అయితే సిట్ చేసే పునర్ దర్యాప్తును హైకోర్టే పర్యవేక్షించాలని, లేనిపక్షంలో సీబీఐకి దర్యాప్తు బాధ్యతల్ని అప్పగించాలంటూ ఆయేషా తల్లిదండ్రులు మరో పిటిషన్ వేశారు. హైకోర్టు ఆదేశిస్తేనే పునర్ దర్యాప్తు చేయగలమని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపై వాదనలు వినిపించాలని పిటిషనర్లను ధర్మాసనం కోరింది. ఇందులోభాగంగా మంగళవారం పోలీసుల తరఫున హోంశాఖ న్యాయవాది విద్యావతి వాదనలు వినిపించారు.
ఆయేషా హత్యకేసులో పునర్ దర్యాప్తునకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే సిట్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే తమంతతాముగా పునర్ దర్యాప్తు చేయలేమని, హైకోర్టు ఆదేశిస్తే తప్పక చేస్తామని వివరించారు. స్వతంత్రంగా దర్యాప్తు జరుగుతున్నప్పుడు కోర్టు పర్యవేక్షణ అవసరం లేదన్నారు. ఆయేషా తల్లిదండ్రుల తరఫు న్యాయవాది సురేశ్‌కుమార్ స్పందిస్తూ.. హైకోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు జరగాలని కోరారు.