![Sakshi Editorial On Corona Virus new variant](/styles/webp/s3/article_images/2023/12/21/corona.jpg.webp?itok=Pld2uxIG)
పారాహుషార్ గంట మరోసారి మోగింది. దేశంలో కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. మే 21 తర్వాత ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయిలో 614 కొత్త కరోనా ఇన్‌ఫెక్షన్ కేసులు వచ్చాయి. కరోనా వైరస్ కొత్త వేరియంట్ జెఎన్.1 కేసు తొలిసారిగా కేరళలో బయటపడిన కొద్దిరోజుల్లోనే ఆ రాష్ట్రంలో నలుగురు బలయ్యారు. ఒక్క బుధవారమే దేశవ్యాప్తంగా 341 కొత్త కోవిడ్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదు కావడం, అందులో 292 కేసులు కేరళ నుంచి వచ్చినవే కావడంతో తక్షణమే అప్రమత్తత అవసరమైంది. ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. భయాందోళనలకు గురి కానక్కర్లేదు కానీ, జాగ్రత్తలు మాత్రం తప్పవనేది ఇప్పుడు మన ఆరోగ్య మంత్రం.
సరిగ్గా మూడేళ్ళ క్రితం మొదలైన కరోనా ఇప్పటికీ ఏదో ఒక రూపంలో మానవాళిని వేధిస్తూనే ఉంది. చిన్నాచితకా అలల్ని పక్కనపెడితే, రెండు ప్రధాన కరోనావేవ్‌లు మన దేశంలో జన జీవితాన్ని ఎంతగా అతలాకుతలం చేశాయో అందరికీ అనుభవైకవేద్యం. అప్పుడు నేర్చిన పాఠాలే ఇప్పుడు మార్గదర్శకాలు. ఈ మూడేళ్ళ కాలంలో అనేక కరోనా వైరస్ వేరియంట్లు వచ్చాయి.
ఆ వరుసలోదే భారత్‌లో తాజాగా కనిపించిన జెఎన్.1 వేరియంట్. బీఏ.2.86 కుటుంబానికి చెందిన ఈ వైరస్ ఉత్పరివర్తనం ఏడాది పైచిలుకుగా రూపుదిద్దుకొంటూ వచ్చిందట. ఇది ఇప్పటికే సుపరిచితమైన ఒమిక్రాన్‌లో బలవత్తరమైన వేరియంట్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వివిధ దేశాల్లో ఇప్పటికే ఇది తన విజృంభణ చూపుతోంది. డిసెంబర్ 3 ముందు వారంలో 32 వేల మందికి కరోనా సోకితే, ఆ తరువాతి వారంలో 56 వేల మందికి ఇన్ఫెక్షన్ వచ్చిందని సింగపూర్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మన దేశంలోని కేరళలో ర్యాండమ్ శాంపిళ్ళకు ఆర్టీ–పీసీఆర్ టెస్టులు చేస్తుండగా ఈ జెఎన్.1 వేరియంట్‌ను గుర్తించారు. మన దగ్గర ఈ వేరియంట్ తొలిసారిగా బయటపడి, కేసులు పెరుగుతుండగానే రాష్ట్రాలన్నిటికీ కేంద్రం తాజాగా మార్గదర్శకావళిని జారీ చేయడం గమనార్హం. పలు రాష్ట్రాలు అప్రమత్తమై ఇప్పటికే సమీక్షా సమావేశాలు జరిపి, మార్గదర్శ కాలను ప్రకటించాయి. కేరళలో పరిస్థితులు, కొత్త జెఎన్.1 వేరియంట్ కేసుల భయంతో కర్ణాటక సర్కార్ 60 ఏళ్ళ పైబడిన వారికి, అనారోగ్య సమస్యలున్నవారికి మాస్కు ధరించడం తప్పని సరి చేసింది. కేరళ సరిహద్దు జిల్లాలలను అప్రమత్తం చేసింది. ప్రజల రాకపోకలు, సమావేశాలపై నియంత్రణలు విధించ లేదన్న మాటే కానీ, కోవిడ్ లక్షణాలున్న వారికి పరీక్షలు చేయించడం పెంచింది.
వివిధ దేశాల్లో ఈ వేరియంట్ కనిపిస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ తాజా పరిస్థితులపై దృష్టి సారించింది. దీన్ని ఆసక్తికరమైన వేరియంట్‌గా పేర్కొంది. ఒమిక్రాన్ తరగతికి చెందినప్పటికీ ఈ వేరియంట్ మరీ ప్రాణాంతకమైనదేమీ కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ టీకా వేసుకోని వారికి సైతం ఈ వేరియంట్ వల్ల ప్రాణహాని ఉండదనీ భరోసా ఇస్తున్నారు. అది కొంత ఊరటనిచ్చే అంశం.
అలాగని అశ్రద్ధచూపలేం, అజాగ్రత్త వహించలేం. ఎవరెన్ని చెప్పినా ఆరోగ్యం, ప్రాణరక్షణకు సంబంధించిన విషయం గనక సహజంగానే ఈ వేరియంట్ పట్ల మన దేశంలో ఆరోగ్య నిపుణుల్లో, ప్రజల్లో ఆందోళన నెలకొనడం సహజమే. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు తొందరపడి, కఠిన నియంత్రణలు పెట్టనక్కరలేదు కానీ, మాస్కు ధారణ, చేతుల పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం లాంటి కనీస జాగ్రత్తలు పాటించడమే ప్రజారోగ్యానికి శ్రీరామరక్ష.
అసలే వ్యాధినిరోధక శక్తి తగ్గే చలికాలం. దానికి తోడు శబరిమల యాత్ర, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సెలవులతో ప్రయాణాల సీజన్. పైగా వచ్చేది సార్వత్రిక ఎన్నికల సీజన్. ర్యాలీలు, బహి రంగ సభల హంగామా. కరోనా వ్యాప్తికి కలిసొచ్చే ఇన్ని అంశాల మధ్య జాగ్రత్తలను విస్మరించడం ఎలాచూసినా రిస్కే. కట్టుదిట్టమైన ఆరోగ్యవ్యవస్థ, పరీక్షల వల్ల కేరళలో ఎప్పటికప్పుడు భారీగా కరోనా కేసులు బయటపడుతున్నాయి కానీ, అంతటి పరీక్షలు, నిఘా లేని చోట పరిస్థితులు చాప కింద నీరులా ఉండివుండవచ్చు.
దురదృష్టమేమంటే, మన దేశంలోనే కాక అనేక ప్రపంచ దేశాల్లో సైతం ఆ మధ్య కోవిడ్ కేసులు తగ్గాక, అధికారికంగా మహమ్మారి ముగిసినట్టు ప్రకటించారే తప్ప తర్వాతి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. జీనోమిక్ ప్రాసెసింగ్ టెస్ట్‌లు సహా వివిధ రూపాల్లో నిఘాను విస్మరించారు. భారత్‌లో లేబరేటరీ నెట్‌వర్క్ ‘ఇన్సాకాగ్’ (ఇండియన్ సార్స్–కోవ్–2 జీనోమిక్స్ కన్సార్టియమ్) తగిన స్థాయిలో పనిచేయకపోవడమే అందుకు ఉదాహరణ.
గత మూడేళ్ళలో దేశంలో 4.5 కోట్ల మంది కరోనా బారినపడ్డారనీ, 5.33 లక్షల మంది మరణించారనీ సర్కారు వారి తాజా లెక్క. ఈ అధికారిక లెక్కలకు అందని, సామాన్య బాధితుల సంఖ్య ఇంతకు అనేక రెట్లు ఎక్కువే. ఈ పరిస్థితుల్లో టెస్ట్‌లు ఎంత ఎక్కువగా చేస్తే, కరోనా విజృంభణను అంత త్వరగా పసిగట్టి, చర్యలు చేపట్టవచ్చు. అలాగే, కొత్త వేరియంట్లకు ఇప్పుడున్న టీకాలు ఏ మేరకు పనిచేస్తాయో పరీక్షించాలి. వివిధ దేశాలు ఇప్పటికే కొత్తవాటికి తగ్గట్టు టీకాలను మెరుగు చేస్తు న్నాయి. మన దేశానికీ వాటి అవసరం ఉందేమో శాస్త్రీయ సలహా స్వీకరించాలి.
ముంచుకొచ్చే దాకా ఆగకుండా మూడు నెలలకోసారి ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్‌లు చేయడం మంచిది. అలసత్వం దూర మవుతుంది. అలాగే, కరోనాపై నిరంతర నిఘా సరేసరి. ప్రజానీకానికి సమాచారం చేరవేస్తూ, పొంచివున్న ముప్పుపై అవగాహన పెంచడం ముఖ్యం. ప్రజారోగ్యంపై అన్ని రాష్ట్రాలూ, ప్రభుత్వాలు ఏకతాటిపైకి రావాలి. రాజకీయాలకు అతీతంగా, సమన్వయంతో ఏకోన్ముఖ వైఖరిని అవలంబించాలి. ప్రయాణాలు, జనసమ్మర్దం పెరిగే రానున్న వారాలు కీలకం గనక సన్నద్ధతే సగం మందు!
Comments
Please login to add a commentAdd a comment