ఎన్‌ఎస్‌టీఆర్ కోర్ ఏరియాలో అమలుకు అటవీశాఖ నిర్ణయం
సున్నిపెంటలో సమావేశమైన అటవీ, దేవస్థానం అధికారులు
శ్రీశైలం ప్రాజెక్ట్: నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్(ఎన్‌ఎస్‌టీఆర్) కోర్ ఏరియాలో ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించేందుకు అటవీశాఖ నిర్ణయించింది. శ్రీశైలం దేవస్థానానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. వారు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, శీతల పానీయాలు, ప్లాస్టిక్ ప్యాకింగ్ కలిగిన తిను బండారాలు తీసుకువచ్చి అటవీ ప్రాంతంలో పడేస్తున్నారు. వాటిని తిని జంతువులు మృత్యువాత పడుతున్నాయి. అలాగే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది.
ఈ విషయాన్ని గ్రహించిన అధికారులు ప్లాస్టిక్ వస్తువులను నిషేధించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా దోర్నాల, నంద్యాల జిల్లా సున్నిపెంట వద్ద గల అటవీ చెక్‌పోస్టుల వద్ద తనిఖీ చేసి ప్లాస్టిక్ వస్తువులను సరఫరా చేసే వాహనాలు వెనక్కి పంపుతున్నారు. యాత్రికుల వాహనాలలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులను పడవేస్తున్నారు.
దేవస్థానంలో స్వామి అమ్మవార్ల ప్రసాదానికి జ్యూట్, కాగితంతో తయారు చేసిన బ్యాగ్‌లను వాడాలని, శ్రీశైలంలో గాజు బాటిళ్ల ప్యాకింగ్‌తో కూడిన మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, అదనంగా 20 మంది సిబ్బందిని నియమించి అటవీ ప్రాంతంలోని రోడ్లకు ఇరువైపులా ఉన్న వ్యర్థాలను తొలగించాలని సమావేశంలో నిర్ణయించారు.
కోర్ ఏరియాలో ప్లాస్టిక్ పూర్తి నిషేధానికి మూడోసారి బుధవారం అటవీ, దేవస్థానం అధికారులు సున్నిపెంట బయోలేబరేటరీలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కన్జర్వేటర్ బి.ఎన్‌ఎన్.మూర్తి, డీఎఫ్‌ఓలు విఘ్నేష్ అపావ్, సాయిబాబా, రేంజ్ అధికారి నరసింహులు, దేవస్థానం అధికారులు రామకృష్ణ అయ్యన్న, మల్లికార్జునరెడ్డి
తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment