జువల్ ఓరం (పాత ఫొటో)
హైదరాబాద్ : గిరిజన పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటోందని చెబుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జువల్ ఓరంను చిక్కుల్లో పడేశాయి. శుక్రవారం ఇక్కడి మారియట్ హోటల్‌లో జరిగిన నేషనల్ ట్రైబల్ ఎంటర్‌ప్రెన్యూర్ కాన్‌క్లేవ్–2018లో పాల్గొన్న కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. గిరిజనులు అన్ని రంగాల్లో రాణించాలని, అలా కావాలంటే విజయ్ మాల్యాలా తెలివిగా ఆలోచించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలు చాలా చాకచక్యంగా వ్యవహరించి బ్యాంకుల నుంచి సులువగా రుణాలు పొందాలని పిలుపునిచ్చారు.
షెడ్యూల్డు కులాలకు చెందిన వారు విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు, ఇలా పలు రంగాల్లో రిజర్వేషన్లు పొందుతున్నారని, అయితే ఇతర సామాజిక వర్గాలవారితో సమానంగా చూడటం లేదని జువల్ ఓరం వ్యాఖ్యానించారు. ‘అంతా విజయ్‌మాల్యాను విమర్శిస్తున్నారు. కానీ మాల్యా ఏం చేశారో గుర్తుచేసుకోంది. అతడు చాలా తెలివైనవాడు. ఎంతోమంది తెలివైనవాళ్లకు ఉపాధి కల్పించాడు. ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు, బ్యాంకులకు మాల్యా చాలా చేశాడంటూ’ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాం రేపాయి. బ్యాంకులను ప్రభావితం చేయండి, ప్రభుత్వాలను, వ్యవస్థలను కాదని షెడ్యూల్డు కులాలవారిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం రూ.కోటి వరకు రాయితీతో గిరిజన పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోందని, దాన్ని రూ.5 కోట్లకు పెంచేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అయితే మాల్యాను పొగడటం ఏంటని కేంద్ర మంత్రిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివరణ ఇచ్చుకున్న మంత్రి
ప్రసంగం మధ్యలో పొరపాటున విజయ్‌మాల్యా పేరును ప్రస్తావించాను. మరొకరి పేరును ప్రస్తావించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దీనిపై జాతీయ మీడియ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘అనుకోకుండా మాల్యా విషయం తీసుకొచ్చా. అయితే ఉద్దేశపూర్వకంగా చేయలేదు. తెలివైన వ్యక్తి అని మరొకరి పేరు చెప్పి ఉంటే బాగుండేది. వా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నానని’ కేంద్ర మంత్రి జువల్ ఓరం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment