ఆరోగ్యమే ప్రగతికి ప్రతిరూపం | A replica of the health progress | Sakshi
Sakshi News home page

ఆరోగ్యమే ప్రగతికి ప్రతిరూపం

Published Thu, Aug 4 2016 11:56 PM | Last Updated on Thu, Mar 21 2019 7:25 PM

సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వాకాటి కరుణ - Sakshi

సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వాకాటి కరుణ

  • సమిష్టిగా పరీక్షలు చేస్తే మంచి ఫలితాలు..
  • ఏటూరునాగారంలో నేత్రాలయం ఏర్పాటు
  • వైద్య, ఆరోగ్య సిబ్బంది సమీక్షలో కలెక్టర్‌ కరుణ
  • ఏటూరునాగారం : ప్రతీ మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ప్రగతి సాధించినట్లు భావించాలని జిల్లా కలెక్టర్‌ వాకాటి కరుణ అన్నారు. ఏజెన్సీలోని 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని 160 గ్రామాల్లో వైద్య, ఆరోగ్యశాఖ వైద్యాధికారులు, సిబ్బందితో పాటు 104 విభాగం సంయుక్త చేపట్టిన  ప్రత్యేక క్యాంపులపై గురువారం ఐటీడీఏ సమావేశపు మందిరంలో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. జూలై 22 నుంచి ఆగస్టు 4 వరకు చేపట్టిన వైద్య శిబిరాల వివరాలను ఆమె ఆరా తీయగా.. ఏజెన్సీలో 19,826 కుటుంబాలు, 92,235 మంది ప్రజల వివరాలు సేకరించామని, 16,454 మంది రోగులను పరీక్షించినట్లు డీఎంహెచ్‌ఓ బోదబోయిన సాంబశివరావు వివరించారు.
     
    ఈ మేరకు పరీక్షలు పూర్తయిన వారికి  కుటుంబ ఆరోగ్య సంరక్షణ కార్డులను కూడా అందజేస్తున్నట్లు చెప్పారు. ఇంకా 160 గ్రామాల్లో 73 గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించినట్లు వివరించారు. అయితే, మిగతా 87 గ్రామాలను పూర్తి చేయాలని ఆదేశించిన కలెక్టర్‌.. కలిసికట్టుగా పనిచేసిన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఉద్యోగులు ఇలా పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.
     
    40 శాతం పోషకాహార లోపంతోనే...
    ఇప్పటి వరకు తిరిగి పరీక్షించిన గ్రామాల్లో 40 శాతం మంది చిన్నారులు పోషకాహారలోపంతో ఉన్నట్లు వైద్యాధికారులు కలెక్టర్‌కు తెలిపారు. ముఖ్యంగా గొత్తికోయగూడెంల్లోని చిన్నారులు సరైన పోషకాహారం అందడం లేదని హెల్త్‌ సూపర్‌వైజర్‌ కోటి శకుంతల వివరించారు. ఇంకా అంగన్‌వాడీ కేంద్రాల్లో బరువు చూసే యంత్రాలు, పోషక విలువలు, లోపం వల్ల వచ్చే రోగాలను తెలిపే చార్ట్స్‌ లేవని ఆర్‌బీఎస్‌కే జిల్లా అధికారిణి శ్యామల నీరజ వెల్లడించారు. ఈ మేరకు స్పందించిన కలెక్టర్‌ కరుణ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు సరైన పోషకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, మారుమూల ప్రాంతాల్లోని మహిళలకు 68 మందికి రక్తహీనత ఉందని వైద్యులు కలెక్టర్‌కు వివరించగా.. ఇందుకు కావాల్సిన మందులు అందుబాటులో ఉన్నాయని డిప్యూటీ డీహెచ్‌ఎం అప్పయ్య చెప్పారు. కాగా, పీహెచ్‌సీలకు డిజిటల్‌ తెరలు కేటాయించాలని మాస్‌ మీడియా జిల్లా అధికారి అశోక్‌రెడ్డి ఏటీడీఏ పీఓను కోరారు. 
     
    కంటిపరీక్షలు, శస్త్రచికిత్సలు
    ఏజెన్సీలో కంటిచూపుతో బాధపడుతున్న వారికి వెంటనే పరీక్షలు, అద్దాలు, శస్త్రచికిత్స కోసం ఏటూరునాగారం మండల కేంద్రంలో నేత్రాలయం నెలకొల్పేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ కరుణ వెల్లడించారు. అలాగే గుట్కాలు, అంబర్‌తో టీబీ తదితర వ్యాధులు వస్తున్నాయని వైద్యాధికారులు కలెక్టర్‌కు విన్నవించగా.. పోలీసులతో గుట్కాల విక్రయాలకు అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. దోమల నివారణ మందును ఇప్పటి వరకు 50 గ్రామాల్లో పిచికారి చేయించామని, 120 హాస్టళ్లలో పిచికారి చేయించేందుకు చర్యలు చేపట్టామని మలేరియా జిల్లా అధికారి పైడి రాజు కలెక్టర్‌కు విన్నవించారు. కాగా, హాస్టళ్లలోని ఎనిమిది వేల మంది గిరిజన పిల్లలకు కావాల్సిన వైద్య సదుపాయాలను అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా కలెక్టర్‌ అన్నారు.
     
    104 సిబ్బందికి వేతనాలు మంజూరు
    నాలుగు నెలల నుంచి వేతనాలు రావడం లేదని 104 సిబ్బంది కలెక్టర్‌ కరుణ దృష్టికి తీసుకువెళ్లగా.. వెంటనే ఫైల్‌ను పరిశీలించి నిధులు మంజూరు చేస్తామని ఆమె తెలిపారు. సమీక్షలో ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్, ఏపీఓ వసంతరావు, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ శ్రీరాం, జిల్లా లెప్రసీ ఆఫీసర్‌ మధుసూదన్, డీఐఓ హరీష్‌రాజ్, సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ రవిప్రవీణ్‌రెడ్డి, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం మేనేజర్‌ రాజిరెడ్డి, జిల్లా గణాంకాల అధికారి కాంతరావు, రమేష్‌ గాడ్కే పాల్గొన్నారు.
     
    ఏజెన్సీలో కలెక్టర్‌ బస
    మండల కేంద్రంలోని ఐటీడీఏ గెస్ట్‌హౌస్‌లో జిల్లా కలెక్టర్‌ వాకాటి కరుణ గురువారం రాత్రి బస చేశారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం ముగిసిన అనంతరం ఆమె గెస్ట్‌హúస్‌కు వెళ్లారు. మండలంలో జరుగుతున్న హరితహారం, గిరిజన విద్య, ఇతర శాఖలపై శుక్రవారం కలెక్టర్‌ సమీక్షిస్తారని అధికారులు వెల్లడించారు. ఇంకా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రత్యేక వైద్యశిబిరాలు, హరితహారం కింద నాటిన మొక్కలను ఆమె పరిశీలించనున్నారు. ఈ మేరకు పలు శాఖల జిల్లా అధికారులు సైతం ఏటూరునాగారంలో ఉండిపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement