
సాక్షి, హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, పాలంపేట గ్రామ పరిధిలో ఉన్న కాకతీయుల కాలం నాటి రామప్ప దేవాలయ దుస్థితిపై పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఈ కథనాలను హైకోర్టు తనంతట తానుగా(సుమోటో) ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)గా పరిగణించింది. దీనిలో కేంద్ర పురావస్తు శాఖ కార్యదర్శి, పురావస్తు, సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్, రాష్ట్ర పురావస్తు శాఖ కార్యదర్శి, డైరెక్టర్, జిల్లా కలెక్టర్‌లను ప్రతివాదులుగా చేర్చింది. దీనిపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది.
ఇటీవల కురిసిన వర్షాలకు రామప్ప దేవాలయ ప్రహరి కూలిపోయింది. అధికారుల నిర్లక్ష్యంతో ఆలయం శిథిలమైపోతోంది. దీనిపై ఇటీవల పత్రికల్లో కథనాలు వచ్చాయి. వీటిని చూసిన న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు రామప్ప దేవాలయ దుస్థితిని లేఖ రూపంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిని ఆయన పిల్ కమిటీకి నివేదించగా, కమిటీలో సభ్యులందరూ కూడా ఈ కథనాన్ని పిల్‌గా పరిగణించాలని ఏకగ్రీవంగా తమ అభిప్రాయాన్ని తెలిపారు. దీంతో పత్రికా కథనాలను పిల్‌గా తీసుకోవాలని రిజిస్ట్రీని ఏసీజే ఆదేశించగా, వీటిని పిల్‌గా మలిచారు.