
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేట గ్రామంలోని సర్వే నంబర్లు 308, 332, 333ల్లోని 184 ఎకరాల భూమిని కబ్జా చేసిన వ్యక్తులపై ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని హైకోర్టు మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలను తమ ముందుంచాలంటూ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, దేవాదాయ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, మేడ్చల్ కలెక్టర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక నేత కొలన్ శ్రీనివాస్‌రెడ్డికీ నోటీసులిచ్చింది. విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. నిజాం పేట గ్రామంలో సీతారామాంజనేయ స్వామి దేవస్థానానికి 184 ఎకరాల భూమి ఉందని, ఆ భూమిని కొలన్ శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలోని దేవస్థానం కమిటీ, స్థానిక సర్పంచ్, స్థానిక నేతలు కలసి ప్లాట్లు చేసి అమ్మేసి కోట్ల రూపాయలు గడించారంటూ కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌కు చెందిన అరుంధతమ్మ హైకోర్టుకు లేఖ రాశారు. ఏసీజే ఆదేశాలతో హైకోర్టు రిజిస్ట్రీ ఆ లేఖను పిల్‌గా పరిగణించింది. ఈ పిల్‌పై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
Comments
Please login to add a commentAdd a comment