sri sailam
-
నా శివయ్యను దర్శనం చేసుకోనివ్వరా.. శ్రీకాళహస్తిలో అఘోరీ ఆత్మహత్యాయత్నం
సాక్షి, తిరుపతి : తిరుపతి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయం వద్ద అఘోరీ హల్చల్ చేశారు. ఆలయ అధికారులు శ్రీకాళహస్తీశ్వరాలయ దర్శనానికి అఘోరీకి అనుమతి ఇవ్వలేదు. దీంతో కోపోద్రికురాలైన అఘోరీ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌తో ఆత్మార్పణం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నిస్తుండగా..అప్రమత్తమైన పోలీసులు ప్రమాదం నుంచి తప్పించారు. నీళ్ళు పోసి అదుపులోకి తీసుకున్న పోలీసులు బీఎన్ కండ్రిగ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
26 నుంచి సోమశిల–శ్రీశైలం లాంచీ ప్రయాణం
కొల్లాపూర్: సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణ సేవలు ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీ లాంచీలో ప్రయాణానికి చిన్నపిల్లలకు, పెద్దలకు వేర్వేరుగా టికెట్ల ధరలను నిర్ణయించారు. వన్‌వే ప్రయాణానికి పెద్దలకు రూ.2,000, చిన్నపిల్లలకు రూ.1,600, వెళ్లి రావడానికి (అప్ అండ్ డౌన్) ప్రయాణానికి పెద్దలకు రూ.3,000, చిన్నపిల్లలకు రూ.2,400గా టికెట్ ధరలు నిర్ణయించారు. ప్రయాణికులకు భోజన వసతులు కల్పించనున్నారు. ఈ నెల 26 నుంచి ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని లాంచీ మేనేజర్ శివకృష్ణ తెలిపారు. లాంచీ ప్రయాణ వివరాలు, టికెట్ల బుకింగ్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు మొబైల్ నంబర్ 7731854994కు సంప్రదించవచ్చు. -
శ్రీశైలానికి తగ్గుతున్న వరద
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. అయినా దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు. మంగళవారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల నుంచి 40,947 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. సోమవారం నుంచి మంగళవారం వరకు శ్రీశైలానికి ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి 35,945 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 1,05,142 క్యూసెక్కులు విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో 14.962 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.838 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ప్రస్తుతం జలాశయంలో 197.4616 టిఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటి మట్టం 881.70 అడుగులకు చేరింది. సాగర్ నీటి మట్టం 589.90 అడుగులు నాగార్జునసాగర్‌లో మంగళవారం 2 రేడియల్ క్రస్ట్‌గేట్ల ద్వారా 24,884 క్యూసెక్కులు దిగువ కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి శ్రీశైలం నుంచి 70,762 క్యూసెక్కులు వస్తుండగా అంతే నీటిని విడుదల చేస్తున్నారు. కుడి కాలువ ద్వారా 10,080, ఎడమ కాలువ ద్వారా 4,613, ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 28,785 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీకి 1800 క్యూసెక్కులు, వరదకాల్వకు 600 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయ నీటిమట్టం 589.90 అడుగుల వద్ద ఉంది. ఇది 311.7462 టీఎంసీలకు సమానం. -
శ్రీశైలానికి పెరిగిన ప్రవాహం
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురి సౌత్: శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాల ప్రవాహం పెరిగింది. శ్రీశైలానికి జూరాల, సుంకేసుల, హంద్రీల నుంచి 1,47,682 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. దీంతో శుక్రవారం 6 గేట్లను తెరచి నాగార్జునసాగర్‌కు 1,67,076 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 212.91 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. నీటిమట్టం 884.40 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం జలాశయం స్పిల్‌వే, కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా నీటిని విడుదల చేస్తుండటంతో శుక్రవారం నాగార్జున సాగర్ జలాశయానికి 2,04064 క్యూసెక్కులు జలాలు వస్తున్నాయి. ఇక్కడి నుంచి 20 క్రస్ట్ గేట్లు ఎత్తి స్పిల్‌వే మీదుగా 1,61,800 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో మరో 28,339 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ, ఏఎమ్మారీ్ప, వరద కాల్వల ద్వారా 13,925 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజికి 1,31,803 క్యూసెక్కులు వస్తుండగా 202 క్యూసెక్కులు కాలువలకు వదులుతున్నారు. మిగులుగా ఉన్న 1,31,601 క్యూసెక్కులు సముద్రంలోకి వదులుతున్నారు. శాంతిస్తున్న గోదావరి ధవళేశ్వరం: ఉరకలెత్తిన గోదావరి క్రమేపీ శాంతిస్తోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం 12.10 అడుగులకు చేరింది. గురువారం రాత్రి 11.75 అడుగులకు నీటి మట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అనంతరం క్రమేపీ పెరుగుతూ శుక్రవారం ఉదయానికి 12.30 అడుగులకు చేరింది. సాయంత్రం 6 గంటలకు స్వల్పంగా తగ్గింది. కాటన్ బ్యారేజీ నుంచి 10,36,440 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. డెల్టా కాలువలకు 2,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ∙ఆరు గేట్ల ద్వారా 1,67,076 క్యూసెక్కులు విడుదల ∙ప్రకాశం బ్యారేజ్ నుంచి 1,31,601 క్యూసెక్కులు సముద్రంలోకి -
శ్రీశైలం, సాగర్ జలాశయాల గేట్లు మూసివేత
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్: ఎగువ నుంచి వరద తగ్గిపోవడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల గేట్లను సోమవారం సాయంత్రం మూసివేశారు. కృష్ణా బేసిన్లో వర్షం తగ్గడంతో జూరాలలో గేట్లను మూసివేయడంతోపాటు విద్యుత్ ఉత్పాదనను కూడా నిలిపివేశారు. తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోవడంతో సుంకేసుల బ్యారేజీకి ఓవర్‌ఫ్లో ప్రవాహం పెరిగింది. సుంకేసుల నుంచి శ్రీశైలానికి 77,598 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తోంది. ఈ ప్రవాహంతోపాటు దిగువకు విడుదలవుతున్న నీరు, డ్యాం గరిష్టస్థాయి నీటిమట్టాన్ని బేరీజు వేసుకుని ఇంజనీర్లు శ్రీశైలం గేట్లను మూసివేశారు. సోమవారం సాయంత్రం సమయానికి డ్యాం నీటిమట్టం 881.20 అడుగులు కాగా, 194.3069 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. అదేవిధంగా నాగార్జునసాగర్ జలాశయంలో 588.80 అడుగులు నీటిమట్టంతో 308.4658 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఎగువ నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి 47,035 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే వరదను బట్టి మళ్లీ సాగర్ రేడియల్ క్రస్ట్‌గేట్లను ఎత్తే అవకాశం ఉంటుంది.‘తుంగభద్ర గేటుకు వెంటనేమరమ్మతులు చేయాలి’ సాక్షి, అమరావతి: తుంగభద్ర ప్రాజెక్టుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘాలు, సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేశాయి. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఏపీ రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.కృష్ణయ్య, కే ప్రభాకరరెడ్డి, కౌలు రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.రాధాకృష్ణ, ఎం.హరిబాబు సోమవారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. ప్రాజెక్టు నుంచి నీరంతా వృథాగా పోతుండడంతో ఈ రెండు జిల్లాల్లోని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. -
శ్రీశైలంలో ప్లాస్టిక్ నిషేధం
శ్రీశైలం ప్రాజెక్ట్: నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్(ఎన్ఎస్టీఆర్) కోర్ ఏరియాలో ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించేందుకు అటవీశాఖ నిర్ణయించింది. శ్రీశైలం దేవస్థానానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. వారు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, శీతల పానీయాలు, ప్లాస్టిక్ ప్యాకింగ్ కలిగిన తిను బండారాలు తీసుకువచ్చి అటవీ ప్రాంతంలో పడేస్తున్నారు. వాటిని తిని జంతువులు మృత్యువాత పడుతున్నాయి. అలాగే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఈ విషయాన్ని గ్రహించిన అధికారులు ప్లాస్టిక్ వస్తువులను నిషేధించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా దోర్నాల, నంద్యాల జిల్లా సున్నిపెంట వద్ద గల అటవీ చెక్‌పోస్టుల వద్ద తనిఖీ చేసి ప్లాస్టిక్ వస్తువులను సరఫరా చేసే వాహనాలు వెనక్కి పంపుతున్నారు. యాత్రికుల వాహనాలలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులను పడవేస్తున్నారు. దేవస్థానంలో స్వామి అమ్మవార్ల ప్రసాదానికి జ్యూట్, కాగితంతో తయారు చేసిన బ్యాగ్‌లను వాడాలని, శ్రీశైలంలో గాజు బాటిళ్ల ప్యాకింగ్‌తో కూడిన మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, అదనంగా 20 మంది సిబ్బందిని నియమించి అటవీ ప్రాంతంలోని రోడ్లకు ఇరువైపులా ఉన్న వ్యర్థాలను తొలగించాలని సమావేశంలో నిర్ణయించారు. కోర్ ఏరియాలో ప్లాస్టిక్ పూర్తి నిషేధానికి మూడోసారి బుధవారం అటవీ, దేవస్థానం అధికారులు సున్నిపెంట బయోలేబరేటరీలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కన్జర్వేటర్ బి.ఎన్ఎన్.మూర్తి, డీఎఫ్ఓలు విఘ్నేష్ అపావ్, సాయిబాబా, రేంజ్ అధికారి నరసింహులు, దేవస్థానం అధికారులు రామకృష్ణ అయ్యన్న, మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనుల జీవనశైలిని చూసొద్దాం రండి..
పెద్దదోర్నాల: విద్యార్థులు వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. నిత్యం పాఠ్య పుస్తకాలతో కుస్తీ పట్టే పిల్లలు సెలవుల్లో విజ్ఞానం పెంచుకోవడానికి విహారయాత్రలు చేసేందుకు ఇష్టపడతారు. అలాగే ఉద్యోగులు, వివిధ వృత్తులలో ఉన్నవారు సైతం వేసవికాలంలో కాస్తంత విశ్రాంతి, మానసికానందం కోసం పర్యాటక ప్రదేశాలు చూసేందుకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు సరిహద్దులో ఉన్న ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలోని చెంచులక్ష్మి ట్రెబల్ మ్యూజియంలో చెంచుల జీవిత విశేషాలను తెలుసుకునేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. ఐటీడీఏ ఏర్పాటుచేసిన ఈ ట్రైబల్ మ్యూజియంలో చెంచులతోపాటు అడవి బిడ్డలైన శోలాములు, కోంధులు, గోండులు, నాయకపోడులు, యానాదులు మొదలైన వారందరి చరిత్ర, సంస్కృతిని తెలియజేసేలా ప్రతిమలు ఉన్నాయి. ట్రైబల్ మ్యూజియంలో ఇవీ ప్రత్యేకతలు... » ప్రధాన ద్వారం నుంచి లోపలికి అడుగుపెట్టగానే ఎదురుగా ఒక పుట్ట, దానిముందు పామును ఆడిస్తున్నట్టుగా ఒక చెంచు గిరిజనుడి ప్రతిమ కనిపిస్తాయి. నాదస్వరంతో సర్పాన్ని ఆడిస్తున్న తీరు చెంచులకు వాటితో గల అనుబంధం, భక్తి, విశ్వాసాలను తెలియజేస్తుంది. » రెండో గదిలో ఢంకా బజాయిస్తున్న చెంచు, ఆ చుట్టూ గోడలకు అవజాల, మద్దెల, మృదంగం, తుడుము, విడక, తప్పెట, డోలు, డోల్కాడ్, మువ్వలదండు, పిల్లనగ్రోవి, కికిరి, పికిరి, డిర్జింగోవరాయ్, గుమ్మలం, పర్ర మొదలైన గిరిజన తెగల వారి సంగీత వాయిద్యాలు ఉన్నాయి. మల్లికార్జున స్వామికి ఇష్టమైన వీటిని మహాశివరాత్రి ఉత్సవాల్లో వివిధ తెగలకు చెందిన గిరిజనులు వాయిస్తుంటారు. » మూడో గదిలో చెంచుగుచ్చ ఏర్పాటుచేశారు. చెంచుల ఆభరణాలు, ఆయుధాలు, ఇతర వస్తు సామగ్రి ఇందులో చూడవచ్చు. » ఐదో గదిలో రవితార, చిడతలు పట్టి శివకథలను చెబుతున్న దేవచెంచుల బొమ్మ ఉంది. శివపూజ చేసే దేవ చెంచులే కష్టాలకోర్చి శ్రీశైలాన్ని రక్షించినట్లు తెలుస్తోంది. శ్రీశైలంలో ఉన్న చెంచులంతా ఈ దేవ చెంచుల జాతికి చెందినవారే. వీరు వాడే పెరుబాకు, కొడవలి, గొరక, వంకటి తెడ్డు, రోకలి, తేనెబుట్ట, గుండురాయి ఈ గదిలో ఉన్నాయి. »తొమ్మిదో గదిలో సోది చెప్పే ఎరుకలసాని కొరవంజి కనపడుతుంది. ఈమె భ్రమరాంబ మల్లికార్జునుల పెళ్లి సంగతి, శ్రీశెలం పెద్ద పట్టణంగా విస్తరించి 12 ఆమడల పట్టణం అవుతుందని సోది చెప్పినట్టు పెద్దలు చెబుతారు. ఈ గదిలో ఎరుకల, యానాదులు ఉపయోగించే వివిధ రకాల వాయిద్య పరికరాలు కూడా ఉన్నాయి. వీటితోపాటు ఎన్నో విశేషాలతో కూడిన ప్రతిమలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. -
శివోహం..
శ్రీశైలంటెంపుల్/సాక్షి, నరసరావుపేట/రేణిగుంట(తిరుపతి జిల్లా)/నెల్లిమర్ల రూరల్/బీచ్‌రోడ్డు (విశాఖ జిల్లా): మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ప్రముఖ శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. శ్రీశైలంలో మల్లన్నకు సంప్రదాయబద్ధంగా తల పాగాలంకరణ, కోటప్పకొండలో భారీ విద్యుత్ ప్రభల ఉత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో విశేష అభిషేకాలు జరిపారు. వివిధ వాహనాలపై కొలువుతీరిన ఆది దంపతులు లక్షలాదిగా తరలివచ్చిన భక్తులను అనుగ్రహించారు... నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా జరిగాయి. స్వామి వారు నంది వాహనంపై ఊరేగారు. వివిధ జానపద కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రాత్రి 10 గంటల నుంచి స్వామివారికి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపించారు. ఆ వెంటనే మరో వైపు పాగాలంకరణ ప్రారంభమైంది. ఆలయంలోని విద్యుత్ దీపాలను ఆర్పి వేయగా.. బాపట్ల జిల్లా హస్తినాపురానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు దిగంబరుడై పాగాను అలంకరించారు. పాగాలంకరణ జరుగుతున్నంత సేపు ఆలయంలో ఓం నమఃశివాయ అంటూ శివనామస్మరణ మారుమోగింది. రాత్రి 12 గంటల సమయంలో స్వామివారి కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. పూజా కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు, శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి దంపతులు, జిల్లా కలెక్టర్ కె.శ్రీనివాసులు, జేసీ టీ.రాహుల్ కుమార్‌రెడ్డి, రాయలసీమ జోన్ డీఐజీ సీహెచ్.విజయరావు, ఎస్పీ కె.రఘువీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంద్ర విమానం, చప్పరంపై స్వామివారి దర్శనం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరాలయం శివనామస్మరణతో మార్మోగింది. తెల్లవారు జామున స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పెద్దసంఖ్యలోభక్తులు దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆలయ ఈవో నాగేశ్వరరావు క్యూలైన్లను పర్యవేక్షించారు. కాగా ఉదయం స్వామి, అమ్మవార్లు ఇంద్ర విమానం, చప్పరంపై పురవీధుల్లో విహరించారు. రాత్రి శ్రీకాళహస్తీశ్వరుడు నంది వాహనంపై, జ్ఞానప్రసూనాంబదేవి సింహ వాహనంపై విహరిస్తూ భక్తకోటిని కటాక్షించారు. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఆలయంలో స్వామి, అమ్మవార్ల లింగోద్భవ దర్శనం(నిజరూప దర్శనం) ప్రారంభం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో దర్శనానికి బారులుతీరారు. రామతీర్థంలో శివనామస్మరణ విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని వైష్ణవ పుణ్యక్షేత్రం రామతీర్థానికి శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా రాష్టం నుంచి భక్తులు పోటెత్తారు. సాక్షాత్తు శ్రీరాముడు రామక్షేత్రంలో శివుని మంత్రాన్ని జపించారన్నది భక్తుల విశ్వాసం. రామకోనేరు గట్టు, కల్యాణ మండపం, నీలాచలగిరి పరిసర ప్రాంతాల్లో కాగడాలు వెలిగించి రాత్రంతా జాగారం చేశారు. భోగాపురం, పూసపాటిరేగ, లావేరు, రణస్థలం, భీమిలి, విశాఖపట్నం ప్రాంతాల నుంచి మత్స్యకారులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ప్రతిమను మధ్యలో ఉంచి చుట్టూ వృత్తంలా ఏర్పడి సంప్రదాయ బద్ధంగా నృత్యాలు చేశారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు బోడికొండ పర్వతంపై శిఖర జ్యోతిని వెలిగించారు. ఎస్పీ దీపిక పాటిల్, దేవదాయశాఖ కమిషనర్ రామ సత్యనారాయణ, తదితరులు ఉత్సవాలను పర్యవేక్షించారు. సాగర తీరంలో మహా కుంభాభిషేకం శివ నామస్మరణతో విశాఖ సాగరతీరం హోరెత్తింది. కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బరామిరెడ్డి కళాపీఠం ఆధ్వర్యంలో 39వ మహా కుంభాభిషేకం ఆర్కే బీచ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కుంభాభిషేకాన్ని శ్రీశారదపీఠం పీఠాధిపతులు శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి, శ్రీస్వాత్మానందేంద్ర సరస్వతి, టి.సుబ్బరామిరెడ్డి ప్రారంభించారు. అంతకు ముందు వీరభద్రస్వామి పూజ నిర్వహించారు. భక్తులకు రుద్రాక్షలు, పసుపుతాళ్లు పంపిణీ చేశారు. కోటప్పకొండలో ప్రభల ఉత్సవం పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ మహాశివరాత్రిని పురస్కరించుకుని శుక్రవారం భక్తజనసంద్రంగా మారింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు శ్రీత్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున రెండు గంటలకు బిందె తీర్థంతో స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులను దర్శనానికి అనుమతించారు. కోటప్పకొండ ప్రత్యేకతను చాటే ప్రభల ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 20 భారీ విద్యుత్ ప్రభలతో పాటు చిన్న చిన్న ప్రభలు ప్రభల నిధికి చేరాయి. ప్రభల వద్ద భక్తుల సందడితో కోలాహలం నెలకొంది. రాత్రి స్థానిక ఎమ్యెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీత్రికోటేశ్వరస్వామిని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కంచిరెడ్డి సురే‹Ùరెడ్డి, బి.కృష్ణమోహన్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ప్రభుత్వ విప్‌లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్త అనిల్‌కుమార్ యాదవ్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, మురుగుడు హనుమంతురావు, వెంపాడ చిరంజివి దర్శించుకున్నారు. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, జేసీ శ్యాంప్రసాద్ స్వామి వారి సేవలో పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవాలకు వేళాయే..
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో 11 రోజుల పాటు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం అంకురార్పణ జరగనుంది. ఉదయం 8:10 గంటలకు యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవ క్రతువులు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా మల్లికార్జునస్వామికి విశేష అర్చనలు, భ్రమరాంబాదేవికి ప్రత్యేక పూజలు, స్వామిఅమ్మవార్లకు వాహన సేవలు నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు భేరిపూజ, భేరీతాడనం, సకలదేవతాహ్వానపూర్వక ధ్వజారోహణ, ధ్వజపట ఆవిష్కరణ నిర్వహిస్తారు. కాగా, బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 2న భృంగి వాహనసేవ, 3న హంస వాహన సేవ, 4న మయూర వాహన సేవ, 5న రావణ వాహన సేవ, 6న పుష్పపల్లకిసేవ, 7న గజ వాహన సేవ, 8న ప్ర¿ోత్సవం, నందివాహన సేవ, అదే రోజు రాత్రి 10గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిõÙకం, పాగాలంకరణ, కల్యాణోత్సవం నిర్వహిస్తారు. 9న రథోత్సవం, తెప్పోత్సవం, 10న బ్రహ్మోత్సవాలకు పూర్ణాహుతి చేపట్టి సాయంత్రం ధ్వజావరోహణ చేస్తారు. 11న అశ్వ వాహనసేవ, పుషో్పత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ నిర్వహిస్తారు. నేడు పట్టు వస్త్రాల సమర్పణ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం వారిచే స్వామి అమ్మవార్లకు పట్టువ్రస్తాలు సమరి్పస్తారు. అలాగే, 2న ద్వారక తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానం, 3న విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం, 4న కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానాలు పట్టువస్త్రాలను సమర్పి0చనున్నాయి. 5న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధులు స్వామిఅమ్మవార్లకు పట్టువ్రస్తాలు సమర్పిస్తారు. -
ముగిసిన దసరా ఉత్సవాలు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/కోడూరు/పెందుర్తి/శ్రీశైలం టెంపుల్: ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తోన్న దసరా ఉత్సవాల్లో భాగంగా సోమవారం 9వ రోజున దుర్గమ్మ 2 అలంకారాల్లో అభయమిచ్చారు. ఉదయం మహిషాసురమర్దినిగా.. మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరిదేవిగా దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు అమ్మవారి అలంకరణ మార్పు కారణంగా దర్శనాలను నిలిపివేశారు. 2 రోజుల్లో రికార్డు స్థాయిలో 4 లక్షలకుపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అంచనా. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో మహా పూర్ణాహుతిని నిర్వహించారు. సోమవారం రాత్రి ఆది దంపతులకు కృష్ణా నదిలో తెప్పోత్సవాన్ని నిర్వహించారు. దుర్గాఘాట్ వద్ద హంస వాహనంపై శ్రీగంగా పార్వతి (దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వారు తెప్పపై విహరించారు. 8.95 లక్షల మందికి దర్శనం ఇంద్రకీలాద్రిపై ఈ నెల 15–23 వరకు నిర్వహించిన దసరా ఉత్సవాల్లో 8.95 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. 14.17 లక్షల లడ్డూలను విక్రయించినట్లు చెప్పారు. స్వర్ణం, వెండి, పట్టుతో నేసిన చీరలో నాంచారమ్మ కృష్ణా తీరంలో భక్తుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న కృష్ణా జిల్లా కోడూరు మండలం విశ్వనాథపల్లిలోని అద్దంకి నాంచారమ్మ అమ్మవారికి బంగారం, వెండి, పట్టుతో నేసిన చీరను అలంకరించారు. పమిడిముక్కల మండలం మంటాడకు చెందిన పసుపులేటి మణికంఠ వృత్తి పరంగా విదేశాల్లో స్థిరపడ్డాడు. దసరా ఉత్సవాలకు నాంచారమ్మ అమ్మవారికి రూ.2 లక్షలతో బంగారం, వెండితో ప్రత్యేకంగా తయారు చేయించిన చీరను మణికంఠ కుటుంబసభ్యులు సోమవారం ఆలయాధికారులకు అందజేశారు. పట్టుతో పాటు చీర మొత్తం బంగారం, వెండి తీగలతో నేయించారు. ఈ చీరను మూలమూర్తికి అలంకరించారు. బంగారం, వెండి చీరలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మణికంఠ కుటుంబీకులను ఆలయ ఈవో పామర్తి సీతారామయ్య సన్మానించారు. విశాఖ శ్రీశారదాపీఠంలో.. విశాఖ శ్రీశారదాపీఠంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. మంగళవారం విజయదశమి సందర్భంగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిలు శమీ వృక్షం వద్ద అపరాజితాదేవిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. విజయదుర్గ అవతారంలో దర్శనమిచ్చిన శారదాస్వరూప రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కేఎస్ జవహర్‌రెడ్డి శ్రీశారదాపీఠాన్ని మంగళవారం సందర్శించి స్వామీజీల ఆశీస్సులు తీసుకున్నారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలంలో.. శ్రీశైలంలో ఆధ్యాత్మికభరితంగా సాగిన దసరా మహోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. అమ్మవారు నిజరూప అలంకారంలో భ్రమరాంబాదేవిగా దర్శనమిచ్చారు. నంది వాహన సేవలో ఆది దంపతులు విహరించారు. ప్రత్యేక అలంకృతులైన అమ్మవారికి, స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక వేదికలో ఆశీనులను చేయించి విశేష పూజలు నిర్వహించారు. విజయదశమి రోజున స్వామి అమ్మవార్లకు విశేష పూజలతో పాటు శమీ పూజ చేపట్టారు. అమ్మవారి యాగశాలలో, స్వామివారి యాగశాలలో శాస్త్రోక్తం గా పూర్ణాహుతి నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంతో శ్రీగిరిలో దసరా మహోత్సవాలు ముగిశాయి. కాగా, సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి అమ్మవార్లకు మంత్రి గుమ్మనూరు జయరాం దంపతులు పట్టువ్రస్తాలను సమర్పించారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి దంపతులు, దేవస్థాన ట్రస్ట్‌బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఈవో పెద్దిరాజు పాల్గొన్నారు. -
ఫార్మాసిటీతో రియల్ బూమ్: వాటికి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీ, ఫ్యాబ్ సిటీ, హార్డ్‌వేర్ పార్క్‌లతో శ్రీశైలం జాతీయ రహదారి రూపురేఖలే మారిపోయాయి. ఫార్మా సిటీ నుంచి కూతవేటు దూరంలో ఉన్న కడ్తాల్, కందుకూరు, ఆమన్‌గల్, తలకొండపల్లి వంటి ప్రాంతాలు రెసిడెన్షియల్ హబ్‌గా మారిపోయాయి. విజయవాడ, బెంగళూరు, వరంగల్ జాతీయ రహదారులతో పోలిస్తే శ్రీశైలం హైవేలోని గృహ అద్దెలకు, స్థలాలకు రెట్టింపు విలువ చేకూరుతుంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న జాతీయ రహదార్లలో ఒక్క శ్రీశైలం రహదారి మినహా అన్ని దార్లలోనూ స్థిరాస్తి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వరంగల్ హైవేలో చూస్తే.. నగరం నుంచి 50 కి.మీ. వరకూ ఎకరం ధర రూ.కోటి పైనే. ముంబై, బెంగళూరు హైవేల్లోనూ కోటిన్నర పైమాటే. ఇక, షామీర్పేట్, శంకర్పల్లి రహదారిలో అయితే రూ.2 కోట్లకెక్కువే. మరి, నేటికీ సామాన్య, మధ్యతరగతి అందుబాటులో ఉన్న ప్రాంతం ఏమైనా ఉందంటే అది ఒక్క శ్రీశైలం రహదారి మాత్రమే. హాట్‌స్పాట్స్ ప్రాంతాలివే.. శ్రీశైలం రహదారిలో కందుకూరు, కడ్తాల్, ఆమన్‌గల్, తలకొండపల్లి, కల్వకుర్తి ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆయా ప్రాంతంలో ధర గజానికి రోడ్ ఫేసింగ్‌ను బట్టి రూ.8 వేల నుంచి 30 వేల వరకున్నాయి. ప్రధా న నగరంలో లేదా ఐటీ కేంద్రాలకు చేరువలో 2 బీహెచ్‌కే ఫ్లాట్‌కు వెచ్చించే వ్యయంతో శ్రీశైలం రహదారిలో ఏకంగా విల్లానే సొంతం చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. లే అవుట్లు, విల్లాలకు డిమాండ్.. శ్రీశైలం రహదారిలో అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్ట్‌లతో పాటూ లే అవుట్ల వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంది. హాల్‌మార్క్, ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై, విశాల్ ప్రాజెక్ట్స్, రాంకీ, హస్తినా రియల్టీ, మ్యాక్ ప్రాజెక్ట్స్, వెర్టెక్స్, జేఎస్ఆర్ గ్రూప్ వంటి పేరున్న నిర్మాణ సంస్థలతో పాటు చిన్న సంస్థలు కూడా ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్‌లు చేస్తున్నాయి. కందుకూరు నుంచి ఆదిభట్లకు 15 కి.మీ. దూరం. దీంతో ఆదిభట్లలోని ఐటీ, ఏరో స్పేస్ ఉద్యోగులు శ్రీశైలం రహదారిలో స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. 30 కి.మీ. దూరంలో ఎల్బీనగర్, ఆదిభట్ల ప్రాంతాలుండడంతో విద్యా, వైద్యం, వినోద కేంద్రాలకూ కొదవేలేదు. కృష్ణా జలాల సరఫరా, విద్యుత్ ఉపకేంద్రంతో మౌలిక వసతులూ మెరుగ్గానే ఉన్నాయి. ఫార్మా సిటీ చుట్టూ అభివృద్ధి.. ఐటీ తర్వాత అధిక శాతం మందికి ఉపాధి అవకాశాల్ని కల్పించేది ఫార్మా రంగమే. తెలంగాణ ప్రభుత్వం ముచ్చర్లలో 19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఫార్మా సిటీ రాకతో శ్రీశైలం రహదారి అభివృద్ధి దశే మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఐడీఏ బొల్లారం, పాశమైలారం తదితర ప్రాంతాల్లోని ఫార్మా పరిశ్రమల వల్ల మియాపూర్, మదీనాగూడ, చందానగర్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల వరకూ అభివృద్ధి విస్తరించింది. అలాగే గతంలో బేగంపేట్‌లో విమానాశ్రయం ఉన్నప్పుడు సనత్‌నగర్, బోయిన్పల్లి వంటి ప్రాంతాలకు ఎలాగైతే అభివృద్ధి చెందాయో.. శంషాబాద్ విమానాశ్రయం శ్రీశైలం రహదారికి చేరువలో ఉండటంతో సమీప భవిష్యత్తులో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందే అవకాశముంది. ఫార్మాసిటీని అనుసంధానిస్తూ రీజినల్ రింగ్ రోడ్డు కూడా రానుంది. ఇది షాద్‌నగర్ నుంచి తలకొండపల్లి మీదుగా ఫార్మాసిటీకి అనుసంధానమై ఉంటుంది. ఇప్పటికే శ్రీశైలం రహదారిలో ఫ్యాబ్‌సిటీ, హార్డ్‌వేర్ పార్క్‌లున్నాయి. -
పర్యాటలకు తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ తీపి కబురు
సాక్షి, పెద్దవూర(నల్గొండ) : పర్యాటలకు తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ తీపి కబురు అందించింది. కృష్ణానదిలో నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం సాగర్ హిల్‌కాలనీలోని లాంచీస్టేషన్ నుంచి ఉదయం 9 గంటలకు లాంచీ ప్రారంభమవుతుందని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. మూడు నెలల క్రితం ప్రారంభం కావాల్సిన లాంచీ ప్రయాణం పర్యాటకులు ఆసక్తి కనపర్చకపోవడంతో వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం 570 అడుగులకు పైగా ఉన్నప్పుడు సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ విహార యాత్రకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జలాశయంలో పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉండటంతో పర్యాటకులు ఆసక్తి చూపిస్తే మరో నెల రోజులకు పైగా లాంచీ ప్రయాణం నిర్వహించే అవకాశం ఉంది. ప్రకృతి అందాల నడుమ ప్రయాణం చుట్టూ ప్రకృతి అందాలతో అలరారే పచ్చదనంతో కప్పేసిన ఎత్తయిన కొండల నడుమ సాగే ఈ లాంచీ ప్రయాణం పర్యాటకులను ఎంతగానో అలరించనుంది. సాగర్ నుంచి శ్రీశైలం వరకు 110 కిలో మీటర్ల దూరం లాంచీలో ఏడు గంటల పాటు ప్రయాణం ఉంటుంది. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో సాగే లాంచీ ప్రయాణం పర్యాటకులకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. ఆహ్లాదకరమైన దృశ్యాలతో పాటు ఆధ్యాత్మిక వాతావరణంలో సాగే లాంచీ ప్రయాణం హాయిగా ఉంటుంది. ఈ ప్రయాణం మరవలేని స్మృతులను అందించనుంది. పక్షుల కిలకిలరావాలతో, నీటి సవ్వడుల మధ్య సాగే ఈ జర్నీలో ఆధ్యంతం ఆసక్తిగా సాగుతూ కొండల మధ్య తిరుగుతూ ఉంటుంది. మనకు తెలియని కొత్త, వింతైన విషయాలను తెలిపేందుకు లాంచీలో గైడ్ కూడా ఉంటాడు. చదవండి: మూడేళ్లుగా ఒకేచోట.. సైబరాబాద్‌లో ఎస్హెచ్ఓల బదిలీలు? టికెట్ వివరాలు నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణానికి గాను ఒకవైపు ప్రయాణికి పెద్దలకు రూ.1500, 4 నుంచి 12 సంవత్సరాల లోపు పిల్ల లకు రూ.1200గా నిర్ణయించారు. సాగర్ నుంచి శ్రీశైలం, తిరిగి శ్రీశైలం నుంచి సాగర్‌కు రెండు పైపులా ప్రయాణానికి పెద్దలకు రూ.2500, పిల్లలకు రూ.2000 ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటలకు బస్ ప్యాకేజీతో కలిపి పెద్దలకు రూ.3999, పిల్లలకు రూ.3399 ఉంటుంది. వివరాలకు 98485 40371, 79979 51023 ఫోన్ నంబర్లను సంప్రదించాలి. ఆన్లైన్ బుకింగ్ కోసం www.tsdc.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని పర్యాటక శాఖ అధికారులు పేర్కొన్నారు. చదవండి: MLC Polls:టీఆర్ఎస్ అభ్యర్థి దండే విఠల్ కోటీశ్వరుడు.. సాగర్ జలాశయంలో లాంచీ (ఫైల్) -
శ్రీశైలం వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా శిల్పా చక్రపాణిరెడ్డి నామినేషన్
-
యాత్రికుల బస్సు బోల్తా.. ఒకరి మృతి
కర్నూలు ,ఓర్వకల్లు: యాత్రికుల బస్సు బోల్తా పడి ఒకరు మృతిచెందగా, 17 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లా బేలూరు పట్టణానికి చెందిన 52 మంది యాత్రికులు కేఏ 06 డి 4887నంబర్ శివగంగ ట్రావెల్ (తుమ్కూర్) టూరిస్టు బస్సు çకర్నూలు జిల్లాలోని పలు పుణ్యక్షేత్రాల సందర్శనార్థం బయలు దేరివచ్చారు. శ్రీశైలం, మహానంది క్షేత్రాలను దర్శించుకొని తిరుగు ప్రయాణంలో మంత్రాలయానికి బయలుదేరారు. మార్గం మధ్యలో ఓర్వకల్లు వద్దకు చేరుకోగానే 40వ నంబర్ జాతీయ రహదారిపై బస్సు ముందు చక్రం పగిలి ప్రమాదవశాత్తు అదుపుతప్పింది. ఈ క్రమంలో నంద్యాల నుంచి కర్నూలు వైపు వెళ్లుతుండగా ఎడమవైపు నుంచి కుడి వైపునకు వేగంగా దూసుకెళ్లి కర్నూలు నుంచి సెంట్రింగ్ సామగ్రితో వస్తున్న మినీ లారీని ఢీకొట్టి ఫ్లైఓవర్ వంతెనపై నుంచి ఆర్టీసీ బస్టాండ్ వైపు ఉన్న సర్వీస్ రోడ్డుపై బోల్తా పడింది. ప్రమాదంలో 15 మంది కన్నడ యాత్రికులతో పాటు మినీ ట్రక్కు డ్రైవర్ ఫరూక్‌బాషా, హెల్పర్ వినోద్‌కుమార్ గాయపడ్డారు. ప్రమాద సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు బోల్తా పడగానే యాత్రికులు పెద్దఎత్తున ఆర్థనాదాలు చేయడంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక ఎస్ఐ మధుసూదన్‌రావు పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మూడు 108 వాహనాల్లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కన్నడ భక్తుడు గోవింద్ స్వామి(50) కోలుకోలేక మృతి చెందాడు. ప్రముఖుల పరామర్శ టూరిస్టు బస్సు బోల్తా పడిన విషయం తెలుసుకున్న వెంటనే వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, గౌరు వెంకటరెడ్డి, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ వేర్వేరుగా ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాద తీరును పరిశీలించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలెక్టర్ పరామర్శ కర్నూలు(హాస్పిటల్): ఓర్వకల్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ పరామర్శించారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్చారు. వీరిని సాయంత్రం జిల్లా కలెక్టర్ కలిసి పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.చంద్రశేఖర్‌ను ఆదేశించారు. క్షతగాత్రులు వీరే.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన రంగస్వామి, పుత్తురాజ్, బీటీ దేవి, శోభ, నాగమ్మ, నాగరాజు, శాంతమ్మ, ఇందిరా, సరస్వతి, సర్వమంగళ, దేవమ్మ, రామయ్య, తాయమ్మ, సిద్దలింగమ్మ వీరందరు మాండ్యా జిల్లా నాగమంగళ తాలుకా బేలూర్ పట్టణ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఇక తుంకూరు టూరిస్టు బస్సు డ్రైవర్ రవికుమార్, ట్రక్కు డ్రైవర్ షేక్ ఫరూక్బాషాకు తీవ్ర గాయాలు అయ్యాయి. ట్రక్కుహెల్పర్ వినోద్‌కుమార్ కర్నూలు నగరంలోని లక్ష్మినగర్‌కు చెందిన వాసి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కర్నూలు తాలుకా రూరల్ సీఐ పవన్‌కిశోర్ తెలిపారు. -
శ్రీశైలం టెయిల్ పాండ్ డ్యాంకు భారీ గండి
శ్రీశైలం: తెలంగాణా జెన్కో ఆధ్వర్యంలో సుమారు రూ.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న శ్రీశైలం టెయిల్‌పాండ్ కాంక్రీట్ డ్యాంకు గండిపడింది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన జరుగుతుండడంతో కొద్దిపాటి ప్రవాహానికి నిర్మాణంలో ఉన్న డ్యాం మధ్యభాగంలో సుమారు 30 అడుగుల వెడల్పు, ఎత్తులో కాంక్రీట్ డ్యాం కొట్టుకుపోయింది. నిల్వ ఉన్న నీరు దిగువ ప్రాంతానికి విడుదలవుతుంది. గురువారం రాత్రి 9గంటల సమయంలో కాంక్రీట్‌డ్యాంకు గండిపడిందని అక్కడి మత్సకారులు అంటున్నారు. శ్రీశైల జలాశయానికి 12 కి.మీ దూరంలో తెలంగాణా- ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలను కలుపుకుని టైల్‌పాండ్ డ్యాంను నిర్మిస్తున్నారు. నీటిలో వేయవల్సిన ట్రీమి కాంక్రీట్‌లో నాణ్యత లోపించడం వల్లే కాంక్రీట్ డ్యాంకు గండిపడినట్లు ఇంజనీర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తి వివరాలను వెల్లడించేందుకు అక్కడి ఇంజనీర్లు నిరాకరిస్తున్నారు. అకస్మాత్తుగా కాంక్రీట్‌డ్యాంకు గండిపడడంతో మత్సకారుల వలలు, బుట్టలు, ప్రమాదానికి గురై దెబ్బతిన్నట్లు అక్కడి మత్సకారులు తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ప్రభుత్వ ధనం వృథా కాకుండా చర్యలు చేపట్టాలని ఆ ప్రాంతంలోని ప్రజలు అంటున్నారు. -
'సఖ్యతతో ఉండక... చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు'
హైదరాబాద్: శ్రీశైలం జలవిద్యుత్ వివాదంపై వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను టీటీడీపీ నేతలు డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లో టీటీడీపీ నేతలు ఎర్రబెల్లి, ఎల్ రమణ, రావుల చంద్రశేఖరరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నట్లు స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలని తెలంగాణ సర్కార్‌కు హితవు పలికారు. కేంద్రాన్ని, ఏపీ సీఎం చంద్రబాబును విమర్శిస్తూ కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వైఖరీతో నష్టపోయేది తెలంగాణే అని వారు స్పష్టం చేశారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులందర్నీ కలిశామని తెలిపారు. ఏపీ నుంచి తమకు నిర్దిష్ట ప్రతిపాదనలు వస్తున్నాయి.... కానీ తెలంగాణ నుంచి మాత్రం ప్రతిపాదనలేవీ రావడం లేదని సాక్షాత్తూ కేంద్రమంత్రులే అంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా మేల్కోవాలని టీటీడీపీ నేతలు కేసీఆర్ సర్కార్‌కు హితవు పలికారు. -
శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
శ్రీశైలం, న్యూస్‌లైన్: శ్రీశైలంలో మకరసంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ఆదివారం ఈఓ చంద్రశేఖర అజాద్ అంకురార్పణ చేశారు. ఉదయం 9.15 గంటలకు యాగశాల ప్రవేశం, గణపతిపూజ, చండీశ్వరపూజ తదితర విశేష పూజలను ఈఓ దంపతులు, అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. సకల దేవతలను ఆహ్వానిస్తూ ప్రత్యేక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేశారు. 18వ తేదీ వరకు జరిగే సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు స్వామిఅమ్మవార్ల ఆర్జితకల్యాణోత్సవం, రుద్రహోమం, గణపతి, మహామృత్యుంజయ తదితర హోమాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. వారం రోజుల పాటు విశేష వాహనసేవలు, ప్రతిరోజూ గ్రామోత్సవం నిర్వహించనున్నారు. సంక్రాంతి పర్వదినాన శ్రీ పార్వతీ మల్లికార్జునస్వామివార్ల బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఈఓ అజాద్ తెలిపారు. -
ద‘శమి’ పూజ
శ్రీశైలం, న్యూస్‌లైన్: శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం విజయదశమి పర్వదినాన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఆలయప్రాంగ ణంలో వైభవంగా శమీ పూజలు నిర్వహించారు. అలంకార మండపంలో అమ్మవారిని సిద్ధిదాయినిగా అలంకరించి, స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను నందివాహనంపై అధిష్టించి విశేష వాహన పూజలు నిర్వహించారు. ఆదివారం నవమి ఘడియలు ముగిసిన వెంటనే విజయద శమి ప్రారంభం కావడంతో దసరా పండుగను దేవస్థానం ఆదివారమే నిర్వహించింది. కాగా ప్రభుత్వ సెలవు దినం సోమవారం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం చేరుకున్నారు. ఆలయప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ కనిపించింది. ఉత్సవంలో భాగంగా నందివాహనాధీశులైన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగిస్తూ ఆలయప్రాంగణంలోని శమి(జమ్మి) వృక్షం వద్దకు చేర్చారు. జమ్మిచెట్టుకు వేదపండితులు, అర్చకులు శమిపూజలు చేశారు. కార్యక్రమంలో ఈఓ చంద్రశేఖర ఆజాద్, ఆలయ ఏఈఓ రాజశేఖర్, కేశవులు, హార్టికల్చరిస్ట్ ఏడీ ఈశ్వరరెడ్డి, పర్యవేక్షకులు మల్లికార్జునరెడ్డి, నాగభూషణం, హరిదాస్, శ్రీశైలప్రభ ఎడిటర్ డాక్టర్ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సాగర్‌లో కొనసాగుతున్న నీటి విడుదల
నాగార్జున సాగర్, న్యూస్‌లైన్ : నాగార్జున సాగర్ జలాశయం నుంచి క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. సోమవారం 8 క్రస్ట్‌గేట్ల ద్వారా దిగువకు 64,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగర్ పూర్తి స్థాయిలో నిండడం, శ్రీశైలం నుంచి భారీగా ఇన్‌ఫ్లో వస్తుండడంతో క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని కృష్ణా డెల్టాకు వదులుతున్నారు. ఈ నెల 17వ తేదీన సాయంత్రం 4 గంటలకు 4 క్రస్ట్‌గేట్లు ఎత్తిన అధికారులు రాత్రికి 6 గేట్లకు పెంచారు. 18న మరో రెండు క్రస్ట్‌గేట్లను ఎత్తి మొత్తం 8 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పర్యాటకుల సందడి.. రెండేళ్ల తర్వాత క్రస్ట్‌గేట్లను ఎత్తడంతో సాగర్ సోయగాలను చూసేం దుకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. 550 అడుగులపై నుంచి స్ఫి ల్వే నుంచి కిందికి దూకుతున్న కృష్ణమ్మను చూసి పర్యాటకులు మంత్రముగ్ధులవుతున్నారు. లాంచీస్టేషన్‌కు తగ్గిన ఆదాయం సాగర్ లాంచీస్టేషన్ ఆదాయం సోమవారం తగ్గింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆదివారం నాగార్జున కొం డకు లాం చీలు నడపలేదు. సోమవారం కూడా నడుపుతారో లేదోనని పర్యాటకులు లాంచీస్టేషన్‌కు రాకపోవడంతో ఆదాయం *30వేలకు పడిపోయింది. సాధారణ రోజుల్లో లాంచీస్టేషన్ ఆదాయం *70 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది. వాతావరణం సరిగాలేదని ఒక రోజు, సమైక్యాంధ్ర ఉద్యమం పేరిట మరో రోజు లాంచీస్టేషన్‌ను మూసివేస్తుండడంతో సాగర్‌కు వచ్చే పర్యాటకులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా లాం చీల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడం, తరచూ మరమ్మతులకు గురవుతుండడంతో పర్యాటకులకు సమాదానం చెప్పలేక వాతావరణం అనుకూలించడం లేదని లాంచీలు నిలి పివేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.