Ramesh ranganathan
-
జస్టిస్ రమేశ్ రంగనాథన్‌కు ఘనంగా వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్తున్న ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్ అధ్యక్షతన మొదటి కోర్టు హాల్లో జరిగిన వీడ్కోలు కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. జస్టిస్ రమేశ్ రంగనాథన్ విలువలకు కట్టుబడిన వ్యక్తి అని, రాజీలేని మార్గంలో, చట్టానికి లోబడి పనిచేశారని కొనియాడారు. నిరంతరం అధ్యయనం చేసే జస్టిస్ రంగనాథన్ 31,487 కేసుల్ని పరిష్కరిస్తే.. అందులో ఫుల్ బెంచ్ ఇచ్చిన తీర్పులు 36 ఉన్నాయన్నారు. అనంతరం జస్టిస్ రమేశ్ రంగనాథన్ మాట్లాడుతూ.. చట్ట నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం వల్ల చాలామంది న్యాయవాదులు నొచ్చుకుని ఉంటారని, దీంతో ఈ కార్యక్రమానికి పెద్దగా న్యాయవాదులు రారేమోనని భావించానన్నారు. అయితే పెద్ద సంఖ్యలో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తనకు విధుల్లో సహకరించిన తోటి న్యాయమూర్తులు, న్యాయాధికారులు, సిబ్బంది, న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్‌రావు మాట్లాడుతూ.. చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు జస్టిస్ రమేశ్ రంగనాథన్ పాటుపడ్డారని చెప్పారు. న్యాయవాద సంఘాల ఆధ్వర్యంలో: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హైకోర్టు న్యాయవాద సంఘాల ఆధ్వర్యంలో జస్టిస్ రమేశ్ రంగనాథన్‌కు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ రాధాకృష్ణన్ హాజరయ్యారు. రెండు సంఘాల అధ్యక్షులు, కార్యవర్గసభ్యులు కలసి సీజే చేతుల మీదుగా జస్టిస్ రమేశ్ రంగనాథన్‌కు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ రమేశ్ రంగనాథన్ భార్య హాజరయ్యారు. -
ఐఏఎస్ అధికారికి జైలు శిక్ష అమలు నిలిపివేత..
సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా బోర్డు కార్యదర్శి కె. శివకుమార్ నాయుడికి సింగిల్ జడ్జి విధించిన 30 రోజుల సాధారణ జైలు శిక్ష అమలును నిలిపివేస్తూ ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సింగిల్ జడ్జి విధించిన రూ.2 వేల జరిమానా చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇది తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని ప్రకటించింది. గత వారం సింగిల్ జడ్జి జైలు శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ శివకుమార్ దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రమేష్‌రంగనాథన్, జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణకు స్వీకరించింది.శివకుమార్ నాయుడు మహబూబ్‌నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు బుచ్చయ్య అనే వ్యక్తి తన ప్రైవేట్ స్థలంలో చేపట్టిన కల్యాణ మంటప నిర్మాణ పనుల కేసులో కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని సింగిల్ జడ్జి ఆయనకు జైలు, జరిమానా విధించిన సంగతి విదితమే.దీనిపై శివకుమార్ అప్పీల్ దాఖలు చేయడంతో ధర్మాసనం ఊరటనిచ్చింది. -
ముందు కాలుష్యరహితం.. తర్వాతే సుందరీకరణ
సాక్షి, హైదరాబాద్: మూసీ నదికి ముందు కావాల్సింది సుందరీకరణ కాదని, కాలుష్య రహిత ప్రవాహమని హైకోర్టు స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో మూసీలో కాలుష్య కారకాలు కలవకుండా నిరోధించినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుందని వెల్లడించింది. ఈ విషయంలో పీసీబీ ఏం చేస్తుందో తెలుసుకోవాలని భావిస్తున్నామంటూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ బి.రాధాకృష్ణన్, జస్టిస్ రమేశ్ రంగనాథన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సబర్మతీ నదిలా మూసీని శుభ్రపరిచేలా ప్రభుత్వా న్ని ఆదేశించాలని నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవా రం ధర్మాసనం విచారణ చేపట్టి పైవిధంగా స్పందించింది. -
‘రైతు రుణ విమోచన’ చైర్మన్ నియామకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్‌గా నాగుర్ల వెంకటేశ్వర్లును నియమిస్తూ జీవో జారీ చేసినట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ విషయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌ల ధర్మాసనం నమోదు చేసుకుంది. నియామక ఉత్తర్వుల్ని పరిశీలించిన ధర్మాసనం బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి ప్రభుత్వంపై దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యంపై విచారణను ముగిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్‌ను ఏర్పాటు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ ఇంద్రసేనారెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యా న్ని దాఖలు చేశారు. కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ హామీ మేరకు ధర్మాసనం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసిందిగానీ, దానికి ఎవరినీ చైర్మన్‌గా నియమించలేదంటూ ఆయన కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. చైర్మన్ నియామక జీవో ప్రతిని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ కుమార్ అందజేయడంతో ఆ వ్యాజ్యాన్ని మూసివేస్తున్న ట్టు ధర్మాసనం ప్రకటించింది. -
‘పొగాకు’ నిషేధంపై కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పొగాకుతో తయారు చేసే గుట్కా, పాన్ మసాలాలు తదితర ఉత్పత్తుల నిషేధ చట్టాలను కఠినంగా అమలు చేయాలని హైకోర్టు అభిప్రాయపడింది. గుట్కా, పాన్ మసాలాల ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను 3 వారాలు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాన్‌మసాలా ఉత్పత్తుల తయారీ, భద్రపర్చడం, పంపిణీ, రవాణాలపై ఉన్న నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది చివరి వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ యూనిక్ టుబాకో ప్రొడక్ట్స్ సంస్థ అధిపతి సయ్యద్ ఇర్ఫానుద్దీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆహార భద్రత కమిషనర్ ఈ ఉత్తర్వులను జారీచేశారని, అసలు పొగాకు ఆహారం కాదని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. బండ్లగూడలోని తమ పరిశ్రమలోకి అధికారులు నోటీసులు జారీ చేయకుండానే తనిఖీలకు వస్తున్నారన్నారు. రాజ్యాంగ, చట్ట వ్యతిరేకంగా విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులైన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్, గుంటూరులోని టుబాకో చైర్మన్, ఆహార భద్రత శాఖ కమిషనర్, డీజీపీ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్లకు నోటీసులు జారీచేసింది. -
ఆ కబ్జారాయుళ్లపై ఏం చర్యలు తీసుకున్నారు?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేట గ్రామంలోని సర్వే నంబర్లు 308, 332, 333ల్లోని 184 ఎకరాల భూమిని కబ్జా చేసిన వ్యక్తులపై ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని హైకోర్టు మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలను తమ ముందుంచాలంటూ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, దేవాదాయ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, మేడ్చల్ కలెక్టర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక నేత కొలన్ శ్రీనివాస్‌రెడ్డికీ నోటీసులిచ్చింది. విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. నిజాం పేట గ్రామంలో సీతారామాంజనేయ స్వామి దేవస్థానానికి 184 ఎకరాల భూమి ఉందని, ఆ భూమిని కొలన్ శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలోని దేవస్థానం కమిటీ, స్థానిక సర్పంచ్, స్థానిక నేతలు కలసి ప్లాట్లు చేసి అమ్మేసి కోట్ల రూపాయలు గడించారంటూ కూకట్పల్లి, హైదర్‌నగర్‌కు చెందిన అరుంధతమ్మ హైకోర్టుకు లేఖ రాశారు. ఏసీజే ఆదేశాలతో హైకోర్టు రిజిస్ట్రీ ఆ లేఖను పిల్‌గా పరిగణించింది. ఈ పిల్‌పై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. -
పంచాయతీ రిజర్వేషన్లపై వివరణ ఇవ్వండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటుతుండటంపై హైకోర్టు సోమవారం తెలంగాణ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిల ధర్మాసనం ఆదేశించింది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50శాతం దాటుతున్నాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని సంగారెడ్డి జిల్లా పోసానిపేట సర్పంచ్ వి.సప్నారెడ్డి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వేదుల శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదికన కల్పిస్తున్నారని వివరించారు. కొన్ని చోట్ల 100 శాతం సీట్లను ఎస్సీ, ఎస్టీలకే ఇస్తున్నారన్నారు. వీటన్నింటినీ కలిపితే రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయన్నారు. -
184 ఎకరాల దేవుడి భూములు అన్యాక్రాంతమా?
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేట గ్రామంలో ఉన్న 308, 332, 333 సర్వే నంబర్లలోని 184 ఎకరాల దేవాదాయ భూమి అన్యాక్రాంతం కావడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. భూమిని ప్లాట్లుగా చేసి స్థానిక నేతలు విక్రయిస్తుంటే ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నిజాం పేటలోని సీతారామాంజనేయ స్వామి దేవస్థానానికి ఉన్న 184 ఎకరాల భూమి ని కొలన్ శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలోని దేవస్థానం కమిటీ, స్థానిక సర్పంచ్, స్థానిక నేతలు కలసి ప్లాట్లు వేసి అమ్మేసి కోట్ల రూపాయలు గడించారంటూ కూకట్‌పల్లిలోని హైదర్‌నగర్‌కు చెందిన అరుంధతమ్మ హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను పరిశీలించిన న్యాయమూర్తుల పిల్ కమిటీ దీన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలని సిఫారసు చేసింది. దీంతో ఏసీజే ఆదేశాల మేరకు హైకోర్టు రిజిస్ట్రీ ఆ లేఖను పిల్‌గా మలచింది. దీనిపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. -
సీబీఐ దర్యాప్తునకు ఎలా ఆదేశించాలి?
సాక్షి, హైదరాబాద్: సామాజిక మాధ్యమాల్లో క్రైస్తవులపై దుష్ప్రచారం చేస్తున్నవారు ఎవరో తెలియకుండా సీబీఐ దర్యాప్తునకు ఎలా ఆదేశించాలని ఆలిండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్(ఏఐటీసీసీ)ను హైకోర్టు ప్రశ్నించింది. హిందూ జనశక్తి, శివశక్తిలకు చెందిన వారు ఏపీ, తెలంగాణాల్లో క్రైస్తవులపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఇందుకు సంబంధించి పలు పోలీసు స్టేషన్లలో ఉన్న కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ విశాఖలోని మాధవధారకు చెందిన కౌన్సిల్ జాతీయ ప్రధాన కార్యదర్శి కొలకలూరి సత్యశీలరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ఎవరిపై ఆరోపణలు చేస్తున్నారో వారిని వ్యాజ్యంలో పేర్కొనకుండా సీబీఐ దర్యాప్తు చేయాలని కోరడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. శివశక్తి, హిందూ జనశక్తిలను ప్రతివాదులుగా చేసేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యర్థనను ధర్మాసనం అంగీకరించింది. తదుపరి విచారణను కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. -
‘గిరిజనేతరుల హక్కులను కాలరాస్తున్నాయి’
సాక్షి, హైదరాబాద్: గిరిజన ప్రాంతాల్లోని భూముల బదలాయింపు నియంత్రణ చట్టం(1ఆఫ్70 యాక్ట్) లోని కొన్ని నిబంధనలు గిరిజనేతరుల హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని, వాటిని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఖమ్మం జిల్లా, చెంచుపల్లి గ్రామానికి చెందిన సూరెడ్డి రమణారెడ్డి వ్యాజ్యా న్ని దాఖలు చేశారు. దీనిపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, గవర్నర్ కార్యదర్శిలకు నోటీసులు జారీ చేసింది. -
విలీనం, విడదీయడం.. ప్రభుత్వ వ్యవహారం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలో గ్రామాలు, కాలనీలను కలపడం, విడగొట్టడం వంటివి ప్రభుత్వ పరిధిలోని వ్యవహారాలని, వాటి విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తమ కాలనీని కొత్తగా ఏర్పాటుచేస్తున్న రామగోవిందాపురం గ్రామ పంచాయతీలో కలపడం లేదంటూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని గాంగారం గ్రామ పరిధిలోని ప్రకాశ్‌నగర్‌కు చెందిన కె.పుల్లయ్య, మరొకరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో తాము జోక్యం చేసుకోలేమని, అభ్యంతరాలు ఏవైనా ఉంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది. పిటిషనర్ల అభ్యంతరంపై ఏం నిర్ణయం తీసుకున్నారో వారికి తెలియచేయాలని అధికారులను ఆదేశించింది. -
హైకోర్టులో ఘనంగా ఆవిర్భావ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఉమ్మడి హైకోర్టులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు హైకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, కోర్టు అధికారులు, సిబ్బంది, న్యాయవాదులు హాజరయ్యారు. -
‘గృహ హింస’పై అవగాహనకు ఏం చేస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్: గృహ హింస నిరోధక చట్టం గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని కేంద్రంతో పాటు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని తెలుపుతూ.. విచారణను జూన్‌కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గృహ హింస నిరోధక చట్టంలోని సెక్షన్–11(ఎ) ప్రకారం ఈ చట్టం గురించి టీవీలు, పత్రికల్లో అవగాహన కల్పించాల్సి ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ న్యాయ విద్యార్థి తాండవ యోగేశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. మహిళల రక్షణ కోసం ఈ చట్టా న్ని తీసుకొచ్చారని, దీని గురించి అవగాహన కల్పించకపోవడంతో చట్టం ఉద్దేశం నెరవేరడం లేదని యోగేశ్ తెలిపారు. -
విద్యా ప్రమాణాలపై హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సాయంతో నడుస్తున్న పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు తగు చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఎంవీ ఫౌండేషన్ ప్రతినిధి ఆర్.వెంకటరెడ్డి మంగళవారం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని తెలుగు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జూన్‌కి వాయిదా వేసింది. -
సహ విద్యార్థినులను ప్రశ్నించలేదేం?
సాక్షి, హైదరాబాద్: బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసుపై సిట్ చేస్తున్న దర్యాప్తుపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆయేషా మీరాతోపాటు హాస్టల్లో ఉన్న విద్యార్థినుల వాంగ్మూలాన్ని ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. ‘ఆయేషా హత్య జరిగిన హాస్టల్లో వంద మంది ఉన్నారు.అలాంటి చోట ఆయేషాను తలమీద కొట్టి హత్య చేస్తే పక్కనే ఉన్నవాళ్లు ఏమీ మాట్లాడటం లేదంటే అందుకు భయమే కారణం కావచ్చు. ఇప్పుడు సాగుతున్న దర్యాప్తును చూస్తుంటే, గతంలో విచారించిన వాళ్లనే మళ్లీ విచారిస్తున్నట్లు ఉంది. నిష్పాక్షికంగా, నిజాయితీగా దర్యాప్తు జరపండి’అని సిట్‌ని ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు పురోగతికి సంబంధించిన వివరాలతో సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని సిట్‌కు నేతృత్వం వహిస్తున్న విశాఖ రేంజ్ డీఐజీ సీహెచ్ శ్రీకాంత్‌కు స్పష్టం చేసింది.తదుపరి విచారణను జూలై 13కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆ తీర్పు అమలును నిలిపేయండి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌ల బహిష్కరణ రద్దు తీర్పుపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ఎదుట శుక్రవారం అప్పీల్ దాఖలైంది. తీర్పు అమలును నిలిపేయాలని కోరుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, జి.సాయన్న, మర్రి జనార్దన్‌రెడ్డి, గ్యాదరి కిశోర్ కుమార్, మాగంటి గోపీనాథ్, మల్లిపెద్ది సుధీర్‌రెడ్డి, కె.పి.వివేకానంద, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, కాలె యాదయ్య, రమావత్ రవీంద్రకుమార్ అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ముందు కోమటిరెడ్డి, సంపత్ దాఖలు చేసిన వ్యాజ్యంలో ఈ 12 మంది ఎమ్మెల్యేలు ప్రతివాదులు కాదు. దాంతో నిబంధనల మేరకు అప్పీల్ దాఖలుకు కోర్టు అనుమతి కోరుతూ అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అప్పీల్‌ను అనుమతించి అత్యవసరంగా విచారణ జరపాలన్న ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది కటిక రవీందర్‌రెడ్డి అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. అప్పీల్ దాఖలుకు అనుమతించాలన్న అనుబంధ పిటిషన్‌పై బుధవారం ముందు విచారణ జరుపుతామని పేర్కొంది. సింగిల్ జడ్జి తీర్పు చట్టవిరుద్దం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సందర్భంగా శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్‌పై హెడ్‌ఫోన్ విసిరి గాయపరిచారంటూ కోమటిరెడ్డి, సంపత్‌లను సభ నుంచి బహిష్కరించడం, వారు ప్రాతినిథ్యం వహిస్తున్న నల్లగొండ, ఆలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. వాటిని సవాలు చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు. బహిష్కరణను, నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి జస్టిస్ శివశంకరరావు ఈ నెల 17న తీర్పునిచ్చారు. తీవ్ర తర్జనభర్జనల అనంతరం ప్రభుత్వం ఎమ్మెల్యేలను రంగంలోకి దించి దానిపై అప్పీల్ దాఖలు చేయించింది. సింగిల్ జడ్జి తీర్పు ఏ రకంగా చూసినా చట్ట విరుద్ధమేనని అప్పీల్లో వారు వాదించారు. ‘‘కోమటిరెడ్డి, సంపత్ సభ్యులుగా కొనసాగేందుకు అర్హులే కాదు. సభా మర్యాదలను వారు మంటగలిపిన తీరును మాతో పాటు సభ్యులంతా చూశారు. వారు పిటిషన్లో కోరిన వాటికి మించి జడ్జి అనుకూల ఉత్తర్వులిచ్చారు. అసలు వారి వ్యాజ్యాన్ని విచారణార్హంగా పరిగణించి ఉండకూడదు. వారి చర్యలు సభా ధిక్కారమే. వారి బహిష్కరణకు శాసన వ్యవహారాల మంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. వీడియో ఫుటేజీ ఇవ్వకపోవడం, సభ్యులకు బహిష్కరణ తీర్మానం, నోటీసు, వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమంటూ జడ్జి తప్పుబట్టారు. కానీ సహజ న్యాయ సూత్రాల విషయంలో పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సభ్యుల చర్యలు దుష్ప్రవర్తనే గాక సభా ధిక్కారం కూడా. ఇలాంటి వారిని అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌కు అనుమతించడం అసాధ్యం. వారేం చేశారో సభంతా చూశాక వారి వాదన వినాల్సిన అవసరమే లేదు. తప్పు చేశారని స్పష్టమవుతుంటే సహజ న్యాయ సూత్రాలను పాటించాలనడంలో అర్థమే లేదు. పైగా సభ్యుల చర్యలు సభా ధిక్కారమైనప్పుడు, వారి వాదనలు వినే విషయంలో ఎలాంటి ప్రొసీజర్ లేనప్పుడు తగిన తీర్మానం జారీ చేసే అధికారం సభకుందని హైకోర్టు ధర్మాసనం గతంలో తీర్పునిచ్చింది’’అని పేర్కొన్నారు. ఆ అధికరణను సుప్రీంకోర్టే ఉపయోగించగలదు ‘‘అసెంబ్లీకి కొన్ని ప్రత్యేక, అసాధారణ అధికారాలున్నాయి. వాటి ప్రకారం సభ్యులను శిక్షించవచ్చు. సభా మర్యాదలకు భంగం కలిగించినా, సభను ధిక్కరించినా, ప్రతిష్టను దిగజార్చినా బాధ్యులైన సభ్యులను బహిష్కరించే అధికారం ఉంది. షోకాజ్ నోటీసు ఇవ్వకుండా ఉద్యోగులను శిక్షించరని జడ్జి పేర్కొన్నారు. దానికి, శాసనసభ్యుల శిక్షకు ఉన్న తేడాను విస్మరించారు. తప్పు చేసిన సభ్యులను మన్నించి వదిలేస్తే సభ సార్వభౌమాధికారం ప్రశ్నార్థకమవుతుంది. సభలో జరిగిన విషయాలపై న్యాయ సమీక్షకు వీల్లేదు. సభకు ప్రత్యేక, అసాధారణ అధికారాలున్నాయని జడ్జి విస్మరించారు. ఆధారాలు సమర్పించకుంటే అవి విరుద్ధంగా ఉన్నాయని భావిం చే పరిస్థితి ఈ కేసుకు వర్తించదు. జడ్జి 142వ అధికరణ కింద ఉన్న అధికారాన్ని ఉపయోగించి తీర్పునిచ్చారు. ఈ అధికారాన్ని సుప్రీంకోర్టే ఉపయోగించగలదు. ఫుటేజీ సమర్పణకు సభ తీర్మానం అవసరం లేదని పార్లమెంటరీ సభా విధానాల ను పరిశీలించకుండానే తీర్పునిచ్చారు. న్యాయపరమైన ఉత్తర్వుల ద్వారా సభ నుంచి డాక్యుమెంట్‌ను కోరితే సభ ప్రత్యే క, అసాధారణ అధికారాలకు విలువ లేనట్లే! సభ జరుగుతుండగా జరిగిన విషయాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇచ్చేందుకు సభ తీర్మానం తప్పనిసరి. సభా హక్కుల ఉల్లంఘన జరిగిందా, లేదా తేల్చేందుకు పార్లమెంటు, శాసనసభలే సరైన అధికార వ్యవస్థలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. జడ్జి తన తీర్పుతో సభ తీర్మానంలో జోక్యం చేసుకున్నారు’’ అని అప్పీల్లో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. -
భూసేకరణ రికార్డుల్ని సమర్పించండి
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కోసం బీబీగూడెం, కుడకుడ గ్రామాల్లో జరిపిన భూసేకరణ ప్రక్రియకు సంబంధించిన రికార్డులన్నింటినీ తమకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కలెక్టరేట్ నిర్మాణానికి వచ్చిన మొదటి రెండు ప్రతిపాదనల్ని కాదని మూడో ప్రతిపాదనను ఆమోదించడానికి కారణాలు చెప్పాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. సూర్యాపేటకు సమీపంలోనే ప్రభుత్వ భూమి ఉందని, అయినా దూరంగా బీబీగూడెంలోని సర్వే నంబర్ 29, కుడకుడ గ్రామంలోని సర్వే నంబర్ 301, 302, 303ల్లోని ప్రైవేటు భూముల్ని సేకరించి కలెక్టరేట్ నిర్మించాలనే ప్రయత్నాలను అడ్డుకోవాలని చకిలం రాజేశ్వర్‌రావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం మంగళవారం విచారించింది. ఆ రెండు గ్రామాల్లోని భూముల్ని శ్రీసాయి డెవలపర్స్ సంస్థ కొనుగోలు చేసిందని, ఆ భూముల విలువలు పెరిగేందుకు వీలుగా ఆ గ్రామాల మధ్యలోని ప్రైవేటు భూముల్లో కలెక్టరేట్ నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. పిటిషనర్ రాజకీయ లబ్ధి కోసం పిల్ దాఖలు చేశారని, దానిని కొట్టేయాలని ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్‌రావు ప్రతివాదన చేశారు. విచారణ ఈ నెల 24కి వాయిదా పడింది. -
సుప్రీం ఆదేశించినా చట్టం తేలేదు
సాక్షి, హైదరాబాద్: వ్యవస్థీకృత నేరాల దర్యాప్తు కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయాలని, మనుషుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏడాదిలోగా చట్టాన్ని తీసుకురావాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించి మూడేళ్లు గడిచినా ఇంత వరకు అది ఆచరణ రూపం దాల్చలేదని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ పేర్కొన్నా రు. ఈ చట్టం రాక కోసమే ఇంతకాలం నిరీక్షించాల్సి వస్తోందని, చట్టం వచ్చిన తర్వాత అమల్లో సైతం ఇలాగే జాప్యం జరిగితే లక్ష్యం నీరుగారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మనుషుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రజ్వల, యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్, క్యాథలిక్ రిలీఫ్ సర్వీసెస్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన దక్షిణాసియా దేశాల సదస్సు ముగింపు కార్యక్రమంలో జస్టిస్ రమేశ్ రంగనాథన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వ్యభిచార కూపంలో మగ్గుతున్నవారిపై అనైతికత ముద్ర వేయడం తగదన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యభిచార వృత్తి నెట్వర్క్ మన దేశంలోనే ఉందన్న విషయాన్ని విస్మరించలేమన్నారు. వ్యభిచార వృత్తిలో మగ్గుతున్న బాలికలు, మహిళలు ఊహకందని భయంకరమైన హింస, వేధింపులకు గురవుతున్నారన్నారు. నగర శివారు లోని ప్రజ్వల హోంను తాను స్వయంగా సందర్శించి అక్కడ ఆశ్రయం పొందుతున్న బాధితులతో మాట్లాడినప్పుడు దిగ్భ్రాంతి కలిగించే విషయాలు తన దృష్టికి వచ్చాయని ఆయన తెలిపారు. కొందరు దుర్మార్గులు వికృత లైంగిక ఆనందం కోసం సిగరెట్లతో కాల్చుతారని, మరికొందరు తలను గోడకేసి కొట్టి హింసిస్తారని, దీంతో మైగ్రెయిన్‌తో బాధపడుతున్నామని బాధితులు తనతో చెప్పుకున్నారని పేర్కొన్నారు. బాధితులను కుటుంబీకులకు అప్పగించొద్దు వ్యభిచార కూపాల నుంచి రక్షించిన బాధితులను తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగిస్తే మళ్లీ వ్యభిచార వృత్తికి తిరిగి వెళ్లే అవకాశాలున్నాయని జస్టిస్ రమేశ్ రంగనాథన్ అభిప్రాయపడ్డారు. బాధితులను పునరావాస కేంద్రాల కస్టడీకి పంపకుండా న్యాయాధికారులు అనాలోచితంగా కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారన్నారు. చాలా కేసుల్లో బంధువులు, కుటుం బీకులే బాధితులను బలవంతంగా వ్యభిచార వృత్తి లో దింపుతున్నారన్నారు. కార్యక్రమంలో యూఎస్ కాన్సులర్ జనరల్ కేథరిన్ హడ్డా, ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్ పాల్గొన్నారు. -
‘ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలి’
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ నుంచి గెలిచి, తర్వాత టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వెంటనే చర్యలు తీసుకునేలా లోక్‌సభ, అసెంబ్లీ సెక్రటరీలను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ ధర్మాసనం విచారణ జరపనుంది. -
ట్రిబ్యునల్‌కు సమాచారం ఎందుకు ఇవ్వరు?
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలు జరిగి ఎవరైనా గాయపడి, మృత్యువాత పడినప్పుడు కేసులు నమోదుచేసే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు ఆ వివరాలని మోటారు ప్రమాద క్రైమ్‌ల ట్రిబ్యునల్‌కు అందజేయ డం లేదనే ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారించింది. పిటిషనర్ ఆరోపణలపై పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల హోంశాఖల ముఖ్యకార్యదర్శులు, డీజీపీలను ఆదేశించింది. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 158 (6) ప్రకారం ప్రమాదాల్లో ఎవరైనా గాయపడినా, మరణించినా ఆ వివరాల్ని 30 రోజుల్లోగా ట్రిబ్యునల్‌కు తెలియజేయాలనే నిబంధనను ప్రభుత్వాలు పెద్దగా అమలు చేయడం లేదంటూ ప్రకాశం జిల్లాకు చెందినలా విద్యార్థి తాండవ యోగేశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిని మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం విచారించి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ప్రమాద వివరాల్ని ట్రిబ్యునల్‌కు సంబంధిత స్టేషన్ హౌజ్ ఆఫీసర్ తెలియజేయాలని ఎంవీ యాక్ట్ చెబుతోందని పిటిషనర్ యోగేశ్ వాదించారు. సమాచార హక్కు చట్టంతో లభించిన వివరాల ప్రకారం 1995 నుంచి 3.67 లక్షల వాహనాలు ప్రమాదాలకు గురైతే అందులో 27,708 కేసుల సమాచారమే ట్రిబ్యునల్‌కు అందిందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను మూడువారాలకు వాయిదా వేసింది. -
మా ఆదేశాలనే అమలు చేయరా?
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌పై హైకోర్టు మండిపడింది. తమ ఆదేశాల మేరకు నివేదిక ఇవ్వకపోవడమే కాక, నివేదిక సమర్పణకు మరింత గడువు కావాలని అఫిడవిట్ రూపంలో కోరకపోవడాన్ని తప్పుపట్టింది. కలెక్టర్ కర్ణన్ తమ ముందు ఏప్రిల్ 3న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంచిర్యాల జిల్లా, నెన్నల మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఫోర్జరీ సంతకాలతో నకిలీ పాసు పుస్తకాలు సృష్టించి పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడమే కాకుండా, ఆక్రమణదారులు ఆ పాసు పుస్తకాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నారని, దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ గొల్లపల్లి గ్రామానికి చెందిన ఇందూరి రామ్మోహనరావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం, ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించింది. తాజాగా ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా, పిటిషనర్ తరఫు న్యాయవాది తేరా రజనీకాంత్‌రెడ్డి స్పందిస్తూ, కలెక్టర్ ఇంకా విచారణ చేస్తూనే ఉన్నారని తెలిపారు. ఈ సమయంలో ప్రభుత్వ న్యాయవాది దుర్గారెడ్డి లేచి నివేదిక సమర్పణకు మరింత గడువు కావాలని కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, నివేదిక ఇవ్వకపోవడమే కాక, మరింత గడువు కావాలంటూ అఫిడవిట్ దాఖలు చేయకుండా, మౌఖికంగా కోరడం ఎంత మాత్రం సరికాదంది. ఇటువంటి వాటిని సహించేది లేదంటూ.. కలెక్టర్ కర్ణన్ వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చింది. -
భూ సేకరణను నిలిపేయండి
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా భూ సేకరణ నోటిఫికేషన్లు జారీ చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కేంద్రం తన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకునేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భూ సేకరణను వెంటనే నిలిపేయాలని, భూముల స్వాధీన ప్రక్రియ కూడా చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. మంగళవారం ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారి విస్తరణకు అవసరమైన భూ సేకరణకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘానికి చెందిన వెంకటేశ్వరరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ, గిరిజన ప్రాంత పరిధిలోని భూముల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చాయని, తెలంగాణ ప్రభుత్వం భూములను స్వాధీనం విషయంలో ప్రజలను ఒత్తిడికి గురి చేస్తోందని తెలిపారు. అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, సమన్వయ లోపం వల్లే రెండు నోటిఫికేషన్లు వచ్చాయని, వివాదమంతా రెండు గ్రామాలకు సంబంధించినది మాత్రమేనని తెలిపారు. కేంద్రం తన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకునే అవకాశం ఉందన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, కేంద్రం తన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకునేంత వరకు జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి ఎలాంటి భూ సేకరణ చేయడానికి వీల్లేదని ఆదేశించింది. -
ఏ అధికారంతో మంత్రి పదవులు?
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ సీపీ నుంచి అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన 18 మంది ఎమ్మెల్యేలు, నలుగురు మంత్రులకు హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఏ అధికారంతో మంత్రులుగా కొనసాగుతున్నారో వివరణ ఇవ్వాలని పార్టీ ఫిరాయించిన నలుగురు మంత్రులను హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలతోపాటు న్యాయశాఖ, అసెంబ్లీ కార్యదర్శులను ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొంది అనంతరం టీడీపీలోకి ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయటంతోపాటు మంత్రి పదవులు అనుభవిస్తున్న నలుగురు ఏ అధికారంతో కొనసాగుతున్నారో వివరణ కోరాలంటూ గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు... పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ 22 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించిన నేపథ్యంలో వారిని న్యాయస్థానం నేరుగా అనర్హులుగా ప్రకటించాలని అభ్యర్థించారు. ఫిరాయింపుదారులు రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని తెలిపారు. దీనిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఫిరాయింపుదారులకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదన్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతోందో అర్థం కాకుండా ఉందన్నారు. ఇదే వ్యవహారంపై హైకోర్టులో ఇప్పటికే పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయని, ఒకసారి విచారణకు వచ్చినా మళ్లీ విచారణకు నోచుకోలేదని నివేదించారు. న్యాయస్థానాల్లో ఈ పరిస్థితిని చూసి ఫిరాయింపుదారులు నవ్వుకుంటున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఫిరాయింపుదారుల్లో నలుగురు ఏకంగా మంత్రి పదవులు అనుభవిస్తున్నారని, అసలు ఫిరాయించడమే రాజ్యాంగ విరుద్ధమైనప్పుడు వీరు మంత్రులుగా ఎలా ఉంటారో అర్థం కాకుండా ఉందన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ నోటీసులు జారీ చేసి వారి వాదనలు వింటామని పేర్కొంది. అయితే ఒకసారి వాయిదా పడిన కేసు మళ్లీ విచారణకు రావడం లేదని మోహన్‌రెడ్డి పేర్కొనగా తాము చేయగలిగింది ఏమీ లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నవ్వుకుంటే మేం చేయగలిగింది ఏమీ లేదు ప్రస్తుతం హైకోర్టులో 3.25 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, నెలకు 5 వేల చొప్పున పెండింగ్ కేసులు పెరుగుతున్నాయని ధర్మాసనం పేర్కొంది. ప్రతి ఒక్కరికీ ప్రతీ కేసూ ముఖ్యమైనదేనని, తాము ఏ కేసుకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రశ్నించింది. ఏ అధికారంతో పదవుల్లో కొనసాగుతున్నారో నలుగురు మంత్రులను సైతం వివరణ కోరతామని స్పష్టం చేసింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలు తమను (కోర్టును) చూసి నవ్వుకుంటే తాము చేయగలిగింది ఏమీ లేదంటూ వ్యాఖ్యానించింది. హైకోర్టు నోటీసులు జారీ చేసిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు 1. ఎం.అశోక్‌రెడ్డి, 2. పి.డేవిడ్‌రాజు, 3. పి.రామారావు, 4. గొట్టిపాటి రవికుమార్, 5. పాశం సునీల్‌కుమార్, 6. తిరివీధి జయరాములు, 7. బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, 8. ఎస్.వి.మోహన్‌రెడ్డి, 9. మణి గాంధీ, 10. అత్తార్ చాంద్ బాషా, 11. జలీల్ ఖాన్, 12. ఉప్పులేటి కల్పన, 13. జ్యోతుల నెహ్రూ, 14. వరుపుల సుబ్బారావు, 15. వి.రాజేశ్వరి,16. కిడారి సరేశ్వరరావు,17. గిడ్డి ఈశ్వరి, 18. కలమట వెంకట రమణమూర్తి హైకోర్టు నోటీసులు జారీ చేసిన ఫిరాయింపు మంత్రులు 1.చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, 2.ఎన్.అమర్నాథ్రెడ్డి, 3.భూమా అఖిలప్రియ, 4.రావు వెంకట సుజయకృష్ణ రంగారావు -
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రైతులు, వ్యవసాయ కూలీలు తదితరులకు సంబంధించిన రుణ విమోచన కమిషన్‌ను 3 నెలల్లో ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను ఇప్పటివరకు అమలు చేయనందుకు కోర్టు ధిక్కారం కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరించాలంటూ హైకోర్టు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని పేర్కొంది. తదుపరి విచారణను 4 వారాలకు వాయి దా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర రుణ విమోచన చట్టం 2016లోని సెక్షన్ 3 (1) ప్రకారం రైతులు, వ్యవసాయ కూలీలు తదితరుల కోసం కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి హైకోర్టు లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, 3 నెలల్లో రుణ విమోచన కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ గతేడాది ఆగస్టు 21న ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను ఇప్పటివరకు అమలు చేయలేదంటూ ఇంద్రసేనారెడ్డి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. -
కోర్టుల్లో కేసులు తేల్చాలంటే 300 ఏళ్లు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కోర్టుల్లో 3 కోట్ల 25 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి , నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ చాన్స్‌లర్ జస్టిస్ రమేశ్ రంగనాథన్ అన్నారు. శనివారం శామీర్‌పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో జరిగిన 16 వ ఏడీఆర్ (ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిసొల్యూషన్), ఎఫ్డీఆర్ (ఫ్యామిలీ డిస్ప్యూట్ రిసొల్యూషన్) పీజీ డిప్లొమా కోర్సుల పట్టాల స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ రమేశ్ రంగనాథన్ మాట్లాడుతూ... ఇప్పటి వరకు కోర్టుల్లో ఉన్న కేసులు పరిష్కారం కావాలంటే సుమారు 300 ఏళ్లు పడుతుందన్నారు. న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులు తక్కువగా ఉన్నందున కేసుల పరిష్కారం ఆలస్యమవుతుందని అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులను త్వరగా పరిష్కరించే అవకాశం ఉందన్నారు. ప్రతీ రోజు 150 కేసులు పరిష్కరిస్తున్నా అంతకంతకూ పెరుగుతున్నాయని తెలిపారు. న్యాయవ్యవస్థలో కోర్టుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. ఏడీఆర్, ఎఫ్డీఆర్ కోర్సులు పూర్తిచేసిన వారు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ కోర్టులకు అనుసంధానంగా కేసులు పరిష్కరించడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. అనంతరం ఏడీఆర్ కోర్సులో 157, ఎఫ్డీఆర్ కోర్సులో ఏడుగురికి పట్టాలను అందించారు. ఏడీఆర్ కోర్సులో 2015 బ్యాచ్‌లో పీజీ డిప్లొమాలో ఉన్నత ప్రతిభ కనబరిచిన సయ్యద్ ముజీబ్‌కు గోల్డ్ మెడల్, ప్రవీణ్‌కుమార్‌కు సిల్వర్ మెడల్‌ను ప్రదానం చేశారు. కార్యక్రమంలో నల్సార్ వైస్ చాన్స్‌లర్ ముస్తఫా, నల్సార్ రిజిస్ట్రార్ బాలకృష్ణ, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
‘అమరజీవి’ జయంతి, వర్ధంతులపై మీ వైఖరేంటి?
సాక్షి, హైదరాబాద్: అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతులను అధికారంగా నిర్వహించే విషయంలో వైఖరి ఏమిటో తెలియచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాంస్కృతికశాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పొట్టి శ్రీరాములు జయంతి, వర్థంతులను అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు వేణుగోపాల్ ఇటీవల హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
ఇసుక తవ్వకాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ఏపీలో ఇసుక తవ్వకాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం, ములకల లంక పరిధిలో గోదా వరి ఒడ్డున పట్టా భూముల్లో కృష్ణారావు అనే వ్యక్తి జరుపుతున్న ఇసుక తవ్వకాలపై హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. 2 వారాలు ఇక్కడ ఇసుక తవ్వకాలు జరపవద్దని ఆదేశించింది. తవ్వకాల ప్రాంతం నది పరిధిలోకి వస్తుందా? రాదా? స్పష్టతనిస్తూ కౌంటర్ దాఖలు చే యాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఇదే మండలం, వంగలపూడి పరిధిలో ఎస్.దుర్గమ్మ, డి.వెంకటేశ్వరరావు తదితరులు చేస్తున్న ఇసుక తవ్వకాలపై న్యాయాధికారితో విచారణ జరిపి నివేదిక ఇవ్వా లని ఆ జిల్లా జడ్జిని హైకోర్టు ఆదేశించింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
40 మంది కాదు.. 18 మందే మృతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న శిశు గృహాల్లో 2017 జనవరి నుంచి ఈ ఏడాది జనవరి వరకు 18 మరణాలు చోటు చేసుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. వీరంతా చెత్తకుండీల్లో, మార్కెట్ల వద్ద దొరికిన శిశువులని, దొరికే సమయానికే వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, శక్తి వంచన లేకుండా డాక్టర్లు ప్రయత్నించినా వీరి ప్రాణాలను కాపాడలేకపోయారని తెలిపింది. ఇలా జరిగిన మరణాలే తప్ప, నిర్లక్ష్యం వల్ల, పౌష్టికాహార లోపం వల్ల శిశు గృహాల్లో ఏ ఒక్క శిశువూ మరణించలేదని వివరించింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న శిశు గృహాల్లో పెద్ద ఎత్తున శిశు మరణాలు సంభవిస్తున్నాయని, శిశు విక్రయాలు కూడా జరుగుతున్నాయని, ఇందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి విచారణ జరిపేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుతరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. శిశు గృహాల్లో 40 మంది శిశువులు చనిపోయింది వాస్తవమో కాదో తెలియచేయాలని ప్రభుత్వాన్ని గత విచారణ సమయంలో ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఓ నివేదికను ధర్మాసనం ముందు ఉంచింది. -
వచ్చేవారం లేదా ఆ పైవారం విచారిస్తాం
సాక్షి, హైదరాబాద్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎలక్ట్రో మెకానికల్ పరికరాల ధరల పెంపుపై మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై వీలునుబట్టి వచ్చే వారం లేదా తరువాత వారం విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. తాను దాఖలు చేసిన వ్యాజ్యం మంగళవారం నాటి విచారణ జాబితాలో ఉన్నప్పటికీ, విచారణకు నోచుకునే పరిస్థితి లేకపోవడంతో నాగం మంగళవారం ఉదయం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ వ్యాజ్యంలో ప్రభు త్వం కౌంటర్ దాఖలు చేసిందని, ఆ కౌంటర్‌కు తాను స మాధానం కూడా ఇచ్చానని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనికి స్పందించిన ధర్మాసనం, ఇప్పటికిప్పుడు విచారణ జరపడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. -
శిశువులు మరణిస్తుంటే ఏం చేస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని శిశు గృహాల్లో చోటు చేసుకుంటున్న శిశు మరణాల వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. శిశు గృహాల్లో 40 మంది శిశువులు చనిపోయిన విషయం వాస్తవమో కాదో తెలపాలని పేర్కొంది. ఒకవేళ నిజమే అయితే ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. మరణాలను నిరోధించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న శిశు గృహాల్లో పెద్ద ఎత్తున శిశు మరణాలు సంభవిస్తున్నాయని, శిశు విక్రయాలు కూడా జరుగుతున్నాయని, ఇందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుతరావు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది సి.దామోదర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లోని శిశు గృహాల్లో చిన్నారులు పెద్ద సంఖ్యలో మరణించారని పేర్కొన్నారు. ఇక్కడి శిశువులకు లాక్టోజన్ పాలను వాడాల్సి ఉండగా, సాధారణ గేదె పాలను వాడుతున్నారని, దీంతో సమస్యలు తలెత్తి మృత్యువాత పడుతున్నారని వివరించారు. ఒక్క నల్లగొండ జిల్లాల్లోనే ఏడాదిలో దాదాపు 32 మంది చిన్నారులు మృతి చెందారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది శిశువుల వరకు మరణించారని పేర్కొన్నారు. -
తెలంగాణ కాంట్రాక్టు వైద్యాధికారులకు ఊరట
సాక్షి, హైదరాబాద్: సమైక్య ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్రా ప్రాంతంలో పని చేసిన కాంట్రాక్ట్ తెలంగాణ వైద్యాధికారులకు ఊరట లభించింది. వారికి వెయిటేజీ మార్కులిచ్చి సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత ఇస్తామని ఉమ్మడి హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి హైకోర్టుకు తెలిపారు. ఈ సమాచారాన్ని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కె.విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం నమోదు చేసి రిట్‌పై విచారణ ముగిస్తున్నట్లు ప్రకటించింది. ఉమ్మడి రాష్ట్రమప్పుడు ఆంధ్రా ప్రాంతంలో పనిచేశామని, ఇప్పుడు తెలంగాణలో పనిచేస్తున్నా తమకు వెయిటేజీ మార్కులు ఇవ్వడం లేదని తెలంగాణ కాంట్రాక్టు వైద్యాధికారులు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. సివిల్ అసిస్టెంట్ సర్జన్, స్టాఫ్ నర్సులు, ఇంజనీరింగ్ పోస్టుల్లో కాంట్రాక్టు పద్ధతిపై చేస్తున్నవారికి వెయిటేజీ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్లపై వచ్చే సోమవారం విచారణ చేస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. -
హిందూయేతరుల పేరుతో ఉద్యోగులను తొలగిస్తారా?
సాక్షి, హైదరాబాద్: హిందూయేతరుల పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానాలతోపాటు, ఆ దేవస్థానాల ఆర్థిక సాయంతో నడిచే దేవాలయాలు, ఆసుపత్రులు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించేందుకు వీలుగా షోకాజ్‌లు జారీ చేయడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇన్నేళ్లు సేవలు అందించిన వారిని ఇప్పుడు ఏదో ఓ కారణంతో ఉద్యోగాల నుంచి తీసేసి వారి కడుపు కొట్టడం ఎంతవరకు భావ్యమంటూ టీటీడీ ఈవోను ప్రశ్నించింది. ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లో హిందూయేతరులకు ఉద్యోగం లేదన్న విషయాన్ని పేర్కొనని అప్పటి టీటీడీ ఈవో, ఇతర ఉద్యోగులపై ముందు చర్యలు తీసుకుని, ఆ తరువాత పిటిషనర్ల గురించి ఆలోచన చేయాలంది. పిటిషనర్ల తొలగింపు విషయంలో వచ్చేవారం వరకు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయడానికి వీల్లేదని ఆదేశించింది. వచ్చే ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
నరికిన చెట్లెన్ని.. నాటిన మొక్కలెన్ని?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం అటవీ ప్రాంతంలో నరికేసిన చెట్ల స్థానంలో మొక్కలను నాటే విషయమై ఏం చర్యలు తీసుకు న్నారో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తొలగించిన చెట్ల స్థానంలో కొత్త మొక్కలను నాటాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేసింది. నరికేసిన చెట్లెన్ని.. నాటిన మొక్కలెన్ని.. మొత్తం వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా, మలక్‌పేట గ్రామ పరిధిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిమిత్తం పెద్ద సంఖ్యలో చెట్లను అనుమతులు తీసుకోకుండా నరికేశారని, కొత్త మొక్కలను నాటేం దుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని డి.మహేశ్ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఏసీజే నేతృత్వం లోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. -
వెయిటేజీ మార్కులపై స్టేకు నో
సాక్షి, హైదరాబాద్: వైద్య శాఖ, ట్రాన్స్‌కోల్లో ఔట్సోర్సింగ్(పొరుగు సేవలు), కాంట్రాక్టు (ఒప్పంద సేవలు) పద్ధతుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలని తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఉద్యోగాల భర్తీకి నిర్వహించబోయే పరీక్షలను నిలుపుదల చేయడంవల్ల ప్రయోజనం ఉండబోదని, ఈ దశలో స్టే మంజూరు అవసరం లేదని సోమవారం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మి లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతుల్లో చేసే ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలనే నిర్ణయాన్ని సమర్థిస్తూ సింగిల్ జడ్జి గతంలో ఉత్తర్వులు జారీ చేశారు. మరో సింగిల్ జడ్జి.. పరీక్షలో సమాన మార్కులు వచ్చినప్పుడు మాత్రమే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలని అందుకు విరుద్ధమైన ఆదేశాలిచ్చారు. దాంతో ఈ వివాదం ధర్మాస నం ముందుకు వచ్చింది. ఔట్సోర్సింగ్/కాంట్రాక్టు పద్ధతుల్లో సేవలందించే వారికి వెయి టేజీ ఇవ్వాలన్న సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను ధర్మాసనం విచా రిస్తూ.. ఉద్యోగ భర్తీకి నిర్వహించే పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులందరికీ ఒకే తరహా పశ్నపత్రం ఉండాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోటీ పరీక్షల తేదీ సమీపిస్తున్నందున ఈ కేసులను వీలైనంత త్వర గా విచారణ జరుపుతామని ప్రకటించింది. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు చేసేవారికి వెయిటేజీ మార్కులు ఇవ్వడం చట్ట వ్యతిరేకమని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదించారు. పరీక్షలు నిర్వహించకుండా స్టే ఉత్తర్వులు ఇవ్వాలని కోరా రు. దీనిపై అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి స్పందిస్తూ.. ఇప్పటికిప్పుడే పరీక్షలు జరిపేసి అర్హుల్ని వెంటనే ఉద్యోగాల్లో చేర్చేసుకోవడం లేదు కాబట్టి పరీక్షల్ని వాయి దా వేయాల్సిన అవసరం లేదన్నారు. వాదనల అనంతరం విచారణ వచ్చేవారానికి వాయిదా పడింది. -
శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు ఏసీజే
సాక్షి,తిరుమల/శ్రీశైలంటెంపుల్/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/నరసరావుపేట రూరల్: ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం ఆలయ మహా ద్వారం నుంచి ఆలయానికి చేరుకున్న ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం శ్రీవారిని, వకుళమాతను దర్శించు కుని, హుండీలో కానుకలు సమర్పించారు. తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా, టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు శ్రీవారి చిత్రపటాన్ని, నూతన సంవత్సరం కేలండర్, లడ్డూప్రసాదాలు అందజేశారు. -
హైకోర్టు విభజనకు 3 కమిటీలు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించి ఇటీవల జరిగిన ఫుల్‌కోర్టు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మూడు కమిటీలు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనాల పరిశీలనకు ఓ కమిటీ, ఉద్యోగుల విభజనకు ఓ కమిటీ, అలాగే రికార్డుల డిజిటలైజేషన్ కోసం మరో కమిటీని ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో ఐదుగురికి స్థానం కల్పించారు. హైకోర్టు ఉద్యోగుల విభజన మార్గదర్శకాల రూపకల్పన కమిటీకి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీలో న్యాయమూర్తులు జస్టిస్ సురేశ్ కెయిత్, జస్టిస్ అడవల్లి రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ అంబటి శంకర నారాయణ, జస్టిస్ షమీమ్ అక్తర్ ఉన్నారు. భవనాల పరిశీలన కమిటీకి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీలో జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ తాళ్లూరి సునీల్ చౌదరి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఉన్నారు. ఇక రికార్డుల డిజిటలైజేషన్ పర్యవేక్షణ కమిటీకి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి నేతృత్వం వహిస్తారు. ఇందులో జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ ఎస్.వి.భట్, జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాద్‌రావు ఉన్నారు. ఏపీకి ఆప్షన్ ఇచ్చిన వారి నుంచే భవనాల పరిశీలన కమిటీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఆప్షన్ ఇచ్చిన న్యాయ మూర్తుల నుంచే (జస్టిస్ రామసుబ్రమణియన్ మినహా) కొందరికి భవనాల పరిశీలన కమిటీలో స్థానం కల్పించారు. కాగా, ఫిబ్రవరి మొదటి వారంలో భవనాల పరిశీలన కమిటీ అమరావతికి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచా రం. ఇప్పటికే నాగార్జున యూనివర్సిటీ లో ఖాళీగా ఉన్న కొన్ని భవనాలను హైకోర్టు కోసం ఏపీ ప్రభుత్వ వర్గాలు గుర్తించినట్లు తెలిసింది. విస్తీర్ణంలో పెద్దవిగా ఉండటంతో పాటు దాదాపు 1,000 కార్లు పట్టేంత పార్కింగ్ స్థలం ఉండడం వల్లే ఈ భవనాలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. న్యాయమూర్తులకు నివాస ఏర్పాట్ల కోసం నాగార్జున యూనివర్సిటీకి సమీపంలోనే కొన్ని భవనాలను గుర్తించినట్లు సమాచారం. అలాగే కంచికచర్ల వద్ద కూడా ఓ భారీ భవనాన్ని హైకోర్టు ఏర్పాటు కోసం గుర్తించారు. వీటితో పాటు వేరే చోట మరో రెండు భవనాలను కూడా కమిటీ పరిశీలనకు సిద్ధం చేస్తున్నారు. ఫుల్ కోర్టు ముందుకు భవనాలపై నివేదిక ఈ భవనాలను పరిశీలించిన తరువాత కమిటీ ఓ నివేదికను సిద్ధం చేస్తుంది. ఆ నివేదికను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులందరితో కూడిన ఫుల్‌కోర్టు ముందుంచుతారు. ఈ సమావేశంలో భవనాల ఎంపిక జరిగిన తరువాత వాటిల్లో మార్పులు, చేర్పులను సూచిస్తారు. ఈ మార్పులను ఏపీ ప్రభుత్వం పూర్తి చేసిన తరువాత భవనాల కమిటీ మరోసారి పరిశీలిస్తుంది. కమిటీ పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తే, అప్పటి నుంచి అమరావతికి ఏపీ హైకోర్టు తరలింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ లోపు ఉద్యోగుల విభజన ప్రక్రియ కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. -
అలా ఆదేశాలివ్వలేం
సాక్షి, హైదరాబాద్: ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’సమావేశాలను నిర్వహిస్తున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఐఎస్‌సీఏ) ప్రభుత్వానికి చెందిన సంస్థో?... కాదో?.. తెలియజేయాలని పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది. అది ప్రభుత్వానికి చెందిన సంస్థ కాని పక్షంలో తాము ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను ఫలానా చోటనే నిర్వహించాలనీ ఆదేశాలు ఇవ్వలేమంది. సమావేశాలపై ప్రభుత్వం తప్పు డు నివేదిక ఇచ్చిందని పిటిషనర్లు ఆరోపిస్తున్న నేపథ్యంలో దీనిపై ప్రభుత్వాన్ని వివరణ కోరుతామంది. తదుపరి విచారణను 23కి వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయ మూర్తి జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను అంతకు ముందు నిర్ణయించిన విధంగానే ఓయూలో నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వడంతో పాటు, ఈ సమావేశాలకు సహాయ సహకారాలను అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పీహెచ్డీ విద్యార్థులు కిరణ్‌కుమార్, విజయకుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయ వాది వాదనలు వినిపిస్తూ, సమావేశాలకు ఓయూ రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు వెచ్చించి ఏర్పాట్లు చేసిందన్నారు. భద్రత విషయంలో ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు నివే దిక వల్ల సమావేశాల వేదికను నిర్వాహకులు వేరే చోటికి తరలించారన్నారు. సమావేశాలు నిర్వహిస్తున్న ఐఎస్‌సీఏ ప్రభుత్వానికి చెందిన సంస్థా? కాదా? అని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఎవరూ సమాధానం చెప్పకపోవడంతో, ఈ విషయంలో స్పష్టతనివ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదిని ఆదేశించింది. -
నేడు హైకోర్టు విభజనపై జడ్జీల భేటీ
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజన కోరుతూ ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు రాసిన లేఖ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్‌కు అందింది. మూడు పేజీల లేఖను అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ శనివారం ఏసీజే ఇంటికి వెళ్లి అందించారు. ఈ విషయాన్ని ఏసీజే మంగళవారం న్యాయవాదుల సంఘం ప్రతినిధుల వద్ద ధ్రువీకరించారు. నేడు హైకోర్టు న్యాయమూర్తులందరితో కూడిన ఫుల్‌కోర్ట్ సమావేశం కానుంది. న్యాయమూర్తులు విభజన విషయంలో అభిప్రాయాలను వెల్లడించనున్నారు. ఫుల్‌కోర్టు నిర్ణయం ఆధారంగా చర్యలు తీసుకుంటారు. కాగా, విభజించే ముందు తమ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు, న్యాయవాదులు మంగళవారం ఏసీజేని కలిశారు. దీంతో ఏసీజే వినతిపత్రం సమర్పించాలని వారికి సూచించారు. హైకోర్టు విభజనకు సంబంధించి ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనల ప్రస్తావనతో చంద్రబాబు తన లేఖను ప్రారంభించారు. 2015 అక్టోబర్‌లో అప్పటి ఏసీజేకి తాను రాసిన లేఖ గురించి ప్రస్తావించారు. హైకోర్టు ఏర్పాటు కోసం కొన్ని భవనాలను గుర్తించామని, వాటిని పరిశీలించేందుకు న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు తన లేఖలో ఏసీజేను కోరారు. న్యాయమూర్తుల కమిటీ ఈ నెలాఖరుకల్లా భవనాలను పరిశీలించి ఏవైనా మార్పులను సూచిస్తే, వాటిని మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేస్తామన్నారు. మార్పులు చేశాక ఏప్రిల్‌లో మరోసారి కమిటీ భవనాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తే మేలో తరలింపు మొదలుపెడతామన్నారు. జూన్ 2 నుంచి కొత్త హైకోర్టు పనిచేయడం ప్రారంభిస్తుందన్నారు. -
అయిన వారికే స్పెషల్ జీవోలు
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రాజెక్టుల కోసం.. పరిశ్రమల కోసం పెద్ద ఎత్తున భూములు సేకరిస్తున్న తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, కావాల్సిన వారి కోసం స్పెషల్ జీవోలు జారీ చేస్తూ, మిగిలిన వారి విషయంలో వాయిదాలు కోరుతుండటాన్ని ఉమ్మడి హైకోర్టు పిల్ కమిటీ ఆక్షేపించింది. ప్రభుత్వాలు నామమాత్రంగా పరిహారం చెల్లిస్తుండటంతో బాధితులు కోర్టులను ఆశ్రయించి పరిహారం పెంపు ఉత్తర్వులు పొందుతున్నా.. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. దీంతో బాధితులు విధిలేని పరిస్థితుల్లో మరోసారి కోర్టుల గడప తొక్కాల్సి వస్తున్న విషయాన్ని గమనించింది. ఈ నేపథ్యంలో పరిహారం పెంపు నిమిత్తం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని కోరుతూ బాధితులు పెద్ద సంఖ్యలో ఎగ్జిక్యూషన్ పిటిషన్లు (ఈపీ) దాఖలు చేస్తుండటం, ప్రభుత్వాలు పదే పదే వాయిదాలు కోరుతుండటం.. కింది కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోవడానికి కారణంగా గుర్తించింది. ఈపీల పెండింగ్ విషయాన్ని ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జి.వెంకటకృష్ణయ్య ఓ లేఖ ద్వారా ఉమ్మడి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ లేఖను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ ప్రజా ప్రయోజన వ్యాజ్య (పిల్) కమిటీకి పంపారు. ఈ లేఖను పరిశీలించిన పలువురు న్యాయమూర్తులతో కూడిన పిల్ కమిటీ, సమస్య తీవ్రతను అర్థం చేసుకుంది. అంతేకాక కావాల్సిన వారికి ప్రభుత్వాలు స్పెషల్ జీవోలు జారీ చేస్తున్న విషయాన్ని కూడా గమనించింది. వాయిదాల వల్లే పెండింగ్ కేసులు: పిల్ కమిటీ వెంటనే ఉభయ రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కోర్టుల నుంచి పెండింగ్‌లో ఉన్న ఈపీ వివరాలను తమ రిజిస్ట్రీ ద్వారా తెప్పించింది. ఈపీల విషయంలో ప్రభుత్వాలు పదే పదే వాయిదాలు కోరుతుండటం వల్లే పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయని అభిప్రాయపడింది. పరిహారం పెంపు ఉత్తర్వుల విషయంలో ప్రభుత్వాలకు విధానపరంగా ఏకరూపత లేకపోవడాన్ని కమిటీ ఎత్తిచూపింది. సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మహబూబ్‌నగర్ ప్రధాన జిల్లా జడ్జి లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించాలని సిఫారసు చేసింది. ఏసీజే విచారణ: అదే లేఖను పిల్‌గా పరిగణించిన ఏసీజే ఇటీవల విచారణ జరిపారు. ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం నిప్పులు చెరిగింది. ప్రభుత్వాల పనితీరు ఇలాగే కొనసాగితే, భూ సేకరణ ప్రక్రియను నిలిపేస్తామని స్పష్టం చేసింది. ముందు పరిహారం చెల్లించిన తరువాతే భూ సేకరణ చేయాలని ఆదేశాలు జారీ చేస్తామని కూడా హెచ్చరించింది. అసలు ఉభయ రాష్ట్రాల్లో ఎన్ని ఈపీలు పెండింగ్‌లో ఉన్నాయి.. ఎన్ని కేసుల్లో కోర్టులు నిర్ణయించిన పరిహారం చెల్లించారు.. ఎంత పరిహారం చెల్లించారు.. తదితర వివరాలను తమ ముందుంచాలని ఉభయ ప్రభుత్వాలను ఆదేశించింది. ఇందుకు నాలుగు వారాల గడువునిచ్చింది. అత్యధిక పెండింగ్ పిటిషన్లు తెలంగాణలోనే: పరిహార పెంపు ఉత్తర్వుల అమలు కోసం బాధితులు దాఖలు చేసిన ఎగ్జిక్యూషన్ పిటిషన్లు అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలోనే పెండింగ్‌లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు సంబంధించి 1,029 కేసులు పెండింగ్‌లో ఉంటే, తెలంగాణలోని 10 జిల్లాలకు సంబంధించి ఏకంగా 2,003 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కోర్టులో అత్యధికంగా 1204 పెండింగ్ కేసులున్నాయి. -
కోర్టు ముందుకు పోస్టుమార్టం నివేదిక
సాక్షి, హైదరాబాద్: మేళ్లమడుగు ఎన్కౌంటర్లో మృతి చెందిన 9 మంది సీపీఐ(ఎంఎల్) చండ్ర పుల్లారెడ్డి బాట దళ సభ్యుల మృతదేహాలకు నిర్వహించిన పోస్టుమార్టం తాలుకు నివేదికను, సీడీలను ప్రభుత్వం శుక్రవారం హైకోర్టు ముందుంచింది. ఈ ఘటనపై పిటిషనర్ కోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని కోరుతున్న నేపథ్యంలో, పూర్తి వివరాలను కౌంటర్ రూపంలో తమ ముందుంచాలని ప్రభు త్వాన్ని ఆదేశించింది. ఈ కౌంటర్‌ను పరిశీలించిన తర్వాత దర్యాప్తుపై ఓ నిర్ణయం తీసుకుంటామంది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, దీనిపై సీబీఐ లేదా సిట్‌తో దర్యాప్తు చేయించి, ఆ దర్యాప్తును పర్యవేక్షించాలని అభ్యర్ధిస్తూ పౌర హక్కుల కమిటీ అధ్యక్షుడు జి.లక్ష్మణ్ హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. -
నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఎలా నియమిస్తారు?
సాక్షి, హైదరాబాద్: ఎటువంటి నియామక ప్రక్రియ చేపట్టకుండానే 550 మందిని కళాకారులుగా ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకోవడంపై హైకోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. వారి నియామకాలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయి దా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కళాకారులుగా 550 మందిని ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా టంగుటూర్‌కు చెందిన జె.రమేశ్, మరో ఇద్దరు పిల్ దాఖలు చేశారు. మంగళవారం దీనిపై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎలాంటి నియామక ప్రకటన జారీ చేయకుండా, దరఖాస్తులు ఆహ్వానించకుండా నేరుగా 550 మందిని ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకున్నారని పేర్కొన్నారు. 2015లో నియమితులైన వీరికి ఒక్కొక్కరికి రూ.24,514 వేతనంగా చెల్లిస్తున్నారని వివరించారు. కాగా, ప్రభుత్వ న్యాయవాది బీఎస్ ప్రసాద్ బదులిస్తూ వారిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించినట్లు తెలిపారు. దీంతో ఆ 550 మంది ఏ విధులు నిర్వర్తిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. -
‘మాస్ కాపీయింగ్’పై ఏం చర్యలు తీసుకున్నారు?
సాక్షి, హైదరాబాద్: మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన, సహక రించినవారిపై ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని హైకోర్టు మంగళవారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మాస్ కాపీయింగ్ చేస్తూ గతేడాది నుంచి ఇప్పటివరకు ఎంతమంది పట్టుబడ్డారో.. ఎంతమందిపై కేసులు పెట్టారో తెలపాలని ప్రధాన కార్యదర్శులకు స్పష్టం చేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఉభయ రాష్ట్రాల్లో మాస్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏలూరుకు చెందిన ప్రొఫెసర్ గుంటుపల్లి శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం మరోసారి విచారించింది. -
తిరుమల వ్యాపారుల నుంచి ప్రాణహాని
సాక్షి, హైదరాబాద్: తిరుమలలో హోటళ్ల నిర్వాహకులు భక్తుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేసినందుకు కొందరు వ్యాపారులు బెదిరిస్తున్నారంటూ డాక్టర్ భరద్వాజ చక్రపాణి అనే పిటిషనర్ కోర్టుకు మొరపెట్టుకున్నారు. వారి నుంచి ప్రాణహాని ఉందని, దీనిపై తిరుపతి పట్టణ ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అందువల్ల ఈ వ్యాజ్యం నుంచి తనను తప్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు... పిటిషనర్ ఫిర్యాదుపై తీసుకున్న చర్యలేమిటో వివరించాలంటూ ఎస్పీని ఆదేశించింది. ఒకవేళ నివేదిక ఇవ్వకుంటే స్వయంగా తమ ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అధిక ధరలకు విక్రయిస్తున్నారని... తిరుమలలో వ్యాపారులు తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని, దీనిపై ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ చిత్తూరుకు చెందిన పరిహార సేవా సమితి గతేడాది హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. దీనిపై మంగళవారం విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది చంద్రమౌళి వాదనలు వినిపించారు. మీడియాకు చెందిన ఢిల్లీబాబురెడ్డి అనే వ్యక్తితో కలసి కొందరు వ్యాపారులు పిటిషనర్‌ను బెదిరిస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వ్యాపారుల పేర్లతో సహా తిరుపతి అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఢిల్లీబాబురెడ్డి, వ్యాపారుల నుంచి పిటిషనర్‌కు ప్రాణహాని ఉందని వివరించారు. అందువల్ల పిటిషనర్ పేరును ఈ వ్యాజ్యం నుంచి తొలగించాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ పిటిషనర్‌ను బెదిరించేలా వ్యవహరించడం న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అవుతుందని తేల్చి చెప్పింది. ఈ చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని తెలిపింది. ఈ వ్యాజ్యంలో తిరుపతి పట్టణ ఎస్పీని సుమోటోగా ప్రతివాదిగా చేర్చడంతోపాటు పిటిషనర్ ఫిర్యాదు ఆధారంగా ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ వారంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. హోటళ్లలో సగానికిపైగా దొంగ లెక్కలే... ఈ కేసు గత విచారణ సమయంలో ఇచ్చిన ఆదేశాల మేరకు తిరుమలలోని హోటళ్ల లెక్కలను ఆడిట్ చేసినట్లు అమ్మకపు పన్ను అధికారుల తరఫు న్యాయవాది తెలిపారు. ఇందులో సగానికిపైగా దొంగలెక్కలేనని తేలిందంటూ నివేదికను ధర్మాసనం ముందుంచారు. దాన్ని పరిశీలించిన ధర్మాసనం... నివేదికను సంబంధిత అధికారులకు పంపి దొంగ లెక్కలు చూపిన హోటళ్ల యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే వివిధ సమస్యలపై భక్తుల ఫిర్యాదులను స్వీకరించేందుకు సిద్ధం చేస్తున్న యాప్ తయారీ ఎంతవరకు వచ్చిందో వివరించాలని టీటీడీ అధికారులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
నియంత్రణకు సమష్టి కృషి కావాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాలు సమష్టిగా కృషి చేస్తే, చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేస్తే బాల్య వివాహాల నియంత్రణ పెద్ద సమస్యే కాదని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ అన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో బాల్య వివాహాలు పెరుగుతున్నాయని, ఆర్థిక భారం కారణంగా 15–18 ఏళ్ల వయసులోనే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి భారం దించుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న బాల్య వివాహాలు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మహిళా కమిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బేగంపేట్‌లోని ప్లాజా హోటల్లో శనివారం సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రంగనాథన్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలతో వరకట్న వేధింపులు, బాధిత మహిళలకు గృహహింస ఇబ్బందులు పెరుగుతున్నట్లు అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయన్నారు. బాల్య వివాహాలు, సమస్యలపై తల్లిదండ్రుల్లో మరింత అవగాహన తీసుకొస్తే నియంత్రణ సులువవుతుందని పేర్కొన్నారు. మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. ఒక పెళ్లి.. అనేక సమస్యలు... చిన్నతనంలోనే పిల్లలకు పెళ్లి చేయడం వల్ల జీవితాం తం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని జస్టిస్ రమా సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. ఒక పెళ్లి అనేక సమస్యలు సృష్టిస్తోందని, బాల్య వివాహాల వల్ల దేశంలో 78 శాతం బాధిత అమ్మాయిలు హింసను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వందేళ్ల క్రితం జరిగిన బాల్య వివాహాల్లో 40 శాతం మంది బాధిత మహిళలు విడాకులు తీసుకున్నారని, వితంతువులయ్యారని చెప్పారు. ఇలాంటి పర్యవసా నాలు తగ్గించేందుకు న్యాయ, పోలీస్, మహిళా శిశు సంక్షేమ శాఖలు, జిల్లా న్యాయ సేవా సంస్థ కలసి పని చేయాలని సూచించారు. పోలీస్ శాఖ తరపున బాల్య వివాçహాల నియంత్రణకు కృషి చేస్తున్నామని, హైదరాబాద్ సౌత్జోన్లో జరుగుతున్న కాంట్రాక్టు పెళ్లిళ్లపై చర్యలు చేపట్టామని సీఐడీ ఐజీ షికాగోయల్ తెలిపారు. బాల్య వివాహాల నియంత్రణ, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అమలు, పేర్ల నమోదుకు వెబ్సైట్ రూపొందిస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్ చెప్పారు. బాల్య వివాహ నియంత్రణకు ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని తరుణి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మమతా రఘువీర్ అభిప్రాయపడ్డారు. పోలీస్ శాఖ నిర్లక్ష్యం..: మహిళా కమిషన్ చైర్పర్సన్ బాల్య వివాహాలు జరుగుతున్నాయని పోలీస్ స్టేషన్లలో ఐసీడీఎస్ అధికారులు ఫిర్యాదు చేస్తే.. పట్టించుకోకుండా పోలీస్‌శాఖ నిర్లక్ష్యం వహిస్తోందని, ఓ కానిస్టేబుల్‌ను పంపి చేతులు దులుపుకుంటున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం తూర్పారబట్టారు. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్‌ను తప్పనిసరిగా అమలు చేయా ల్సిన ప్రభుత్వం, రిజిస్ట్రేషన్ విభాగాలు అలసత్వం వహిస్తున్నాయని ఆరోపించారు. పెళ్లి చేసుకున్న జంట మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలని అడిగితే.. ఏ అధికారి వద్ద కూడా సరైన సమాధానం లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. -
ఎస్ఏ పోస్టుకు బీటెక్–బీఈడీ చదివితే సరిపోదు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో స్కూల్ అసిస్టెంట్ (మేథమెటిక్స్) పోస్టుకు దర ఖాస్తు చేసుకునేందుకు బీటెక్–బీఈడీ చదివితే సరిపోదని, బీఈడీలో తప్పనిసరిగా మేథమెటిక్స్ మెథడాలజీ చదివి ఉండాల్సిందేనని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. బీటెక్ చేసి బీఈడీలో మేథమెటిక్స్ మెథడాలజీ చదవని అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు చేసుకున్న దరఖాస్తులను తిరస్కరించడంలో తప్పు లేదంది. ఈ విషయంలో అధికారులను తప్పుపట్టలేమని పేర్కొంది. తన దరఖాస్తును అధికారులు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ఓ అభ్యర్ధి దాఖ లు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం రెండు రోజుల కింద ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన టీఆర్టీ నోటిఫికేషన్లో స్కూల్ అసి స్టెంట్ (మేథమెటిక్స్) పోస్టుకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మేథమెటిక్స్‌లో డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలని, దీంతోపాటు ఎన్సీటీఈ గుర్తింపు ఉన్న విద్యా సంస్థ నుంచి బీఈడీలో మేథమెటిక్స్‌ను తప్పనిసరిగా చదివి ఉండాలని నిర్దేశించింది. -
నిత్యం విషం తింటున్నాం..
సాక్షి, హైదరాబాద్: ‘నిత్యం విషమే తింటున్నాం. మన పిల్లలూ ఈ విషాన్నే తినాల్సి వస్తోంది. రసాయనాలతో పండించిన, మగ్గబెట్టిన ఫలాలే కాదు.. పాలు, పెరుగు, పంచదార, ఉప్పు, బియ్యం.. ఇలా అన్నీ కల్తీనే. కల్తీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఏం యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాయి? తనిఖీలు ఏమైనా చేస్తున్నారా? కోర్టులో కేసు విచారణకు వచ్చినప్పుడు మాత్రం అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నాం.. అని చెబుతారు. లేదంటే దాని గురించే పట్టించుకోరు. అయినా మీ బాధ్యతల గురించి మేం ఎందుకు చెప్పాలి? మీ అంతట మీరు మీ బాధ్యతలను నిర్వర్తించలేరా? మేం చెబితే పాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయంటారు. చెప్పకపోతే మీరంతట మీరు చేయరు. కాల్షియం కార్బైడ్ ఉపయోగించి పళ్లను మగ్గబెడుతున్న వారికి సంబంధించి ఇటీవలి కాలంలో ఎన్ని తనిఖీలు చేశారు? ఎన్ని కేసులు పెట్టారు? ఎంత మందిని ప్రాసిక్యూట్ చేశారు? ఈ వివరాలన్నీ తదుపరి విచారణ నాటికి కోర్టు ముందుంచండి. లేనిపక్షంలో కోర్టులంటే ఏమిటో తెలుసుకునేందుకు సిద్ధంగా ఉండండి’ అని హైకోర్టు ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలకు తేల్చిచెప్పింది. కాల్షియం కార్బైడ్‌ను ఉపయో గించి పండ్ల వ్యాపారులు కాయల్ని మగ్గబెట్టి అమ్మకాలు చేస్తుండటంపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని హైకోర్టు పిల్‌గా పరిగణించింది. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. అధికారులు నామమాత్రంగానే ఉన్నారు... ఈ కేసులో కోర్టుకు సహాయకారిగా (అమికస్ క్యూరీ) నియమితులైన సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదిస్తూ..ప్రతీ ఒక్కటి కల్తీ అవుతున్నాయని, కల్తీలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. తనిఖీలు నిర్వహించే అధికారుల సంఖ్య నామమాత్రంగా ఉందని తెలిపారు. ఎఫ్‌ఎస్‌వోలు ఏపీలో 28, తెలంగాణలో 20 మందే ఉన్నారని, అండమాన్‌లోనూ 28 మంది ఉన్నారని, తమిళనాడులో ఏకంగా 554 మంది ఉన్నారని వివరించారు. తనిఖీ అధికారుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. కోర్టు ఆదేశించినప్పుడో, ఆగ్రహాన్ని వ్యక్తం చేసినప్పుడో అధికారులు తనిఖీలు చేసి ఊరుకుంటున్నారని, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుంటేనే ఫలితాలు ఉంటాయని పేర్కొంది. ఆకస్మిక తనిఖీలు ఎన్ని చేశారు, ఎంతమందిపై కేసు నమోదు చేశారు, కోర్టుల్లో శిక్షలు పడ్డాయా, లేదా పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని 2 రాష్ట్రాలను ధర్మాసనం ఆదేశించింది. విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. -
నిబంధనలపై ఏం చేస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్: ఆస్పత్రులు, కోర్టు ప్రాంగణాలు తదితర చోట్ల వాహనాల పార్కింగ్‌కు అక్రమంగా చార్జీలు వసూలు చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే విషయంలో నిబంధనలు రూపొందించేందుకు ఏం చేస్తున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్లకు స్పష్టం చేసింది. మంగళవారం ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఆస్పత్రులు, కోర్టు ప్రాంగణాలు తదితర చోట్ల పార్కింగ్‌కు అక్రమంగా చార్జీలు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ నల్లగొండకు చెందిన న్యాయవాది ఆర్.గిరికుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాలతో దీనిని కూడా జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. -
పాత జిల్లాల ప్రకారమే భర్తీ చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 31 కొత్త జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్థానికతకు ప్రాతిపదికగా పాత పది జిల్లాలనే పేర్కొన్నారని.. వాటి ప్రకారమే పోస్టులను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. 31 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పుడు.. ఆ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వుల్లోనూ సవరణలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పది జిల్లాలను ఆధారంగా చేసుకుని.. షెడ్యూల్ ప్రకారమే ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నిర్వహించుకోవచ్చంది. దీనికి అవసరమైన సవరణలు, చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించకుండా వీలుకాదు.. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన నిబంధనలను, 8,700కుపైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ ఆదిలాబాద్‌కు చెందిన అరుణ్‌కుమార్, మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎస్.రాహుల్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించకుండా 31 జిల్లాల ఆధారంగా నియామకాలు సబబు కాదని తేల్చిచెప్పింది. సవరణ నోటిఫికేషన్ ఇవ్వండి టీఆర్టీకి సంబంధించి జారీ చేసిన జీవోలో 31 జిల్లాలని పేర్కొన్న స్థానంలో 10 జిల్లాలనే పేర్కొనాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే దరఖాస్తుల స్వీకరణ గడువునూ డిసెంబర్ 15 వరకు పెంచాలని సూచించింది. ఈ మేరకు సవరణ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించింది. ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని.. దరఖాస్తులను బట్టి అభ్యర్థులు పాత పది జిల్లాల్లో ఏ జిల్లాకు చెందుతారో వర్గీకరించాలని స్పష్టం చేసింది. తాము చెప్పిన ఈ సవరణలు చేసి.. షెడ్యూల్ ప్రకారమే టీఆర్టీని నిర్వహించుకోవచ్చని సూచించింది. -
‘సొసైటీ’పై కోర్టు ధిక్కార వ్యాజ్యానికి తెర
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆగ్రహంతో హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ దిగొచ్చింది. చెల్లించాల్సిన బకాయిలను ఎట్టకేలకు సొసైటీ చెల్లించినట్లు ఉమ్మడి హైకోర్టుకు హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఎం. శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని మూసివేసినట్లు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2011 నుంచి 2017 వరకు రూ.93.94 లక్షలకు రూ.64.96 లక్షలను గతంలోనే ఎగ్జిబిషన్ సొసైటీ చెల్లించిందని ప్రభుత్వ న్యాయవాది (హోం) టి.శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 7న మిగిలిన బకాయి మొత్తం రూ.28.97 లక్షలను అగ్నిమాపక శాఖకు ఎగ్జిబిషన్ సొసైటీ చెల్లించిందన్నారు. 2015లో అగ్నిమాపక శాఖకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ సొసైటీ బకాయిలు చెల్లించడం లేదని న్యాయవాది ఖాజా అజాజుద్దీన్ ప్రజాప్రయో జన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. 2011 నుంచి 2016 వరకు ఉన్న రూ.80.14 లక్షల బకాయిలను ఆరు నెలల్లోగా చెల్లించాలన్న హైకోర్టు ఆదేశాల్ని ఎగ్జిబిషన్ సొసైటీ ఖాతరు చేయలేదు. దీంతో పిటిషనర్ కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని దాఖలు చేయడంతో హైకోర్టు గతంలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిలను వాయిదాల పద్ధతిలో చెల్లించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ నెల 7న మిగిలిన రూ.28.98 లక్షల మొత్తాన్ని చెల్లించినట్లు ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో ఎగ్జిబిషన్ సొసైటీపై కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని ముగిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. -
రిటైరైన వారికి రెగ్యులర్ పోస్టులా..?
సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ పొందిన వారిని తిరిగి రెగ్యులర్ పోస్టుల్లో ఎలా భర్తీ చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఒక పోస్టులో పనిచేసి పదవీ విరమణ పొందాక అదే వ్యక్తిని తిరిగి అదే రెగ్యులర్ పోస్టులో నియమిస్తే.. సర్వీసులో తర్వాతి సీనియర్లకు పదోన్నతుల్లో అన్యాయం జరుగుతుందని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం పేర్కొంది. పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఇన్చార్జి)గా ఎం.సత్యనారాయణరెడ్డిని మరో రెండేళ్లు కొనసాగిస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ సివిల్ ఇంజనీర్స్ ఫోరం అధ్యక్షుడు కె.శ్యాంసుందర్ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై ధర్మాసనం సోమవారం విచారించింది. ఇలాంటి నియామకాల వల్ల రిటైరైన వారే కీలక పదవుల్లో ఉంటే పదోన్నతులు పొందేవారికి అన్యాయం జరుగుతుందని పిటిషనర్ న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదించారు. ఆర్థిక శాఖ 2015లో జారీ చేసిన జీవో 55 ప్రకారం పదవీ విరమణ పొందిన వ్యక్తి సేవల్ని వినియోగించుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని అడ్వకేట్ జనరల్ ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ధర్మాసనం 2 వారాలకు వాయిదా వేసింది. -
గాడిదల్నీ వదలరా: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: గాడిద మాంసాన్ని కూడా అమ్మేస్తున్నారా.. గాడిదల్ని కూడా వదలట్లేదా.. అని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. గుంటూరులో రోడ్లపైనే గాడిదల్ని వధించి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై మంగళవారం ఉమ్మడి హైకోర్టు విచారించింది. కాకినాడకు చెందిన యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ కార్యదర్శి గోపాలరావు, మరో ముగ్గురు దాఖలు చేసిన పిల్‌ను ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం విచారించింది. కబేళాలను మూసేయాలన్న ఉత్తర్వుల్ని ఎందుకు అమలు చేయలేదో తెలియజేయాలని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను ధర్మాసనం ఆదేశించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
ప్రత్యేక బీఈడీ, డీఈడీలకు టీఆర్టీలో అవకాశమివ్వాలి
సాక్షి, హైదరాబాద్: వినికిడి, దృష్టి లోపాలతో పాటు బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకు విద్యను అందించేందుకు ప్రత్యేక బీఈడీ, డీఈడీ చదివిన అభ్యర్థులకు టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ)లో అవకాశం కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రత్యేక బీఈడీ, డీఈడీ చేసిన వారికి అవకాశం కల్పించే విషయంలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకునేంత వరకు టీఆర్టీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధించాలని పిటిషన్లో కోరారు. ఈ మేరకు తెలంగాణ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధి బి.శ్రీనివాసులు హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి ప్రకారం ప్రత్యేక బీఈడీ, డీఈడీ చేసిన వారు సాధారణ బీఈడీ కోర్సు చేసిన వారితో సమానమని పిటిషన్లో వివరించారు. అయితే ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించిందని, టీఆర్టీ జీవో 25లో ప్రత్యేక బీఈడీ, డీఈడీ వారికి అవకాశం కల్పించలేదని తెలిపారు. అలాగే వీరికి ప్రత్యేక పాఠశాలల్లోనే కాకుండా సాధారణ పాఠశాలల్లో కూడా పనిచేసే అవకాశం ఇవ్వాలని, ఆ దిశగా ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరావు చట్ట నిబంధనలను పిటిషనర్ సవాలు చేసినందున దీనిపై ధర్మాసనం విచారించడమే సబబుగా ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరపనుంది. -
కోర్టు తీర్పునకు లోబడే ‘మెరీడియన్’ రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) కాలనీలో నిర్మించిన మెరీడియన్ అపార్ట్‌మెంట్స్‌లో ఇప్పటికే ఒప్పందం చేసుకున్న మేరకు జరిపే రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా కోర్టు వెలువరించే తదుపరి తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి తనఖా పెట్టిన 24 ఫ్లాట్లతో పాటు ఖాళీగా ఉన్న 73 ఫ్లాట్లను సైతం ఎట్టి పరిస్థితు ల్లోనూ విక్రయించరాదని లోథా కన్స్ట్రక్షన్స్ను హైకోర్టు ఆదేశించింది. అనం తరం ఆ సంస్థ ఇచ్చిన హామీని నమోదు చేసుకుంటూ, లోథా దాఖలు చేసిన అప్పీళ్ల ను మూసివేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. లోథా సంస్థ నిర్మించిన బెల్లేజా, మెరీడియన్ నివాస సముదాయాల మధ్య ఉన్న గోడ కూల్చివేతకు జీహెచ్ఎంసీ ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ లోథా కన్స్ట్రక్షన్స్ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఖాళీ ఫ్లాట్లను విక్రయించవద్దని ఆదేశాలిచ్చారు. గోడ కూల్చివేతపై యథాతథస్థితిని కొనసాగించాలన్నారు. ఈ ఆదేశాలపై లోథా సంస్థ ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసింది. ఈ అప్పీళ్లపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. వాదనలు విన్న ధర్మాసనం అమ్మకాలకు సంబంధించి ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు ఎవరైనా కొనుగోలుదారు తమ ఫ్లాట్లను రిజిçష్టర్ చేయాలని కోరితే, అదే విషయాన్ని నోటీసు ద్వారా మెరీడియన్, బెల్లేజా నివాసితులకు తెలియజేయాలని లోథా సంస్థను ఆదేశించింది. రిజిస్ట్రేషన్లన్నీ కూడా కోర్టు వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయంటూ అప్పీళ్లను మూసివేసింది. -
సీఎంవోను సంస్కరించే ఉద్దేశం ఉందా?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) పనితీరుపై ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై హైకోర్టు స్పందించింది. కృష్ణారావు చెబుతున్న విధంగా సీఎంవోను సంస్కరించే ఉద్దేశం ఉందో లేదో తెలియచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. సీఎంవో రాజకీయ కార్యాలయంగా మారిపోయిందని.. దీన్ని సంస్కరించాల్సిన అవసరముందని, పారదర్శకంగా పనిచేసేందుకు ఓ నిర్దిష్ట విధానాన్ని రూపొందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఐవైఆర్ ఇటీవల హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. -
రామప్ప ఆలయ దుస్థితిపై స్పందన
సాక్షి, హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, పాలంపేట గ్రామ పరిధిలో ఉన్న కాకతీయుల కాలం నాటి రామప్ప దేవాలయ దుస్థితిపై పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఈ కథనాలను హైకోర్టు తనంతట తానుగా(సుమోటో) ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)గా పరిగణించింది. దీనిలో కేంద్ర పురావస్తు శాఖ కార్యదర్శి, పురావస్తు, సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్, రాష్ట్ర పురావస్తు శాఖ కార్యదర్శి, డైరెక్టర్, జిల్లా కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చింది. దీనిపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ఇటీవల కురిసిన వర్షాలకు రామప్ప దేవాలయ ప్రహరి కూలిపోయింది. అధికారుల నిర్లక్ష్యంతో ఆలయం శిథిలమైపోతోంది. దీనిపై ఇటీవల పత్రికల్లో కథనాలు వచ్చాయి. వీటిని చూసిన న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు రామప్ప దేవాలయ దుస్థితిని లేఖ రూపంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిని ఆయన పిల్ కమిటీకి నివేదించగా, కమిటీలో సభ్యులందరూ కూడా ఈ కథనాన్ని పిల్‌గా పరిగణించాలని ఏకగ్రీవంగా తమ అభిప్రాయాన్ని తెలిపారు. దీంతో పత్రికా కథనాలను పిల్‌గా తీసుకోవాలని రిజిస్ట్రీని ఏసీజే ఆదేశించగా, వీటిని పిల్‌గా మలిచారు. -
కేసు నమోదులో ఇంత జాప్యమా?
సాక్షి, హైదరాబాద్: తమను దారుణంగా కొట్టి హింసించారని ఆరోపిస్తూ సిరిసిల్ల సీసీఎస్ ఎస్ఐ రవీందర్‌పై బాధితులు ఎప్పుడో ఫిర్యాదు చేస్తే ఈ నెల 6 వరకు కేసు నమోదు చేయకుండా ఎందుకు జాప్యం చేశారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై ఎందుకు ఎస్సీ, ఎస్టీ చట్ట నిబంధనల కింద ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించింది. పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలంటూ విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ గంగారావుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిరిసిల్ల జిల్లా నేరెళ్ల, జిల్లెల్ల, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన దళితులపై పోలీసుల దాడి ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, అలాగే బాధితులను నిమ్స్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ రాసిన లేఖపై కూడా హైకోర్టు స్పందించి విచారణ జరుపుతోంది. ఈ వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఎస్సై రవీందర్‌పై కేసు నమోదు చేసినట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ తెలిపారు. ఘటన ఎప్పుడు జరిగిందని ధర్మాసనం ప్రశ్నించగా.. జూలైలో జరిగిందని సంజీవ్ చెప్పగా, కేసు నమోదు చేసేం దుకు అంత జాప్యం ఎందుకు జరిగిందని నిలదీసింది. ఆగస్టు 10న రవీం దర్‌ను సస్పెండ్ చేశామని, ఈ నెల 6న కేసు నమోదు చేశామని సంజీవ్ తెలిపారు. రవీందర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ స్పందిస్తూ.. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు గడువు కావాలని కోరారు. ఎస్పీ విశ్వజిత్ తరపున వాదనలు వినిపించేందుకు గడువు కావాలని సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి కోరారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. -
ఆయేషా కేసుపై ముగిసిన వాదనలు
సాక్షి, హైదరాబాద్: బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో పునర్ దర్యాప్తు నిమిత్తం దాఖలైన వ్యాజ్యాల్లో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. వాదనలు విన్న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం తన ఉత్తర్వులను వాయిదా వేసింది. ఈ కేసులో పునర్ దర్యాప్తు చేయించాల్సిన అవసరమెంతైనా ఉందని ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ రమా మేల్కోటే, పాత్రికేయురాలు కె.సజయ, సామాజిక కార్యకర్త వల్లూరుపల్లి సంధ్యారాణి సంయుక్తంగా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం తెలిసిందే. అయితే సిట్ చేసే పునర్ దర్యాప్తును హైకోర్టే పర్యవేక్షించాలని, లేనిపక్షంలో సీబీఐకి దర్యాప్తు బాధ్యతల్ని అప్పగించాలంటూ ఆయేషా తల్లిదండ్రులు మరో పిటిషన్ వేశారు. హైకోర్టు ఆదేశిస్తేనే పునర్ దర్యాప్తు చేయగలమని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపై వాదనలు వినిపించాలని పిటిషనర్లను ధర్మాసనం కోరింది. ఇందులోభాగంగా మంగళవారం పోలీసుల తరఫున హోంశాఖ న్యాయవాది విద్యావతి వాదనలు వినిపించారు. ఆయేషా హత్యకేసులో పునర్ దర్యాప్తునకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే సిట్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే తమంతతాముగా పునర్ దర్యాప్తు చేయలేమని, హైకోర్టు ఆదేశిస్తే తప్పక చేస్తామని వివరించారు. స్వతంత్రంగా దర్యాప్తు జరుగుతున్నప్పుడు కోర్టు పర్యవేక్షణ అవసరం లేదన్నారు. ఆయేషా తల్లిదండ్రుల తరఫు న్యాయవాది సురేశ్‌కుమార్ స్పందిస్తూ.. హైకోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు జరగాలని కోరారు. -
మళ్లీ హైకోర్టుకు ‘ఏపీ ఎన్జీవో’ వివాదం
- మీటింగ్ హాల్, గదుల తాళాలు ఇవ్వడం లేదు: ఏపీ ఎన్జీవో - సభ్యత్వం ఇవ్వడం లేదన్న భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎన్జీవో సంఘం భవన వివాదం మరోసారి హైకోర్టుకు చేరింది. హైదరాబాద్ గన్ ఫౌండ్రీలో ఉన్న సంఘం భవనంలోని మీటింగ్ హాల్, 4 గదులకు భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సంఘం వేసిన తాళాలు తీసి.. వాటిని తమకు అప్పగించాలన్న హైకోర్టు ఆదే శాల్ని ఖాతరు చేయడం లేదని ఏపీ ఎన్జీవో సంఘం కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. గత ఆదేశాల మేరకు తాము ఏపీ ఎన్జీవోలో సభ్యత్వ చందా చెల్లిస్తా మంటే తీసుకోవడం లేదని భాగ్య నగర్ తెలంగాణ ఎన్జీవో సంఘం హైకోర్టుకు తెలిపింది. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. సంఘ భవనంలోని గదులకు భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సంఘం వేసిన తాళాలను తమకు అప్పగించాలని గతంలోని హైకోర్టు ఆదేశాలు అమలు చేయలేదని ఏపీ ఎన్జీవో సంఘం తరపు న్యాయవాది చెప్పారు. తాళాలు ఇచ్చేందుకు తాము సిద్ధమేనని, అయితే తమకు సభ్యత్వం ఇవ్వాలన్న గత ఆదేశాల్ని ఏపీ ఎన్జీవో సంఘం పట్టించుకోవడం లేదని భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఏపీ ఎన్జీవో సంఘ సభ్యత్వానికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని తెలంగాణ ఎన్జీవో సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 30వ తేదీకి వాయిదా వేసింది. -
పెచ్చరిల్లుతున్న లైంగికదాడులు
ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్ విజయవాడ లీగల్: దేశంలో బాలికలపై లైంగికదాడులు పెచ్చరిల్లుతున్నాయని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ దాడులను అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. విజయవాడ బందరు రోడ్డులోని, హోటల్ మురళి ఫార్చ్యూన్ పార్కులో జువెనైల్ జస్టిస్, పోస్కో చట్టాలపై శనివారం వర్క్‌షాపు జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన జస్టిస్ రమేష్ రంగనాథన్ మాట్లాడుతూ బాలికలు ఎక్కువగా లైంగిక వేధింపులకు గురవుతున్నారన్నారు. జువినైల్ కోర్టుల్లో ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ దినేష్‌కుమార్ మాట్లాడుతూ పోస్కో చట్టం–2012లో అమలులోకి వచ్చిందని, అప్పటి నుంచి రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు. 53 శాతం మంది బాలికలు లైంగిక వేధంపులకు గురవుతున్నారని వివరించారు. డీజీపీ ఎన్.సాంబశివరావు మాట్లాడుతూ బాల బాలికలపై జరిగే వేధింపులకు సంబంధించి పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. యూనిసెఫ్ ప్రతినిధి సోనీజార్జ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో పోస్కో, జువినైల్ చట్టాలు బాగానే అమలవుతున్నాయని అభిప్రాయం వ్యక్తంచేశారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.కె.జైస్వాల్, జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు మాట్లడుతూ ఎన్జీవోలు, జువైనైల్ జస్టిస్ బోర్డు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. -
కేటాయింపు 200 కోట్లు.. ఇచ్చింది 6 కోట్లు
- ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనంపై సీనియర్ సిటిజన్స్ లేఖ - పిల్‌గా పరిగణించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో కొత్త ఆస్పత్రి భవన నిర్మాణానికి రూ.200 కోట్ల నిధులు కేటాయించినా విడుదల చేయడం లేదంటూ సీనియర్ సిటిజన్స్ స్వచ్ఛంద సంస్థ రాసిన లేఖపై హైకోర్టు స్పందించింది. ఈ లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించింది. ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ఉస్మానియా ఆస్పత్రిలో చాలాభాగం కూలిపోయే దశలో ఉందని, కొత్త ఆస్పత్రి భవనానికి రూ.200 కోట్లు కేటాయించిందని పేర్కొంది. ఇప్పటి వరకు రూ.6 కోట్లే విడుదల చేశారని తెలిపింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోర్టును కోరింది. దీనిపై స్పందించిన కోర్టు పిల్‌గా విచారణకు స్వీకరించింది. -
ఎవరినీ ఖాళీ చేయించవద్దు
సర్కారు సేకరిస్తున్న భూములపై హైకోర్టు స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం సేకరిస్తున్న భూముల నుంచి ఎవరినీ ఖాళీ చేయించబోమని అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ మంగళవారం హైకోర్టుకు హామీ ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేస్తామని, అప్పటి వరకు ఏ ఒక్కరినీ ఖాళీ చేయించబోమని పేర్కొన్నారు. ఏజీ మౌఖిక హామీని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
రేపటిలోగా స్థలాన్ని ఖాళీ చేస్తాం
ఐమాక్స్ పక్కన పార్కింగ్ స్థలంపై హైకోర్టుకు నివేదించిన డాక్టర్ కార్స్ అప్పీల్ ఉపసంహరణకు ధర్మాసనం అనుమతి సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) నుంచి ప్రసాద్స్ ఐమాక్స్ పక్కన లీజుకు తీసుకున్న స్థలాన్ని శనివారంలోపు ఖాళీ చేస్తామని డాక్టర్ కార్స్ యాజమాన్యం హైకోర్టుకు నివేదించింది. సింగిల్ జడ్జి తీర్పుపై తాము దాఖలు చేసిన అప్పీల్‌ను సైతం ఉపసంహరించుకుంటున్నామని తెలిపింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు అప్పీల్ ఉపసంహరణకు అనుమతినిచ్చింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధానన్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయం, ప్రదర్శన నిమిత్తం డాక్టర్ కార్స్ యాజమాన్యం 2012లో హెచ్ఎండీఏ నుంచి ప్రసాద్ ఐమాక్స్ పక్కనున్న స్థలాన్ని లీజుకు తీసుకుంది. అద్దె బకాయిలు చెల్లించలేదంటూ ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని హెచ్ఎండీఏ ఇటీవల నోటీసులు జారీ చేసింది. దీనిపై డాక్టర్ కార్స్ హైకోర్టును ఆశ్రయించగా సింగిల్ జడ్జి స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఆ తరువాత స్టే ఎత్తివేయాలని కోరుతూ హెచ్ఎండీఏ అనుబంధ పిటిషన్ దాఖలు చేయగా సింగిల్‌జడ్జి స్టేని ఎత్తివేస్తూ తీర్పునిచ్చారు. దీనిపై డాక్టర్ కార్స్ యాజమాన్యం ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయగా బుధవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. లీజు గడువు ముగిసిన నేపథ్యంలో ఎప్పటిలోపు స్థలాన్ని ఖాళీ చేస్తారో చెప్పాలంటూ కోర్టు విచారణను గురువారానికి వారుుదా వేసింది. అప్పీల్ గురువారం విచారణకు రాగా శనివారంలోపు స్థలాన్ని ఖాళీ చేస్తామని డాక్టర్ కార్స్ యాజమాన్యం కోర్టుకు నివేదించింది. -
హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా రమేశ్ రంగనాథన్
► రాష్ట్రపతి ఉత్తర్వులు.. కేంద్రం నోటిఫికేషన్ హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జస్టిస్ రమేశ్ రంగనాథన్ నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దిలీప్.బి.బొసాలే బాధ్యతల నుంచి తప్పుకున్న నాటి నుంచి జస్టిస్ రమేశ్ రంగనాథన్ ప్రధాన న్యాయమూర్తి నిర్వహించే విధులను నిర్వర్తిస్తారని కేంద్రం ఆ నోటిఫికేషన్లో పేర్కొంది. జస్టిస్ బొసాలే పదోన్నతిపై అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన విషయం తెలిసిందే. జస్టిస్ రమేశ్ రంగనాథన్ 1958 జూలై 28న న్యూఢిల్లీలో జన్మించారు. 1977లో గ్రాడ్యుయేషన్, 1981లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చార్టెర్డ్ అకౌంటెంట్‌గా, కంపెనీ సెక్రటరీగా కూడ ఆయన అర్హత సాధించారు. బెంగళూరు యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ సాధించారు. 1985 నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా నమోదయ్యారు. 1996 నుంచి 2000 వరకు ప్రభుత్వ న్యాయవాది (జీపీ)గా బాధ్యతలు నిర్వర్తించారు. 2000 జూలై నుంచి 2004 మే వరకు అదనపు అడ్వొకేట్ జనరల్‌గా సేవలందించారు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తదితర ప్రముఖ సంస్థలకు న్యాయ సలహాదారుగా ఉన్నారు. 2005, మే 26న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2006 ఫిబ్రవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2015 డిసెంబర్ 29 నుంచి ఆంధ్రప్రదేశ్ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
ఖమ్మం జిల్లా జెడ్పీ చైర్మన్ ఎన్నికలపై స్టే
* హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు * ఎంపీపీ అధ్యక్ష ఎన్నికలపైనా స్టే * కౌంటర్ దాఖలు చేయాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశం * విచారణ రెండు వారాలకు వాయిదా సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో పాటు, ఖమ్మం జిల్లా నుంచి ఏడు మండలాలను తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఖమ్మం జెడ్పీ చైర్మన్, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు జరిగాయని, అప్పుడు రాష్ట్రం మొత్తాన్ని, జిల్లా మొత్తాన్ని యూనిట్లుగా తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేశారని, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడంతో పాటు, ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను తొలగించారని, అందువల్ల తిరిగి రిజర్వేషన్లను ఖరారు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బి.విజయగాంధీ, కె.రోశిరెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ రమేష్ రంగనాథన్ శుక్రవారం మరోసారి విచారించారు. ఉమ్మడి రాష్ట్రంలో రిజర్వేషన్ల ప్రకారం జెడ్పీపీ చైర్మన్ పోస్టును ఎస్సీ మహిళకు కేటాయించారని, దీని వల్ల గాంధీ జెడ్పీపీ చైర్మన్ పోస్టుకు పోటీ చేయలేకపోయారని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది కోర్టుకు నివేదించారు. అలాగే రోశిరెడ్డి కూడా ఎంపీపీ పోస్టుకు అర్హుడని, అందువల్ల కొత్త మార్పులను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లను ఖరారు చేసేలా అధికారులను ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఈ సమయంలో పంచాయతీరాజ్ శాఖ తరఫు న్యాయవాది పాండురంగారెడ్డి స్పందిస్తూ, రెండు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, తమకు అందుకు సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే అప్పటి వరకు ఖమ్మం జిల్లా జెడ్పీపీ చైర్మన్, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికల నిర్వహణను నిలుపుదల చేస్తామని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆ పంచాయతీలకు..ఎన్నికలు
ఏప్రిల్ 15 లోగా నిర్వహించాల్సిందే హైకోర్టు ఆదేశం భీమిలి మున్సిపాలిటీ విలీనంపైనా సందేహాలు? సాక్షి, విశాఖపట్నం : జీవీఎంసీలో విలీనం కాకుండా నిలుపుదల చేసిన భీమునిపట్నం మండల పరిధిలోని ఐదు గ్రామ పంచాయతీలకు వెంట నే ఎన్నికలు నిర్వహించాలని హైకో ర్టు బుధవారం ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 15 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భీమునిపట్నం మండల పరిధిలోని కె.నగరపాలెం, కాపులుప్పాడ, చేపలుప్పాడ, నిడిగట్టు, జేవీ అగ్రహారం గ్రామాలను జీవీఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం గత ఏడాది జీవో జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేయగా, ఆ జీవోను హైకోర్టు రద్దు చేసింది. అయినా కూడా ఈ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించకపోవడంతో మత్య్సకారులు వై.అప్పలకొండ, మరికొం దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను వివరణ కోరింది. మునిసిపల్ ఎన్నికల వల్ల తమపై ఎంతో భారం ఉందని కమిషన్ తెలి పింది. దీనిపై న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో ఉన్న మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తుండ గా లేని భారం, ఐదు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎందుకని ప్రశ్నించా రు. ఈ ఐదు పంచాయతీలు వెంటనే ఎన్నికలు పెట్టాలని, మొత్తం ప్రక్రియను ఏప్రిల్ 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. భీమిలి విలీనంపైనా సందేహాలు? తాజా ఉత్తర్వుల నేపథ్యంలో జీవీఎంసీలో భీ మిలి విలీనంపై సందేహాలు ముసురుకున్నా యి. నిబంధనల మేరకు కొనసాగింపు లేకుం డా ప్రాంతాలను కార్పొరేషన్లో విలీనం చేసేం దుకు వీల్లేదు. భీమిలి-జీవీఎంసీ మధ్య ఈ ఐదు పంచాయతీలున్నాయి. వీటి విలీనం రద్దుతో.. జీవీఎంసీకి, భీమిలి మున్సి పాలిటీ మధ్య లింకు తెగనుంది. అలాంటపు డు జీవీఎంసీలోకి భీమిలిని విలీనం చేయడం కుదిరేది కాదని అధికారులే చెప్తున్నారు. మేయర్‌ను జనరల్ కేటగిరీగా ప్రకటించిన ఎన్నికల సంఘం, వార్డుల రిజర్వేషన్లను కూడా ప్రకటించాల్సి ఉంది. -
‘గల్ఫ్’ మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేలా ఆదేశించండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ దేశాలకు వెళ్లి విపత్కర పరిస్థితుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం అందించే విషయంలో వైఖరి ఏమిటో తెలియచేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు జడ్జి జస్టిస్ రమేష్ రంగనాథన్ ఉత్తర్వులు జారీ చేశారు. గల్ఫ్ దేశాలకు బతుకుతెరువు కోసం వెళ్లే రాష్ట్ర వాసుల్లో ఎంతో మంది విపత్కర పరిస్థితుల్లో మరణిస్తున్నారని, దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, అందువల్ల వారి కుటుంబాలకు పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ‘మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్’ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన పోతుల రాజిరెడ్డి దుబాయ్‌లో ఆత్మహత్య చేసుకున్నారని, తన యజమాని పని చేయించుకుని జీతం చెల్లించకపోవడమే ఇందుకు కారణమని పిటిషనర్ల తరఫు న్యాయవాది శశికిరణ్ కోర్టుకు నివేదించారు. రాజిరెడ్డిని అనాథగా పేర్కొంటూ దుబాయ్లోనేఅంతిమ సంస్కారాలు చేసేశారని వివరించారు. అలాగే కరీంనగర్ జిల్లాకు చెందిన దుర్గం భీమయ్య మస్కట్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎన్కౌంటర్లో మరణించారని కోర్టుకు నివేదించారు. పనికోసం వేరే ప్రాంతానికి వెళ్తున్న సమయంలో భీమయ్యను అక్కడి బోర్డర్ సెక్యూరిటీ అధికారులు కాల్చి చంపారని, దీంతో ఆయన కుటుంబం జీవనాధారం కోల్పోయిందని తెలిపారు. వీరిద్దరికీ పరిహారం చెల్లింపు కోసం ఆయా జిల్లాల కలెక్టర్లు సిఫారసు చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన స్పందన రావడం లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు.