శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు
శ్రీశైలం మల్లన్నకు పాగాలంకరణ
వైభవంగా కోటప్పకొండ తిరునాళ్లు
శ్రీకాళహస్తిలో విశేష అభిషేకాలు
శ్రీశైలంటెంపుల్/సాక్షి, నరసరావుపేట/రేణిగుంట(తిరుపతి జిల్లా)/నెల్లిమర్ల రూరల్/బీచ్‌రోడ్డు (విశాఖ జిల్లా): మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ప్రముఖ శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. శ్రీశైలంలో మల్లన్నకు సంప్రదాయబద్ధంగా తల పాగాలంకరణ, కోటప్పకొండలో భారీ విద్యుత్ ప్రభల ఉత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో విశేష అభిషేకాలు జరిపారు. వివిధ వాహనాలపై కొలువుతీరిన ఆది దంపతులు లక్షలాదిగా తరలివచ్చిన భక్తులను అనుగ్రహించారు... నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా జరిగాయి.
స్వామి వారు నంది వాహనంపై ఊరేగారు. వివిధ జానపద కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రాత్రి 10 గంటల నుంచి స్వామివారికి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపించారు. ఆ వెంటనే మరో వైపు పాగాలంకరణ ప్రారంభమైంది. ఆలయంలోని విద్యుత్ దీపాలను ఆర్పి వేయగా.. బాపట్ల జిల్లా హస్తినాపురానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు దిగంబరుడై పాగాను అలంకరించారు. పాగాలంకరణ జరుగుతున్నంత సేపు ఆలయంలో ఓం నమఃశివాయ అంటూ శివనామస్మరణ మారుమోగింది.
రాత్రి 12 గంటల సమయంలో స్వామివారి కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. పూజా కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు, శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి దంపతులు, జిల్లా కలెక్టర్ కె.శ్రీనివాసులు, జేసీ టీ.రాహుల్ కుమార్‌రెడ్డి, రాయలసీమ జోన్ డీఐజీ సీహెచ్.విజయరావు, ఎస్పీ కె.రఘువీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇంద్ర విమానం, చప్పరంపై స్వామివారి దర్శనం
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరాలయం శివనామస్మరణతో మార్మోగింది. తెల్లవారు జామున స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పెద్దసంఖ్యలోభక్తులు దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆలయ ఈవో నాగేశ్వరరావు క్యూలైన్లను పర్యవేక్షించారు.
కాగా ఉదయం స్వామి, అమ్మవార్లు ఇంద్ర విమానం, చప్పరంపై పురవీధుల్లో విహరించారు. రాత్రి శ్రీకాళహస్తీశ్వరుడు నంది వాహనంపై, జ్ఞానప్రసూనాంబదేవి సింహ వాహనంపై విహరిస్తూ భక్తకోటిని కటాక్షించారు. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఆలయంలో స్వామి, అమ్మవార్ల లింగోద్భవ దర్శనం(నిజరూప దర్శనం) ప్రారంభం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో దర్శనానికి బారులుతీరారు.
రామతీర్థంలో శివనామస్మరణ
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని వైష్ణవ పుణ్యక్షేత్రం రామతీర్థానికి శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా రాష్టం నుంచి భక్తులు పోటెత్తారు. సాక్షాత్తు శ్రీరాముడు రామక్షేత్రంలో శివుని మంత్రాన్ని జపించారన్నది భక్తుల విశ్వాసం. రామకోనేరు గట్టు, కల్యాణ మండపం, నీలాచలగిరి పరిసర ప్రాంతాల్లో కాగడాలు వెలిగించి రాత్రంతా జాగారం చేశారు.
భోగాపురం, పూసపాటిరేగ, లావేరు, రణస్థలం, భీమిలి, విశాఖపట్నం ప్రాంతాల నుంచి మత్స్యకారులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ప్రతిమను మధ్యలో ఉంచి చుట్టూ వృత్తంలా ఏర్పడి సంప్రదాయ బద్ధంగా నృత్యాలు చేశారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు బోడికొండ పర్వతంపై శిఖర జ్యోతిని వెలిగించారు. ఎస్పీ దీపిక పాటిల్, దేవదాయశాఖ కమిషనర్ రామ సత్యనారాయణ, తదితరులు ఉత్సవాలను పర్యవేక్షించారు.
సాగర తీరంలో మహా కుంభాభిషేకం
శివ నామస్మరణతో విశాఖ సాగరతీరం హోరెత్తింది. కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బరామిరెడ్డి కళాపీఠం ఆధ్వర్యంలో 39వ మహా కుంభాభిషేకం ఆర్కే బీచ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కుంభాభిషేకాన్ని శ్రీశారదపీఠం పీఠాధిపతులు శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి, శ్రీస్వాత్మానందేంద్ర సరస్వతి, టి.సుబ్బరామిరెడ్డి ప్రారంభించారు. అంతకు ముందు వీరభద్రస్వామి పూజ నిర్వహించారు. భక్తులకు రుద్రాక్షలు, పసుపుతాళ్లు పంపిణీ చేశారు.
కోటప్పకొండలో ప్రభల ఉత్సవం
పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ మహాశివరాత్రిని పురస్కరించుకుని శుక్రవారం భక్తజనసంద్రంగా మారింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు శ్రీత్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున రెండు గంటలకు బిందె తీర్థంతో స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులను దర్శనానికి అనుమతించారు.
కోటప్పకొండ ప్రత్యేకతను చాటే ప్రభల ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 20 భారీ విద్యుత్ ప్రభలతో పాటు చిన్న చిన్న ప్రభలు ప్రభల నిధికి చేరాయి. ప్రభల వద్ద భక్తుల సందడితో కోలాహలం నెలకొంది. రాత్రి స్థానిక ఎమ్యెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
శ్రీత్రికోటేశ్వరస్వామిని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కంచిరెడ్డి సురే‹Ùరెడ్డి, బి.కృష్ణమోహన్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ప్రభుత్వ విప్‌లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్త అనిల్‌కుమార్ యాదవ్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, మురుగుడు హనుమంతురావు, వెంపాడ చిరంజివి దర్శించుకున్నారు. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, జేసీ శ్యాంప్రసాద్ స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment