కన్నీటి దిగుబడి | Farmers across Annamayya district have suffered losses | Sakshi
Sakshi News home page

కన్నీటి దిగుబడి

Published Thu, Mar 27 2025 5:41 AM | Last Updated on Thu, Mar 27 2025 5:42 AM

Farmers across Annamayya district have suffered losses

కర్బూజ, దోసరైతు కుదేలు

పెట్టుబడి కూడా రాని వైనం

దోచుకుంటున్న దళారులు 

పట్టించుకోని ప్రభుత్వం

రాయచోటి/రైల్వేకోడూరు అర్బన్‌: అన్నమయ్య జిల్లాలో దోస, కర్బూజ పంటలు పండించే రైతులకు ఫలితాలు.. ఈ ఏడాది కూడా ఆశాజనకంగా లేవు. నట్టేట ముంచి అప్పులపాలు చేస్తున్నాయి. ఫిబ్రవరి నెల ఆఖరులో, మార్చి మొదటి వారంలో దోస 22 రూపాయలు, కర్బూజ 18 రూపాయలు ధరలు పలకడంతో కొందరు రైతులు లాభపడ్డారు. దీంతో రైతులు కొండంత ఆశ పెట్టుకొన్నారు. 

కానీ అందరి దిగుబడి చేతికి వచ్చే సరికి.. దళారులు మోసాలతో ధరలను పాతాళానికి పడేశారు. జిల్లాలో భారీగా దోస, కర్బూజ పంటలు సాగు చేశారు. ముఖ్యంగా రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి ప్రాంతాలలో వందలాది మంది రైతులు వేశారు. తెగుళ్లు, దళారీల మోసాలు, గిట్టుబాటు ధరలు లేక భారీగా నష్టపోతున్నారు. ఓబులవారిపల్లిలో కోహినూర్‌ దోస వేసి ఎగుమతులు లేక రూ.లక్షల్లో నష్టపోయారు. 

ఎరువులు, పురుగు మందుల పిచికారీ కోసం.. 
దోస, కర్బూజ పంటల సాగు ప్రారంభ దశ నుంచే రైతులకు మందుల పిచికారీ, ఎరువులు పెనుభారంగా మారింది. విత్తన దశ నుంచి క్రిమి సంహారక మందులకు వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. దీనికి తోడు పూతకు పిందెలు వచ్చే సమయం నుంచి తెగుళ్ల నివారణకు మందుల పిచికారీ అధికంగా ఉంటుంది. వాతావరణ మార్పుల వల్ల పూత రావడానికి, పిందె నిలవడానికి, తెగుళ్లకు రెండు రోజులకు ఒక సారి అయినా మందులు పిచికారీ చేయాలి. కేవలం మందులకే రైతులు దుకాణాల్లో రూ.లక్షలు అప్పులు చేశారు.

తూకాల్లో కోత 
రైతులు పంటకు ధరలు పడి పోయి కన్నీరు కారుస్తుంటే.. పలువురు దళారీలు ఇదే అదునుగా మరింతగా రేటు తగ్గిస్తున్నారు. ఇక్కడి దిగుబడిని ఇతర రాష్ట్రాలకు కూడా తరలిస్తుంటారు. ఇదే అదునుగా రైతులకు, వ్యాపారులకు మధ్య దళారులు చేరి అక్కడ ఒకరేటు, రైతులకు ఒకరేటు, లోడ్‌ తూకాలలో కోత, కమీషన్‌లు ఇలా రకరాలుగా మోసం చేస్తున్నారు.   

కరుణించని పాలకులు 
మార్కెట్‌ ధరలు లేక అప్పుల ఊబిలో కూరుకుపోయిన దోస రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. గిట్టుబాటు ధరలు రావడం లేదని రైతు సంఘాల నేతలు గళమెత్తి అరుస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. కనీసం జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం.. కష్టాల కడలిలో ఉన్న కర్షకులను పరామర్శ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ ప్రాంతం ఎమ్మెల్యేలు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రైతులు కోరుతున్నారు. 

రైతులను ఆదుకోవాలి  
సంబేపల్లి మండలం రెడ్డివారిపల్లె పంచాయతీ సీఎం కొత్తపల్లిలో రైతు రామచంద్ర 4 ఎకరాలలో రూ.6 లక్షలు ఖర్చు చేసి సాగు చేశారు. దళారులు అడిగినంతకు కాయలు ఇవ్వలేదని వాటిని కొనుగోలు చేయలేదు. కాయలు తోటలోనే కుళ్లిపోవాల్సిన పరిస్థితి.  పండించిన పంటను మార్కెట్‌కి తరలించలేక రైతు తోటలోనే కూలిపోయాడు. ఇలా వేల మంది రైతులు దోస, కర్బూజ తోటలను సాగు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కావున ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. – బాలకృష్ణారెడ్డి, రైతు సంఘం రీజనల్‌ కోఆర్డినేటర్, అన్నమయ్య జిల్లా  

ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పు రావాలి  
జిల్లాలో సాగవుతున్న పంటలో సగం ఒక పైగా రైతులు పండ్ల తోటలు వేస్తున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని మంచి ఆదాయాన్ని గడించవచ్చని దోస పంట సాగు చేశారు. రైతులు పండించిన పంటకు మంచి గిట్టుబాటు ధరలు రావాలంటే ప్రజలు ఆహారపు అలవాట్లను మార్చుకుంటే మంచిది. ప్రతి ఒక్కరూ ప్రతి రోజు మంచి ఆరోగ్యం కోసం ఆహారంలో 200 గ్రాములు పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. జిల్లాలో పండించిన రైతుకు బాగుంటుంది.   – రవిచంద్రబాబు, జిల్లా ఉద్యానవన అధికారి, అన్నమయ్య జిల్లా 

అనుకూలించని రేటు
కష్టపడి పండించిన కర్బూజాకు మార్కెట్‌ ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కొంత మంది రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా దోస, పుచ్చకాయ పంటను సాగు చేశారు. మార్కెట్లో కేజీ దాదాపు రూ.15 నుంచి రూ.20 పలుకుతోంది. దళారులు కేజీ రూ.5 లేదా రూ.8 మాత్రమే చెల్లిస్తున్నారు.

కానీ ఎకరాకు పెట్టుబడి 50 వేల నుంచి లక్ష రూపాయలకు పైగా అవుతుందని రైతులు పేర్కొంటున్నారు. దీంతో పంటపై పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పొలంలోనే కాయలను వదిలి వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వాపోతున్నారు.  

దళారీల సిండికేటుతో ఇక్కట్లు 
నా పేరు ఎద్దుల ప్రసాద్‌. మాది రైల్వేకోడూరు. పది ఎకరాలలో కర్బూజా పంటను సాగు చేశా. దళారుల సిండికేట్‌ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలోని వ్యాపారులు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా కలిసి వాట్సాప్‌ గ్రూపులలో దోస, కర్బూజా ధరలను పంచుకుంటున్నారు. 

ఒక వ్యాపారి తోట దగ్గరికి వచ్చి కిలో 5 రూపాయలతో కొనుగోలు చేస్తామని చెప్పి వెళ్లిన విషయాన్ని వాట్సాప్‌ గ్రూపుల ద్వారా రైతు పేరుతోపాటు గ్రూపులలో షేర్‌ చేస్తున్నారు. దీంతో మిగిలిన వ్యాపారులు అదే ధరకు లేదా మరో రూపాయి అదనంగా ఇస్తామని మాత్రమే చెబుతున్నారు.  

పెట్టుబడి కూడా రాలేదు 
నా పేరు నిరంజన్‌రెడ్డి. మా ఊరు చిన్నమండెం మండలం రెడ్డివారిపల్లె. 20 ఎకరాల్లో దోస సాగు చేశా. పంట దిగుబడి వచ్చే వరకు 30 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఉద్యానవన అధికా రుల సూచనలతో పురుగు నివారణ మందులు పిచికారీ చేశాను. 

ఎకరాకు నాలు గైదు టన్ను లు వస్తుందని ఆనందపడ్డాను. ప్రకృతి కరుణించలేదు, తెగుళ్లు వీడలేదు. ఫలితంగా సగం తోట దెబ్బతిన్నది. వచ్చిన దిగుబడితోనైనా పెట్టుబడి వస్తుందని ఆశించాను. మార్కెట్‌కి వెళ్తే ధరలు లేక, పెట్టిన పెట్టుబడి రాక ఆర్థికంగా కుంగిపోయే పరిస్థితులు వచ్చాయి.    

అప్పుల పాలైన అన్నదాత  ఇదీ ఈ ఇద్దరి రైతుల ఆవేదనే కాదు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement