
సాక్షి, హైదరాబాద్: మూసీ నదికి ముందు కావాల్సింది సుందరీకరణ కాదని, కాలుష్య రహిత ప్రవాహమని హైకోర్టు స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో మూసీలో కాలుష్య కారకాలు కలవకుండా నిరోధించినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుందని వెల్లడించింది. ఈ విషయంలో పీసీబీ ఏం చేస్తుందో తెలుసుకోవాలని భావిస్తున్నామంటూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
ఈ మేరకు సీజే జస్టిస్ బి.రాధాకృష్ణన్, జస్టిస్ రమేశ్ రంగనాథన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సబర్మతీ నదిలా మూసీని శుభ్రపరిచేలా ప్రభుత్వా న్ని ఆదేశించాలని నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవా రం ధర్మాసనం విచారణ చేపట్టి పైవిధంగా స్పందించింది.