సాక్షి, హైదరాబాద్: గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి రోజువారీగా వచ్చిచేరుతోన్న మురుగు జలాలతో చారిత్రక మూసీనది మృతనదిగా మారుతోంది. దీని ప్రక్షాళన కాగితాలకే పరిమితమౌతుండటంతో డెంగీ, మలేరియా దోమలకు ఆలవాలమైంది. మహానగరంలో మూసీ ప్రవేశించే బాపూఘాట్ నుంచి ఘట్‌కేసర్ సమీపంలోని ప్రతాపసింగారం వరకు సుమారు 44 కి.మీ మార్గంలో ఇది ప్రవహిస్తోంది. ఈమార్గం మొత్తం ఇప్పుడు డెంగీ, మలేరియా దోమల విజృంభనతో స్థానికులు రోగాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. నగరంలో సుమారు 3 వేలకుపైగా డెంగీ కేసులు నమోదు కాగా..వారిలో 30 మంది మృత్యువాతపడ్డారు. హైకోర్టు సైతం ఈ మరణాలపై అధికార యంత్రాంగాన్ని మందలించిన దృష్ట్యా మూసీ ప్రక్షాళన చర్చనీయాంశమైంది.
కాలుష్యకారక నదుల్లో నాలుగో స్థానం..
నిత్యం మూసీలోకి చేరుతోన్న గృహ, వాణిజ్య, పారిశ్రామిక వ్యర్థాలతో మూసీ నది జాతీయస్థాయిలో కాలుష్యకారక నదుల్లో నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఘనవ్యర్థాలు, కుళ్లిన కూరగాయలు, ఇతర వ్యర్థాల చేరికతో డంపింగ్‌యార్డుగా మారి రసాయన కాలుష్యం పెరుగుతోంది. ఇలా ఇది దోమల ఉత్పత్తి కేంద్రంగా మారింది. బాపూఘాట్–ప్రతాపసింగారం మార్గంలో(44 కి.మీ) దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఏళ్లుగా వివిధ రసాయనాలను సైతం వంటబట్టించుకున్న అవి శక్తిమంతంగా మారి నియంత్రణకు లొంగడం లేదు. స్ప్రేలు, కాయిల్సూ, జెల్, లిక్విడ్స్ వంటివి వాడినా నిర్మూలన సాధ్యపడటం లేదు. ఈ కారణంగా నగరవాసులు మలేరియా, డెంగీ వంటి వ్యాధులు.. కొత్తకొత్త వైరస్‌లతో అనారోగ్యం పాలవుతున్నారు. కుళ్లిన పదార్థాలు, కార్బన్ డై ఆక్సైడ్ వాసన అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో ఆడ ఎనాఫిలిస్, క్యూలెక్స్, ఏడిస్ ఈజిప్టి తదితర దోమలు పుట్టి పెరుగుతున్నాయి.
ఇవన్నీ సమీపంలో ఉన్న బస్తీలు, కాలనీలపై దండయాత్ర చేస్తుండటంతో వేలాదిమంది ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ దోమలు సుమారు 4 నుంచి 7 మిల్లీమీటర్లు ఉంటాయి. పగటివేళల్లోనే ఇవి అత్యధికంగా కుడతాయి. వీటి విజృంభన మూసీలో పెరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. దోమలు ప్రధానంగా కార్వాన్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా, అంబర్‌పేట్, ఉప్పల్, ఎల్బీ నగర్, మలక్‌పేట్ ప్రాంతాల్లో స్వైరవిహారం చేస్తున్నా.. ఏమీ చేయలేని స్థితి. బల్దియా చేపట్టిన ఫాగింగ్, యాంటీ లార్వా కార్యక్రమాలు సత్ఫలితాన్నివ్వడంలేదు. ప్రతీ శుక్రవారం డ్రైడేగా పాటిస్తూ దోమల నివారణకు చర్యలు చేపడుతున్నామంటున్న యంత్రాంగం ప్రచారానికే పరిమితమౌతుండటం విమర్శలకు గురవుతోంది.
అడుగు ముందుకు పడని ప్రక్షాళన...
మూసీనది ప్రక్షాళన, సుందరీకరణ ఏళ్లుగా కాగితాలకే పరిమితమవడంతో ఘన, ద్రవ, రసాయన వ్యర్థాల చేరికతో కాలుష్య కాసారమౌతోంది. ప్రస్తుతం మూసీలోకి నిత్యం గృహ,వాణిజ్య,పారిశ్రామిక వాడల నుంచి 2 వేల మిలియన్ లీటర్ల (సుమారు 200 కోట్ల లీటర్లు) మురుగునీరు చేరుతోంది. ఇందులో జలమండలి 18 ఎస్టీపీల్లో సుమారు 700 మిలియన్‌లీటర్ల వ్యర్థజలాలను శుద్ధిచేసి మూసీలోకి వదులుతోంది. మిగతా మురుగునీరు శుద్ధి ప్రక్రియ లేనిదే. గుజరాత్‌లోని సబర్మతి నది తరహాలో దీన్ని ప్రక్షాళన చేయాలన్న సర్కారు సంకల్పం బాగానే ఉన్నా... ఆచరణలో అడుగు ముందుకు పడడం లేదు. మూసీ తీరప్రాంత అభివృద్ధికి రూ.3 వేల కోట్ల అంచనా వ్యయంతో సుందరీకరణకు, మరో రూ.3వేల కోట్ల అంచనాతో మురుగుజలాలు నదిలో కలవకుండా నగరం నలుమూలలా 60 మురుగు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. నిధుల కేటాయింపు లేదు.
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి దీనికి చైర్మన్‌ను, సభ్యకార్యదర్శిని నియమించినప్పటికీ ఫలితంలేదు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పంటలసాగు జరుగుతోంది. ఈ కూరగాయలనే మార్కెట్లలో విక్రయిస్తున్నారు. వీటిలో హానికారక మూలకాలు, రసాయనాల ఆనవాళ్లుండటంతో వీటిని తిన్నవారు రోగాలపాలవుతున్నారు.నగరం పొడవునా మూసీ నది గృహ, వాణిజ్య, పారిశ్రామిక వ్యర్థాలకు డంపింగ్ యార్డుగా మారడం కలచివేస్తోంది. ఈ దుస్థితి నగరవాసులను కన్నీరుపెట్టిస్తోంది.
కాగితాలపైనే సుందరీకరణ ప్రాజెక్టు..గ్రేటర్‌లో మూసీ ప్రవహిస్తున్న మార్గంలో రోడ్లు, ఫ్లైఓవర్లు..పార్కులను తీర్చిదిద్దేందుకు రూ.3 వేల కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు. రెండేళ్లుగా వీటికి మోక్షం లేదు.
►రీచ్1: ఉస్మాన్‌సాగర్ హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ల నుంచి బాపూఘాట్‌వరకు (19 కి.మీ) రహదారిని తీర్చిదిద్దడానికి అంచనా వ్యయం రూ.647.98 కోట్లు
►రీచ్2: బాపూఘాట్ నుంచి నాగోల్ బ్రిడ్జి (21.50)కి.మీ మార్గంలో రహదారి ఏర్పాటు రూ.2162.01కోట్లు
►రీచ్3: నాగోల్‌బ్రిడ్జి నుంచి ఔటర్‌రింగ్‌రోడ్డు (గౌరెల్లి) వరకు(15 కి.మీ)మార్గంలో అప్రోచ్ రోడ్ ఏర్పాటు రూ.155.52 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment