చింతూరు : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కిడ్నాప్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా పదిమంది గిరిజనులను కిడ్నాప్ చేయడమేకాక ఓ కానిస్టేబుల్‌ను హతమార్చారు. వివరాల్లోకి వెళ్తే... సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని భెర్జి గ్రామానికి చెందిన పదిమంది గిరిజనులు ఆదివారం వంటచెరకు నిమిత్తం అటవీ ప్రాంతంలోకి వెళ్లగా మావోయిస్టులు కిడ్నాప్ చేసి రహస్య ప్రదేశానికి తరలించారు. తాము నిర్వహిస్తున్న సమావేశాలకు గిరిజనులు రాకపోవడంతోపాటు తమకు సహకరించడంలేదనే కారణంతో మావోయిస్టులు ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా గత నెలరోజులుగా దండకారణ్యంలో మావోయిస్టులు కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారు. 20 రోజుల క్రితం గొల్లపల్లి సర్పంచ్‌తో పాటు మరొకరిని కిడ్నాప్ చేసి, హతమార్చారు. వారం క్రితం గంగలేరు సర్పంచ్‌తోపాటు నలుగురిని కిడ్నాప్ చేసి, తర్వాత విడిచిపెట్టారు. కిడ్నాప్‌ల పరంపర కొనసాగుతుండడంతో దండకారణ్య పరిధిలోని గ్రామాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందోననే భయాందోళనలు నెలకొన్నాయి.
కాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఓ పోలీసు కానిస్టేబుల్‌ను హతమార్చారు. మిర్తూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సుందర్ కశ్యప్ శనివారం సమీపంలోని చేర్పాల్‌లో నిర్వహిస్తున్న జాతర చూసేందుకు వెళ్లాడు. అక్కడ అతడిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు గొంతు నులిమి, హత్య చేసి ఆదివారం శవాన్ని పాలనార్ వద్ద పడేశారు.
10 మంది గిరిజనుల కిడ్నాప్
Published Sun, Mar 22 2015 7:11 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
Advertisement