
సాక్షి, హైదరాబాద్: గిరిజన ప్రాంతాల్లోని భూముల బదలాయింపు నియంత్రణ చట్టం(1ఆఫ్70 యాక్ట్) లోని కొన్ని నిబంధనలు గిరిజనేతరుల హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని, వాటిని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఖమ్మం జిల్లా, చెంచుపల్లి గ్రామానికి చెందిన సూరెడ్డి రమణారెడ్డి వ్యాజ్యా న్ని దాఖలు చేశారు. దీనిపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, గవర్నర్ కార్యదర్శిలకు నోటీసులు జారీ చేసింది.