సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ జీవనాడి అయిన...చారిత్రక మూసీ నదిని కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు మళ్లీ న్యాయపోరాటం మొదలైంది. నదీ గర్భంలోకి చొచ్చుకొచ్చిన ఆక్రమణలను తక్షణం తొలగించాలని...ప్రవహించే నదిలో వ్యర్థాల డంపింగ్‌ను నిరోధించాలని, ప్రక్షాళనకు వీలుగా మురుగు శుద్ధి కేంద్రాలను తక్షణం నిర్మించాలని కోరుతూ ఇటీవల నగరానికి చెందిన ముగ్గురు న్యాయ విద్యార్థులు నయీం, అఫ్తాబ్, పవన్‌లు ఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. మూసీ కాలుష్యం, ఆక్రమణలు, ప్రస్తుత దుస్థితిపై 400 పేజీల సమగ్ర నివేదికను, 500 ఫొటోలను ధర్మాసనానికి సమర్పించారు. ఈ నేపథ్యంలో నది ప్రక్షాళనకు ఇప్పటివరకు తీసుకున్న..తీసుకుంటున్న చర్యలపై తక్షణం ధర్మాసనానికి నివేదించాలని ఆదేశిస్తూ జలమండలి, మున్సిపల్ పరిపాలన శాఖ, కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీచేసింది. ఈ కేసు విచారణను ఈ నెల 27న ధర్మాసనం తిరిగి విచారించనుంది.
మూసీ కాలుష్యం ఇలా..
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) నిర్దేశిత పరిమితుల ప్రకారం లీటరు నీటిలో కరిగిన ఆక్సిజన్ మోతాదు (డీవో) పరిమాణం కనీసం 4 మిల్లీ గ్రాములుండాలి. అంతకంటే తక్కువగా ఉంటే ఆ చెరువు లేదాకుంటలో జలచరాలు బతకవు. బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ) విషయానికొస్తే లీటరు నీటిలో 3 ఎంజీలను మించకూడదు. డీవో తగ్గుతున్న కొద్దీ బీవోడీ పెరుగుతుంది. అలా జరుగుతుంటే ఆ జలవనరులో కాలుష్యం పెరుగుతుందని అర్థం.
బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీవోడీ) గండిపేట దగ్గర నిర్దేశిత పరిమితుల కంటే తక్కువగానే ఉంది. లీటర్ నీటిలో 2 ఎంజీలుగా ఉంది. ఇక నగరంలోకి ప్రవేశించగానే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 25 నుంచి 37 ఎంజీల వరకు బీఓడీ నమోదైంది. కృష్ణా నదిలో కలిసే వాడపల్లి దగ్గర 4 ఎంజీలకు తగ్గింది. జూలైలో గండిపేట దగ్గర 2 ఎంజీలుండగా.. నాగోల్ దగ్గర 24, ప్రతాపసింగారం వద్ద 20 ఎంజీలుండగా వాడపలి కాసానిగూడ వద్ద 3 ఎంజీలకు తగ్గింది.
నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్(డీవో) గండిపేట దగ్గర లీటరు నీటిలో 5.2 ఎంజీలుండగా.. నగరంలోకి రాగానే తగ్గింది. మూసారంబాగ్ నుంచి ప్రతాప సింగారం వరకు 0.2 ఎంజీల నుంచి 1 ఎంజీలకు తగ్గిపోయింది. ఇక పిల్లాయిపల్లి దాటగానే 1.9 ఎంజీలకు పెరిగింది. వాడపల్లిలో 4 ఎంజీల కంటే ఎక్కువగా ఉంది. ఇక గండిపేటలో 4.9 ఎంజీలుండగా.. నాగోలు, ప్రతాపసింగారం దగ్గర ’0’, కాసానిగూడ వద్ద 6.2 ఎంజీలకు పెరిగింది.
ప్రక్షాళనకు ప్రణాళిక ఇదే..
మూసీ నదిని కాలుష్యం కోరల నుంచి రక్షించాలంటే రెండోదశ ప్రక్షాళన పథకాన్ని తక్షణం పూర్తిచేస్తే కొంత మేర ఉపశమనం ఉంటుంది. ఇందుకు రూ.1500 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది.
మూసీ నది ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఐదేసి చొప్పున నూతనంగా మొత్తం..పది సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటుచేయాల్సి ఉంది.
ఎస్టీపీలు నిర్మించాల్సిన ప్రాంతాలు: అంబర్‌పేట్(142ఎంఎల్‌డి), నాగోల్(140ఎంఎల్‌డి), నల్లచెరువు(80ఎంఎల్‌డి), హైదర్షాకోట్(30), అత్తాపూర్(70ఎంఎల్‌డి), మీరాలం(6ఎంఎల్‌డి), ఫతేనగర్(30ఎంఎల్‌డి), ఐడీపీఎల్ టౌన్‌షిప్ (59ఎంఎల్‌డి), నాగారం(29ఎంఎల్‌డి), కుంట్లూర్ హయత్‌నగర్ (24 ఎంఎల్‌డి)
రీసైక్లింగ్ యూనిట్లు: ఫతేనగర్,ఐడీపీఎల్ టౌన్‌షిప్,నాగారం కాప్రా
మూసీ ప్రస్థానం ఇదీ..
ఈ నది వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్‌లో పుట్టి.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మీదుగా ప్రవహించి మిర్యాలగూడకు సమీపంలోని వాడపల్లి దగ్గర కృష్ణా నదిలో కలుస్తోంది. మొత్తం 250 కి.మీ. ప్రవహిస్తోంది. నగరంలో బాపూఘాట్–ప్రతాపసింగారం వరకు సుమారు 45 కి.మీ ప్రవహిస్తోంది. దేశంలోని అత్యంత కలుషితమైన నదుల్లో ఈ నది నాలుగోస్థానం దక్కించుకుందంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
మూసీని పరిరక్షించాల్సిందే
చారిత్రక మూసీనది గృహ, వాణిజ్య, పారిశ్రామిక, జీవ వ్యర్థాల చేరికతో తీవ్ర కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. ఈ నదిని సమగ్ర పక్షాళన చేసి పూర్వ వైభవం తీసుకురావాలి. నదీగర్భంలోనికి చొచ్చుకొచ్చిన అక్రమనిర్మాణాలను తక్షణం తొలగించాలి. నగరంలో మూసీ ప్రవాహిస్తోన్న మార్గం డంపింగ్ యార్డును తలపిస్తోంది. నదిలో చేరిన వ్యర్థాలను శుద్ధిచేయడంలో సంబంధిత విభాగాలు విఫలమవుతున్నాయి.
– ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, పర్యావరణ వేత్త
Comments
Please login to add a commentAdd a comment