శ్రీశైలంలో ఆకట్టుకుంటున్న ‘చెంచులక్ష్మి’ ట్రైబల్ మ్యూజియం
గిరిజన తెగల సంస్కృతి, చరిత్రను తెలియజేసేలా ప్రతిమలు
చెంచులతోపాటు మరికొన్ని కొండ జాతుల విశేషాలు
పెద్దదోర్నాల: విద్యార్థులు వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. నిత్యం పాఠ్య పుస్తకాలతో కుస్తీ పట్టే పిల్లలు సెలవుల్లో విజ్ఞానం పెంచుకోవడానికి విహారయాత్రలు చేసేందుకు ఇష్టపడతారు. అలాగే ఉద్యోగులు, వివిధ వృత్తులలో ఉన్నవారు సైతం వేసవికాలంలో కాస్తంత విశ్రాంతి, మానసికానందం కోసం పర్యాటక ప్రదేశాలు చూసేందుకు వెళ్తుంటారు.
ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు సరిహద్దులో ఉన్న ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలోని చెంచులక్ష్మి ట్రెబల్ మ్యూజియంలో చెంచుల జీవిత విశేషాలను తెలుసుకునేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. ఐటీడీఏ ఏర్పాటుచేసిన ఈ ట్రైబల్ మ్యూజియంలో చెంచులతోపాటు అడవి బిడ్డలైన శోలాములు, కోంధులు, గోండులు, నాయకపోడులు, యానాదులు మొదలైన వారందరి చరిత్ర, సంస్కృతిని తెలియజేసేలా ప్రతిమలు ఉన్నాయి.
ట్రైబల్ మ్యూజియంలో ఇవీ ప్రత్యేకతలు...
» ప్రధాన ద్వారం నుంచి లోపలికి అడుగుపెట్టగానే ఎదురుగా ఒక పుట్ట, దానిముందు పామును ఆడిస్తున్నట్టుగా ఒక చెంచు గిరిజనుడి ప్రతిమ కనిపిస్తాయి. నాదస్వరంతో సర్పాన్ని ఆడిస్తున్న తీరు చెంచులకు వాటితో గల అనుబంధం, భక్తి, విశ్వాసాలను తెలియజేస్తుంది.
» రెండో గదిలో ఢంకా బజాయిస్తున్న చెంచు, ఆ చుట్టూ గోడలకు అవజాల, మద్దెల, మృదంగం, తుడుము, విడక, తప్పెట, డోలు, డోల్‌కాడ్, మువ్వలదండు, పిల్లనగ్రోవి, కికిరి, పికిరి, డిర్జింగోవరాయ్, గుమ్మలం, పర్ర మొదలైన గిరిజన తెగల వారి సంగీత వాయిద్యాలు ఉన్నాయి. మల్లికార్జున స్వామికి ఇష్టమైన వీటిని మహాశివరాత్రి ఉత్సవాల్లో వివిధ తెగలకు చెందిన గిరిజనులు వాయిస్తుంటారు.
» మూడో గదిలో చెంచుగుచ్చ ఏర్పాటుచేశారు. చెంచుల ఆభరణాలు, ఆయుధాలు, ఇతర వస్తు సామగ్రి ఇందులో చూడవచ్చు.
» ఐదో గదిలో రవితార, చిడతలు పట్టి శివకథలను చెబుతున్న దేవచెంచుల బొమ్మ ఉంది. శివపూజ చేసే దేవ చెంచులే కష్టాలకోర్చి శ్రీశైలాన్ని రక్షించినట్లు తెలుస్తోంది. శ్రీశైలంలో ఉన్న చెంచులంతా ఈ దేవ చెంచుల జాతికి చెందినవారే. వీరు వాడే పెరుబాకు, కొడవలి, గొరక, వంకటి తెడ్డు, రోకలి, తేనెబుట్ట, గుండురాయి ఈ గదిలో ఉన్నాయి.
»తొమ్మిదో గదిలో సోది చెప్పే ఎరుకలసాని కొరవంజి కనపడుతుంది. ఈమె భ్రమరాంబ మల్లికార్జునుల పెళ్లి సంగతి, శ్రీశెలం పెద్ద పట్టణంగా విస్తరించి 12 ఆమడల పట్టణం అవుతుందని సోది చెప్పినట్టు పెద్దలు చెబుతారు. ఈ గదిలో ఎరుకల, యానాదులు ఉపయోగించే వివిధ రకాల వాయిద్య పరికరాలు కూడా ఉన్నాయి. వీటితోపాటు ఎన్నో విశేషాలతో కూడిన ప్రతిమలు సందర్శకులను ఆకట్టుకుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment