మూసీ.. ముప్పు! | Musi river threat for Hyderabad people | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 23 2018 1:33 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Musi river threat for Hyderabad people - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మూసీ నది.. ఒకప్పుడు ఈ నదిలో నాణెం వేస్తే పైకి కనిపించేదట. కానీ ఇప్పుడు మూసీకి బారెడు దూరంలో ఉన్నా ముక్కు పుటాలు పగిలిపోతున్నాయి. నిండా చెత్త చెదారంతో, హానికర కలుషితాలతో నది అత్యంత ప్రమాదకరంగా మారిపోయింది. ప్రక్షాళనపై ప్రభుత్వాల నిర్లక్ష్యం, రోజురోజుకూ పెరుగుతున్న నగర జనాభా, వ్యర్థాలను నదిలోనే డంప్‌ చేస్తుండటం, పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కలుషిత జలాలతో మూసీ నది వైతరణీ నదిని తలపిస్తోంది. నది వెంట ఉన్న బస్తీలు, కాలనీల వాసులు రోగాల బారిన పడుతున్నారు. గుజరాత్‌లోని సబర్మతి నది తరహాలో మూసీని ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా.. ఆచరణలో అడుగు ముందుకు పడటం లేదు.

ప్రక్షాళన కోసం రూ.1,200 కోట్లతో, తీర ప్రాంత అభివృద్ధి, సుందరీకరణ కోసం రూ.3 వేల కోట్లతో రూపొందించిన ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఏడాది కింద ‘మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినా.. నామమాత్రంగానే మిగిలిపోయింది. ఇక కొందరు నది వెంట ఈ కలుషిత నీటితోనే కూరగాయలు, ఆకుకూరలు పండిస్తుండడంతో.. వాటిని తిన్నవారు రోగాల పాలవుతున్నారు. మూసీ హైదరాబాద్‌ నగరంలోకి ప్రవేశిస్తోన్న బాపూఘాట్‌ ప్రాంతం నుంచి ప్రతాప సింగారం వరకు సుమారు 44 కిలోమీటర్ల పొడవునా మూసీ పరిస్థితిపై ‘సాక్షి’బృందం సోమవారం క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. ఈ సందర్భంగా ఎన్నో విస్తుగొలిపే అంశాలు వెల్లడయ్యాయి. 

బాపూఘాట్‌–చాదర్‌ఘాట్‌: చెత్తా చెదారం, మురుగు మధ్య.. 

  • నగరంలోకి మూసీ నది ప్రవేశించే లంగర్‌హౌస్‌ బాపూఘాట్‌ ప్రాంతం నుంచి పురానాపూల్, ముస్లిం జంగ్‌ బ్రిడ్జి, నయాపూల్, చాదర్‌ఘాట్‌ వరకు డంపింగ్‌ యార్డును తలపిస్తోంది. 
  • నది వెంట ఉన్న కాలనీలు, బస్తీల నుంచి మురుగు నీరంతా నదిలో కలుస్తోంది. ప్లాస్టిక్, ఇతర ఘన వ్యర్థాలతో నిండి కనిపిస్తోంది. 
  • లంగర్‌హౌజ్‌ టిప్పుఖాన్‌ బ్రిడ్జి వద్ద నదిలోనే శ్మశాన వాటిక ఉంది. మృతదేహాలను దహనం చేయడం, ఇతర వ్యర్థాలన్నీ నదిలోకే చేరుతున్నాయి. 
  • నది ఒడ్డున దోబీ ఘాట్‌లు ఉన్నాయి. ఆ నీటితోనే బట్టలు ఉతుకుతున్నారు.  
  • అత్తాపూర్‌ బ్రిడ్జి వద్ద జీహెచ్‌ఎంసీ వాహనాలు భవన, మురుగు వ్యర్థాలను నదిలోనే డంప్‌ చేస్తున్నాయి.  
  • పలు చోట్ల నది వెంట ఆ నీటితోనే ఆకుకూరలు సాగు చేస్తున్నారు. 

చాదర్‌ఘాట్‌–ఉప్పల్‌: మురికి గుంట 

  • చాదర్‌ఘాట్‌ వద్ద ఒకవైపు ఎంజీబీఎస్‌ బస్‌స్టేషన్, మరోవైపు రెండు మెట్రో కారిడార్లు కలిసే చోట నిర్మిస్తోన్న ఇంటర్‌ చేంజ్‌ మెట్రోస్టేషన్‌ నిర్మాణంతో మూసీ ఇరుగ్గా మారిపోయింది. 
  • చాదర్‌ ఘాట్‌ ప్రధాన వంతెన, దిగువ వంతెనలకు ఆనుకుని అనేక అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దానికితోడు చెత్తా చెదారం నిండి నది మురికినీటి గుంటలా మారిపోయింది. మూసారాంబాగ్, గోల్నాక, అంబర్‌పేట్‌ల వద్ద కూడా ఇదే పరిస్థితి. 
  • మురికి నీరు నిలవడంతో దోమలు విపరీతంగా ఉండి.. సమీప ప్రాంతాల వాసులు రోగాలబారిన పడుతున్నారు. 
  • అంబర్‌పేట్‌ వద్ద మురుగు శుద్ధికేంద్రం వద్ద నది నీటిలోని చెత్తా చెదారాన్ని మాత్రమే తొలగిస్తున్నారు. హానికర రసాయనాలను తొలగించే ఎఫ్లూయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ లేకపోవడం ఆందోళనకరం. 

ఉప్పల్‌– ప్రతాప్‌సింగారం: పచ్చని విషం 

  • నగరం నుంచి మూసీ నది బయటికి వెళ్లే ఫిర్జాదిగూడ, పర్వతాపూర్, కాచవాని సింగారం, ప్రతాప సింగారం ప్రాంతాల్లో మూసీ నది ‘పచ్చని విషాన్ని’వెదజల్లుతోంది. 
  • మూసీ కాలువలకే నేరుగా మోటార్లు బిగించి నీటిని తోడి.. పొలాలకు మళ్లిస్తున్నారు. 
  • ఈ కలుషిత నీటితోనే పాలకూర, తోటకూర, మెంతి, కొత్తిమీర, పుదీనా, గంగవాయిలి తదితర ఆకుకూరలు, పశువుల కోసం గడ్డి పండిస్తున్నారు. ఆకుకూరలను ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. 
  • మూసీ నీటిలోని విషపూరిత రసాయనాలు, హానికర పదార్థాలు ఈ పంటల్లోకి చేరుతున్నాయి. 
  • కాచవాని సింగారం, ప్రతాప సింగారం ప్రాంతంలో పలు చోట్ల బోర్లు వేసినా.. కలుషిత నీరే వస్తోందని స్థానికులు వాపోతున్నారు. దీనివల్ల చర్మవ్యాధులు, ఇతర రోగాలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. 
  • పంటలకు మూసీ నీటిని తరలిస్తున్న సమయంలో చుట్టూ రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో భయంకరమైన దుర్గంధం వ్యాపిస్తోంది. 
  • మూసీ జలాలు, కలుషిత గాలి కారణంగా ఇళ్లకు వినియోగించిన ఉక్కు తుప్పుపట్టి గోడలకు, పైకప్పులకు పగుళ్లు వస్తున్నాయని రియల్‌ఎస్టేట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 

మూసీ దుస్థితి ఇదీ..
వికారాబాద్‌ జిల్లా అనంతగిరి కొండలు మూసీ జన్మస్థానం. అక్కడి నుంచి సుమారు 90 కిలోమీటర్ల మేర ప్రవహించి.. బాపూఘాట్‌ వద్ద హైదరాబాద్‌లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడి నుంచి నగర శివార్లలోని ప్రతాప సింగారం వరకు సుమారు 44 కిలోమీటర్లు నగరంలో ప్రవహిస్తుంది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక వాడల నుంచి నిత్యం 140 కోట్ల లీటర్ల మురుగునీరు నదిలోకి చేరుతోంది. పారిశ్రామిక వ్యర్థాలతో నదిలో రసాయన కాలుష్యం పెరుగుతోంది. నదిపై ఉన్న ఐదు మురుగు శుద్ధి కేంద్రాల్లో నిత్యం 70 కోట్ల లీటర్ల మురుగు నీటిని మాత్రమే శుద్ధి చేస్తున్నారు. మరో పది చోట్ల మురుగు శుద్ధి కేంద్రాలు, పలు చోట్ల రీసైక్లింగ్‌ యూనిట్లు నిర్మించాలని ప్రణాళికలు కూడా వేశారు. కానీ అమల్లోకి రాలేదు. 

మూసీ ప్రక్షాళన రెండోదశ ఏదీ? 
మూసీని కాలుష్యం కోరల నుంచి రక్షించాలంటే రెండోదశ ప్రక్షాళనను తక్షణం చేపట్టాల్సి ఉంది. ఇందుకు రూ.1,200 కోట్లు అవసరం. మూసీ నది ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఐదేసి చొప్పున మొత్తం పది సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. మరో నాలుగు చోట్ల రీసైక్లింగ్‌ యూనిట్లు నిర్మించాల్సి ఉంది. దీనిపై జలమండలి ప్రతిపాదనలు రూపొందించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. 

కాగితాలపైనే సుందరీకరణ ప్రాజెక్టు 
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మూసీ ప్రవహిస్తున్న మార్గం వెంట రహదారులు, ఫ్లైఓవర్లు, పార్కులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటు సౌకర్యం, ఇటు మూసీ సుందరీకరణకు తోడ్పడే ఈ ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్లతో ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. కానీ ఇదంతా కాగితాలకే పరిమితమైపోయింది. ఇందులో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ రిజర్వాయర్ల నుంచి బాపూఘాట్‌ వరకు (19 కిలోమీటర్లు, రూ.647.98 కోట్ల వ్యయం), బాపూఘాట్‌ నుంచి నాగోల్‌ బ్రిడ్జి వరకు (21.50 కిలోమీటర్లు, రూ.2,162.01 కోట్లు వ్యయం), నాగోల్‌ బ్రిడ్జి నుంచి ఔటర్‌రింగ్‌ రోడ్డు (గౌరెల్లి) వరకు (15 కిలోమీటర్లు, రూ.155.52 కోట్లు వ్యయం) అంచనాలను రూపొందించారు. ఇవి అమల్లోకి వస్తే.. నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు కూడా తప్పుతాయి. 

దేశంలోనే నాలుగో స్థానం 
దేశంలోని అత్యంత కాలుష్యభరిత నదుల్లో మూసీ నాలుగో స్థానంలో ఉండడం నది దుస్థితికి అద్దం పడుతోంది. హైదరాబాద్‌ పరిధిలో నదిలో టీడీఎస్‌ (టోటల్‌ డిసాల్వ్‌డ్‌ సాలిడ్స్‌), బీఓడీ (బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌–బీఓడీ)లు ప్రమాదకర స్థాయికి చేరుకోవడం ఆందోళనకరంగా మారింది. దీంతో సూక్ష్మజీవులు వినియోగించే ఆక్సిజన్‌ పరిమాణం కనిష్ట స్థాయికి పడిపోయింది. వ్యర్థ రసాయనాలు అత్యధికంగా కలవడం వల్ల కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (సీఓడీ) కూడా బాగా పెరిగినట్లు తేలింది. సాధారణంగా నీటిలో సీఓడీ ఉండకూడదు. కానీ పరిస్థితి చేయిదాటింది. ఇక నీటి క్షారత (పీహెచ్‌) పెరిగింది. కొద్దినెలలుగా మూసీ నదిలో కాలుష్య పరిమితి ప్రమాదకర స్థాయిలో పెరిగిందని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తాజా నివేదిక వెల్లడించింది. 


ఉండాల్సిన పరిమితి.. (ప్రతి లీటర్‌ నీటికి మిల్లీగ్రాముల్లో..) 
టీడీఎస్‌ (నీటిలో కరిగి ఉన్న ఘన పదార్థాలు): 500  
బీఓడీ (బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌): 4 
సీఓడీ (కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌): 0 (అసలు ఉండరాదు) 
పీహెచ్‌ (నీటి ఆమ్ల/క్షార లక్షణం): 6.5 

ఆకుకూరలు పండిస్తున్నాం.. 
‘‘మూసీ నీటితోనే అన్ని రకాల ఆకుకూరలు పండిస్తున్నాం. రోజూ పొద్దున్నే ఉప్పల్‌ మార్కెట్‌కు తరలిస్తాం. మూసీ నీళ్లు బాగా లేవని తెలిసినా తప్పదు. బోరు వేసినా కలుషిత నీళ్లే వస్తున్నాయి..’’
 – వీరమణి, ఫిర్జాదిగూడ 


ఏళ్లుగా బట్టలు ఉతుకుతున్నాం 
‘‘మా తాతల కాలం నుంచి మేం లంగర్‌హౌజ్‌ టిప్పుఖాన్‌ బ్రిడ్జి వద్ద బట్టలు ఉతుకుతున్నాం. దాదాపు 25 మంది వరకు ఈ పనిలో ఉన్నాం. నదిలో నీటిని పక్కన ఏర్పాటు చేసుకున్న నీటి హౌజుల్లో నింపుకొని వాడుతున్నాం..’’  – కమల్‌సింగ్, లంగర్‌హౌస్‌ 

ఐదేళ్లుగా మెంతి పండిస్తున్నాం 
‘‘గత ఐదేళ్లుగా మూసీ నది వెంట ఒడ్డుపై మెంతి పంట పండిస్తున్నాం. ఆరు వారాల్లోగా మెంతి పెరుగుతుంది. కిలోకు 400 కట్టలదాకా వస్తాయి. రూ.10కి ఎనిమిది కట్టల చొప్పున గుడిమల్కాపూర్‌లో విక్రయిస్తున్నాం..’’  – గజేందర్‌సింగ్, కార్వాన్‌ 

డంపింగ్‌ యార్డును తలపిస్తోంది 
‘‘చెత్తా చెదారం, ప్లాస్టిక్‌ బ్యాగులు, పారిశ్రామిక వ్యర్థాలతో మూసీనది డంపింగ్‌ యార్డుగా మారిపోయింది. పురానాపూల్‌–చాదర్‌ఘాట్‌ మధ్య ఒకప్పుడు సుందరంగా ఉండేది. ఇప్పుడు కాలుష్యకాసారంగా కనిపిస్తోంది. మురుగు నీటి శుద్ధి సరిగా జరగడం లేదు..’’  – ప్రొఫెసర్‌ పురుషోత్తమరెడ్డి, పర్యావరణవేత్త  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement