సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నగరాలు, పెద్ద పట్టణాలను వణికించిన కరోనా మహమ్మారి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలను, గిరిజన తండాలను సైతం చుట్టేస్తోంది. చిన్నచిన్న పట్టణాల్లో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. పల్లె ప్రజల అవగాహనారాహిత్యం వైరస్ వ్యాప్తికి ఆజ్యం పోస్తోంది. సరైన సమయంలో చికిత్స అందక బాధితులు కన్నుమూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు గ్రామాలు, చిన్న పట్టణాల్లో మహమ్మారి వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం కొత్త మార్గదర్శకాలు, ప్రామాణిక నియమావళిని (ఎస్‌ఓపీ) జారీ చేసింది. గ్రామాలు, పట్టణాల్లో ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో కరోనా బారినపడినప్పటికీ లక్షణాలు లేనివారి కోసం, హోం ఐసోలేషన్‌లో ఉండడం సాధ్యం కాని బాధితుల కోసం 30 పడకల కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. అన్ని ప్రజారోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, హెల్త్ సెంటర్లు, వెల్‌నెస్ సెంటర్లలో సరిపడా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు (ఆర్‌ఏటీ) కిట్లు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. ఈ మార్గదర్శకాల్లో ఇంకా ఏం ప్రస్తావించారంటే...
► శ్వాస, అనారోగ్య సమస్యలతో బాధపడేవారిపై నిఘా పెట్టాలి. కరోనా కేసులు గుర్తించి వారికి ఆరోగ్య సదుపాయాలు కల్పించాలి. మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహించాలి.
► ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించడానికి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇవ్వాలి. ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు అందుబాటులో ఉంచాలి.
► లక్షణాలు లేనప్పటికీ కరోనా సోకిన వారిని క్వారంటైన్‌లో ఉంచాలి. 80 నుంచి 85 శాతం కేసుల్లో లక్షణాలు ఉండట్లేదు. వీరికి ఆసుపత్రి అవసరం లేదు. ఇంట్లో లేదా కరోనా కేర్ సెంటర్‌లో ఐసోలేషన్ సదుపాయం కల్పించాలి. కుటుంబ సభ్యులూ క్వారంటైన్ పాటించాలి.
► కరోనా రోగులకు పారాసిటమాల్, ఐవెర్‌మెక్టిన్, దగ్గు సిరప్, మల్టీ విటమిన్ల్లతో కూడిన హోం ఐసోలేషన్ కిట్లు అందజేయాలి.
► శ్వాసలో ఇబ్బంది, ఆక్సిజన్ సాచురేషన్ 94 కన్నా తక్కువ, ఛాతీ భాగంలో నొప్పి, మానసిక ఆందోళన ఉన్న వారికి తక్షణమే వైద్య సదుపాయం అందించాలి.
► ఆక్సిజన్ స్థాయి 94 కన్నా తక్కువ ఉన్న వారికి ఆసుపత్రుల్లో బెడ్ల సదుపాయం కల్పించాలి.
► తక్కువ, లక్షణాలు లేని వారిని కోవిడ్ కేర్ సెంటర్లకు, మోడరేట్ కేసుల వారిని డెడికేటెడ్ కోవిడ్ హెల్త్ సెంటర్‌కు, తీవ్రంగా ఉన్న కేసులు డెడికేటెడ్ కోవిడ్ ఆసుపత్రులకు పంపాలి.
► కేసుల సంఖ్య, కరోనా తీవ్రత బట్టి కాంటాక్ట్ ట్రేసింగ్ తప్పకుండా చేయాలి.
► పట్టణ శివారు ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ కేర్ సెంటర్లలో 30 పడకలుండాలి.
గిరిజన ప్రాంతాల్లో....
గ్రామీణప్రాంతాలతో పోలిస్తే గిరిజన ప్రాంతా ల్లో అదనపు సవాళ్లు ఉండడంతోపాటు ఆరోగ్య సేవలు తక్కువగా, సామాజికంగా, ఆర్థికంగా భౌగోళికంగానూ దూరంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో....
► ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత గ్రామ సభ తీసుకోవాలి. కోవిడ్–కేర్ కార్యక లాపాల్లోనూ కీలకపాత్ర పోషించాలి.
► మొబైల్ మెడికల్ యూనిట్లు ఏర్పాటు చేసి కోవిడ్‌కేర్ సెంటర్లతో అనుసంధానించాలి.
► ఎంఎంయూల్లో వైద్యాధికారి, ఫార్మాసిస్టు, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్ ఉండాలి.
గ్రామీణ, గిరిజన ప్రాంతాలపై దృష్టి సారించాలి
Published Mon, May 17 2021 6:19 AM | Last Updated on Mon, May 17 2021 6:19 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment