
పనస కాయలతో విలువఆధారిత ఉప ఉత్పత్తులు
తయారీ, మార్కెటింగ్ ద్వారా అధిక ఆదాయం
ఆ దిశగా శిక్షణ ఇస్తున్న పందిరిమామిడి కేవీకే
మార్చిలో మరో బ్యాచ్‌కు శిక్షణ
గిరిజనుల ఆర్థిక పరిస్థితిలో మార్పు తేవాలి, వారి ఆదాయం రెట్టింపుకావాలన్న లక్ష్యంతో పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం (Krishi Vigyan Kendra) పనిచేస్తోంది. ఇందుకోసం గిరిజనులకు అందుబాటులో ఉండే వనరుల వినియోగం, విలువ ఆధారిత ఉప ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇస్తోంది. దీనిలో భాగంగా జిల్లాలో లభించే పనస పండ్లతో పసందైన వంటకాల తయారీ, మార్కెటింగ్‌పై శిక్షణ అందిస్తోంది. మార్చి నెలలో రెండో బ్యాచ్‌కు శిక్షణ ఇవ్వనున్నారు. పసన పండ్ల లాభాలు తెలియజేసి, వాటి నుంచి అదనంగా ఆదాయం సమకూర్చుకునేలా శిక్షణ అందజేయనున్నారు.
రంపచోడవరం: అల్లూరి సీతారామరాజు జిల్లాలో విరివిగా లభించే పనసకాయలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో పందరిమామిడి (Pandarimamidi) కృషి విజ్ఞాన కేంద్రం గిరిజనులకు అవగాహన కల్పిస్తోంది. పనస తొనలతో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేయడంలో ఇప్పటికే ఒక దఫా 30 మందికి శిక్షణ ఇచ్చారు. ఈ ఏడాది మార్చిలో మరో బ్యాచ్‌కు శిక్షణ ఇచ్చేందుకు కేవీకే ప్రణాళిక సిద్ధం చేసింది.
రెండు లక్షల చెట్లు
జిల్లాలో రెండు లక్షల వరకు పనస చెట్లు ఉన్నట్టు ఉద్యానవన శాఖాధికారుల అంచనా. మారేడుమిల్లి, వై.రామవరం, రంపచోడవరం, అడ్డతీగల, చింతూరు, పాడేరు, చింతపల్లి, అరకు (Araku) తదితర 19 మండలాల్లో పనస చెట్లు ఎక్కువగా ఉన్నాయి. గిరిజనులు తోటలుగానే కాకుండా ఇళ్ల వద్ద, పంట పొలాల్లో కూడా పనసను పెంచుతారు. పనస కాయల (Jack Fruit) దిగుబడి ఫిబ్రవరిలో ప్రారంభమై మే వరకు లభిస్తాయి. పనస మొదటి దశలో తొనలు, విత్తనాలు(పనస పిక్కలు) తయారు కావు.
వీటిని ఎక్కువగా కూరలు, పచ్చళ్ల తయారీకి ఉపయోగిస్తారు. గింజలు అభివృద్ధి చెందే దశలో కూడా కూర పనసగా ఉపయోగిసా్తరు. తొనలు వచ్చినా తీí³, వాసన లేకుండా ఉంటాయి. వీటిని చిప్స్ తయారీలో ఉపయోగిస్తారు. పనస తొక్కు పచ్చడి, బజ్జీలు, పకోడి, బిర్యానీ, హల్వా, చాక్లెట్స్, తాండ్ర, జామ్, జ్యూస్, ఐస్‌క్రీమ్, పనస పిక్కల పిండితో పూరీలు, అప్పడాలు తయారు చేయవచ్చు. కేవీకే శాస్త్రవేత్తలు వీటి తయారీపై ఇప్పటికే గిరిజన యువతకు శిక్షణ ఇచ్చారు.
ఆర్థిక భరోసా
జిల్లాలో మేలుజాతి పనస ఉత్పత్తులు సీజన్‌లో లభిస్తాయి. అనేక పోషక విలువలు ఉన్న పనసను గిరిజనులు వారపు సంతల్లో, గ్రామాలకు వచ్చే వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. కొనుగోలు దారులులేకపోతే పశువులకు ఆహారంగా వేస్తున్నారు. గిరిజన రైతులు గరిష్ట ధర పొందలేకపోతున్నారు. గతంలో కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ పొందిన పలువురు ఉప ఉత్పత్తులు తయారు చేసి వారపు సంతల్లో విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు.
పోషక విలువలెన్నో..
పనసలో మెండైన పోషక విలువలు ఉన్నాయి. విటమిన్లు, పీచుపదార్థం, ఖనిజ లవణాలు ఉన్నాయన్నారు. దీంతో పనస ఉప ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్ ఉంది. గిరిజన యువత కొద్దిపాటి మెలకువలు పాటిస్తే పనసకాయలతో పచ్చడి, చిప్స్, పనస జ్యూస్, జామ్‌తోపాటూ పలు రకాల ఉత్పత్తులు తయారు చేయవచ్చని కేవీకే శాస్త్రవేత్తలు తెలిపారు.
నోరూరించే చాక్లెట్లు
పనస తొనలతో తయారు చేసే చాక్లెట్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా సులభంగా తయారు చేయవచ్చు. కేజీ పనస తొనలను వేడి నీటిలో ఉడికించి, గుజ్జుగా తయారు చేసుకోవాలి. గిన్నెలో నెయ్యి వేసుకుని పనసగుజ్జు, కరిగించిన పాలపొడి, వేయించిన కోకో పౌడరు, పంచదార వేసి కాసేపు వేయించుకోవాలి. చల్లారిన తరువాత ముక్కలుగా చేసుకోవాలి. అంతే.. పనస చాక్లెట్లు సిద్ధమవుతాయి.
చదవండి: వైజాగ్‌పై చంద్రబాబు సర్కారు శీతకన్ను!
కరకరలాడే చిప్స్‌పచ్చి పనస తొనలతో వీటిని తయారు చేస్తారు. అర కేజీ తొనల నుంచి పిక్కలు వేరు చేయాలి. తరువాత అర ఇంచీ మందంతో పొడవుగా కోయాలి. కోసిన పనస తొనల ముక్కలను గుడ్డలో కట్టి మరిగించిన నీళ్లలో రెండు నిమిషాల పాటు ఉంచి బయటకు తీయాలి.తరువాత వాటిని అరబెట్టుకోవాలి. ఒక పాత్రలో నూనె వేసి తగినంత పసుపు వేసి మరిగించాలి. నూనె బాగా మరిగిన తరువాత అరబెట్టుకొన్న పనస తొనల ముక్కలను వేయించాలి. వాటిపై ఉప్పు,కారం జల్లుకుంటే వేడివేడి చిప్స్ రెడీ
తాండ్ర తయారీ ఇలా
పిక్కలు వేరు చేసిన కేజీ పనస తొనలను వేడినీళ్లలో వేసుకుని మరిగించుకోవాలి. మెత్తబడిన పనస తొనలను మిక్సర్‌లో వేసుకొని గుజ్జుగా చేసుకోవాలి. ట్రేలలో సమాంతరంగా ఈ గుజ్జును వేసుకోవాలి. తేమ ఆరే వరకు ఎండలోగాని, డ్రయర్ల గాని ఉంచుకోవాలి. తేమ ఆరిపోతే తాండ్ర ట్రేలో నుంచి సులభంగా వస్తుంది. వీటితో పాటు మరికొన్ని విలువ ఆధారిత ఉత్పత్తులపై శిక్షణ ఇవ్వనున్నారు.
మార్చిలో మరోదఫా శిక్షణ
పందిరిమామిడి కేవీకేలో మార్చి నెలలో మారోమారు పనసతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇవ్వనున్నాం. ఈ ఏడాది ఏజెన్సీలో 25 ఎకరాల్లో పనస మొక్కలు నాటించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. జిల్లాలో అధిక సంఖ్యలో పనసపండ్లు లభిస్తున్నా గిరిజనులు పూర్తిస్థాయిలో ఆదాయం పొందలేకపోతున్నారు. పనసతో విలువ ఆధారిత ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. గిరిజన యువతను ఆ దిశగా ప్రోత్సహించేందుకు కేవీకే కృషి చేస్తోంది.
– క్రాంతి, ఉద్యానవన శాస్త్రవేత్త, కేవీకే, పందిరిమామిడి
Comments
Please login to add a commentAdd a comment