25 మంది కిడ్నాప్‌!: నలుగురి హత్య | Maoist Kidnap 25 People In Chhattisgarh! | Sakshi
Sakshi News home page

25 మంది కిడ్నాప్‌!: నలుగురి హత్య

Sep 23 2020 7:49 AM | Updated on Sep 23 2020 7:51 AM

Maoist Kidnap 25 People In Chhattisgarh! - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, చర్ల: సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో రెండు గ్రామాలకు చెందిన 25 మందిని కిడ్నాప్‌ చేసిన మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించి నలుగురిని హత్య చేశారు. ఈ ఘటన బీజాపూర్‌ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. గంగులూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల కుర్చేలి, మోటాపాల్‌ గ్రామాలకు చెందిన 25 మంది గ్రామస్తులను మావోయిస్టులు మూడు రోజుల క్రితం కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే వారిని ప్రజాకోర్టులో విచారించి అనంతరం రెండు గ్రామాలకు చెందిన నలుగురిని ప్రజాకోర్టులోనే గొంతుకోసి దారుణంగా హతమార్చినట్లు సమాచారం. అనంతరం ఐదుగురిని విడిచిపెట్టినట్లు తెలుస్తుండగా.. మిగిలిన 16 మందిని వారి అదుపులోనే ఉంచుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కాగా.. ఈ విషయంపై పోలీసు అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. (ఆ 300 మంది మావోయిస్టులు ఎక్కడ?)

ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఒకరి హత్య 
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో సోమ వారం రాత్రి మావోయిస్టులు ఓ గ్రామస్తుడిని హత్య చేశారు. బాసగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పుటాకేల్‌ గ్రామానికి సుమారు 20 మంది మావోయిస్టులు దసార్‌ రమణ ఇంటికి వచ్చారు. నిద్రిస్తున్న అతడిని లేపారు. మాట్లాడే పని ఉందని చెప్పి బయటకు రమ్మని పిలవడంతో.. అతడు నిరాకరించాడు. కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే మాట్లాడాలంటూ పట్టుబట్టారు. దీంతో మావోయిస్టులు అతడిని బలవంతంగా బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు ఇంటి ఎదుటే ఇనుప రాడ్లతో కొట్టడంతోపాటు రమణను కత్తులతో దారుణంగా పొడిచి చంపారు.ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement