tribles
-
గిరిజనుల జీవనశైలిని చూసొద్దాం రండి..
పెద్దదోర్నాల: విద్యార్థులు వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. నిత్యం పాఠ్య పుస్తకాలతో కుస్తీ పట్టే పిల్లలు సెలవుల్లో విజ్ఞానం పెంచుకోవడానికి విహారయాత్రలు చేసేందుకు ఇష్టపడతారు. అలాగే ఉద్యోగులు, వివిధ వృత్తులలో ఉన్నవారు సైతం వేసవికాలంలో కాస్తంత విశ్రాంతి, మానసికానందం కోసం పర్యాటక ప్రదేశాలు చూసేందుకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు సరిహద్దులో ఉన్న ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలోని చెంచులక్ష్మి ట్రెబల్ మ్యూజియంలో చెంచుల జీవిత విశేషాలను తెలుసుకునేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. ఐటీడీఏ ఏర్పాటుచేసిన ఈ ట్రైబల్ మ్యూజియంలో చెంచులతోపాటు అడవి బిడ్డలైన శోలాములు, కోంధులు, గోండులు, నాయకపోడులు, యానాదులు మొదలైన వారందరి చరిత్ర, సంస్కృతిని తెలియజేసేలా ప్రతిమలు ఉన్నాయి. ట్రైబల్ మ్యూజియంలో ఇవీ ప్రత్యేకతలు... » ప్రధాన ద్వారం నుంచి లోపలికి అడుగుపెట్టగానే ఎదురుగా ఒక పుట్ట, దానిముందు పామును ఆడిస్తున్నట్టుగా ఒక చెంచు గిరిజనుడి ప్రతిమ కనిపిస్తాయి. నాదస్వరంతో సర్పాన్ని ఆడిస్తున్న తీరు చెంచులకు వాటితో గల అనుబంధం, భక్తి, విశ్వాసాలను తెలియజేస్తుంది. » రెండో గదిలో ఢంకా బజాయిస్తున్న చెంచు, ఆ చుట్టూ గోడలకు అవజాల, మద్దెల, మృదంగం, తుడుము, విడక, తప్పెట, డోలు, డోల్కాడ్, మువ్వలదండు, పిల్లనగ్రోవి, కికిరి, పికిరి, డిర్జింగోవరాయ్, గుమ్మలం, పర్ర మొదలైన గిరిజన తెగల వారి సంగీత వాయిద్యాలు ఉన్నాయి. మల్లికార్జున స్వామికి ఇష్టమైన వీటిని మహాశివరాత్రి ఉత్సవాల్లో వివిధ తెగలకు చెందిన గిరిజనులు వాయిస్తుంటారు. » మూడో గదిలో చెంచుగుచ్చ ఏర్పాటుచేశారు. చెంచుల ఆభరణాలు, ఆయుధాలు, ఇతర వస్తు సామగ్రి ఇందులో చూడవచ్చు. » ఐదో గదిలో రవితార, చిడతలు పట్టి శివకథలను చెబుతున్న దేవచెంచుల బొమ్మ ఉంది. శివపూజ చేసే దేవ చెంచులే కష్టాలకోర్చి శ్రీశైలాన్ని రక్షించినట్లు తెలుస్తోంది. శ్రీశైలంలో ఉన్న చెంచులంతా ఈ దేవ చెంచుల జాతికి చెందినవారే. వీరు వాడే పెరుబాకు, కొడవలి, గొరక, వంకటి తెడ్డు, రోకలి, తేనెబుట్ట, గుండురాయి ఈ గదిలో ఉన్నాయి. »తొమ్మిదో గదిలో సోది చెప్పే ఎరుకలసాని కొరవంజి కనపడుతుంది. ఈమె భ్రమరాంబ మల్లికార్జునుల పెళ్లి సంగతి, శ్రీశెలం పెద్ద పట్టణంగా విస్తరించి 12 ఆమడల పట్టణం అవుతుందని సోది చెప్పినట్టు పెద్దలు చెబుతారు. ఈ గదిలో ఎరుకల, యానాదులు ఉపయోగించే వివిధ రకాల వాయిద్య పరికరాలు కూడా ఉన్నాయి. వీటితోపాటు ఎన్నో విశేషాలతో కూడిన ప్రతిమలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. -
సీఎం జగన్ ప్రభుత్వంలో గిరిపుత్రుల సరికొత్త జీవితం
-
నేటి నుంచి తెలంగాణ లో కాంగ్రెస్ దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా
-
ఉట్నూరు ఐ టి డీ ఏ ను ముట్టడించిన ఆదివాసీలు
-
గ్రామీణ, గిరిజన ప్రాంతాలపై దృష్టి సారించాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నగరాలు, పెద్ద పట్టణాలను వణికించిన కరోనా మహమ్మారి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలను, గిరిజన తండాలను సైతం చుట్టేస్తోంది. చిన్నచిన్న పట్టణాల్లో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. పల్లె ప్రజల అవగాహనారాహిత్యం వైరస్ వ్యాప్తికి ఆజ్యం పోస్తోంది. సరైన సమయంలో చికిత్స అందక బాధితులు కన్నుమూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు గ్రామాలు, చిన్న పట్టణాల్లో మహమ్మారి వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం కొత్త మార్గదర్శకాలు, ప్రామాణిక నియమావళిని (ఎస్ఓపీ) జారీ చేసింది. గ్రామాలు, పట్టణాల్లో ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో కరోనా బారినపడినప్పటికీ లక్షణాలు లేనివారి కోసం, హోం ఐసోలేషన్‌లో ఉండడం సాధ్యం కాని బాధితుల కోసం 30 పడకల కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. అన్ని ప్రజారోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, హెల్త్ సెంటర్లు, వెల్నెస్ సెంటర్లలో సరిపడా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు (ఆర్ఏటీ) కిట్లు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. ఈ మార్గదర్శకాల్లో ఇంకా ఏం ప్రస్తావించారంటే... ► శ్వాస, అనారోగ్య సమస్యలతో బాధపడేవారిపై నిఘా పెట్టాలి. కరోనా కేసులు గుర్తించి వారికి ఆరోగ్య సదుపాయాలు కల్పించాలి. మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహించాలి. ► ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించడానికి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలకు శిక్షణ ఇవ్వాలి. ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు అందుబాటులో ఉంచాలి. ► లక్షణాలు లేనప్పటికీ కరోనా సోకిన వారిని క్వారంటైన్లో ఉంచాలి. 80 నుంచి 85 శాతం కేసుల్లో లక్షణాలు ఉండట్లేదు. వీరికి ఆసుపత్రి అవసరం లేదు. ఇంట్లో లేదా కరోనా కేర్ సెంటర్లో ఐసోలేషన్ సదుపాయం కల్పించాలి. కుటుంబ సభ్యులూ క్వారంటైన్ పాటించాలి. ► కరోనా రోగులకు పారాసిటమాల్, ఐవెర్‌మెక్టిన్, దగ్గు సిరప్, మల్టీ విటమిన్ల్లతో కూడిన హోం ఐసోలేషన్ కిట్లు అందజేయాలి. ► శ్వాసలో ఇబ్బంది, ఆక్సిజన్ సాచురేషన్ 94 కన్నా తక్కువ, ఛాతీ భాగంలో నొప్పి, మానసిక ఆందోళన ఉన్న వారికి తక్షణమే వైద్య సదుపాయం అందించాలి. ► ఆక్సిజన్ స్థాయి 94 కన్నా తక్కువ ఉన్న వారికి ఆసుపత్రుల్లో బెడ్ల సదుపాయం కల్పించాలి. ► తక్కువ, లక్షణాలు లేని వారిని కోవిడ్ కేర్ సెంటర్లకు, మోడరేట్ కేసుల వారిని డెడికేటెడ్ కోవిడ్ హెల్త్ సెంటర్‌కు, తీవ్రంగా ఉన్న కేసులు డెడికేటెడ్ కోవిడ్ ఆసుపత్రులకు పంపాలి. ► కేసుల సంఖ్య, కరోనా తీవ్రత బట్టి కాంటాక్ట్ ట్రేసింగ్ తప్పకుండా చేయాలి. ► పట్టణ శివారు ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ కేర్ సెంటర్లలో 30 పడకలుండాలి. గిరిజన ప్రాంతాల్లో.... గ్రామీణప్రాంతాలతో పోలిస్తే గిరిజన ప్రాంతా ల్లో అదనపు సవాళ్లు ఉండడంతోపాటు ఆరోగ్య సేవలు తక్కువగా, సామాజికంగా, ఆర్థికంగా భౌగోళికంగానూ దూరంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో.... ► ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత గ్రామ సభ తీసుకోవాలి. కోవిడ్–కేర్ కార్యక లాపాల్లోనూ కీలకపాత్ర పోషించాలి. ► మొబైల్ మెడికల్ యూనిట్లు ఏర్పాటు చేసి కోవిడ్‌కేర్ సెంటర్లతో అనుసంధానించాలి. ► ఎంఎంయూల్లో వైద్యాధికారి, ఫార్మాసిస్టు, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్ ఉండాలి. -
సెంటినలీస్లతో మమేకమైన మధుబాల!
గాలి, నీరు, చెట్టు, పుట్ట ఇవే వారికి జీవితం, ఆరాధ్యం. అంతకు మించిన కాంక్రీటు జంగిల్‌కి సంబంధించిన భవబంధాలేవీ వారు కోరుకోరు. వారే అండమాన్‌లోని సెంటినలీస్ తెగకు చెందిన ఆదివాసీలు. దాదాపు 60,000 సంవత్సరాలుగా ఆ తెగ అక్కడ మనుగడ సాగిస్తోంది. తమదైన ప్రత్యేక ప్రపంచంలో జీవిస్తోన్న వారిని దూరం నుంచి చూడటమే తప్ప వారి దగ్గరకు వెళ్ళడం అసాధ్యం. 2004 తరువాత ప్రభుత్వం కూడా ఆదివాసీలున్న ప్రాంతానికి ఇతరులు వెళ్ళడాన్ని నిషేధించింది. వారి కళ్లుగప్పి వారి దరిదాపుల్లోకి వెళ్ళిన వాళ్ళెవ్వరూ బతికిబట్టకట్టలేదు. ఇటీవలే జాన్ అలెన్ చౌ అనే క్రిస్టియన్ అమెరికన్ మిషనరీ యువకుడు వారి సామ్రాజ్యంలోకి చొరబడి వారి బాణాల దెబ్బలకు చనిపోయిన సంగతి తెలిసిందే. సెంటినలీస్‌ను దగ్గరి నుంచి కూడా చూడటానికి జంకుతున్న వేళ, వారితో స్నేహ కరచాలనాన్ని అందుకొని మమేకమైన ఏకైక సామాజిక శాస్త్ర పరిశోధకురాలు మధుమాల ఛటోపాధ్యాయ. అరుదైన ఆదివాసీ తెగ సెంటినలీస్‌ని 1999లో తొలిసారిగా కలిసిన మధుమాల ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించారు. జాన్ అల్లెన్ చౌ మరణరహస్యాన్ని కూడా ఆమె ఛేదించే ప్రయత్నం చేశారు. ముందు హెచ్చరికలు.. తరువాతే దాడి.. దశాబ్దాలుగా బాహ్యప్రపంచాన్ని వెలివేస్తూ అండమాన్ అటవీ ప్రాంతంలో తమదైన చిన్ని ప్రపంచంలో నివసిస్తున్న సెంటినలీస్ చాలా బలంగా ఉంటారు. ఒక్క మధ్య వయస్కుడు బలీయమైన ఐదుగురు యువకులను సైతం అవలీలగా మట్టికరిపించగలడు. నిజానికి సెంటినలీస్ తమంతట తామే దాడికి దిగరని తెలిపారు. తమ హెచ్చరికలను లెక్కచేయకుండా ముందుకెళితేనే వారు దాడికి దిగుతారంటారు మధుమాల. పరిశోధనలో భాగంగా నెలల తరబడి సెంటినలీస్‌తో గడిపిన మధుమాల ఒకరోజు అక్కడి నుంచి బయటి ప్రపంచానికి ప్రయాణమయ్యారు. కాసేపట్లో వర్షం కురుస్తుందని, వెళ్ళొద్దని వాళ్ళు వారించారు. అప్పటిదాకా కాసిన మండుటెండ మాయమై వర్షం రావడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతయింది. వాళ్ళెంతగా ప్రకృతిలో లీనమై ఉంటారనడానికి మధుమాల చెప్పిన ఉదాహరణ ఇది. సెంటినలీస్ అంతిమసంస్కారాలు సైతం ప్రత్యేకంగా ఉంటాయి. మృతుల పోలిక ఉన్న చెక్కబొమ్మను చేసి, దాని పక్కనే వారికిష్టమైన ఆహారాన్ని, నీటిని పెడతారు. 1999లో సెంటినలీస్‌ని కలిసినప్పుడు మధుమాలను ‘‘మిలాలే, మిలాలే’’ అని పిలిచేవారు. మిలాలే అంటే వారి భాషలో మిత్రులని అర్థం. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ఇతరత్రా సందర్భాల్లో సెంటినలీస్‌కు అలవాటైన కొందరినే ప్రభుత్వం అక్కడికి పంపిస్తుంది. -
ఇది గౌరవమేనా?
సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తరువాత మైనారిటీ, ఎస్టీ వర్గాల నుంచి ఇద్దరితో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సిద్ధమైంది! ఈమేరకు ఏపీ శాసనమండలి చైర్మన్ ఫరూక్, ఇటీవల మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రవణ్‌లకు సీఎం కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందచేసినట్లు తెలిసింది. ఆదివారం రోజు ఉదయం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధంగా ఉండాలని వారిద్దరికీ సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అనాదిగా అదే ఆనవాయితీ.. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ రాష్ట్రంలో చూసినా మైనారిటీలు, గిరిజనులకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే సంప్రదాయాన్ని పాటించారు. ఈ వర్గాలకు ప్రాతినిథ్యం లేకుండా మంత్రివర్గ ఏర్పాటు ఎన్నడూ జరగలేదు. ఈ నేపథ్యంలో నాలుగున్నరేళ్లు గడిచిపోయిన తరువాత ఇన్నాళ్లూ దూరంగా పెట్టి, తీరా ఎన్నికలకు వెళ్లే ముందు మైనారిటీ, ఎస్టీలను మంత్రివర్గంలో తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడం ఆ వర్గాలకు సన్మానమా? అవమానమా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నికలకు ముందు ఓ వ్యక్తిని తెచ్చి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తే తమను ఎలా గౌరవించినట్లు అవుతుందని ఆయా వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ దశలో ఇప్పుడు మంత్రులుగా నియమించినంత మాత్రాన వారు చేయగలిగేది ఏమీ ఉండదని, ఇదంతా ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇది ఆయా వర్గాలను గౌరవించడం కాదు అవమానించినట్లుగానే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. పదవిస్తే అవమానం మాసిపోతుందా? రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన గిరిజన సలహా మండలి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శించింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎస్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉండటంతో గిరిజన సలహా మండలిని నియమించకుండా ఏళ్ల తరబడి తాత్సారం చేసింది. దీనిపై పోరాడిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయడమే కాకుండా రాష్ట్రపతి, గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ప్రతిపక్ష నేత పోరాటంతో దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితం ఎట్టకేలకు గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఎస్టీ వర్గానికి చెందిన వారిని మంత్రి పదవిలోకి తీసుకున్నా ఇన్నేళ్లుగా గిరిజన వర్గానికి సర్కారు చేసిన అన్యాయం, అవమానం మాసిపోదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఎన్నిక కాకుండానే మంత్రిగా శ్రవణ్! మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నందున కిడారి శ్రవణ్ ఆరు నెలల్లోగా ఎమ్మెల్సీగా లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే అప్పటికి సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఏ సభకూ ఎన్నిక కాకుండానే శ్రవణ్ మంత్రిగా కొనసాగుతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. స్పీకర్ కోడెల ఆఖరి ప్రయత్నం.. విస్తరణ నేపథ్యంలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. కోడెల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అన్న క్యాంటీన్ కోసం రూ.5 లక్షల విరాళాన్ని అందించేందుకు వచ్చిన కోడెల శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. అయితే ఇప్పుడు అవకాశం ఇవ్వలేనని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు తెలిసింది. రెండు బెర్తులే ఖాళీగా ఉన్నాయని, వాటిని ముస్లిం, ఎస్టీ వర్గాలకు ఇవ్వాలని నిర్ణయించామని చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు తన వద్దే ఉన్న వైద్య, ఆరోగ్య శాఖను ఎవరికి ఇవ్వాలనే అంశంపై ముఖ్యమంత్రి మల్లగుల్లాలు పడుతున్నారు. గతంలో ఆ శాఖ తీసుకోవాలని యనమల రామకృష్ణుడికి సూచించినా వివాదాలున్నాయనే కారణంతో ఆయన నిరాకరించారు. గ్రీవెన్స్ హాల్లో ప్రమాణ స్వీకారం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఆదివారం ఉదయం 11.45 గంటలకు ముహూర్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం పక్కన గ్రీవెన్స్ హాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని సీఎం కార్యాలయం శుక్రవారం సాధారణ పరిపాలన శాఖ(రాజకీయ)ను ఆదేశించింది. -
‘పొరపాటున నోరుజారా.. నా ఉద్దేశం అది కాదు’
హైదరాబాద్ : గిరిజన పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటోందని చెబుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జువల్ ఓరంను చిక్కుల్లో పడేశాయి. శుక్రవారం ఇక్కడి మారియట్ హోటల్లో జరిగిన నేషనల్ ట్రైబల్ ఎంటర్ప్రెన్యూర్ కాన్క్లేవ్–2018లో పాల్గొన్న కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. గిరిజనులు అన్ని రంగాల్లో రాణించాలని, అలా కావాలంటే విజయ్ మాల్యాలా తెలివిగా ఆలోచించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలు చాలా చాకచక్యంగా వ్యవహరించి బ్యాంకుల నుంచి సులువగా రుణాలు పొందాలని పిలుపునిచ్చారు. షెడ్యూల్డు కులాలకు చెందిన వారు విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు, ఇలా పలు రంగాల్లో రిజర్వేషన్లు పొందుతున్నారని, అయితే ఇతర సామాజిక వర్గాలవారితో సమానంగా చూడటం లేదని జువల్ ఓరం వ్యాఖ్యానించారు. ‘అంతా విజయ్‌మాల్యాను విమర్శిస్తున్నారు. కానీ మాల్యా ఏం చేశారో గుర్తుచేసుకోంది. అతడు చాలా తెలివైనవాడు. ఎంతోమంది తెలివైనవాళ్లకు ఉపాధి కల్పించాడు. ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు, బ్యాంకులకు మాల్యా చాలా చేశాడంటూ’ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాం రేపాయి. బ్యాంకులను ప్రభావితం చేయండి, ప్రభుత్వాలను, వ్యవస్థలను కాదని షెడ్యూల్డు కులాలవారిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం రూ.కోటి వరకు రాయితీతో గిరిజన పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోందని, దాన్ని రూ.5 కోట్లకు పెంచేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అయితే మాల్యాను పొగడటం ఏంటని కేంద్ర మంత్రిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరణ ఇచ్చుకున్న మంత్రి ప్రసంగం మధ్యలో పొరపాటున విజయ్‌మాల్యా పేరును ప్రస్తావించాను. మరొకరి పేరును ప్రస్తావించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దీనిపై జాతీయ మీడియ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘అనుకోకుండా మాల్యా విషయం తీసుకొచ్చా. అయితే ఉద్దేశపూర్వకంగా చేయలేదు. తెలివైన వ్యక్తి అని మరొకరి పేరు చెప్పి ఉంటే బాగుండేది. వా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నానని’ కేంద్ర మంత్రి జువల్ ఓరం అన్నారు. -
ఇదేం లెక్క
అక్కన్నపేట(హుస్నాబాద్): అవి మూరుమూల గిరిజన తండాలు.. ఆపై కనీస సౌకర్యాలు లేవు. కొండల్లో, గుట్టల నడుమ ఉన్న తండాలపై ఇంత నిర్లక్ష్యమా!? అడవిలో నివసించేటోళ్లు అడవి లోనే ఉండాలా.. అని ఆ గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. ఏ తండాకు వెళ్లాలన్నా కాళ్లు తడవాల్సిన పరిస్థితి. అక్కన్నపేట మండల కేంద్రానికి నాలుగు కిలో మీట ర్ల దూరంలోని బోదరవాగు తండా, చౌడు తండా, మంగ్యానాయక్ తండాలు నేటికి కనీస సౌకర్యాలు లేక దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆ మూడు తండాల్లో దాదాపు 450కి పైగా జనాభా ఉంటుంది. కానీ ఈ తండాలు మండలం పరిధిలోనే లేవన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. తమ తం డాలన్నీ కలుపుకొని గ్రామ పంచాయతీ గా మార్చాలని పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా తండాలను గ్రామ పం చాయతీలుగా ఏర్పాటు చేసేందుకు ప్ర భుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. చెరువులు, కొండలు, గుట్ట లు, వాగులు ఉన్న తండాల్లో 300 నుంచి 400 వరకు జనాభా ఉంటే గ్రామపంచా యతీగా గుర్తించవచ్చని ప్రభుత్వం చెబు తోంది. కానీ ఆ తండాలను గుర్తించడం అటుంచి కనీసం ఆ వైపు కన్నెత్తి చూసే వారు లేక కనీస సౌకర్యాలు కరువై గిరి జనులు నరకయాతన పడుతున్నారు. ప్రతిపాదనలో కేశనాయక్ తండా నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు కానున్న కేశనాయక్ తండాలో బోదర్ వాగు తండా, చౌడు తండా, మంగ్యానాయక్ తండాలను కలిపితే చెరువుదాటి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే మండల కేంద్రంలో కొనసాగిస్తే వాగు దాటి రావాల్సి ఉంది. గిరిజనులు ఏటు వెళ్లాలన్నా వాగైనా, చెరువైనా దాటాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకే పంచాయతీ పరిధిలో మూడింటికి ప్రతిపాదనలు హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని వంగరామయ్యపల్లి, బల్లునాయక్ తండా, పూల్నాయక్ తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపిచడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవి గ్రామ పంచాయతీకి అర కిలో మీటర్ దూరంలో మెయిన్ రోడ్డుకు పక్కనే ఉన్నాయి. ఒకే గ్రామ పంచాయతీ పరిధిలో మూడు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేయడం రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే కొనసాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి హరీశ్‌రావు తమ తండాలపై దృష్టిసారించి కనీస సౌకర్యాల కల్పనతోపాటు గ్రామ పంచాయతీ ఏర్పాటు గురించి ఆలోచించాలని గిరిజనులు కోరుతున్నారు. పంచాయతీలుగా గుర్తించాలి బోదరవాగు తం డా, చౌడు తండా, మంగ్యానాయక్ తండాలవాసులు ఎటు వెళ్లాలన్నా చెరువైనా, వాగైనా దాటాల్సిన పరి స్థితి. ఆ తండాల చుట్టూ వాగు లు ఉన్నాయి. నేటికీ రోడ్డు, తాగునీటి సౌకర్యాలు లేవు. ఈ మూడు తండాలను కలిపి గ్రామపంచాయతీగా గు ర్తించాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఆం దోళనకు దిగుతాం. –బీమాసాహెబ్, గిరిజన జేఏసీ చైర్మన్ -
మన్యంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి
విశాఖపట్నం: మన్యంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. విశాఖ మన్యంలో అనారోగ్యాలతో బాధపడుతున్న గిరిజనులను పరామర్శించేందుకు శుక్రవారం ఆయన విశాఖకు చేరుకున్నారు. అక్కడి నుంచి రహదారి మార్గంలో ప్రయాణించి బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. -
గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు
కలెక్టర్ అరుణ్‌కుమార్ కాకినాడ సిటీ : జిల్లాలోని 11 ఏజెన్సీ మండలాల్లో గిరిజనుల ఆరోగ్య పరిరక్షణపై విస్తృత ప్రచారం కల్పించి, ఆ ప్రాంత ప్రజలను అనారోగ్య పరిస్థితుల నుంచి కాపాడాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏజెన్సీలోని గిరిజనుల అనారోగ్య సమస్యలపై శాశ్వత చర్యలు అవసరమని పేర్కొన్నారు. ఏజెన్సీలోని సీసీ రోడ్ల నిర్మాణాన్ని సమీక్షిస్తూ, ఏజెన్సీలో రూ.11 కోట్ల విలువైన పనులు ఇప్పటికే మంజూరయ్యాయని వివరించారు. గోదావరి నదిలో ధవళేశ్వరం ఎగువ భాగంలో త్వరలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇసుక మేటలను తొలగించే పనులు ప్రారంభం కానున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఈ పనులను డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అప్పగించిందని, తద్వారా 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వుతారని చెప్పారు. జిల్లాలో ఉన్న 65 సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లు, ఏర్పాటులో ఉన్న 15 వేల వర్మీ కంపోస్ట్ యూనిట్ల నుంచి ఉత్పత్తి అయ్యే సేంద్రీయ ఎరువుల మార్కెటింగ్ కోసం ఒక ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. వచ్చే డిసెంబర్ నాటికి పెద్దఎత్తున సేంద్రియ ఎరువులు ఉత్పత్తి కానున్నట్టు చెప్పారు. స్వచ్ఛభారత్ దత్తత అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాల సాధన ప్రగతిపై సమీక్షించారు. సమావేశంలో జేసీ ఎస్.సత్యనారాయణ, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి చక్రధరబాబు, డీఆర్డీఏ పీడీ ఎస్.మల్లిబాబు, జెడ్పీ సీఈఓ కె.పద్మ, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం.జ్యోతి, డ్వామా పీడీ ఎ.నాగేశ్వరరావు, డీఈఓ ఆర్.నరసింహరావు, ఆర్అండ్బీ ఎస్ఈ మూర్తి, జేడీఏ కేఎస్వీ ప్రసాద్ పాల్గొన్నారు. బాధిత కుటుంబాలకు సత్వర సాయం తీవ్రవాద హింసాత్మక చర్యల్లో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు సహాయాలను సత్వరం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. తీవ్రవాద బాధిత కుటుంబాల సంక్షేమంపై ఏర్పాౖటెన జిల్లా స్థాయి కమిటీ సమావేశం సోమవారం రాత్రి కలక్టరేట్లో జరిగింది. జిల్లాలో నమోదైన 9 కేసులపై సమీక్షించి, బాధిత కుటుంబాల్లో ఆరుగురికి సాయం అందించేందుకు, కుటుంబాల్లో ఒకరికి ఉపాధి కల్పించేందుకు ఆమోదించింది. ఆ మే రకు రాష్ట్ర కమిటీకి ప్రతిపాదించింది. మూడు కేసుల్లో మృతుల వారసుల నిర్ధారణపై రాష్ట్ర కమిటీ వివరణ కోరేందుకు నిర్ణయించారు. రంపచోడవరం సబ్ కలెక్టర్ పి.రవి, ఓఎస్డీ కె.ఫకీరప్ప పాల్గొన్నారు. -
మూడెకరాల భూమి ఇవ్వాలి
నల్లగొండ టౌన్ : ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం.డేవిడ్‌కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక న్యూడెమోక్రసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ దళితులు, గిరిజనులకు ఇస్తామన్న మూడెకరాల భూమి వెంటనే ఇవ్వాలని, కేజీ టు పీజీ ఉచిత విద్య అందించాలని, రుణమాఫీ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఇ.సాగర్, కె.అయోధ్య, నగేష్, బి.వి చారి, చైతన్య, హరికృష్ణ, సుధాకర్‌రెడ్డి, నర్సింహ, ప్రవీణ్ పాల్గొన్నారు. -
పస్కర దేవర పూజలు
కాసిపేట : మండలంలోని దేవాపూర్ జీపీ పరిధిలోని సమీప గుట్టల్లో ఆదివాసీ గిరిజనులు పస్కర దేవర పూజలు చేశారు. ముందుగా పోచమ్మ దేవతకు పూజలు నిర్వహించి అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి కుటుంబ సమేతంగా వెళ్లి అటవీరాజుల దేవర ప్రతిమలు తయారు చేసి పప్పు పలహారాలు నైవేద్యం పెట్టి సామూహిక పూజలు నిర్వహించారు. వర్షాలు సంవద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, గొడ్డుగోదా పశుపక్షాదులను కాపాడాలని మొక్కులు చెల్లించారు. అనంతరం సామూహిక భోజనాలు చేశారు. పూజారులు రొడ్డ లచ్చులు, రొడ్డ రాజం, గిరిజనసంఘాల నాయకులు కొమ్ముల బాపు, రొడ్డ రమేష్, సండ్ర బాపు తదితరులు ఉన్నారు. -
అటవీ గెస్ట్‌హౌస్‌ను ముట్టడించిన గిరిజనులు
అశ్వారావుపేట: అటవీశాఖ అధికారులు తమపై పెట్టిన తప్పుడు కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ ఆధ్వర్యంలో గిరిజనులు బుధవారం ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అటవీశాఖ గెస్ట్‌హౌస్‌ను ముట్టడించారు. అనంతరం చెక్‌పోస్ట్ వద్ద ధర్నా నిర్వహించారు. అటవీశాఖ అధికారులు అనవసరంగా గిరిజనులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, వాటిని ఎత్తివేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి రంగారావు డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోని బండారుగుంపు వద్ద అటవీశాఖ అధికారులపై పోడు సాగుదారులు దాడి చేయడం... దానిపై కేసు నమోదు చేయడం తెలిసిందే. -
అటవీ సిబ్బందిపై గిరిజనుల దాడి
అశ్వారావుపేట: ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం పరిధిలో గిరిజనులు అటవీశాఖ అధికారులపై దాడి చేశారు. మండల పరిధిలోని బండారుగుంపు వద్ద అటవీ భూముల్లో గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు జగన్నాథపురం సెక్షన్‌కు చెందిన అటవీశాఖ సిబ్బంది వాహనంలో వెళ్లగా... వారిని పోడు సాగుదారులు అడ్డుకున్నారు. దాడికి దిగడంతోపాటు జీపును ధ్వంసం చేశారు. దీంతో అటవీశాఖ సిబ్బంది అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ ఘటనపై అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. -
10 మంది గిరిజనుల కిడ్నాప్
చింతూరు : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కిడ్నాప్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా పదిమంది గిరిజనులను కిడ్నాప్ చేయడమేకాక ఓ కానిస్టేబుల్‌ను హతమార్చారు. వివరాల్లోకి వెళ్తే... సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని భెర్జి గ్రామానికి చెందిన పదిమంది గిరిజనులు ఆదివారం వంటచెరకు నిమిత్తం అటవీ ప్రాంతంలోకి వెళ్లగా మావోయిస్టులు కిడ్నాప్ చేసి రహస్య ప్రదేశానికి తరలించారు. తాము నిర్వహిస్తున్న సమావేశాలకు గిరిజనులు రాకపోవడంతోపాటు తమకు సహకరించడంలేదనే కారణంతో మావోయిస్టులు ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా గత నెలరోజులుగా దండకారణ్యంలో మావోయిస్టులు కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారు. 20 రోజుల క్రితం గొల్లపల్లి సర్పంచ్‌తో పాటు మరొకరిని కిడ్నాప్ చేసి, హతమార్చారు. వారం క్రితం గంగలేరు సర్పంచ్‌తోపాటు నలుగురిని కిడ్నాప్ చేసి, తర్వాత విడిచిపెట్టారు. కిడ్నాప్‌ల పరంపర కొనసాగుతుండడంతో దండకారణ్య పరిధిలోని గ్రామాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందోననే భయాందోళనలు నెలకొన్నాయి. కాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఓ పోలీసు కానిస్టేబుల్‌ను హతమార్చారు. మిర్తూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సుందర్ కశ్యప్ శనివారం సమీపంలోని చేర్పాల్‌లో నిర్వహిస్తున్న జాతర చూసేందుకు వెళ్లాడు. అక్కడ అతడిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు గొంతు నులిమి, హత్య చేసి ఆదివారం శవాన్ని పాలనార్ వద్ద పడేశారు. -
అటవీ అధికారులు, గిరిజనుల మధ్య ఘర్షణ
ఖమ్మం : ఖమ్మం జిల్లా చంద్రుగుండు మండలంలోని మర్రిగూడెం గ్రామంలో అటవీ శాఖ అధికారులు, గిరిజనులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక్కడ అటవీ సరిహద్దు ప్రాంతంలో అధికారులు కందకం పనులను సోమవారం చేపట్టారు. అయితే తాము పోడు వ్యవసాయం చేసుకునే భూముల్లో కందకం పనులను నిర్వహించవద్దని గిరిజనులు అడ్డుకున్నారు. వెంటనే పనులను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. అటవీ సిబ్బంది ససేమిరా అనడంతో గిరిజనులు సిబ్బంది కళ్లల్లో కారం చల్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. అటవీ శాఖ సిబ్బంది గిరిజనులపై లాఠీ చార్జి చేశారు. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థతి విషమంగా ఉంది. బాధితుడిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (చంద్రుగొండు) -
అశ్వారావు పేటలో గిరిజనుల ఆందోళన
అశ్వారావుపేట: ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామం సమీపంలో అటవీ శాఖ అధికారులు, గిరిజనుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక్కడ అటవీ సరిహద్దు ప్రాంతంలో అధికారులు శుక్రవారం ఉదయం కందకం పనులు చేపట్టారు. అయితే తాము పోడు వ్యవసాయం చేసుకునే భూముల్లో కందకం పనులను నిర్వహించవద్దని గిరిజనులు అడ్డుకున్నారు. అనంతరం వారు ఆందోళన చేపట్టారు. దీంతో అటవీ శాఖ సిబ్బంది పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.