విశాఖ స్పోర్ట్స్: ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్రా’ టోర్నమెంట్ తుదిదశ పోటీలకు విశాఖ సిద్ధమైంది. వార్డు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఐదు దశల్లో, ఐదు క్రీడాంశాల్లో ఈ పోటీలు నిర్వహిస్తుండగా జిల్లా స్థాయి విజేత జట్లు తుది పోరుకు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా విశాఖలోని ప్రధాన కూడళ్లలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో క్రీడల్లో పాల్గొనే మహిళా, పురుష ఆటగాళ్ల 26 జిల్లాల జట్లు విశాఖకు చేరుకుంటున్నారు. రైల్వేస్టేషన్, బస్ స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అక్కడే వారికి కేటాయించిన వసతి తదితర వివరాలను చెబుతున్నారు.
ప్రతి జిల్లా నుంచి 134 మంది ఆటగాళ్లు పోటీలకు హాజరవుతుండగా, పురుష జట్లకు దబంగలోని టిడ్కో గృహాల్లో, మహిళల జట్లకు సుద్దగెడ్డ, కొమ్మాదిలోని టిడ్కో గృహాల్లోనూ వసతి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆటగాళ్లు పోటీల వేదికకు చేరుకునేందుకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు. ఉదయం అల్పాహారం, రాత్రి భోజనాల్ని వసతి వద్దే సమకూర్చనుండగా మధ్యాహ్నం భోజనం, మధ్యలో స్నాక్స్, ఎనర్జీ డ్రింక్స్‌ను పోటీల వేదిక వద్దే అందజేయనున్నారు. 9న రైల్వే స్టేడియంలో ప్రారంభ వేడుకకు రాష్ట్ర మంత్రులు, క్రీడాప్రాధికార సంస్థ ప్రతినిధులు, ఉన్నతాధికారుల రాకతో పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఇక్కడే అతిథులు చేతుల మీదుగా క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్నాయి.
బ్రాండింగ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో హోర్డింగులు, జెండాలు, బిల్‌బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మహిళల క్రికెట్ పోటీలు కొమ్మాది గ్రౌండ్స్‌లో జరగనుండగా, పురుషుల క్రికెట్ పోటీలకు వైఎస్‌ఆర్ స్టేడియం బి గ్రౌండ్, ఏయూ ఇంజనీరింగ్ కళాశాల తదితర గ్రౌండ్లను సిద్ధం చేశారు. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీలు ఏయూ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు. బ్యాడ్మింటన్ పోటీలను రైల్వేస్టేడియంలోని ఎన్‌క్లేవ్‌లో నిర్వహిస్తారు. ఈనెల 13న విజేతలుగా నిలిచిన జట్లు ట్రోఫీ, సరి్టఫికెట్లతో పాటు భారీగా నగదు ప్రోత్సాహకాల్ని సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా వైఎస్‌ఆర్ స్టేడియంలో అందుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment