మూసీ కాదు.. మూ‘ఛీ’ | Special Story on Musi river pollution | Sakshi
Sakshi News home page

మూసీ కాదు.. మూ‘ఛీ’

Published Sat, Feb 27 2016 3:10 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

మూసీ కాదు.. మూ‘ఛీ’ - Sakshi

మూసీ కాదు.. మూ‘ఛీ’

► పాల నుంచి కూరగాయల దాకా.. విషమే
► మూసీ జలం హాలాహలం!
► నిత్యం మూసీలో కలుస్తున్న 140 కోట్ల లీటర్ల వ్యర్థ జలాలు
► అందులో 60 కోట్ల లీటర్లే శుద్ధి.. అదీ అరకొరగా
► మిగతా 80 కోట్ల లీటర్లు నేరుగా నదిలోకే..
► కాలుష్య కాసారమవుతున్న నది
► నదీతీరంలో గడ్డి తిన్న పశువుల పాలూ కలుషితం
► గరళంగా మారుతున్న భూగర్భ జలాలు
► వాటిని తాగిన జనాలను వెంటాడుతున్న రోగాలు

 సాక్షి, హైదరాబాద్:  మూసీ.. ఆ నది నీళ్లు తాగిన మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి.. నదిలోని జలచరాల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది.. నదీతీరంలో గడ్డి మేసినందుకు పశువుల పాలూ కలుషితమవుతున్నాయి.. పాలల్లోనే కాదు అక్కడ పండే కూరగాయల్లో సైతం విషపు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అవన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మన ఒంట్లోకి చేరి రోగాలపాలు చేస్తున్నాయి. కాలుష్య కాసారంలా మారిన మూసీ దెబ్బకు పరిసర ప్రాంతాల్లోని భూగర్భ జలాలూ గరళంలా మారుతున్నాయి. ఈ నీటిని తాగే వారికి నిమోనియా, టైఫాయిడ్, కామెర్లు, విరేచనాలు, కోరింత దగ్గు, జీర్ణకోశ  వ్యాధులు వస్తున్నాయి.

పరిశ్రమల నుంచి వచ్చే రసాయన వ్యర్థాలు, ఇళ్ల నుంచి వచ్చే మురుగు కలిసి ఒక్కరోజులోనే 140 కోట్ల లీటర్ల జలాలు మూసీలో కలుస్తుండడంతో నది ప్రమాదకరంగా మారుతోంది. ఇందు లో కేవలం 60 కోట్ల లీటర్ల జలాలనే శుద్ధి చేస్తున్నారు. అదీ అరకొరగా. మిగతా 80 కోట్ల లీటర్ల వ్యర్థ జలాలు ఎలాంటి శుద్ధి లేకుండా నేరుగా మూసీలో కలిసిపోతున్నాయి. దీంతో అందులోని నీళ్లు విషతుల్యమవుతున్నాయి. తాజాగా మూసీ జలాలను పరీక్షించిన రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ).. అవి నీళ్లు కాదు, గరళం అని తేల్చింది! మూసీ నీటిలో బయులాజికల్ ఆక్సిజన్ డివూండ్ (బీఓడీ), టోటల్ డిజాల్వ్‌డ్ సాలిడ్స్(టీడీఎస్) ప్రవూదకర స్థారుుకి చేరుకున్నట్లు ఈ పరీక్షలో స్పష్టమైంది. జలాల్లో ప్రాణవాయువు పరిమాణం అత్యంత కనిష్ట స్థాయికి చేరడంతోపాటు వ్యర్థ రసాయనాల వల్ల  కెమికల్ ఆక్సిజన్ డిమాండ్(సీఓడీ ) విపరీతంగా పెరిగింది. సాధారణంగా నీటిలో సీఓడీ ఉండరాదు. ఇక నీటి  క్షారత(పీహెచ్) అనూహ్యంగా ఏడు యూనిట్లను మించడం కలవరపెడుతోంది. మూసీ కాలుష్యంతో అటు పర్యావరణం ఇటు జీవావరణ సమతౌల్యం దెబ్బతింటోంది.శుద్ధి శుద్ధ దండగ
ఒకప్పుడు స్వచ్ఛమైన జలాలతో గండిపేట్, ఉస్మాన్‌సాగర్, హుస్సేన్‌సాగర్ జలాశయాలకు మూసీ ఆదరువుగా ఉండేది. కానీ జీహెచ్‌ఎంసీ పరిధిలో 574.59 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని నాలాలు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలతో పూర్తిగా కలుషితమైంది. ఈ నదిలో కలుస్తున్న వ్యర్థ జలాలను జలమండలి, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఏడు చోట్ల(ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దిగువన, కిమ్స్ ఎదురుగా పాటిగడ్డ వద్ద, అంబర్‌పేట్, నాగోలు, నల్లచెరువు, అత్తాపూర్) మురుగు శుద్ధి కేంద్రాల్లో(ఎస్టీపీ) శుద్ధి చేస్తున్నారు. అయినా జలాల్లో విష రసాయనాలు, భార లోహాలు, హానికారక మూలకాలు తొలగకపోవడంతో శుద్ధి ప్రక్రియ అలంకారప్రాయంగా మారింది.
 
మురుగు జలాలను ఎస్టీపీలకు తరలించే భారీ సీవర్ ట్రంక్ మెయిన్ పైప్‌లైన్లకు తరచూ గండి పడుతుండడంతో మురుగు నీరు మూసీకి చేరుతోంది. దీంతో ఈ నీటిని తాగిన పశుపక్ష్యాదులు, చేపల మనుగడ ప్రశ్నార్థకమౌతోంది. ఈ కలుషిత జలాలతోనే ఉప్పల్, ఫిర్జాదిగూడ, ప్రతాపసింగారం, పిల్లాయిపల్లి తదితర ప్రాంతాల్లో పంటలు సాగుచేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సాగుచేస్తున్న ఆకుకూరలు, కాయగూరల్లోనూ కాలుష్య కారకాల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అవసరమైన చోట్ల ఎస్టీపీలు లేకపోవడంతో ఎనభై కోట్ల లీటర్ల వ్యర్థ జలాలు ఎలాంటి శుద్ధి కాకుండానే నేరుగా మూసీ నదిలో  కలుస్తున్నాయి.
 
 మూసీ జలాలతో పంటల సాగు
 నాగోలు, ఉప్పల్, ఫిర్జాదిగూడ, పిల్లాయిపల్లి, ప్రతాపసింగారం తదితర ప్రాంతాల్లో మూసీ నీళ్లతో కాయగూరలు పండిస్తున్నారు. ఇవన్నీ స్థానిక మార్కెట్లకు వ స్తున్నాయి.
 
 ప్రక్షాళన తక్షణావసరం
 జాతీయ నదీ పరిరక్షణ పథకం(ఎన్‌ఆర్‌సీడీ) రెండో దశ కింద రూ.950 కోట్లతో మూసీ ప్రక్షాళన చేసేందుకు మరో పది సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటితోపాటు మరో మూడు ప్రాంతాల్లో రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ గతంలోనే స్పష్టం చేసింది. కానీ మూడేళ్లుగా ఈ ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.
 
మురుగు శుద్ధి కేంద్రాల అవసరం ఇక్కడే..

అంబర్‌పేట్, నాగోల్, నల్లచెరువు, హైదర్షాకోట్, అత్తాపూర్, మీరాలం, ఫతేనగర్, ఐడీపీఎల్ టౌన్‌షిప్, నాగారం, కుంట్లూర్ - హయత్‌నగర్.
 రీసైక్లింగ్ యూనిట్లు: ఫతేనగర్, ఐడీపీఎల్ టౌన్‌షిప్, నాగారం- కాప్రా
 
అరకొర శుద్ధితో ప్రయోజనం లేదు
మూసీలో కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థ జలాలను ఎస్టీపీల్లో అరకొరగా శుద్ధి చేస్తున్నారు. దీనివల్ల ఉపయోగం లేదు. హానికారక రసాయనాలను తొలగించేందుకు ఈటీపీలు(ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు) అవసరం. పారిశ్రామిక వాడల నుంచి వచ్చే వ్యర్థ జలాలను ఎక్కడికక్కడే శుద్ధి చేసి, ఆ తర్వాతే మూసీలో కలిసేలా చూడాలి. అప్పుడే మూసీకి విషం నుంచి విముక్తి.
 - సజ్జల జీవానందరెడ్డి, పర్యావరణ వేత్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement