గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు
-
కలెక్టర్ అరుణ్‌కుమార్
కాకినాడ సిటీ :
జిల్లాలోని 11 ఏజెన్సీ మండలాల్లో గిరిజనుల ఆరోగ్య పరిరక్షణపై విస్తృత ప్రచారం కల్పించి, ఆ ప్రాంత ప్రజలను అనారోగ్య పరిస్థితుల నుంచి కాపాడాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏజెన్సీలోని గిరిజనుల అనారోగ్య సమస్యలపై శాశ్వత చర్యలు అవసరమని పేర్కొన్నారు. ఏజెన్సీలోని సీసీ రోడ్ల నిర్మాణాన్ని సమీక్షిస్తూ, ఏజెన్సీలో రూ.11 కోట్ల విలువైన పనులు ఇప్పటికే మంజూరయ్యాయని వివరించారు. గోదావరి నదిలో ధవళేశ్వరం ఎగువ భాగంలో త్వరలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇసుక మేటలను తొలగించే పనులు ప్రారంభం కానున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఈ పనులను డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అప్పగించిందని, తద్వారా 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వుతారని చెప్పారు. జిల్లాలో ఉన్న 65 సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్లు, ఏర్పాటులో ఉన్న 15 వేల వర్మీ కంపోస్ట్ యూనిట్ల నుంచి ఉత్పత్తి అయ్యే సేంద్రీయ ఎరువుల మార్కెటింగ్ కోసం ఒక ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. వచ్చే డిసెంబర్ నాటికి పెద్దఎత్తున సేంద్రియ ఎరువులు ఉత్పత్తి కానున్నట్టు చెప్పారు. స్వచ్ఛభారత్ దత్తత అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాల సాధన ప్రగతిపై సమీక్షించారు. సమావేశంలో జేసీ ఎస్.సత్యనారాయణ, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి చక్రధరబాబు, డీఆర్‌డీఏ పీడీ ఎస్.మల్లిబాబు, జెడ్పీ సీఈఓ కె.పద్మ, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం.జ్యోతి, డ్వామా పీడీ ఎ.నాగేశ్వరరావు, డీఈఓ ఆర్.నరసింహరావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మూర్తి, జేడీఏ కేఎస్‌వీ ప్రసాద్ పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు సత్వర సాయం తీవ్రవాద హింసాత్మక చర్యల్లో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు సహాయాలను సత్వరం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. తీవ్రవాద బాధిత కుటుంబాల సంక్షేమంపై ఏర్పాౖటెన జిల్లా స్థాయి కమిటీ సమావేశం సోమవారం రాత్రి కలక్టరేట్‌లో జరిగింది. జిల్లాలో నమోదైన 9 కేసులపై సమీక్షించి, బాధిత కుటుంబాల్లో ఆరుగురికి సాయం అందించేందుకు, కుటుంబాల్లో ఒకరికి ఉపాధి కల్పించేందుకు ఆమోదించింది. ఆ మే రకు రాష్ట్ర కమిటీకి ప్రతిపాదించింది. మూడు కేసుల్లో మృతుల వారసుల నిర్ధారణపై రాష్ట్ర కమిటీ వివరణ కోరేందుకు నిర్ణయించారు. రంపచోడవరం సబ్ కలెక్టర్ పి.రవి, ఓఎస్‌డీ కె.ఫకీరప్ప పాల్గొన్నారు.