
కంచేడి పువ్వులతో చవులూరించే కూరలు
లొట్టలేసుకునితింటున్నగిరిజనులు
ఔషధ గుణాలు పుష్కలం
సంతల్లోఅమ్మకాలు జోరు
సర్వరోగనివారిణిగా వినియోగం
పూర్వం నుంచిగిరిజన ఆచార వంటకంగా ఆదరణ
కంచేడి పూలు... అందంగా కనిపించే వీటిని గిరిజనులు లొట్టలేసుకుని మరీ తింటారు... వాటితో ఘుమఘుమలాడే కూరలు చేసుకుని ఇష్టంగా లాగించేస్తారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో లభించే వీటికి అల్లూరి జిల్లాలో మంచి డిమాండ్ ఉంది. ఏజెన్సీ వాసులే కాకుండా ఇప్పుడు మైదాన ప్రాంతవాసులు కూడా వీటిని తినేందుకు అలవాటు పడ్డారు.
సాక్షి,పాడేరు: అడవుల్లోను, గ్రామాల సమీపంలోను కంచేడి చెట్లకు మార్చి, ఏప్రిల్ నెలల్లో పూలు పూస్తాయి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న వీటిని సర్వరోగ నివారిణిగా గిరిజనులు భావిస్తారు. ఈ పూలను ఈ సీజన్‌లో రోజువారీ కూరగా వండుకుని ఇంటిల్లాపాదీ తింటారు. మైదాన ప్రాంత ప్రజలు కూడా కంచేడి పూల కూర తినడానికి అలవాటుపడ్డారు. అల్లూరి జిల్లాలోని వారపుసంతల్లో ఈ పూల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. శ్రీరాముడు వనవాసం చేసే సమయంలో వీటిని ఉడకబెట్టి తిన్నాడన్న పురాణగాథ కూడా ప్రచారంలో ఉంది.

ఈ విరులు.. ఆరోగ్య సిరులు
ఈ పూల కూర మంచి రుచికరంగా ఉండడంతో పాటు, ఔషధగుణాలు కలిగిఉండడంతో గిరిజనులు ఇష్టంగా తింటారు. రక్తహీనత, కీళ్ల సమస్య, నొప్పులు, అజీర్ణం, కంటిచూపు మందగించడం వంటి రుగ్మతలు ఉన్న వారు ఈ కూరను తింటే మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. మహిళల్లో పలు శారీరక రుగ్మతలను నయం చేస్తుందని గిరిజనుల నమ్మకం. వీటితో వేపుడు, ఇగురు కూరలను వండుకుని తింటున్నారు. కొంతమంది ఎండుచేప, ఎండు రొయ్యలను కూడా కలిపి ఇగురు కూరగా తయారు చేస్తారు.

మరి కొంతమంది గిరిజనులు ఈపూలను బాగా ఎండబెట్టి వరిగెలు తయారు చేసుకుని, భద్రపరుచుకుని ఏడాది పొడవునా వండుకుని తింటారు. బుట్ట కంచేడిపూలు రూ.600 నుంచి రూ.800 ధరతో అమ్ముతున్నారు. సంతల్లో చిన్న పోగులుగా వేసి వాటాను రూ.50తో అమ్మకాలు విక్రయిస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ పూలు లభిస్తాయి.
అనారోగ్య సమస్యలు
దూరం కంచేడిపూలను వండుకుని తింటే మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఏడాదిలో రెండు నెలల మాత్రమే పూసే కంచేడి పూలను పూర్వం నుంచి తింటున్నాం. ఈకూర రుచికరంగా ఉండడంతో పాటు శరీరంలోని అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. కంచేడి పూలను మహిళలు అధికంగా తింటారు. – చిట్టిబాబు, ఆయుర్వేద వైద్యుడు,కుజ్జెలి గ్రామం, పాడేరు మండలం