రంపచోడవరం: ఏజెన్సీ ప్రాంతంలో విరివిగా లభించే పనస ద్వారా గిరిజనులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా పనసతో వివిధ విలువ ఆధారిత పదార్థాల తయారీలో గిరిజన యువత శిక్షణ ఇస్తోంది. రెండేళ్ల కాలంలో వంద మంది ఆసక్తి కలిగిన గిరిజన యువత ఇందులో శిక్షణ తీసుకుంది. పనసలో విటమిన్–సి, కాల్షియం, ఐరన్, పోటాషియం, మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. ప్రస్తుత కాలంలో పచ్చికాయలు, పండ్లకు మంచి గిరాకీ ఉంది. ఈ నేపథ్యంలో కృషి విజ్ఞాన కేంద్రం వృతి నైపుణ్య శిక్షణ ఉచితంగా ఇస్తోంది. ఆగస్టు మొదటి వారంలో కొత్త బ్యాచ్‌కు శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి.
1164 హెక్టార్లలో పనస
విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పనస ఎక్కువగా లభ్యమవుతుంది. ఈ ప్రాంతాల్లో సుమారుగా 1,164 హెకార్లలో పనస చెట్లు ఉన్నాయి. రంపచోడవరం ఏజెన్సీలో మారేడుమిల్లి, వై.రామవరం మండలాల్లో సుమారు 120 హెక్టార్ల విస్తీర్ణంలో పనస సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి 4,332 టన్నుల పనస దిగుబడి వస్తుంది. పనస కాయ తొనలు, పనస పొట్టుతో కూరను ఎక్కువగా తయారు చేస్తారు.
అయితే కేవీకే శాస్త్రవేత్తలు పనస కాయలు, పండ్లతో చిప్స్, తాండ్ర, హల్వా, జామ్, ఐస్‌క్రీమ్, పనస తొనల పొడి, పనస పిక్కల పొడి, బజ్జీలు, పకోడి వంటి వాటి తయారీపై శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే శిక్షణ పొందిన గిరిజనులు స్వయం ఉపాధి పొందుతున్నారు. పనసలో పైబర్ ఎక్కువగా ఉండడంతో కేవీకే శాస్త్రవేత్తలు పిక్కలు, తొనలతో మన్యం జాక్‌ప్రూట్ పిండిని తయారు చేశారు. శరీరానికి పైబర్ అవసరమైన వారు ఈ పిండిని ప్రతి రోజూ చపాతీ, అన్నం, దోసెల పిండిలో 20 గ్రాముల వరకు కలుపుకుని తీసుకోవడం ద్వారా.. శరీరానికి పైబర్ పుష్కలంగా అందించవచ్చు. (క్లిక్: విద్యుత్ ఉత్పత్తిలో మేటిగా నిలిచి.. మహారత్న బిరుదు)
శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు
ఏజెన్సీలో ఎటువంటి పెట్టుబడి లేకుండా రైతులుకు పనస లభిస్తోంది. ఇక్కడ పండే పనస ద్వారా రైతులు పూర్తిగా ఆదాయాన్ని పొందలేకపోతున్నారు. పనసకు విలువ ఆధారితం జోడించడం ద్వారా మార్కెట్ విలువ పెరుగుతుంది. ఇందులో భాగంగా ఆసక్తి ఉన్న వారికి ఏటా పనసతో తయారు చేసే పదార్థాలపై శిక్షణ ఇస్తున్నాం.
– ఆదర్శ, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, పందిరిమామిడి
Comments
Please login to add a commentAdd a comment