
కొండూరు బీటులో పదికిపైగా శివాలయాలు
ఆలయాల పక్కనే వెలుగులోకి వచ్చిన గుహలు
4వ శతాబ్దిలో శైవం వర్థిల్లిన ఆనవాళ్లు
పక్కనే రాతిబండపై ఆయుధాల గుర్తులు
ఇక్కడే శివుని పాదముద్రలు, బండపై శాసనాలు
ఈ ప్రాంతమే కైలాసకోనగా ప్రాచుర్యం
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లాలోని సిద్దవటం అటవీ ప్రాంతమైన లంకమల అభయారణ్యంలో 4వ శతాబ్ది నాటి మానవుల ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాక.. ఈ ప్రాంతంలో ఇంకా ఎలాంటి విశేషాలు, చరిత్ర దాగున్నాయన్న ఉత్సుకత పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగా రోజుకో కొత్త విషయం బయటికి వస్తోంది. కొత్తగా సిద్దవటం అటవీశాఖ క్షేత్రాధికారిణి బి.కళావతి.. వెలుగులోకి తెచ్చిన ఫొటోల ఆధారంగా మరిన్ని విషయాలు బాహ్య ప్రపంచంలోకి వచ్చాయి.

సాక్షిలో ‘ఆధ్యాత్మిక క్షేత్రం.. లంకమల’ కథనం ద్వారా పలు ఆసక్తికర అంశాలను వెలుగులోకి తేవడం తెలిసింది. ప్రస్తుతం ఆ కథనానికి మరింత బలం చేకూర్చే మరిన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. ఒకే చోట గుహ, బండపై శాసనం, శిథిలమైన శివాలయాల ఆనవాళ్లు, శివుని పాద ముద్రలు, అక్కడే పైనుంచి కిందికి దూమికే జలపాతం.. ఇలా అన్నీ ఆధారాలు వెలుగులోకి వచ్చిన ఈ ప్రాంతానికి కైలాసకోనగా ప్రాచుర్యం ఉంది.
అంటే శివుడు నివసించిన ప్రాంతమని అర్థం. కాబట్టి శైవం ఏ స్థాయిలో ఇక్కడ వర్దిల్లిందో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. అందిన ఆధారాలను పురావస్తుశాఖ క్షుణ్ణంగాపరిశీలిస్తోంది.
బండలపై ఆధారాలు
ఈ ప్రాంతంలో శైవ క్షేత్రం వర్థిల్లిందని.. ఆనాటి శైవులు బండలపై శాసనాలు, ఇతర గీతల ద్వారా వెల్లడవుతోంది. శాసనాలను బట్టి 4వ శతాబ్దినాటి శైవులు ఇక్కడ ఉన్నట్టు నిర్ధారిస్తున్నారు. అప్పట్లో ఎలాంటి ఆయుధాలు వినియోగించారో.. తెలిపేలా బండలపై వాటి ఆకృతి తెలిపేలా చెక్కారు. మరోచోట శాసనం, పక్కనే శివలింగ ఆకారం ఉన్నాయి. ఇక్కడి శిథిల ఆలయాల నిర్మాణం కోసం చుతురస్రాకారంలో ఉండే బండలను వినియోగించారని, వాటిని బట్టి స్పష్టం అవుతోంది.

పై కైలాసం.. జారే జలపాతం
శైవ క్షేత్రాలున్నట్టు గుర్తించిన ప్రాంతానికి సమీపంలోనే పై కైలాసకోన ఉంది. ఇది అద్భుతమైన జలపాతం. పై నుంచి జలపాతం కిందకు దూకే ప్రాంతం అత్యంత భయంకరంగా కనిపిస్తుంది. కొండనడుమ దూకే జలపాత ప్రాంతం ప్రకృతి సౌందర్యాన్ని తలపిస్తుంది. ఈ జలపాతంపై నుంచి కిందకు జారితే కైలాసానికి చేరినట్టే. అందుకనే దీన్ని పై కైలాసంగా ప్రాచుర్యంలో ఉంది. జలపాతం దిగువన గుహలు, ఆలయాలతో కూడిన ప్రదేశమే దిగువ కైలాసకోన.
అక్కడే గుహ.. ఆలయాలు
లంకమల మొత్తం 36 వేల హెక్టార్ల మేర విస్తరించి ఉండగా.. అందులో సిద్దవటం రేంజి పరిధిలో 26 వేల హెక్టార్ల అభయారణ్యం ఉంది. అడవిలోని కొండూరు బీటులో శైవ క్షేత్ర ఆనవాళ్లు విస్తృతంగా లభ్యమయ్యాయి. దిగువ కైలాసకోనగా పిలువబడే.. ఈ ప్రదేశంలో అర ఎకరం విస్తీర్ణంలో పదికిపైగా శివాలయాల శిథిలాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన పునాదుల బండరాళ్లు, వాటి నిర్మాణం కనిపిస్తున్నాయి.
పడిపోయిన గోడలు, వాటి శిథిలాలు ఉన్నాయి. దీన్ని ఆధారంగా చేసుకుంటే వాటిని ఆలయాలుగా భావిస్తున్నారు. ఈ చోటనే గుహను కూడా గుర్తించారు. ఆలయాల వద్ద పూజల నిర్వహణ, గుహలో సిద్దులు, యోగులు తపస్సు చేసుకునే వారు. ఇక్కడే శివుడ్ని ఆరాధిస్తున్న వీరుడి విగ్రహం లభ్యమైంది.
ఈ ప్రాంతం దిగువ కైలాసకోనగా ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది. ఈ అడవికి సమీపంలో సిద్దవటం గ్రామం ఉంది. అంటే సిద్దులకు ఈ ప్రాంతం నివాసమని భావిస్తున్నారు. దీనివల్లె సిద్దవటం అని పేరొచ్చిందని చెబుతారు.
Comments
Please login to add a commentAdd a comment