tribal welfare department
-
రాష్ట్ర వాటా విడుదల ఎప్పుడో!
సాక్షి, హైదరాబాద్: పోస్టు మెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థుల ఉపకార వేతనాల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా ఇంకా ఎదురు చూపులు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయకపోవడమే ఇందుకు కారణం. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాలున్నాయి. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి కేంద్రం 75% నిధులు ఇస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం 25% నిధులు భరిస్తుంది. ఎస్సీ అభివృద్ధి శాఖకు సంబంధించి కేంద్రం 60% నిధులు ఇస్తుండగా.. 40% రాష్ట్రం చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్రం తన వాటాను విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాలు విడుదల చేయలేదు. విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఎదురుచూస్తూనే ఉన్నారు. రూ.450 కోట్లు అందుబాటులో ఉన్నా.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులకు ప్రస్తుతం రూ.450 కోట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. ఇందులో ఎస్సీ అభివృద్ధి శాఖలో రూ.275 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో రూ.175 కోట్లు ఉన్నాయి. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ మొత్తాన్ని కేంద్రం విడుదల చేసింది. గతేడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగడంతో గత ఆర్థిక సంవత్సర నిధులు విడుదలలో జాప్యం జరిగింది. అయితే నెలన్నర క్రితం అప్పటి నిధులను క్లియర్ చేసిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్‌ను విడుదల చేసిన వెంటనే ఈ నిధిని వినియోగించాలనే నిబంధన విధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం చేకూరదు. కేంద్రం ఇచ్చిన నిధులను సకాలంలో వినియోగించుకోకుంటే వాటిని కేంద్రం వెనక్కు తీసుకునే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆన్లైన్లో తాజా దరఖాస్తుల ప్రక్రియ మరోవైపు 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. వాస్తవానికి గత నెల 31తోనే ఈ గడువు ముగిసింది. అయితే విద్యార్థుల నుంచి పెద్దసంఖ్యలో దరఖాస్తులు అందలేదు. దీంతో గడువు పొడిగింపు కోసం సంక్షేమ శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాయి. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు ఆమోదించలేదు. అయితే వెబ్సైట్లో దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్‌ను అందుబాటులో ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. -
కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం గిరిజనుల కోసం అమలు చేసే పథకాలపై కసరత్తు చేసి రాష్ట్రానికి నిధులు సాధించే ప్రణాళికలతో రావాలని అధికారులను సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ సమీక్షలో గిరిజనులకు విద్యా, వైద్యం, సంక్షేమ పథకాల అమలుపై సీఎం సమీక్షించారు. గిరిజనులు సాగుచేస్తున్న భూములు, ఆయా పంటలకు వస్తున్న ఆదాయం, గిరిజన ఉత్పత్తులు..ఇతర పనుల ద్వారా తలసరి ఆదాయంపై సమగ్ర వివరాలతో రావాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదని ఆదేశించారు. ఫీడర్ అంబులెన్స్‌లను తిరిగి ప్రవేశ పెట్టడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా చూడాలన్నారు. నెలలు నిండిన గర్భిణిల కోసం గతంలో టీడీపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన గర్భిణీ వసతి గృహాలు మళ్లీ ప్రారంభించాలన్నారు. వచ్చే నెలలో జరిగే అంతర్జాతీయ గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలను ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు.ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలిఅరకు కాఫీని ప్రమోట్ చేసేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. గిరిజన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందని, దాన్ని ఉపయోగించుకుంటే గిరిజనుల జీవితాల్లో మార్పులు తేవచ్చని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో సారవంతమైన భూములున్నాయని, ఆ ప్రాంతాల్లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. తేనె, హార్టికల్చర్, కాఫీని ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి ఎక్కడా కనిపించకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ట్రైకార్, జీసీసీ, ఐటీడీఏలు పూర్తిగా యాక్టివేట్ కావాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. -
అడవి బిడ్డల ఆనందం
సాక్షి, అమరావతి: అడవిపై ఆధారపడి జీవిస్తున్న గిరిజన తెగలు ప్రగతి బాటలో పురోగమిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్వోఎఫ్ఆర్ పట్టాల జారీ, దేశంలో తొలిసారిగా ఏజన్సీ రైతులకు రైతు భరోసా లాంటి విప్లవాత్మక కార్యక్రమాలు గిరిజనాభివృద్ధికి ఊతమిస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, అటవీ సంపదతో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు గిరిజన జిల్లాలను ఏర్పాటు చేసింది. అడవితో ముడిపడిన గిరిజనుల జీవితం అక్కడి నుంచే అభివృద్ధి చెందేలా బాటలు వేసింది. అటవీ ఉత్పత్తుల సేకరణతోపాటు వ్యవసాయం, పోడు భూముల సాగును ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తోంది. గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే నేతృత్వంలో ఇ.రవీంద్రబాబు, జి.చిన్నబాబు, నాగరాజు చిక్కాల రూపొందించిన నివేదికను గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు జె.వెంకట మురళి ఆవిష్కరించారు. గిరిజన యువత, కళాకారులు, నాయకులు, అధికారులతో సహా పలువురిని భాగస్వాములను చేశారు. ఆర్వోఎఫ్ఆర్, పీసా, 1 ఆఫ్ 70 చట్టాలు, గిరిజన జీవనోపాధి, సంప్రదాయ కళారూపాలు, అభివృద్ధి ప్రాంతాలను పరిశీలించడంతోపాటు గిరిజనులకు సంబంధించిన పలు పుస్తకాలను అధ్యయనం చేశారు.సాగు.. నైపుణ్యాభివృద్ధి.. మార్కెటింగ్పాడేరు, రంపచోడవరం, సీతంపేట సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ల పరిధిలో 16 గ్రామాల్లో అధ్యయనం నిర్వహించి నివేదిక రూపొందించారు. సాగు, నైపుణ్యాభివృద్ధి, మార్కెటింగ్ ద్వారా గిరిజనులకు మరింత మేలు చేయవచ్చని నివేదిక సూచించింది. పంటల సాగులో మెళకువలతోపాటు నైపుణ్యాభివృద్ధి చర్యల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొంది. నల్ల మిరియాలు, మిర్చి, కొండ చీపుర్లు లాంటి అటవీ ఉత్పత్తులు, సాగును ప్రోత్సహించడం ద్వారా గిరిజనుల జీవన ప్రమాణాలను పెంపొందించవచ్చని సూచించింది. ప్రధానంగా అత్యంత బలహీన గిరిజన సమూహాలైన (పీవీటీజీ) మూక దొర, భగత, కొండ దొర, సవర, కొండ రెడ్డి తెగల ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆదాయం లభించేలా కొండ చీపుర్లు, గడ్డి పెంపకం, మార్కెటింగ్ నైపుణ్యాలపై శిక్షణ, అవగాహన కల్పించాలని నిర్దేశించింది. కాఫీ తోటల్లో అంతర పంటలుగా నల్ల మిరియాల సాగును ప్రోత్సహించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచవచ్చు. దీంతోపాటు మిర్చి రకాల సాగుపై అవగాహన పెంచడం, అధిక దిగుబడులు సాధించేలా పరిజ్ఞానాన్ని అందించడం, మంచి ధర దక్కేలా మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవడం ద్వారా గిరిజనులకు మరింత ఊతం ఇచ్చినట్టు అవుతుందని గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ అధ్యయనంలో పేర్కొంది.అడవి బిడ్డలకు అండగా సీఎం జగన్⇒ గిరిజనులకు ముఖ్యమంత్రి జగన్ కొండంత అండగా నిలిచారు. నవరత్నాల సంక్షేమ పథకాలను అందించి ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు భూమిపై హక్కులు కల్పించి సాగుకు ఊతమిచ్చారు. సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో గిరిజన కుటుంబాలకు ఏకంగా 3.22 లక్షల ఎకరాలను అటవీ హక్కుల చట్టం (ఆర్వోఎఫ్ఆర్) ప్రకారం పట్టాలు అందించడం దేశంలోనే రికార్డు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీకి దివంగత వైఎస్సార్ శ్రీకారం చుట్టగా సీఎం జగన్ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలతోపాటు డీకేటీ పట్టాలు పంపిణీ చేసి ఆ భూములను సాగులోకి తెచ్చేందుకు ఉపాధి హామీతో చేయూతనందించారు. ⇒ దేశంలోనే తొలిసారిగా సీఎం జగన్ వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా 3,40,043 మంది గిరిజన రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, బిందు, తుంపర సేద్యం పరికరాలు సమకూర్చారు. అల్లూరి జిల్లాలో 2,58,021 ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్న దాదాపు 2,46,139 మంది గిరిజన రైతులకు అన్ని విధాలా అండంగా నిలిచారు. కాఫీ తోటల సాగుకు సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, పెట్టుబడి సాయం, రుణాలు, యంత్రాలు లాంటివి అందించారు. అంతర పంటగా మిరియాల సాగుకు అవసరమైన పరికరాలు అందించారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా అటవీ ఫలసాయం, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర దక్కేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అటవీ ఫలసాయం, వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే అధికంగా జీసీసీ చెల్లిస్తోంది. శ్రీశైలం, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గిరిజనుల ద్వారా సేకరిస్తున్న తేనెను రాజమహేంద్రవరం, చిత్తూరులోని జీసీసీ తేనె శుద్ధి కర్మాగారాల్లో శుద్ధి చేసి ‘గిరిజన్‘ బ్రాండ్‌తో మార్కెటింగ్ చేస్తున్నారు. గిరిజన రైతులకు వ్యవసాయం, కాఫీ సాగుకు జీసీసీ రుణాలు అందచేస్తోంది. -
ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఇన్చార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ఈ) కె.జగజ్యోతి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే... గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో నిజామాబాద్ పట్టణంలో ఒక నిర్మాణ పనిని, గాజుల రామారంలో జువెనైల్ బాయిస్ హాస్టల్ నిర్మాణపనులను బొడుకం గంగన్న అనే లైసెన్స్డ్ కాంట్రాక్టర్ చేపట్టారు. వాటికి సంబంధించిన బిల్లుల చెల్లింపుల విషయమై కాంట్రాక్టర్‌ను ఆ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఇన్చార్జ్ సూపరింటెండెంట్ కె.జగజ్యోతి లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంట్రాక్టర్ నుంచి రూ.84 వేల లంచం తీసుకుంటుండగా సోమవారం హైదరాబాద్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ(డీఎస్ఎస్) భవన్లో జగజ్యోతిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.65 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. కార్యాలయంలోనూ కొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తర్వాత ఆమెను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈఈ స్థాయి అధికారి అయిన జగజ్యోతి ఇన్‌ఛార్జి హోదాలో ఎస్ఈ బాధ్యతలూ నిర్వర్తిస్తుండటం గమనార్హం. -
గిరిజన పల్లెకు సంక్షేమ పలకరింపు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ పథకాల ఫలాలతో పులకరిస్తున్న గిరిజన పల్లెలను మరోసారి ప్రభుత్వ యంత్రాంగం ఆత్మీయంగా పలకరించనుంది. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారంతో పాటు, పథకాలు అందని అర్హులు ఎవరైనా మిగిలుంటే వారికి పథకాలు అందేలా చూస్తారు. ఇందుకోసం ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’లో భాగంగా రాష్ట్రంలోని గిరిజన పల్లెల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ‘జన జాతీయ గౌరవ్ దివస్’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని 15న విశాఖ బీచ్ రోడ్డులో ర్యాలీని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ప్రారంభిస్తారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొంటారని ఏపీ గిరిజన సంక్షేమ శాఖ అడిషినల్ డైరెక్టర్ రవీంద్రబాబు తెలిపారు. ఈ నెల 26వ తేదీ వరకు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఆ రెండు జిల్లాల్లోని 430 గిరిజన గ్రామాల్లో నాలుగు ప్రత్యేక వాహనాల(ప్రభుత్వ పథకాల ప్రచార వ్యాన్)తో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. గ్రామ, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ), జిల్లాల స్థాయిలో స్థానిక ప్రజలు, స్వయం సహాయక సంఘాలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహించాలనేది ప్రత్యేకంగా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. వీటిపై ప్రత్యేక దృష్టి ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం నిర్వహించనున్నారు. గిరిజనుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఇంకా అర్హత ఉన్న వాళ్లకు ఎవరికైనా రాకుంటే.. వారికి సంక్షేమ ఫలాలు అందించేలా తక్షణ చర్యలు చేపడతారు. గిరిజన జిల్లాల్లో సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్, ఏకలవ్య మోడల్ స్కూల్లో విద్యార్థులను చేరి్పంచడం, స్కాలర్‌షిప్‌ల మంజూరు, అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాల అమలు, అర్హులకు వాటిని దరి చేర్చడం వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. ‘జన జాతీయ గౌరవ్ దివస్’ను ఘనంగా జరుపుదాం సీఎం జగన్‌కు కేంద్ర మంత్రి లేఖ జన జాతీయ గౌరవ్ దివస్‌ను ఘనంగా జరిపేందుకు రాష్ట్ర స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని, మంత్రులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా లేఖ రాశారు. 15న జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా పార్లమెంట్ కాంప్లెక్స్‌లో భగవాన్ బిర్సా ముండా విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ నివాళి అర్పిస్తారని తెలిపారు. అలాగే బిర్సా ముండా జన్మస్థలం జార్ఖండ్ రాష్ట్రం ఉలిహటు వద్ద నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని.. దేశంలోని 75 ఆదివాసీల ప్రాబల్యం ఉన్న జిల్లాల్లో ‘హమారా సంకల్ప్ వికసిత్ భారత్‘ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని.. మీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. -
గిరిజన భూ వివాదాలకు సత్వర పరిష్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గిరిజన భూ వివాదాల సత్వర పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని గిరిజనులకు చెందిన షెడ్యూల్డ్ ఏరియా ‘భూ బదలాయింపు నిబంధనలు (ఎల్టీఆర్) 1/70’ ప్రకారం వారి హక్కులను కాపాడేలా పక్కా కార్యాచరణ చేపట్టింది. దాదాపు 1976 నుంచి పేరుకుపోయిన వేలాది ఎల్టీఆర్ కేసుల్లో వేగంగా విచారణ జరిపి సత్వర న్యాయం అందించే దిశగా ఆదేశాలిచ్చింది. దీంతో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చడంతోపాటు ఇటీవల ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న ఎల్టీఆర్ కేసులు విచారణ వేగవంతం చేయడం, పాత కేసుల్లోని భూ వివాదాలను త్వరితగతిన పరిష్కరించడం, కొత్తగా నమోదైన కేసులను 6 నెలల గడువులోను, అప్పీల్‌కు వెళ్లిన కేసులు రెండు నెలల్లో పరిష్కరించాలని ఆదేశాలిచ్చింది. అప్పటికీ వివాదం కొలిక్కిరాకపోతే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, కమిషనర్ విచారణకు వెళుతుంది. కేసుల్లో గిరిజనులకు అనుకూలమైన ఉత్తర్వులను వేగంగా అమలులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొంది. గిరిజనులకు వ్యతిరేకంగా వచ్చింన వాటి వివరాలను సంబంధిత అధికారులకు తెలియజేయడంతోపాటు ఆయా గ్రామ సచివాలయాల వద్ద ప్రదర్శించాల్సి ఉంటుంది. ఎల్టీఆర్ కేసుల పురోగతిపై ఎప్పటికప్పుడు ఐటీడీఏ పీవోలు, మైదాన ప్రాంత కలెక్టర్లు పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన సమాచారాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి నివేదిక పంపించాలి. ఎల్టీఆర్ కేసులు, హక్కులపై ఐటీడీఏల పరిధిలో వాల్ పోస్టర్లు, కరపత్రాల ద్వారా గిరిజనులకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆదేశాలు ఇచ్చింది. గిరిజన భూములకు రక్ష 1/70 యాక్ట్ రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజనులకు ప్రత్యేక హక్కులు కల్పించారు. భూములకు సంబంధించి 1/70 (1959 చట్ట సవరణ) సెక్షన్–3తో గిరిజనులకు భూములపై హక్కులున్నాయి. షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనులకు చెందిన భూములు వారే అనుభవించాలి. గిరిజనులు నుంచి గిరిజనులు భూములు పొందచ్చు. గిరిజనుల నుంచి గిరిజనేతరులు కొనుగోలు చేయడం, ఆక్రమించడం వంటివి చెల్లవు. భూముల అన్యాక్రాంతాన్ని నిరోధించడమే దీని ఉద్దేశం. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతం (షెడ్యూల్డ్ ఏరియా) 37 మండలాల పరిధిలోని 3,512 గ్రామాల్లో నివసించే వారికి ఈ హక్కులు వర్తిస్తాయి. గిరిజనులకు చెందిన భూవివాదాల పరిష్కారం కోసం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాలకు చెందిన రంపచోడవరం, పాడేరు, పార్వతీపురం, సీతంపేట, కోట రామచంద్రపురం, పోలవరం ఐటీడీఏల పరిధిలో ఐదు ప్రత్యేక ఎల్టీఆర్ కోర్టులను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆయా ప్రాంతాల్లో భూ వివాదాలను తొలుత డిప్యూటీ తహసిల్దార్ (డీటీ) గుర్తించి నోటీసులు జారీ చేస్తారు. తగిన సమాచారం సేకరించిన అనంతరం ఐటీడీఏల పరిధిలోని పాడేరు, రంపచోడవరం, ఎల్వీఎన్ పేట, కేఆర్ పురం, పోలవరం కోర్టుల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు విచారణ చేపడతారు. ఈ వివాదాల్లో తగిన పత్రాలు, ఆధారాలను సమర్పించడం ద్వారా భూమి ఎవరిదో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఎల్టీఆర్ ఆర్డర్ అమలు ఇలా ♦ ప్రారంభం (1976) నుండి ఈ ఏడాది జూన్ వరకు 29,810 ఎల్టీఆర్ వివాదాలు(1,47,554 ఎకరాలు) గుర్తించారు. ♦ 12,678 కేసులు (56,882 ఎకరాలు) గిరిజనులకు అనుకూలంగా ఉత్తర్వులు అమలయ్యాయి. ♦ 11,754 కేసుల్లో 51,278 ఎకరాలను గిరిజనులకు స్వాదీనం చేశారు. ♦ 924 కేసుల్లో 5,604 ఎకరాలను అప్పగించాల్సి ఉంది. మరికొన్ని కేసులు పలుస్థాయి (కోర్టు)ల్లో పెండింగ్‌లో ఉన్నాయి. -
పోడు పట్టాల పండగ!
సాక్షి, హైదరాబాద్: గిరిజనులకు పోడు భూములకు సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జూన్ 24 నుంచి 30 వరకు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి రైతుబంధు పథకాన్ని వర్తింపచేయాలని ఆదేశించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు పట్టాల పంపిణీ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంగళవారం సచివాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమానికి తాను స్వయంగా హాజరవుతానని ముఖ్యమంత్రి తెలిపారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్ఓఎఫ్ఆర్)–2006 కింద పట్టాలు పొంది రైతుబంధు అందుకుంటున్న గిరిజన రైతులతో, కొత్తగా పోడు పట్టాలు అందుకోబోతున్న గిరిజన లబ్ధిదారులను క్రోడీకరించాలని సూచించారు. ఇతర రైతుల తరహాలోనే వీరికీ రైతుబంధు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వమే బ్యాంకు ఖాతాలను తెరిచి పోడు భూముల పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లో రైతుబంధు మొత్తాన్ని జమ చేస్తుందని చెప్పారు. కొత్తగా పోడు పట్టాలు అందుకుంటున్న గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖకు అందజేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను కేసీఆర్ ఆదేశించారు. అర్హులైన నిరుపేదలకు భూములు గ్రామాల్లో ఇంకా మిగిలి వున్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను గుర్తించి, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అర్హులైన నిరుపేదల ఇళ్ల నిర్మాణాల కోసం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సొంత జాగాలో ఇళ్ల నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం విధివిధానాలను త్వరితగతిన తయారు చేయాలని, జూలైలో ఈ పథకాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. జూలైలోనే దళితబంధు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్‌కు సూచించారు. కలెక్టర్లతో రేపు సదస్సు తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి ఈ నెల 25న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రులు, జిల్లా ఎస్పీలు పాల్గొంటారు. 14న నిమ్స్ విస్తరణకు శంకుస్థాపన వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా జూన్ 14న నిమ్స్ ఆస్పత్రి విస్తరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. 2,000 పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణం పనులకు పునాదిరాయి వేయనున్నారు. -
ఒక్కో గిరిజన గురుకులానికి రూ. 5 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని గురుకుల పాఠశాలలకు అదనపు హంగులు దిద్దాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణలో 47 గిరిజన గురుకుల పాఠశాలలున్నాయి. ఇవన్నీ శాశ్వత భవనాల్లోనే నిర్వహిస్తున్నప్పటికీ... ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ భవనాల సామర్థ్యం సరిపోవడం లేదు. దీంతో శాశ్వత ప్రాతిపదికన అదనపు గదులు, డారి్మటరీలు, డైనింగ్ హాల్స్ ఏర్పాటు కోసం గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. గిరిజనుల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న షెడ్యూల్డ్ ట్రైబ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్టీ ఎస్డీఎఫ్) ద్వారా సివిల్ పనులు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేయగా... రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే ఆమోదం తెలిపింది. ఒక్కో పాఠశాలకు రూ. 5 కోట్లు... గిరిజన గురుకుల సొసైటీ పరిధిలో పాత పాఠశాలల్లో నిర్మాణ పనుల కోసం ఒక్కో గురుకులానికి రూ.5 కోట్లు చొప్పున కేటాయించింది. చాలాచోట్ల తరగతి గదులతో పాటు డార్మిటరీ భవనాల ఆవశ్యకత ఎక్కువగా ఉంది. ఇదివరకు ఒక్కో పాఠశాలలో ఒక తరగతికి ఒక సెక్షన్ మాత్రమే ఉండేది. ఇప్పుడు విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయ్యింది. దీంతో పాటు ఇంటరీ్మడియట్ కాలేజీలుగా దాదాపు అన్నీ అప్‌గ్రేడ్ అయ్యాయి. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా వసతి లేకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలతో ఇప్పటివరకు నెట్టుకొచ్చారు. తాజాగా ఎస్టీ ఎస్డీఎఫ్ ద్వారా నిధుల లభ్యతకు అనుగుణంగా నిధులు కేటాయించారు. మొత్తం 47 పాఠశాలలకు రూ.235 కోట్లు కేటాయించారు. అతి త్వరలో ఈ పనులకు సంబంధించి టెండర్లు ఖరారు చేసిన తర్వాత పనులు ప్రారంభించనున్నారు. గిరిజన విద్యార్థుల అడ్మిషన్ల డిమాండ్‌కు అనుగుణంగా 2023–24 వార్షికంలో కొత్తగా మరో రెండు పాఠశాలల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో వీటికి శాశ్వత ప్రాతిపదికన భవనాలను నిర్మించేందుకు ప్రత్యేక నిధులను సైతం కేటాయించింది. ఒక్కో పాఠశాలకు రూ.12కోట్లు చొప్పున రెండింటికి కలిపి రూ.24కోట్లు కేటాయించింది. దీంతో గురుకుల పాఠశాలల నిర్మాణ పనులకు మొత్తంగా రూ.259 కోట్లు ఖర్చు చేయనుంది. గిరిజన ఇంజనీరింగ్ పర్యవేక్షణ... ఎస్టీ గురుకులాల్లో త్వరలో చేపట్టనున్న ఈ సివిల్ పనుల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న గిరిజన ఇంజనీరింగ్ విభాగానికి అప్పగించింది. టెండర్ల ఖరారు, పనుల కేటాయింపు, పర్యవేక్షణ, నాణ్యత పరిశీలన తదితర పూర్తిస్థాయి బాధ్యతలను గిరిజన ఇంజనీరింగ్ అధికారులే చూసుకుంటారు. గత మూడేళ్లుగా నిర్మాణ పనులకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో స్తబ్ధుగా ఉన్న గిరిజన ఇంజనీరింగ్ విభాగానికి తాజాగా ఊరట లభించినట్లయింది. -
యానాదుల బతుకుల్లో మార్పుకు శ్రీకారం
సాక్షి, అమరావతి: ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన యానాదులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే నెల్లూరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పరిధిలో ప్రత్యేకంగా యానాదులకు ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆధార్ కార్డుల జారీతో వారికి ప్రభుత్వ పథకాలు, విద్య, వైద్యం వంటి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెల్సిందే. తాజాగా విజయవాడ ఐటీడీఏ(మైదాన ప్రాంతం) పరిధిలోని ఎన్టీఆర్ జిల్లాలో యానాదుల స్థితిగతులను అధ్యయనం చేసి వారికి ప్రభుత్వ పథకాలను చేరువ చేసేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. కేర్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో కోబో కలెక్ట్ యాప్(మొబైల్ అప్లికేషన్) సాయంతో సర్వే నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి సర్వేలో సేకరించిన అంశాల ఆధారంగా వారికి ప్రభుత్వ పథకాలతో పాటు అవసరమైన సహకారాన్ని అందించనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలిస్తుండటంతో మిగిలిన జిల్లాల్లోనూ అమలు చేసే విషయాన్ని గిరిజన సంక్షేమ శాఖ పరిశీలిస్తోంది. కోబో యాప్‌తో సమగ్ర సమాచారం గిరిజన సంక్షేమ శాఖ అధికారుల పర్యవేక్షణలో కేర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఏకుల రవి, వెలుగు చంద్రరావు తమ సిబ్బందితో కలిసి కోబో కలెక్ట్ యాప్‌తో ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామాల్లో పర్యటించి యానాదులను గుర్తిస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాలతో పాటు వారి స్థితిగతులు, సమస్యలను యాప్ ద్వారా సేకరిస్తున్నారు. సేకరించిన సమాచారాన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు అందిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పలు ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని యానాదుల సమస్యలను పరిష్కరిస్తున్నారు. విద్యాశాఖ అధికారుల సహకారంతో బడి ఈడు పిల్లలను బడిలో, చిన్న పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేరుస్తున్నారు. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల యంత్రాంగంతో మాట్లాడి వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇప్పించేలా చర్యలు చేపట్టారు. 412 మంది యానాదులకు ఇళ్ల మరమ్మతుల కోసం రూ.50 వేల చొప్పున అందించారు. 2,500 మందికి ఆధార్ కార్డులు, 550 మందికి రేషన్‌కార్డులు, మూడు వేల మందికి కుల ధ్రువీకరణ పత్రాలిప్పించేలా చర్యలు చేపట్టారు. చేపల వేటకు లైసెన్స్లిస్తున్నాం.. మైదాన ప్రాంత ఐటీడీఏ పరిధిలోని ఎస్టీల్లో లంబాడీ, ఎరుకల, యానాది, చెంచు, నక్కల తెగల వారున్నారు. వారిలో యానాదులకు సరైన చిరునామా, నివాసం లేక అవస్థలు పడుతున్నారు. వారి స్థితిగతులపై చేపట్టిన సర్వే మరో రెండు నెలల్లో పూర్తవుతుంది. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని అందిస్తున్నాం. ప్రధానంగా చేపల వేటపై ఆధారపడి జీవించే యానాదుల ఉపాధిని మరింత మెరుగుపరిచేలా దృష్టి సారించాం. కాలువలు, నదుల్లో చేపలను వేటాడుకునేలా జి కొండూరు మండలం కవులూరు గ్రామానికి చెందిన 18 మందికి కొత్తగా లైసెన్స్లిచ్చాం. మత్స్యశాఖ, గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో సబ్సిడీపై వలలు అందించేలా కార్యాచరణ చేపట్టాం. – ఎం.రుక్మంగదయ్య, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, మైదాన ప్రాంత ఐటీడీఏ(విజయవాడ) -
ఏజెన్సీలో మరో 32 గర్భిణీ వసతి గృహాలు
సాక్షి, అమరావతి: కొండలు, కోనల్లో ఉండే గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు సీఎం వైఎస్ జగన్ పలు చర్యలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 159 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీలు) ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులను అత్యవసర సమయాల్లో డోలీలు, మంచాలపై మోసుకెళ్లకుండా వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిరక్షించి, ముందుగానే ఆస్పత్రులకు తరలించేందుకు గిరిజన ప్రాంతాల్లో గర్భిణీ వసతి గృహాలు (బర్త్ వెయిటింగ్ హోమ్స్–బీడబ్ల్యూహెచ్) ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవి 45 ఉన్నాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రతిపాదనల మేరకు మరో 32 గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేయనున్నారు. వీటితో మొత్తం వీటి సంఖ్య 77కు పెరగనుంది. మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులకు తక్షణ వైద్య సేవలు అందించి తల్లీ బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చడంలో ఈ వసతి గృహాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో 1818 మారుమూల ప్రాంతాలున్నాయి. కొండలు, గుట్టలు, అడవులు, సెలయేరులు తదితర మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలకు గతంలో వైద్యం గగనమే అయ్యేది. దీంతో మరణాలూ అధికంగానే ఉండేవి. గర్భిణుల అవస్థలు చెప్పనలవి కాదు. సరైన వైద్యం అందక, ప్రసవ సమయానికి ఆస్పత్రికి వెళ్లలేక మరణించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. గిరిజనులకు ఈ అవస్థలు తప్పించి, వారికి మంచి వైద్య సేవలను వైఎస్ జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఆ ప్రాంతాల్లో తల్లీ బిడ్డలను క్షేమంగా ఉంచేందుకు గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేస్తోంది. గిరి రక్షక్ పేరుతో ఏర్పాటు చేయనున్న బైక్ అంబులెన్స్‌లు నెలలో 25 రోజులపాటు ప్రతి మారుమూల ప్రాంతాన్ని సందర్శించి గర్భిణుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంటారు. స్థానిక ఏఎన్ఎం దగ్గర్నుంచి మండల స్థాయి వైద్యాధికారి, మండల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి గర్భిణులతోపాటు అక్కడి వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి తగు చర్యలు చేపడుతుంటారు. ప్రతి గురువారం గ్రామ సచివాలయ బృందం అన్ని మారుమూల (డోలీపై ఆధారపడిన) ప్రాంతాలను సందర్శిస్తుంది. ప్రతి శనివారం (పలకరింపు) వైద్య బృందం వెళ్లి అక్కడి వారికి ప్రాథమికంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది. ప్రతి మంగళవారం ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు మారుమూల ప్రాంతాలకు వెళ్లి క్షేమ సమాచారం తెలుసుకుంటారు. డోలీ మరణాల నివారణకు మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులను డాక్టర్ నిర్ధారించిన ప్రసవ సమయానికి నెల రోజుల ముందుగానే సురక్షిత రవాణా వ్యవస్థ (108 అంబులెన్స్, ఫీడర్అంబులెన్స్, బైక్ అంబులెన్స్) ద్వారా బర్త్ వెయిటింగ్ హోమ్‌కు తరలిస్తారు. ఈ గృహాల్లో ఏఎన్ఎం, ఆశా వర్కర్లు నిరంతరం గర్భిణుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంటారు. నిత్యం పోషకాహారాన్ని, మందులను అందిస్తారు. మెరుగైన వైద్యం అవసరమైతే సమీపంలోని ప్రాథమిక, సామాజిక, జనరల్ ఆసుపత్రులకు తరలిస్తారు. -
ఆదివాసీ, గిరిజనానికి ప్రత్యేక ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీ, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మించిన జంట భవనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రేపు(ఈనెల 17న) ప్రారంభించనున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఈ ఏర్పాట్లను అత్యంత ఘనంగా చేపట్టింది. భవనాల ప్రారంభోత్సవానికి ఆయా వర్గాల ప్రజలను ఆహ్వానిస్తోంది. గిరిజన గూడేలు, ఏజెన్సీ గ్రామాలు, తండాల్లోని పంచాయతీలకు ప్రత్యేకంగా ఆహ్వానాలను పంపింది. ఆదివాసీ తెగలు, గిరిజన పౌరులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని అందులో సూచించింది. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులంతా హైదరాబాద్‌లో జంట భవనాల ప్రారంభోత్సవానికి హాజరు కావాలని సూచి స్తూ, ఆయా ఉద్యోగులకు ఆన్‌డ్యూటీ సౌకర్యాన్ని సైతం కల్పించింది. జంట భవనాల ప్రారంభోత్సవం అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే గిరిజన మహాసభను విజ యవంతం చేయాల్సిందిగా ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఒక్కో భవనానికి రూ. 22 కోట్లు... మహానగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతమైన బంజారాహిల్స్‌లో ఈ రెండు భవనాల కోసం ఎకరా స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చింది. నిర్మాణంకోసం రూ.44 కోట్లు కేటాయించింది. ఓక్కో భవనానికి రూ.22 కోట్లు చొప్పున ఖర్చు చేసింది. ఒక్కో భవనంలో సగటున వెయ్యి మంది సమావేశమయ్యేందుకు వీలుగా నిర్మించింది. ఇక ఈ వేడుకలకు హాజరయ్యే ప్రముఖులకు అక్కడే వసతి కల్పించేలా గదులు ఉన్నాయి. ఆయా భవనాల్లోకి ప్రవేశించగానే వారి సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే బొమ్మలు, కళాత్మక చిత్రాలను కూడా ఏర్పాటు చేసింది. గతేడాది సెప్టెంబర్ నాటికే భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సమయం కోసమే గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈనెల 17న ముహూర్తం కుదరడంతో.. రేపు ఆ రెండు భవనాలు ప్రారంభం కానున్నాయి. -
గిరిజనులకు పీఎంఏవై ఇళ్లు ఇవ్వండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గిరిజనులకు పూర్తిస్థాయి సబ్సిడీతో ఇచ్చే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పేదలకు 31 లక్షలకుపైగా ఇళ్లస్థలాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇళ్ల పట్టాలు ఇచ్చిన పేదలు దశలవారీగా ఇళ్లు నిర్మించుకునేలా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సొంతంగా పక్కా ఇల్లు లేని 92 వేల గిరిజన కుటుంబాలు ఉన్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వీటిలో 15 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేసేందుకు సాంకేతిక సమస్య ఎదురైంది. వారికి గతంలో రేకుల షెడ్డు, పెంకుటిల్లు నిర్మాణానికి ప్రభుత్వం గృహనిర్మాణ పథకంలో నిధులు ఇచ్చింది. అప్పట్లో గృహనిర్మాణ పథకంలో డబ్బులు ఇచ్చినందున ఆ రేకుల షెడ్డు, పెంకుటింటి స్థానంలో పక్కా ఇల్లు నిర్మించుకోవాలంటే మళ్లీ ప్రభుత్వం సాయం అందించేందుకు నిబంధనల ప్రకారం కుదరదు. ఈ నిబంధనలను సవరించి వారికి కూడా పక్కా భవనం నిర్మించుకునేలా ప్రత్యేక మినహాయింపు ఇచ్చి పీఎంఏవై మంజూరు చేయించేలా రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రయత్నాలను కొనసాగిస్తోంది. పేదలందరితోపాటు గిరిజనులకు కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం వారికి కూడా పక్కా ఇల్లు నిర్మించేలా పీఎంఏవై కోసం ప్రతిపాదించింది. కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిని కోరాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవాప్తంగా గిరిజనులకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు అవసరమైన ప్రతిపాదనలు చేశాం. గతంలో 15 వేలమంది గిరిజనులకు రేకుల షెడ్డు, పెంకుటింటి కోసం ప్రభుత్వం సాయం అందించడంతో ఇప్పుడు పక్కా భవనం కోసం దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం వారు అనర్హులు అని వస్తోంది. సాంకేతికంగా వచ్చిన ఆ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. వారికి కూడా పూర్తిస్థాయి సబ్సిడీతో పీఎంఏవై కింద ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్‌ముండాను కోరాం. ఆర్థికంగాను, సామాజికంగాను అత్యంత వెనుకబడిన 92 వేల గిరిజన కుటుంబాలకు దశలవారీగానైనా పీఎంఏవై ఇళ్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలు సమర్పించాం. – పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి -
మైదాన ప్రాంతంలోనూ ‘సమీకృత గిరిజనాభివృద్ధి’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మైదాన ప్రాంత గిరిజనులకు మరిన్ని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజన చేయడంతో మైదాన ప్రాంతంలో ఏడు జిల్లాలకు ఐటీడీఏల ఏర్పాటు అత్యవసరమైంది. ఆయా జిల్లాల్లోని గిరిజనులకు సేవలు అందించేలా ఒకటి, రెండు ఐటీడీఏలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఇటీవల కేంద్రాన్ని కోరింది. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం గిరిజన జనాభా 27.39 లక్షలు. వీరిలో 15.88 లక్షలమంది (58 శాతం) మైదాన ప్రాంతంలోనే నివసిస్తున్నారు. వారి అభివృద్ధి, సంక్షేమానికి మరిన్ని ఐటీడీఏల అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. రాష్ట్రంలో ప్రస్తుతం తొమ్మిది ఐటీడీఏలున్నాయి. వీటిలో విజయవాడ కేంద్రంగా ఉన్న మైదాన ప్రాంత ఐటీడీఏ మాత్రమే ఎస్టీలు తగినంత సంఖ్యలో ఉన్న ఏడుజిల్లాలకు సేవలందిస్తోంది. జిల్లాల పునర్విభజనలో రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం.. రెండు పూర్తిస్థాయి గిరిజన జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మైదానప్రాంత జిల్లాలైన అనంతపురం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో గిరిజనులు గణనీయంగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ జిల్లాల్లో కనిష్టంగా 75,886 మంది, గరిష్టంగా 2,88,997 మంది గిరిజనులున్నారు. ఈ జిల్లాల్లోని గిరిజనుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేకంగా ఐటీడీఏలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తగినన్ని ఐటీడీఏలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారికి మరింత సమర్థంగా అందించే వీలుకలుగుతుందని పేర్కొంది. మైదాన ప్రాంత ఎస్టీల కోసం ఐటీడీఏ అత్యవసరం మైదాన ప్రాంతాల్లో ఎస్టీల సంక్షేమానికి, అభివృద్ధికి మరిన్ని ఐటీడీఏలు కావాలని కేంద్ర గిరిజన సంక్షేమశాఖకు ప్రతిపాదనలు అందించాం. ఏపీలోని గిరిజనుల కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. మైదాన ప్రాంతంలోని ఎస్టీల అవసరాలను గుర్తించి వారి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఏజెన్సీలో మాదిరిగానే మైదాన ప్రాంతంలోని ఎస్టీలకు ప్రాథమిక విద్య, వైద్యం, రహదారుల కల్పన, విద్యుత్, ఆర్థికాభివృద్ధిపై అవకాశాలు వంటి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. – పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి -
గిరిజనుల్లో 'నవరత్న' కాంతులు.. ప్రగతిబాటలో ఏజెన్సీ గ్రామాలు
ఇతని పేరు మడివి సిరమయ్య. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోని మారుమూల గ్రామమైన గుంజవరం. మూడేళ్లలో ‘నవరత్నాల’ ద్వారా ఏకంగా రూ.2.86 లక్షల మేర లబ్ధి పొందాడు. గత ప్రభుత్వ హయాంలో సాయం అంటే ఏమిటో తెలీకుండా ఉండేదని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు వలంటీర్ స్వయంగా తన ఇంటికొచ్చి పథకాలూ అందేలా చూస్తున్నారని అంటున్నాడు. అడవుల్లో ఎవరికీ పట్టనట్లు ఉండే గిరిజన బతుకులు సీఎం వైఎస్ జగన్ పుణ్యాన బాగుపడుతున్నాయని సంతోషం వ్యక్తం చేశాడు. ఈమె పేరు కుంజం సావిత్రి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం ముసురుమిల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఉంటోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈమెకు అటవీ హక్కుల చట్టం (ఆర్వోఎఫ్ఆర్) ప్రకారం రెండు ఎకరాలకు భూమి హక్కు పట్టా అందించింది. అలాగే, మూడేళ్లుగా రైతుభరోసా అందిస్తూ పోడుభూముల్లో వ్యవసాయం చేసుకునేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండదండగా నిలుస్తున్నారంటూ కృతజ్ఞతలు తెలిపింది. సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయనగరం: అన్ని సామాజిక వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు’ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. అనేక సంవత్సరాలుగా కనీస సదుపాయాలకు నోచుకోని ఆదివాసీలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వరాల మూట అందిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గిరిజనోద్ధరణకు అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయి. వీటిద్వారా 95 శాతం మంది గిరిజనులు లబ్ధి పొందారు. దేశ చరిత్రలో మరే రాష్ట్రంలోనూ ఇంత ప్రయోజనం కలిగిన దాఖలాల్లేవు. ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీల హక్కులు, రక్షణ కోసం పునరంకితమయ్యేలా ఏటా ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో గిరిజనులకు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరుగుతున్న మేలు ఏమిటంటే.. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 27.39 లక్షల మంది గిరిజనులున్నారు. 9 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ల పరిధిలో 16,068 గిరిజన ఆవాసాలున్నాయి. వాటిలో 7 ఐటీడీఏలు అటవీ ప్రాంతంలోను, రెండు ఐటీడీఏలు మైదాన ప్రాంతాల్లోను గిరిజనుల కోసం పనిచేస్తున్నాయి. ఇక నవరత్నాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా గత మూడేళ్లలో 51,74,278 మంది గిరిజన లబ్ధిదారులకు రూ.9,204.75 కోట్ల మేర లబ్ధిచేకూరింది. ప్రత్యక్షంగా నగదు బదిలీ (డీబీటీ) ద్వారా 33,92,435 మందికి రూ.7,012.35 కోట్లు, పరోక్షంగా (నాన్ డీబీటీ) 17,81,843 మందికి రూ.2,192.40 కోట్ల మేర లబ్ధిచేకూరింది. గిరిపుత్రులకు ఇంత భారీ స్థాయిలో ఆర్థిక ప్రయోజనం చేకూరడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. దీనికితోడు గిరిజన ఉప ప్రణాళిక(ట్రైబల్ సబ్‌ప్లాన్).. కేంద్ర, రాష్ట్ర నిధులతో దాదాపు 40 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. గిరిజనం కోసం ప్రభుత్వ చర్యల్లో ముఖ్యమైనవి.. ► గిరిజన రైతులకు పోడు భూములపై యాజమాన్య హక్కులను కల్పించేలా సీఎం జగన్మోహన్రెడ్డి స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టారు. గత మూడేళ్ల కాలంలో 1,34,056 మందికి ఆర్ఓఎఫ్ఆర్, ఆర్ఓఆర్ పట్టాలు చేతికందాయి. తద్వారా వారికి 2,48,066 ఎకరాలపై హక్కు లభించింది. అంతేకాదు వారికి వైఎస్సార్ రైతుభరోసా పథకాన్ని ముఖ్యమంత్రి వర్తింపజేశారు. ► గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక వైద్య కళాశాలల నిర్మాణంతోపాటు మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.746 కోట్లు మంజూరు చేసింది. ► గిరిజన గ్రామాల్లో డోలీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఫీడర్ అంబులెన్సులను వినియోగిస్తున్న ప్రభుత్వం తాజాగా.. 128 బైక్ అంబులెన్సులను అందుబాటులోకి తేనుంది. ► రక్తహీనత కారణంగా బాలింతలు, శిశువులు మరణిస్తుండడంతో గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం గిరి గోరుముద్ద, బాల సంజీవని, పోషకాహార బుట్ట వంటి ప్రత్యేక వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని అమలుచేస్తున్నారు. ► ఏజెన్సీలో 2,652 మంది గిరిజన కమ్యూనిటీ హెల్త్ వర్కర్ (సీహెచ్‌డబ్ల్యూ)లకు 1995 నుంచి ఉన్న రూ.400 జీతాన్ని ఏకంగా రూ.4 వేలకు పెంచారు. ► గిరిజనులకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారు. ► వంద శాతం గిరిజనుల జనాభా కలిగిన తండాలు, గూడేలను 165 కొత్త గిరిజన పంచాయతీలుగా ఏర్పాటుచేసిన ప్రభుత్వం అక్కడ ప్రజాప్రతినిధులంతా గిరిజనులే ఎన్నికయ్యేలా రిజర్వ్ చేస్తూ జీఓ నెంబర్ 560 జారీచేసింది. ► 4,76,206 గిరిజనుల కుటుంబాల గృహావసరాలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందిస్తోంది. ► గిరిజనులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెస్తూ కురుపాంలో రూ.153 కోట్లతో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాలకు సీఎం శ్రీకారం చుట్టారు. ► కోట్లాది రూపాయలతో విద్యా సంస్థల భవనాలు, గిరిజన ప్రాంతాల్లోని రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు. è రాష్ట్రానికి మంజూరైన గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రస్తుతం విజయనగరం వద్ద నిర్వహిస్తున్నారు. ► కరోనా కష్టకాలంలో.. అటవీ ఫలసాయం, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) అడవి బిడ్డలకు అండగా నిలిచింది. ► ఇక విశాఖ జిల్లా తాజంగిలో రూ.35 కోట్లతో గిరిజన సమరయోధుల మ్యూజియం, కాపులుప్పాడలో రూ.45 కోట్లతో అల్లూరి సీతారామరాజు స్మారక మ్యూజియం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. విశాఖలో రూ.10కోట్లతో ట్రైబల్ రీసెర్చ్ మిషన్ (టీఆర్ఎం)కు భవన నిర్మాణం పూర్తయింది. గిరిజనులకు వైఎస్ కుటుంబమే బాసట నాడు వైఎస్సార్ ఇప్పుడు ఆయన కుమారుడు జగన్మోహన్రెడ్డి పాలనలో గిరిజనులకు ఎంతో మేలు జరిగింది. అందుకే వీరిని గిరిజనులు దైవంతో సమానంగా భావిస్తారు. గిరిజనులకు ప్రాధాన్యమిస్తూ కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటుచేశారు. మరో జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదనలున్నాయి. గిరిజనులకు విద్య, వైద్యం రెండు కళ్లుగా భావిస్తూ సీఎం జగన్మోహన్రెడ్డి విద్యాసంస్థలు, ఆస్పత్రుల నిర్మాణం చేపట్టారు. ప్రత్యక్షంగానే రూ.9వేల కోట్లకు పైగా వారికి లబ్ధిచేకూర్చారు. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి -
సమావేశమా.. అయితే సందర్శకులు బంద్!
సాక్షి, హైదరాబాద్: ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, స్వయం ఉపాధికి రాయితీ రుణాలు, కల్యాణలక్ష్మి, దళితబంధు లాంటి ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేస్తున్న వివిధ సంక్షేమ శాఖల కార్యాలయాలకు నిత్యం సందర్శకుల తాకిడి ఉంటుంది. పేదలకు నేరుగా లబ్ధి చేకూరే ఈ పథకాలు అమలు చేస్తున్న ప్రధాన కార్యాలయాలున్నది మాసాబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో. వందల మంది లబ్ధిదారులు ఇక్కడ సంబంధిత శాఖల ఉన్నతాధికారులను నేరుగా కలసి తమ గోడు వినిపించుకుంటారు. అలాంటి వారి సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కారం లభిస్తుంది. ఆ నమ్మకంతోనే ఇక్కడికి రాష్ట్రం నలు మూలలనుంచి వస్తుంటారు. కానీ ప్రస్తుతం సందర్శకులపై ఆంక్షలు విధించారు. గిరిజన సంక్షేమ శాఖ నిర్వహణలో ఉన్న ఈ భవన్లో సందర్శకులను అనుమతించడం లేదు. ఈ శాఖ ఉన్నతాధికారుల సమావేశాల పేరిట ఇతర కార్యాలయాలకు వచ్చే వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంటున్నారు. రోజూ ఈ శాఖ అధికారులకు సంబంధించి ఏదో ఒక సమావేశం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆరు అంతస్తుల్లో వివిధ కార్యాలయాలున్న సంక్షేమ భవన్లో మొదటి అంతస్తు వద్దే సందర్శకులను నిలువరిస్తుండటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు సంబంధిత ఉన్నతాధికారులను కలవకుండా ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. గురుకుల ప్రవేశాలతో రద్దీ.. ప్రస్తుతం సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. వాస్తవానికి సీట్ల కేటాయింపులన్నీ ఆన్లైన్ పద్ధతి ద్వారానే జరుగుతున్నా.. వివరాల్లో పొరపాట్లు, రిపోర్టింగ్ వివరాలు, ఇతర సమస్యలతో పెద్ద సంఖ్యలో పిల్లల తల్లిదండ్రులు ప్రతిరోజూ సంక్షేమ భవన్‌కు వస్తున్నారు. ముఖ్యంగా రెండో అంతస్తులోని బీసీ గురుకుల సొసైటీ కార్యాలయానికి విద్యార్థులు, తల్లిదండ్రుల తాకిడి అధికంగా ఉంటోంది. ఈ క్రమంలో మొదటి అంతస్తు వరకే సందర్శకులను అనుమతించడం, పైఅంతస్తుల్లోకి పంపకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బందిని నిలదీస్తున్న కొందరిని లిఫ్ట్ ద్వారా అనుమతిస్తుండగా.. అధికశాతం సందర్శకులను నిలిపివేస్తుండటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళితబంధు పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు సైతం సంక్షేమ భవన్‌లోని ఐదో అంతస్తులో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయ అధికారులను కలిసేందుకు అనుమతి దొరకడం లేదు. కాగా, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల సమావేశం మందిరం మెట్ల దారి పక్కనే ఉందని, సమీక్షలు, సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎవరినీ అనుమతించవద్దని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించినందునే సందర్శకులను నిలిపివేస్తున్నామని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. -
భావి తరాలకు పదిలంగా..!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను రాబోయే తరానికి అందించేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చేస్తున్న కృషి ఫలిస్తోంది. గిరిజన తెగల సంస్కృతి, భాషల అధ్యయనం విస్తృతంగా సాగుతోంది. గిరిజనుల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను వీడియో డాక్యుమెంటేషన్ చేసి విస్తృత ప్రచారం కల్పించేందుకు గట్టి ప్రయత్నం జరుగుతోంది. గిరిజనుల వారసత్వాన్ని పరిరక్షిస్తూ వాటికి సంబంధించిన సమాచారాన్ని రాబోయే తరాలకు తెలియజేయడం కోసం గిరిజన వస్తు ప్రదర్శనశాలలు(మ్యూజియం)ను ఏర్పాటు చేసింది. అరకులోయ, శ్రీశైలం, సీతంపేట(శ్రీకాకుళం జిల్లా)లో గిరిజన వస్తు ప్రదర్శనశాలలను గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తోంది. షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన సాహిత్యం, వాజ్ఞయాలతో కూడిన 15 వేలకు పైగా పుస్తకాలను రూపొందించడంతోపాటు, వాటిలోని చాలా వరకు డిజిటలైజేషన్ చేసింది. గ్లోబలైజేషన్ యుగంలో వివిధ గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలుపై హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇటీవల నిర్వహించిన చర్చాగోష్టిలో సమర్పించిన పత్రాలను నాలుగు సంపుటాలుగా వెలువరించింది. గిరిజన బడుల్లో 1 నుంచి 3వ తరగతి వరకు చదువుతున్న గిరిజన విద్యార్థులకు వారి మాతృభాషలోనే విద్యాబోధన జరిగేలా చర్యలు తీసుకుంది. కోయ, ఆదివాసి, సుగాలి, కొండ, సవరా, భారతి, కువి, భాషల్లో 54 వాచకాలు రూపొందించి గిరిజన విద్యార్థులకు అందించింది. బడగ, గదబ, కొండకాపు, గౌడు, కొఠియా, రోనా, భిల్లు, పరంగి పోర్జా, పోర్జా, మాలి, ధూలియా, కట్టునాయకన్, యానాది వంటి గిరిజన తెగలకు చెందిన వారి సంస్కృతి భాష, ఇతర సంప్రదాయాలపై సమగ్ర అధ్యయనాలను చేపట్టింది. కొండరెడ్డి, కోండ్, గదబ, చెంచు, కొరజ, సవర, జాతాపు, నక్కల, కోయ, వాల్మీకి తెగల ఆచార వ్యవహారాలను సంస్కృతిని సంప్రదాయక పరిజ్ఞానాన్ని పరిరక్షించడం కోసం వారి జీవన శైలిని వీడియో రూపంలో డాక్యుమెంటేషన్ చేయడం విశేషం. ఏటా గిరిజనోత్సవాలు గిరిజన సంస్కృతిని వెలుగులోకి తేవడంతోపాటు గిరిజన స్వాతంత్య్ర పోరాటాలను స్మరించుకోవడానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఏటా గిరిజనోత్సవాలను నిర్వహిస్తోంది. అలాగే ప్రతి ఏడాది మే నెలలో మోదకొండమ్మ జాతర, జూలై 4న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, ఆగస్ట్ 9న ప్రపంచ ఆదివాసీల దినోత్సవం నిర్వహిస్తోంది. గిరిజన కళలను ప్రోత్సహించేందుకు అనేక పోటీలు, ఔత్సాహిక కార్యక్రమాలను చేపడుతోంది. గిరిజన నాట్య బృందాలకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే గిరిజన ఉత్సవాల్లో పోటీలకు పంపిస్తోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయపూర్‌లో 2019లో జరిగిన జాతీయ గిరిజన నృత్యోత్సవంలో రాష్ట్రానికి చెందిన ‘కొండరెడ్ల కొమ్ము’ నాట్యానికి 3వ బహుమతి వచ్చింది. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్నాం.. సీఎం జగన్ ఆదేశాలతో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు అనేక చర్యలు చేపట్టాం. గిరిజన తెగలకు సంబంధించిన విస్తృత సమాచారాన్ని ప్రపంచానికి అందించేందుకు కృషి చేస్తున్నాం. గిరిజనుల జీవనశైలి, వారి సంస్కృతి, వేషభాషలు, సంగీత, నాట్య పరికరాలు, వ్యవసాయ పరికరాలు, కళలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని సేకరించి మ్యూజియంలతోపాటు, వీడియోలు, ఫొటోలు, డిజిటలైజేషన్ తదితర రూపాల్లో అందుబాటులోకి తెస్తున్నాం. మరింత పరిజ్ఞానం తెలుసుకునేలా అధ్యయనం చేపట్టడంతోపాటు గిరిజన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాం. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి -
స్టార్స్.. మెమ్స్!
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలలు కొత్త రూపును సంతరించుకోబోతున్నాయి. ఈ శాఖ పరిధిలోని ఆశ్రమ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం (2022–2023) నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినందున ఈ స్కూళ్లను మరింత ఆధునీకరించబోతున్నారు. నాణ్యమైన బోధన, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకు రూ. 25 కోట్లు అవసరమవుతాయని గుర్తించారు. గురుకుల పాఠశాలల స్థాయిలో ఆశ్రమ పాఠశాలలు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 326 ఆశ్రమ పాఠశాలలున్నాయి. వీటిల్లో మూడు నుంచి పదో తరగతి వరకు బోధిస్తున్నారు. 1.05 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీళ్లకు ఉచిత వసతి, భోజన సౌకర్యము కల్పిస్తారు. ఇవిగాక 1,432 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 30 వేల మంది పిల్లలున్నారు. ఈ పాఠశాలన్నీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయి ఆంగ్ల మాధ్యమంలోకి మారనున్నాయి. ఈ నేపథ్యంలో ఆశ్రమ పాఠశాలల పేర్లను ‘ఎస్టీ అడ్వాన్స్డ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (స్టార్)’గా, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను మోడల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ (మెమ్స్)గా పేరు మార్చనున్నారు. ఆశ్రమ పాఠశాలలన్నింటినీ గురుకుల పాఠశాల మాదిరి నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. విడతల వారీగా టీచర్లకు శిక్షణ ఆశ్రమ, గిరిజన ప్రభుత్వ పాథమిక పాఠశాలలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలలుగా మార్చే క్రమంలో అన్ని రకాల వసతులు సమకూర్చాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. లైబ్రరీ, ప్రయోగ శాలలు, ఆట వస్తువులు, స్కౌట్స్ అండ్ గైడ్స్, టీచర్లలో బోధన సామర్థ్యం పెంపు, బ్రిడ్జి కోర్సులను నిర్వహించాలని నిర్ణయించింది. ప్రాథమిక సౌకర్యాల కోసం కనీసం రూ.25 కోట్లు అవసరమని గిరిజన సంక్షేమ శాఖ గుర్తించింది. మరింత లోతుగా ప్రణాళిక తయారు చేస్తోంది. మరోవైపు ఆశ్రమ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల టీచర్లకు శిక్షణ తరగతులను గిరిజన సంక్షేమ శాఖ ప్రారంభించింది. విడతల వారీగా అన్ని కేటగిరీల్లోని టీచర్లకు శిక్షణ ఇవ్వనుంది. ఇందుకోసం రూ.5 కోట్లు కేటాయించింది. -
హెచ్ఐవీ బాధిత ఎస్టీ కుటుంబాలకు చేయూత
సాక్షి, అమరావతి: హెచ్ఐవీ బాధిత గిరిజన కుటుంబాలకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చేయూత అందిస్తోంది. హెచ్ఐవీ కారణంగా బతుకుదెరువు లేక మానసికంగా కుంగిపోకుండా వారిలో మనోధైర్యం నింపేలా ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది. బాధితులు తమ కుటుంబాలను పోషించుకునేలా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేసి స్వయం ఉపాధి చూపించే చర్యలు చేపట్టింది. ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఇప్పటికే 117 మంది బాధితులను గుర్తించి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం మంజూరు చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎస్టీల్లో హెచ్ఐవీ బాధితుల జాబితాలు పంపించాలని కలెక్టర్లను కోరామని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ వి.చినవీరభద్రుడు తెలిపారు. కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ ప్రత్యేక శ్రద్ధతో ఎస్టీల్లో హెచ్ఐవీ బాధితులకు రూ.1.17 కోట్లు మంజూరయ్యాయని గిరిజన సంక్షేమ అధికారి ఎం.రుక్మాంగదయ్య చెప్పారు. -
గిరిజనుల స్వయం ఉపాధికి సర్కార్ కృషి
డుంబ్రిగుడ/అరకులోయ రూరల్: అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే గిరిజనుల స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే చెప్పారు. విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో డుంబ్రిగుడ మండలం అరకు సంతబయలు జీసీసీ గోడౌన్లో కొర్రాయి వీడీవీకే ఏర్పాటు చేసిన బిస్కెట్ తయారీ కేంద్రాన్ని ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ, అరకు ఎమ్మెల్యే ఫాల్గుణతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంతీలాల్ దండే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కృషితో కేంద్ర ప్రభుత్వం 350 వన్‌ధన్ వికాస కేంద్రాలను ఏపీకి మంజూరు చేసిందన్నారు. సీతంపేట, పాడేరు, రంపచోడవరం ఐటీడీఏల పరిధిలో వీటిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అటవీ ఉత్పతులకు అదనపు విలువ జోడించి ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. వీటిని కాటేజీ పరిశ్రమ కిందకు మారిస్తే విద్యుత్ రాయితీ పొందవచ్చని సూచించారు. ఎమ్మెల్యే ఫాల్గుణ మాట్లాడుతూ.. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా తగిన సహకారం అందిస్తోందన్నారు. అనంతరం కాంతీలాల్ దండే కుటుంబ సమేతంగా అరకులోయను సందర్శించారు. గిరి గ్రామదర్శినిలో కాంతిలాల్ దంపతులకు గిరిజన సంప్రదాయ దుస్తులు వేసి మరోసారి పెళ్లి తంతు జరిపించారు. సాంప్రదాయాలు కనుమరుగు అవుతున్న ఈ రోజుల్లో గిరి గ్రామదర్శిని నిర్వహణ అభినందనీయమన్నారు. పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ, గిరిజన సంక్షేమ శాఖ ఎస్ఈ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ చట్టారి జానకమ్మ, ఎంపీపీ బాక ఈశ్వరి, సర్పంచ్ శారద పాల్గొన్నారు. -
ఆటలకు సై..!
సాక్షి, అమరావతి: గిరిజన బిడ్డలు చదువుల్లోనే కాదు ఇకపై ఆటల్లోనూ దూసుకుపోనున్నారు. రాష్ట్రంలోని గిరిజన పాఠశాలలు, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో క్రీడా మైదానాల అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 10 ప్రాంతాల్లో రూ.18 కోట్లతో ఆట స్థలాల అభివృద్ధి పనులు చేపట్టింది. ఈ పనులను ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ(శాప్) పర్యవేక్షిస్తోంది. స్టేడియం నిర్మాణం, క్రీడా సౌకర్యాల ఆధునికీకరణ పథకంలో చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకు నాలుగు పనులు పూర్తి కాగా, మరో ఆరు పనులు వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని నెల్లూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని గిరిజన విద్యాలయాల్లో రూ.2 కోట్లతో ఆట స్థలాల అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రెండేసి, పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున పనులు జరుగుతున్నాయి. ఈ ఆరు క్రీడా మైదానాల అభివృద్ధికి, క్రీడా పరికరాల ఆధునికీకరణకు రూ.16 కోట్లు కేటాయించారు. ఇది ఇలా ఉంటే రాష్ట్రంలోని అన్ని గిరిజన పాఠశాలలకు సంబంధించిన క్రీడా మైదానాలను మట్టి, ఇసుకతో మెరక చేసి అభివృద్ధిపరిచేలా ‘సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)’లకు బాధ్యతలు అప్పగించారు. ఆట స్థలాల అభివృద్ధి పనులను నాడు–నేడు, ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమాల్లో చేపట్టాలని ప్రతిపాదించారు. ఇందుకోసం తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని గిరిజన గురుకుల విద్యాలయాన్ని ప్రయోగాత్మకం(ఫైలెట్)గా తీసుకుని ఆటస్థలం అభివృద్ధి పనులు చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. -
పాడేరు ఐటీడీఏ ఈఈపై ఏసీబీ దాడులు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం : గిరిజన సంక్షేమ శాఖ అధికారిపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) శనివారం దాడులు నిర్వహించింది. పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) కాట్రెడ్డి వెంకటసత్యనగేష్కుమార్పై అక్రమాస్తులపై ఫిర్యాదు రావడంతో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలపై ఏసీబీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. విశాఖతో పాటు మూడు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగాయి. విశాఖ, అనకాపల్లిలోని నగేష్‌కుమార్ ఇళ్లు, పాడేరులోని కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో నగేష్‌కుమార్, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో రెండు ఫ్లాట్లు, 9 ఇళ్ల స్థలాలు, 6.50 ఎకరాల సాగు భూమి, రెండు కార్లు, నగదు, బంగారు, వెండి వస్తువులను గుర్తించారు. వాటి విలువ రూ.2,06,17,622 ఉంటుందని అంచనా వేశారు. మొత్తంగా ప్రాథమిక దర్యాప్తులో ఆదాయానికి మించి రూ.1,34,78,180 ఆస్తులు కలిగి ఉన్నట్టు గుర్తించారు. బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉంది. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ ప్రధాన కార్యాలయం పేర్కొంది. -
గిరిజన కష్టాలకు కాంగ్రెస్సే కారణం
భోపాల్: కాంగ్రెస్ హయాంలో గిరిజనుల సంక్షేమం మరుగునపడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. గత పాలకుల వల్ల ఇప్పటికీ వెనుకబాటుకు గురైన ప్రాంతాల అభివృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. గత ప్రభుత్వాల వీఐపీ సంస్కృతి నుంచి ఈపీఐ(ప్రతి వ్యక్తీ ముఖ్యుడే) సాధన దిశగా దేశం ప్రస్తుతం పరివర్తన చెందుతోందని ప్రధాని అన్నారు. సోమవారం ఆయన భోపాల్‌లో జన్‌జాతీయ గౌరవ్ దివస్ మహాసమ్మేళన్‌లో మాట్లాడారు. అనంతరం ప్రధాని ఆధునీకరించిన రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. గోండ్ రాణి దుర్గావతి ధైర్యసాహసాలు, రాణి కమలాపతి త్యాగాలను దేశం ఎన్నటికీ మరువదన్నారు. ‘గత ప్రభుత్వాల్లో గిరిజనులకు సముచిత స్థానం దక్కలేదు. కనీస సౌకర్యాలకు కూడా నోచుకోలేదు. అంబేద్కర్ జయంతి, గాంధీ జయంతి, వీర్‌సావర్కర్ జయంతిల మాదిరిగానే భగవాన్ బిర్సాముండా జయంతిని ఏటా నవంబర్ 15న నిర్వహిస్తాం’అని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్, తదితర రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్న 50 ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈపీఐ దిశగా పరివర్తన: గత ప్రభుత్వాల వీఐపీ సంస్కృతి నుంచి ఈపీఐ(ప్రతి వ్యక్తీ ముఖ్యుడే) సాధన దిశగా దేశం ప్రస్తుతం పరివర్తన చెందుతోందని ప్రధాని చెప్పారు.‘వీఐపీ సంస్కృతి నుంచి ఈపీఐ(ప్రతి ఒకరూ ముఖ్యులే) అన్న ఆదర్శం దిశగా దేశం పరివర్తన చెందుతోందనడానికి ఇదే ఉదాహరణ. దేశవ్యాప్తంగా 175 రైల్వే స్టేషన్లలో ఇటువంటి అత్యాధునిక వసతులను సమకూరుస్తాం’అని చెప్పారు గత ప్రభుత్వాల హయాంలో రైల్వే ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు 40–50 ఏళ్లు పట్టేంది. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 1,100 కిలోమీటర్ల ఈస్టర్న్, వెస్టర్న్ ఫ్రెయిట్ కారిడార్ల పనులు ఏడేళ్లలోపే పూర్తయిందన్నారు. -
జాతీయ ఆదివాసీ దినోత్సవం: గిరిజన కళలకు 'కళ'
సాక్షి, అమరావతి/బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): గిరిజన కళలకు ఊతమిచ్చేలా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ వారం పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా 146వ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ‘జన్ జాతి గౌరవ దివస్’(జాతీయ ఆదివాసీ దినోత్సవం)గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22 వరకు గిరిజన కళలను ప్రోత్సహించేలా కార్యాచరణ చేపట్టారు. దీనిలో భాగంగా విశాఖ ఆర్కే బీచ్‌లో సోమవారం ప్రారంభించిన గిరిజన హస్తకళల ప్రదర్శన, విక్రయాలు 19 వరకు కొనసాగుతాయి. సవర, కొండరెడ్డి, కొండదొర, నూకదొర, కోయ, జాతపు, కొండ కమ్మర, వాల్మీకి, భగతహ, కొటియా తదితర ఆదిమ గిరిజనులు రూపొందించిన హస్త కళలను ఐదు రోజుల పాటు ప్రదర్శించనున్నారు. గిరిజన సంప్రదాయ, ప్రత్యేకత కలిగిన ఈ హస్తకళ నైపుణ్యాలను మరో తరానికి అందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు దోహదపడతాయి. గిరిజన హస్తకళాకారులకు జీవనోపాధి చూపడంతో పాటు.. సంప్రదాయ గిరిజన హస్తకళలను నిలబెట్టేందుకు 12 ప్రధాన రకాల ఉత్పత్తులతో గిరిజన సంక్షేమ శాఖ స్టాల్స్‌ను ఏర్పాటు చేసింది. మహోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ గిరిజన ప్రాంతాల నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా థింసా నృత్యం చేస్తున్న సమయంలో గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ రంజిత్ బాషా, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశా కూడా నృత్యం చేశారు. డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలు రాష్ట్రంలోని గిరిజన కళాకారులను ప్రోత్సహించేలా ఈ నెల 18 వరకు డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తున్నారు. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పర్యవేక్షణలో నిర్వహించే ఈ పోటీల్లో విజేతలకు ఈ నెల 21న రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి రూ.50 వేలు, రూ.25 వేలు, రూ.15 వేల చొప్పున ఈ నెల 22న జరిగే ముగింపు కార్యక్రమంలో బహుమతులను అందిస్తారు. గిరిజన పోరాట యోధుడు.. బిర్సా ముండా ఆదివాసీల కోసం బ్రిటీష్ వారిపై వీరోచితంగా పోరాడిన గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతి రోజైన నవంబర్ 15న ‘జన్ జాతి గౌరవ దివస్’గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 1875 నవంబర్ 15న రాంచీలో జన్మించిన బిర్సా ముండా 1900 జూన్ 9న రాంచీ సెంట్రల్ జైల్లోనే మరణించాడు. గిరిజన వ్యవసాయ పద్ధతులను, జీవన విధానాలను దెబ్బతీసే చర్యలకు పాల్పడిన బ్రిటీష్ వారిపై పోరాటం చేశాడు. ఆయన స్ఫూర్తి భావితరాలకు అందించాలని కేంద్రం ఆయన జయంతిని జన్ జాతి గౌరవ దివస్‌గా నిర్వహిస్తోంది. -
ఐబీపీఎస్ పరీక్షలకు ఎస్టీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గిరిజన స్టడీ సర్కిల్లో ఐబీపీఎస్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమశాఖ సంయుక్త సంచాలకుడు సముజ్వల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు నెలల పాటు నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు studycircle.cgg.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల అర్హతలో మెరిట్ ఆధారంగా శిక్షణకు ఎంపిక చేస్తామని, మొత్తం వంద మంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. మూడోవంతు సీట్లు మహిళలకు కేటాయించామన్నారు. వివరాలకు 6303497606 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. -
గిరిజన గర్భిణులకు కొండంత రక్షణ
సాక్షి,అమరావతి: మన్యంలోని గర్భిణులకు కొండంత రక్షణగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ప్రెగ్నెంట్ ఫ్రెండ్లీ’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మరింత సమన్వయంతో సమర్థవంతమెన ఆరోగ్య సేవలు అందించేలా ‘ట్రైబల్ హెల్త్ కొలాబరేటివ్ మానిటరింగ్ సిస్టం’ (గిరిజన ఆరోగ్య సమన్వయ పర్యవేక్షణ విధానం) పేరుతో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ దీనిని నిర్వహించనుంది. గిరిజన గర్భిణులకు కొత్తగా అందించనున్న సేవలతోపాటు కొత్త యాప్‌ను కూడా సోమవారం ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. విశాఖ జిల్లా పాడేరులో నిర్వహించే ట్రయల్ రన్‌ను ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి పర్యవేక్షిస్తారు. యాప్‌తో ప్రయోజనాలు ఇలా ఏజెన్సీ ప్రాంత గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ రూపొందించిన ఈ ప్రత్యేక యాప్‌తో ప్రయోజనం మెండుగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గిరిజనుల ఆరోగ్య సమాచారం సేకరించి ఈ యాప్‌లో పొందుపరుస్తారు. గర్భిణుల నుంచి చిన్నారుల వరకు అవసరమైన వైద్యసేవలు సకాలంలో అందించేలా ఈ యాప్ ఎప్పటికప్పుడు అధికారులను, సంబంధిత విభాగాల సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. సమాచార సేకరణ నుంచి వైద్య సేవలు అందించే వరకు గిరిజన సంక్షేమ, వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ, విద్యా శాఖల సమన్వయంతో పనిచేసేలా దీనిని రూపొందించారు. యాప్‌లో పొందుపరిచిన సమాచారం మేరకు ప్రసవానికి 30 రోజుల ముందు నుంచే గర్భిణులకు వైద్యం అందించే వైద్యంపై ఆయా కుటుంబాల వారికి ఆశ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు అవగాహన కల్పిస్తారు. 20 రోజుల ముందు వారిని ఏ ఆస్పత్రికి తరలించేది గ్రామ సచివాలయాలకు సమాచారం అందిస్తారు. ప్రసవానికి 15 రోజుల ముందు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆస్పత్రికి సమాచారం అందిస్తారు. 10 రోజుల ముందు ఐటీడీఏ పీవోలకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తారు. ప్రసూతి వసతి గృహాలకు తరలింపు ఈ యాప్ ద్వారా ఒకవైపు అధికారులను అప్రమత్తం చేస్తూ మరోవైపు గర్భిణులకు అవగాహన, వారి బంధువులకు కౌన్సెలింగ్ ఇచ్చి ప్రసవానికి 30 నుంచి 10 రోజుల సమయం ఉండగానే ప్రసూతి వసతి గృహాలకు తరలిస్తారు. ఇందుకోసం ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా 41 ప్రసూతి వసతి గృహాలను ఏర్పాటు చేశారు. వాటిలో 2,600 బెడ్లు సమకూర్చారు. ప్రసవానికి ముందు నుంచి గర్భిణులు ఆరోగ్యంగా, ఆనందంగా గడిపేలా ఆట పాటలతో కూడిన వాతావరణ కల్పిస్తారు. అంతేకాకుండా వారికి ఆరోగ్యం పట్ల అవగాహన తరగతులు నిర్వహించడంతోపాటు బలమైన ఆహారం అందిస్తారు. తల్లీబిడ్డల మరణాలు తగ్గించడమే లక్ష్యం గిరిజన ప్రాంతాల్లో తల్లీబిడ్డల మరణాలు లేకుండా చూసేందుకు ప్రభుత్వం అనేక విప్లవాత్మక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే డోలీతో మోసుకొచ్చే పద్ధతికి స్వస్తి పలుకుతూ బైక్ అంబులెన్సులు అందుబాటులోకి తెచ్చాం. ఈ యాప్‌లో గర్భిణుల వివరాలతోపాటు గురుకుల విద్యార్థుల వివరాలు, చిన్నారులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, వారికి అందించాల్సిన వైద్య సేవలు వంటి ఎన్నో వివరాలు ఉంటాయి. – పుష్ప శ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి