Jack fruit
-
‘గుర్తు’పెట్టుకోండి.. పన్నీర్‌సెల్వంకు ‘పనస’
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రామనాథపురం నుంచి పోటీ చేస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీర్‌సెల్వంకు ఎన్నికల అధికారులు 'పనస కాయ' గుర్తును కేటాయించారు. రామనాథపురంలోని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన లాటరీ ద్వారా గుర్తును కేటాయించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న పన్నీర్‌సెల్వం.. తిరువాడనైలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో పనసకాయతో ఫోజులిచ్చి గుర్తు కేటాయింపును అధికారికంగా ప్రకటించారు. రామనాథపురంలో అదే పేరుతో ఉన్న మరో నలుగురు అభ్యర్థులతో ఈ మాజీ సీఎం తలపడనున్నారు. పన్నీర్‌సెల్వం బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఏఐఏడీఎంకే జెండాను, లెటర్‌హెడ్‌ను నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నించారు. అయితే మద్రాస్ హైకోర్టులో ఓడిపోయిన తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తమిళనాడులో 39 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఏప్రిల్ 19వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. -
బడ్డింగ్ మెథడ్‌లో గ్రాఫ్టింగ్ చేస్తూ.. పనస వైభవం!
కేరళలోని కొట్టాయంకు చెందిన రైతు వి.ఎ. థామస్ 8 ఏళ్ల క్రితం రబ్బర్ సాగుకు స్వస్తి చెప్పారు. 70 ఏళ్ల వయసులో రసాయనిక వ్యవసాయం వదిలి సేంద్రియ వ్యవసాయం చేపట్టారు. ఇంత వరకే అయితే పెద్ద విశేషం లేదు. కొట్టాయం దగ్గర్లోని చక్కంపుఝ గ్రామంలోని తమ 5 ఎకరాల కుటుంబ క్షేత్రాన్ని 400 రకాల పనస చెట్లతో జీవవైవిధ్యానికి చెరగని చిరునామాగా మార్చారు థామస్. బడ్ గ్రాఫ్టింగ్ లేదా బడ్డింగ్ మెథడ్‌లో గ్రాఫ్టింగ్ చేస్తూ కొత్త రకాలను సృష్టిస్తున్నారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ పనస తొనలను రుచి చూస్తారు. నచ్చిన రకాల మొక్కల్ని వెంట తెచ్చి నాటుకుంటారు. రెండేళ్లు, ఏడాదిన్నరలోనే కాపుకొచ్చే వియత్నాం, కంబోడియాల నుంచి కూడా కొన్ని పనస రకాలను సేకరించారు. మొక్కలతో పాటు ఎండబెట్టిన పనస తొనలను అమ్ముతూ ఎకరానికి ఏటా రూ.4 లక్షల ఆదాయం పొందుతున్నారు. ఎండబెట్టిన పచ్చి పనస కాయలను కిలో రూ. వెయ్యి. ఎండబెట్టిన పనస పండ్లను కిలో రూ. 2 వేలకు అమ్ముతుండటం విశేషం! ఇవి కూడా చదవండి: ‘వ్యవసాయ’ ఉద్గారాలు 31% కాదు.. 60%! -
పనస పండుతో పాఠోలి స్వీట్, టేస్ట్ అదిరిపోద్ది
పనస పాఠోలి తయారీకి కావల్సినవి: బియ్యం – కప్పు; పనసపండు తురుము – ఒకటిన్నర కప్పులు (తొనలను సన్నగా తురమాలి); పచ్చికొబ్బరి తురుము – పావు కప్పు; అరటి ఆకులు – పాఠోలీకి సరిపడా. స్టఫింగ్ కోసం: పచ్చికొబ్బరి తురుము – కప్పు; బెల్లం – ముప్పావు కప్పు; యాలుకలు పొడి – అరటీస్పూను. పనసపండుతో పాఠోలి.. తయారీ విధానమిలా: ►బియ్యాన్ని కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.మందపాటి బాణలిలో బెల్లం, నాలుగు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి వేసి మరిగించాలి. ► బెల్లం కరిగి నురగలాంటి బుడగలు వస్తున్నప్పుడు పచ్చికొబ్బరి తురుము వేయాలి. పాకంలో గరిట పెట్టి కలియతిప్పుతూ మిశ్రమం దగ్గర పడేంత వరకు మగ్గనివ్వాలి. ► నీరంతా ఇంకిపోయినప్పుడు అర టీస్పూను యాలకుల పొడి కలిపి చల్లారనివ్వాలి. ► ఇప్పుడు నానిన బియ్యంలో నీళ్లు తీసేసి బ్లెండర్లో వేయాలి ∙దీనిలోనే పనసపండు తురుము, కొబ్బరి తురుము వేసి మెత్తని పేస్టులా గ్రైండ్ చేయాలి. ► గ్రైండ్ అయిన మిశ్రమాన్ని గిన్నెలో తీసుకోవాలి ∙ఇప్పుడు అరటి ఆకులను శుభ్రంగా కడిగి, తడిలేకుండా తుడుచుకోవాలి. ► రుబ్బుకున్న బియ్యం పేస్టుని అరటి ఆకులపైన మందపాటి పొరలాగా వేసుకోవాలి. పొర మరీ మందంగా, మరీ పలుచగా కాకుండా మీడియంగా ఉండాలి ► చల్లారిన బెల్లం కొబ్బరి తురుముని పొరపైన మధ్యలో వేయాలి ∙ఇప్పుడు అరటి ఆకుని నిలువుగా మడిచి ఆవిరి పాత్రలో పెట్టుకోవాలి ∙ఈ ఆకులను ముఫ్పై నిమిషాల పాటు ఆవిరిమీద ఉడికిస్తే పనస పాఠోలీ రెడీ. -
పనసకాయ.. షుగర్ ఆటకట్టు!
సాక్షి, హైదరాబాద్: మధుమేహ చికిత్సలో ప్రభావవంతమైన వైద్య పోషకాహార చికిత్సగా పచ్చి పనసపొట్టు పిండి పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ అధ్యయనం నిరూపించింది. శ్రీకాకుళంలోని ప్రభుత్వ వైద్య విజ్ఞాన సంస్థలో జరిగిన ఈ అధ్యయనంలో పచ్చి పనసపొట్టు పిండి ప్రయోజనాలను గుర్తించారు. పచ్చి పనసపొట్టు పిండికి మధుమేహ రోగుల్లో బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రించే శక్తి ఉందని నిర్ధారించారు. ఈ అధ్యయన ఫలితాలను ‘జాక్‌ఫ్రూట్365’ సంస్థ వ్యవస్థాపకుడు జేమ్స్ జోసెఫ్ పలువురు వైద్య నిపుణులతో కలసి శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. నిత్యం తగిన మోతాదులో పచ్చి పనసపొట్టు పిండిని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటున్నట్లు వైద్య బృందం సైతం నిర్ధారించిందన్నారు. రోజుకు 30 గ్రాముల పచ్చి పనసపొట్టు తీసుకుంటే.. ‘జాక్‌ఫ్రూట్365’ సంస్థ వ్యవస్థాపకుడు జేమ్స్ జోసెఫ్ పేర్కొన్న వివరాల ప్రకారం... ఈ అధ్యయనం కోసం షుగర్ మాత్రలు వాడుతున్న 18 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మొత్తం 40 మంది టైప్–2 మధుమేహ రోగులను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్‌లోని రోగులకు మూడు టేబుల్స్పూన్లకు సమానమైన 30 గ్రాముల పచ్చి పనసపొట్టు పిండిని 12 వారాలపాటు అందించారు. అలాగే మరో గ్రూప్‌లోని రోగులకు అంతే పరిమాణంలో పిండి తరహా పదార్థాన్ని అందించారు. ఈ అధ్యయన కాలంలో మధుమేహ రోగుల్లోని హెచ్‌బీఏ1సీ స్థాయిల్లో మార్పులతోపాటు ఫాస్టింగ్ ప్లాస్మా, గ్లూకోజ్, పోస్ట్ ప్రాండియల్ ప్లాస్మా గ్లూకోజ్ (పీపీజీ), లిపిడ్ ప్రొఫైల్, శరీర బరువును పరీక్షించారు. అలాగే గ్రీన్ జాక్‌ఫ్రూట్ ఫ్లోర్‌ను రోగుల రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించారు. వాటి ఫలితాల ప్రకారం పచ్చి పనసపొట్టు పిండి తీసుకున్న రోగుల్లో హెచ్‌బీఏ1సీ, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్ (పీపీజీ)లో గణనీయంగా క్షీణత కనిపించింది. అధ్యయన ఫలితాలు ప్రోత్సాహకరం: వైద్య నిపుణులు ఈ అధ్యయనాన్ని మధుమేహ రోగులకు ప్రోత్సాహకరమైన వార్తగా ఫెర్నాండేజ్ ఆసుపత్రి కన్సల్టెంట్ న్యూట్రిషియనిస్ట్ డాక్టర్ లతా శశి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అభివర్ణించారు. అహ్మదాబాద్‌కు చెందిన డయాబెటాలజిస్ట్ డాక్టర్ వినోద్ అభిచందానీ వర్చువల్ పద్ధతిలో మాట్లాడుతూ పచ్చి పనసపొట్టు పిండిని తన రోగులు వినియోగించడం ద్వారా వారు ఆరోగ్య ప్రయోజాలను పొందారన్నారు. ఇదే తరహా సూచనలను అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ సైతం చేసిందన్నారు. పచ్చి పనసపొట్టు పిండిలో పీచు పదార్థాలు అధికంగా లభిస్తాయని, దీనివల్ల తీసుకొనే కేలరీలు తగ్గడంతోపాటు గ్లైసెమిక్ లోడ్ తక్కువగా ఉంటుందన్నారు. జాక్‌ఫ్రూట్365 సంస్థ అందించే గ్రీన్ జాక్‌ఫ్రూట్ ఫ్లోర్‌ను ఒక టేబుల్ స్పూన్ మోతాదులో ప్రతిరోజూ భోజన సమయంలో వినియోగించడం వల్ల కార్బోహైడ్రేట్లు, కేలరీల స్వీకరణ తగ్గుతుందన్నారు. మెడికల్ న్యూట్రిషన్ థెరఫీలో పచ్చి పనసపొట్టు పిండి సామర్ధ్యంపై క్లినికల్ అధ్యయనం చేసేందుకు శ్రీకాకుళం మెడికల్ కాలేజీని తాము ఎంచుకున్నట్లు డాక్టర్ అంతర్యామి మహారాణా చెప్పారు. -
పనసకాయ కోసం ఎన్ని తిప్పలు పడిందో ఈ ఏనుగు: వీడియో వైరల్
ఎన్నో రకాల జంతువులకు సంబంధించిన వీడియోలు చూశాం. జంతువులు తమ ఆహారాన్ని తినే ఫన్నీ వీడియోలు కూడా చూశాం. ఐతే ఇక్కడొక ఏనుగు తనకి ఇష్టమైన పనకాయ కోసం ఎంతలా ప్రయత్నించిందో చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పైగా ఆ చెట్టు ఆ ఏనుగుకి అందనంతా ఎత్తులో ఉంది. అయినా సరే ఎలాగోలా ఆ పనసకాయను కోసేందుకు తెగ ట్రై చేసింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఏనుగు పనసకాయ కోసేందుకు దాని ముందరి కాళ్లను పైకి ఎత్తి చెట్టుకి తొక్కిపెట్టి మరీ కోసేందుకు ప్రయత్నిస్తోంది. ఆఖరికి తొండాన్ని ఎలాగోలా బాగా పైకి ఎత్తి ఆ పనసకాయను కోసేస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఆఫీసర్ సుప్రియా సాహు ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్‌లు వచ్చాయి. మీరు ఓ లుక్కేయండి. Jackfruit is to Elephants what Mangoes are to humans.. and the applause by humans at the successful effort of this determined elephant to get to Jackfruits is absolutely heartwarming 😝 video- shared pic.twitter.com/Gx83TST8kV — Supriya Sahu IAS (@supriyasahuias) August 1, 2022 (చదవండి: Viral Video: అవమానపడ్డ టూరిస్ట్...టచ్ చేయకూడనవి టచ్ చేస్తే ఇలానే ఉంటుంది!) -
పనసతో విలువ ఆధారిత పదార్థాల తయారీ
రంపచోడవరం: ఏజెన్సీ ప్రాంతంలో విరివిగా లభించే పనస ద్వారా గిరిజనులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా పనసతో వివిధ విలువ ఆధారిత పదార్థాల తయారీలో గిరిజన యువత శిక్షణ ఇస్తోంది. రెండేళ్ల కాలంలో వంద మంది ఆసక్తి కలిగిన గిరిజన యువత ఇందులో శిక్షణ తీసుకుంది. పనసలో విటమిన్–సి, కాల్షియం, ఐరన్, పోటాషియం, మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. ప్రస్తుత కాలంలో పచ్చికాయలు, పండ్లకు మంచి గిరాకీ ఉంది. ఈ నేపథ్యంలో కృషి విజ్ఞాన కేంద్రం వృతి నైపుణ్య శిక్షణ ఉచితంగా ఇస్తోంది. ఆగస్టు మొదటి వారంలో కొత్త బ్యాచ్‌కు శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. 1164 హెక్టార్లలో పనస విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పనస ఎక్కువగా లభ్యమవుతుంది. ఈ ప్రాంతాల్లో సుమారుగా 1,164 హెకార్లలో పనస చెట్లు ఉన్నాయి. రంపచోడవరం ఏజెన్సీలో మారేడుమిల్లి, వై.రామవరం మండలాల్లో సుమారు 120 హెక్టార్ల విస్తీర్ణంలో పనస సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి 4,332 టన్నుల పనస దిగుబడి వస్తుంది. పనస కాయ తొనలు, పనస పొట్టుతో కూరను ఎక్కువగా తయారు చేస్తారు. అయితే కేవీకే శాస్త్రవేత్తలు పనస కాయలు, పండ్లతో చిప్స్, తాండ్ర, హల్వా, జామ్, ఐస్‌క్రీమ్, పనస తొనల పొడి, పనస పిక్కల పొడి, బజ్జీలు, పకోడి వంటి వాటి తయారీపై శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే శిక్షణ పొందిన గిరిజనులు స్వయం ఉపాధి పొందుతున్నారు. పనసలో పైబర్ ఎక్కువగా ఉండడంతో కేవీకే శాస్త్రవేత్తలు పిక్కలు, తొనలతో మన్యం జాక్‌ప్రూట్ పిండిని తయారు చేశారు. శరీరానికి పైబర్ అవసరమైన వారు ఈ పిండిని ప్రతి రోజూ చపాతీ, అన్నం, దోసెల పిండిలో 20 గ్రాముల వరకు కలుపుకుని తీసుకోవడం ద్వారా.. శరీరానికి పైబర్ పుష్కలంగా అందించవచ్చు. (క్లిక్: విద్యుత్ ఉత్పత్తిలో మేటిగా నిలిచి.. మహారత్న బిరుదు) శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు ఏజెన్సీలో ఎటువంటి పెట్టుబడి లేకుండా రైతులుకు పనస లభిస్తోంది. ఇక్కడ పండే పనస ద్వారా రైతులు పూర్తిగా ఆదాయాన్ని పొందలేకపోతున్నారు. పనసకు విలువ ఆధారితం జోడించడం ద్వారా మార్కెట్ విలువ పెరుగుతుంది. ఇందులో భాగంగా ఆసక్తి ఉన్న వారికి ఏటా పనసతో తయారు చేసే పదార్థాలపై శిక్షణ ఇస్తున్నాం. – ఆదర్శ, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, పందిరిమామిడి -
Recipe: పనస గింజలతో వడలు.. ఇలా తయారు చేసుకోండి!
పనస గింజల వడల తయారీ విధానం తెలుసా? పనస గింజల వడల తయారీకి కావలసినవి: ►పనస గింజలు – ఒకటిన్నర కప్పులు (పైతొక్క తీసి, మెత్తగా ఉడికించుకుని, కొద్దిగా నీళ్లు పోసుకుని మిక్సీ పట్టుకోవాలి) ►ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు (చిన్నచిన్నగా తరగాలి) ►పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్ (చిన్నగా తరిగినవి) ►కొత్తిమీర తురుము, కరివేపాకు తురుము – అర టేబుల్ స్పూన్ చొప్పున ►అల్లం పేస్ట్, మిరియాల పొడి, వాము – అర టీ స్పూన్ చొప్పున ►కారం, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా పనస గింజల వడల తయారీ విధానం ►ముందుగా ఒక బౌల్లో పనస గింజల గుజ్జు వేయాలి ►దానిలో.. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ►అందులో కొత్తిమీర తురుము, కరివేపాకు తురుము, అల్లం పేస్ట్, మిరియాల పొడి, వాము అన్నీ కలిపి బాగా ముద్దలా చేసుకోవాలి. ►అనంతరం ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకుని.. వేళ్లతో గట్టిగా ఒత్తి, పలుచగా చేసుకుని, నూనెలో దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Singori Sweet Recipe: కోవా... పంచదార.. పచ్చి కొబ్బరి.. నోరూరించే స్వీట్ తయారీ ఇలా! ఇవన్నీ కలిపి బోన్‌లెస్ చికెన్ ముక్కల్ని బొగ్గు మీద కాల్చి తింటే! మరిన్ని రెసిపీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Jack Fruit: నోరూరించే పనస పండ్లు.. తింటే ఎన్ని లాభాలో తెలుసా?
అంబాజీపేట(కోనసీమ జిల్లా): చెట్లకు సాధారణంగా పువ్వు నుంచి పిందె, పిందె నుంచి కాయ వచ్చి అది పండుగా మారుతుంది. కాని పనస పండు పుట్టిక మాత్రం అలా జరగదు. ఈ చెట్టు కాండం నుంచే పిందెలు దిగి అవి కాయులు, పండ్లుగా తయారవుతాయి. కనుకనే పనస చెట్టు మొదలు నుంచి చివరి వరకూ కాండంపై కాయలు నిండి ఉంటాయి. సువాసనలు వెదజల్లుతూ నోరూరించే పనసపండు అంటే అందరికీ ఇష్టమే. పనసపండులో శరీరానికి అవసరమైన పలు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును ఆంగ్లంలో జాక్‌ఫ్రూట్ అంటారు. దీని వృక్షశాస్త్ర నామ థేయం ఎట్రోకార్పస్ ఇంటి గ్రిఫోలియా. ఏటా మార్చి నుంచి జూలై వరకూ పనస పండ్లు ఎక్కువగా దొరుకుతాయి. ఒక్కొక్క చెట్టుకు 100 వరకూ కాయలు దిగుబడులు వస్తాయి. ఒక్కొక్క కాయ 10 నుంచి 20 కేజీల బరువు ఉంటాయి. కాగా కాయ ఎంత బరువున్నా అందులో 30 శాతం మాత్రమే తినడానికి ఉపయోగపడుతుంది. కాగా అంబాజీపేట పరిసర ప్రాంతాల్లో దొరకే పనస పండ్లకు మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ డిమాండ్ ఉంది. పనసలో పలు రకాలు బంగారు పనస, కొబ్బరి పనస, ఖర్జూర పనస, వేరు పనస, చిన్నకోల పనస, గుండ్రు పనస, గులాబి పనస, కర్ణపనస, తేనెపనస అనే రకాలు ఉన్నాయి. వివాహాది శుభ కార్యాలయాల్లో పనసకాయ కూర చేస్తారు. పనసకాయను పొట్టుగా కొట్టి కూర వండితే తినతివారు ఉండరు. అంతేకాకుండా లేత పనస కాయలను చిన్న ముక్కలుగా తరిగి మషాలా కూరల్లో ఉపయోగిస్తారు. పోషకాలు ఇలా.. పనస పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయని, ఏడాదికి ఒకసారైనా కచ్చితంగా పనసపండు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. పనస పండులో మాంసకృతులు 1.9 శాతం, చక్కెర 19.8 శాతం, కొవ్వులు 0.1 శాతం, కెరోటిన్ 175 మైక్రో గ్రాములు, థియోమిన్ 0.3 మిల్లీ గ్రాములు, విటమిన్ సి 7 మిల్లీ గ్రాములు, పీచు పదార్థం 1.1 శాతం, సున్నం 20.0 మిల్లీ గ్రాములు, ఇనుము 0.56 మిల్లీ గ్రాములు ఉంటాయి. -
Health Tips: పనసతొనలతో పాటు కొబ్బరి పాలు, బెల్లంను కలిపి తీసుకుంటే..
Jackfruit Surprising Health Benefits: పనసలోని యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్, టైప్ –2 డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులను దరిచేరనీయ్యవు. యాంటీ ఆక్సిడెంట్స్‌తోపాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రక్తంలోని గ్లూకోజ్, రక్తపీడనం, కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రణలో ఉంచుతాయి. ►పనస తొనలతో పాటు కొబ్బరి పాలు, బెల్లంను కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి. ►పనస జ్యూస్ తాగినప్పుడు పొట్ట నిండిన భావన కలిగి ఎక్కువసేపు ఆకలి వేయదు. ►ఫలితంగా తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ►విటమిన్ సి, ఈ, లారిక్ యాసిడ్లలోని యాంటీసెప్టిక్ గుణాల వల్ల బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాల వల్ల కలిగే వ్యాధులు దరిచేరవు. ►కొబ్బరిపాలు, బెల్లంలలో కావల్సినంత ఐరన్ ఉంటుంది. ►దీని జ్యూస్ తాగడంవల్ల హిమోగ్లోబిన్ స్థాయులు పెరగి రక్త హీనత సమస్య ఎదురవదు. ►జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపపడుతుంది. ►చర్మం, వెంట్రుకల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఈ జ్యూస్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. జాక్‌ఫ్రూట్ షేక్‌కు కావలసినవి: ►గింజలు తీసిన పనస తొనలు – రెండు కప్పులు ►చిక్కటి కొబ్బరి పాలు – కప్పున్నర ►బెల్లం తరుగు – నాలుగు టేబుల్ స్పూన్లు ►నీళ్లు – అరకప్పు, ఐస్ క్యూబ్స్ – ఎనిమిది. తయారీ... ►పనస తొనలను సన్నగా తరిగి బ్లెండర్లో వేయాలి ►తొనలకు బెల్లం, కొబ్బరిపాలను జోడించి మెత్తగా గ్రైండ్ చేయాలి ►మెత్తగా నలిగిన తరువాత ఐస్ క్యూబ్స్, అర కప్పు నీళ్లుపోసి మరోసారి గ్రైండ్ చేయాలి. ►అన్నీ చక్కగా గ్రైండ్ అయ్యాక వెంటనే గ్లాసులో పోసుకుని సర్వ్ చేసుకోవాలి. వేసవిలో ట్రై చేయండి: Summer Drinks: యాపిల్, నేరేడు.. జ్యూస్ కలిపి తాగితే.. కలిగే లాభాలివే! -
పనసల పదనిస.. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 250 కాయలు
ఇంట్లో పనస పండు ఉంటే ఎంత దాచి పెట్టినా అందరికీ తెలిసిపోతుంది. దాని ఘుమఘుమ అలాంటిది. ఇక పనస తొనల మాధుర్యం చెప్పనలవే కాదు. అటువంటి పనస పండు ఇంట్లో ఒకటుంటేనే ఎంతో సంతోషం. అవే వందల సంఖ్యలో కనిపిస్తే ఆ ఆనందమే వేరు. పనస చెట్టుకు కాయలు కాయడం సాధారణమే. అలా కాకుండా ఆరు నుంచి ఎనిమిది కాయలతో గుత్తులు గుత్తులుగా కాస్తే నిజంగా విశేషమే! పెరవలి మండలం ఖండవల్లిలో రాజు గారి చేను వద్ద రోడ్డు పక్కన ఈ పనస చెట్టు ఉంది. ఇది ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 250 కాయలు కాసింది. చెట్టు మొదలు నుంచి గుత్తులుగుత్తులుగా పై వరకూ ఉన్న కాయలు కాసిన ఈ చెట్టును అటుగా వెళ్తున్న వారు కన్నార్పకుండా చూసి, ఆనందిస్తున్నారు. ఇంతలా కాయలు కాసిన పనస చెట్టును చూడటం ఇదే మొదటిసారంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ చెట్టు ఏటా కాపు కాస్తుందని, ఈ ఏడాది ఇంతలా గుత్తులుగుత్తులుగా కాయటం విశేషమేనని రైతు రాజు చెప్పారు. – పెరవలి(తూర్పుగోదావరి) చదవండి: Seshachalam Hills: మాట వినం..తాట తీస్తాం! -
ఉద్దానం స్కందఫలం.. ఉత్తరాదికి వరం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానపు ప్రాంత ఉద్యాన పంటలకు అన్ని ప్రాంతాల్లోనూ ఆదరణ లభిస్తుంటుంది. అద్భుతమైన రుచితో పండే ఇక్కడి ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ ఎక్కువ. ముఖ్యంగా సీజనల్‌గా పండే పనస (స్కంద) పంట ఉత్తరాది ప్రాంతాలకు సైతం ఎగుమతి అవుతూ రైతుకు సిరులు కురిపిస్తోంది. ఏటా ఏప్రిల్, మే నెలల్లో పూతకు వచ్చే ఈ పంట ఈ ఏడాది మాత్రం ఫిబ్రవరి మధ్య నుంచే కాయలు దిగుబడి రావడంతో ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. పనసకాయలతో పకోడి.. పండుగలు.. సాధారణ రోజుల్లోనూ పనసకాయలతో చేసే పకోడిని ఇష్టంగా ఆరగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పనసతో పచ్చళ్లు, కూరలు, గూనచారు తయారు చేస్తారు. ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్, కోల్‌కతా తదితర ప్రాంతాలకు రోజుకు 40 టన్నుల వరకు పనసకాయలు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం కేజీ పనసకాయ రూ.20 నుంచి రూ. 25 వరకు ధర పలుకుతోంది. మే నెల వరకు భారీ ఎగుమతులు జరుగుతాయి. తిత్లీ తుఫాన్ సమయంలో పనస చెట్లు విరిగిపోవడంతో నాలుగేళ్లుగా అంతంతమాత్రంగానే దిగుబడి వచ్చింది. జిల్లాలో సుమారు 25 వేల హెక్టార్లలో పనసకాయలు పండిస్తున్నారు. ముఖ్యంగా ఉద్దానం ప్రాంతంలోని పలాస, వజ్రపుకొత్తూరు, మందస, ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, నందిగాం తదితర మండలాల్లో వీటి సాగు ఎక్కువ. వివిధ వంటకాలు.. పనస ముక్కల బిర్యానీ, పొట్టు కూర, హల్వా, పొట్టు పకోడీ, గింజల కూర, గూనచారు, కుర్మా, ఇడ్లీ, పచ్చళ్లు, బూరెలు వంటి విభిన్న రకాల ఆహార పదార్థాలు పనసకాయలతో చేస్తారు. ఆదాయం ఘనం.. ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాలతో పాటు టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలంలో పనసకాయల దిగుబడి ఎక్కువ. ఒక్కోచెట్టు నుంచి ఏడాదికి రూ. 800 నుంచి రూ.1500 వరకు ఆదాయం వస్తుంది. కేవలం పొలంగట్లపై చెట్లు వేసుకుంటేనే ఏడాదికి రూ.10 వేల వరకు ఆదాయం సంపాదించవచ్చు. – జె.సునీత, ఉద్యానవన అధికారి, పలాస -
Jackfruit: ఆరోగ్యానికి కేరాఫ్ పనస
సాక్షి, అమరావతి: రోజువారీ ఆహారంలో పనసపొడిని కలుపుకుని తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంతో పాటు రక్తపోటునూ నివారించుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. జీర్ణక్రియను మెరుగుపర్చుకోవచ్చు. పనస పొడిలో ప్రోటీన్ కూడా ఎక్కువేనని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది ‘తీపి’ కబురు. ప్రతి రోజూ 30 గ్రాములకు తగ్గకుండా పనస పొడిని ఆహారంలో కలిపి మూడు నెలల పాటు తీసుకుంటే షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చునని ఇటీవల జరిగిన పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ఏడీఏ) కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) మంచి ఆహారం జాబితాలో మన పనస (జాక్‌ఫ్రూట్)కు చోటు దక్కడమే ఇందుకు నిదర్శనం. పరిశోధనలు తేల్చిన నిజం.. కరోనా జనాన్ని హడలెత్తిస్తున్న నేపథ్యంలో చాలా మంది వాళ్లకు తెలియకుండానే షుగర్ పేషెంట్లు అయ్యారు. అంతకుముందే ఉన్న వాళకైతే మరింత పెరిగింది. ఏపీ, తెలంగాణలోనైతే ఈ బెడద మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, ఏపీకి చెందిన డాక్టర్లు కొందరు దీనిపై దృష్టి సారించారు. వారిలో ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గోపాలరావు, మహారాష్ట్ర పుణెలోని చెల్లారామ్ డయాబెటిస్ ఇన్స్టిట్యూట్ సీఈవో డాక్టర్ ఏజీ ఉన్నికృష్ణన్ ఉన్నారు. షుగర్ బెడద తగ్గించడానికి ఏమైనా పండ్లు పనికి వస్తాయా? అని పరిశోధన చేశారు. అప్పుడు బయటపడిందే ఈ పనస ప్రయోజనం. వాళ్లు కనిపెట్టిన అంశాలన్నింటినీ ఇటీవల అంతర్జాతీయ సైన్స్ పత్రిక నేచర్ ప్రచురించింది. వారం పాటు క్రమం తప్పకుండా పసన పొడిని తింటే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినట్టు కనుగొన్నారని నేచర్ పత్రిక వివరించింది. ఈ విషయాన్ని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ఏడీఏ) ధ్రువీకరించింది. ఎలా తీసుకోవాలంటే.. ఇటీవలి కాలంలో చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులు బియ్యానికి బదులు చిరు ధాన్యాలను వాడుతున్నారు. వాటితో పాటు పనసపొడిని కలుపుకుని తింటే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. టైప్–2 డయాబెటిస్ ఉన్న వారిపై వరుసగా ఏడు రోజుల పాటు పనస పొడి ప్రయోగం చేసిన తర్వాత షుగర్ లెవెల్స్ తగ్గినట్టు డాక్టర్లు నిర్ధారణకు వచ్చారు. పైగా పనస పొడి వాడకం వల్ల శరీర బరువును తగ్గించుకోవచ్చు. పండిన పనస తొనలను తింటే షుగర్ పెరిగే అవకాశం ఉంది. అయితే పక్వానికి వచ్చిన కాయల నుంచి పనస పొడిని తయారు చేస్తారు కాబట్టి షుగర్ నియంత్రణలో ఉంటుంది. పనస గింజ ల్ని కూడా ఎండబెట్టి కూర వండుతారు. మొత్తంగా పనస కాయ చాలా రకాలుగా.. వ్యాధి నిరోధకశక్తిగా పనికి వస్తుంది. -
Photo Feature: విరగకాసిన పనస చెట్టు
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పెద్దముర హరిపురంలోని గొరకల రామారావు తోటలో పనస చెట్టు విరగకాసింది. పనస కాయలు గుత్తులుగుత్తులుగా నేలను తాకి అబ్బుర పరుస్తున్నాయి. చెట్టు మొదట్లోనే దాదాపు 70 కాయలు ఉన్నాయి. – వజ్రపుకొత్తూరు -
Jackfruit: ఉద్దానం పనస.. ఉత్తరాదిన మిసమిస
కాశీబుగ్గ: ఉద్దానం పంటను ఉత్తరాది వాళ్లూ మెచ్చారు. ఇక్కడి పనసకు కాయలను ఆ రాష్ట్రాల వారు లొట్టలేసుకుని తింటున్నారు. దీంతో ఇక్కడి పనస డిమాండ్ పెరుగుతోంది. రుచి పరంగా అద్భుతంగా ఉండడంతో పాటు రంజాన్ సీజన్ కావడంతో ఉత్తరప్రదేశ్, బిహార్, తదితర రాష్ట్రాలు ఉద్దానం ప్రాంతం నుంచి పనస కాయలు, పండ్లను దిగమతి చేసుకుంటున్నాయి. మరోవైపు కాశీబుగ్గ కేంద్రంగా బరంపురం, గుజరాత్, కోల్‌కతా, కటక్ తదితర ప్రాంతాలకు కూడా పనస ఎగుమతి అవుతోంది. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ, పూండి, హరిపురం, కవిటి, ఇచ్ఛాపురం, మందస, కంచిలి, సోంపేట కేంద్రాల నుంచి వివిధ రాష్ట్రాలకు పనస ఎగుమతులు ఊపందుకున్నాయి. గడచిన రెండు నెలల్లో రోజుకు సగటున 44 టన్నుల చొప్పున ఇప్పటివరకు 2,640 టన్నుల పనస కాయలు ఎగుమతి అయ్యాయి. విరగకాసింది మార్చి నెలాఖరు నుంచి మే వరకు పనస ఎగుమతులు కొనసాగుతాయి. తిత్లీ తుపానుకు దెబ్బతిన్న పనస చెట్లన్నీ ఈ ఏడాది జీవం పోసుకుని విరగకాస్తున్నాయి. ఉద్దాన ప్రాంతంలోని ఏడు మండలాల్లో పనస అంతర పంటగా సాగవుతోంది. ఇబ్బడిముబ్బడిగా దిగుబడులు రావడంతో ప్రస్తుతం కేజీ పనస కాయ కేవలం రూ.13 చొప్పున మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఈ ధర గతంలో కేజీ రూ.20 వరకు ఉండేది. ఉద్యాన శాఖాధికారులు పనస, మునగ తదితర పంటలకూ ప్రభుత్వ పరంగా ధరలు నిర్ణయిస్తే మేలు జరుగుతుందని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. పనసతో చేసే వంటకాలవీ.. పనస ముక్కల బిర్యానీ, పనస పొట్టు కూర, పనస పండు హల్వా, పనస పొట్టు పకోడి, పనస గింజల కూర, పనస ముక్కల గూనచారు, పనస చిల్లీ, పనస కాయ కుర్మా, పనసకాయ ఇడ్లీ, పొంగనాలు, పనస నిల్వ పచ్చడి, పనస బూరెలు. 25 వేల హెక్టార్లలో మిశ్రమ పంటగా.. శ్రీకాకుళం జిల్లాలోని మన్యంలోనూ పనస పండుతున్నప్పటికీ ఉద్దాన ప్రాంతమే దీనికి చిరునామాగా మారింది. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలతో పాటు టెక్కలి నియోజకవర్గం పరిధిలోని నందిగాం మండలంలోనూ పనస పంట ఉంది. 8 మండలాల్లో ఈ ఏడాది విరగ కాసింది. ఎకరాకి రెండు నుంచి ఐదు చెట్లు ఉన్న రైతులు కలుపుకుని కేవలం ఉద్దానంలో వెయ్యి హెక్టార్లలో, జిల్లా వ్యాప్తంగా 25వేల హెక్టార్లలో మిశ్రమ పంటగా పండిస్తున్నారు. పండిన పంటలో 80 శాతం పంట కేజీ, కేజీన్నర కాయ పెరిగేంత వరకు మాత్రమే ఉంచి మార్కెట్ చేస్తారు. 20 శాతం కాయలు, వెనుక పండిన కాయలు పనస పండ్లుగా రెండో రకం మార్కెటింగ్ చేస్తారు. – సునీత, ఉద్యాన అధికారి, పలాస -
విరగకాసిన పనస!
కాశీబుగ్గ/వజ్రపుకొత్తూరు: ఉద్దానం పనసకు హోలీ గిరాకీ వచ్చింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పనసకాయలకు డిమాండ్ ఉండటంతో ప్రతిరోజూ లారీల్లో కాయలను తరలిస్తున్నారు. ఈ నెల 28న హోలీ, వచ్చే నెల ప్రారంభంలో ఉగాది పండుగల నేపథ్యంలో ఈసారి కిలో పనసకాయల ధర ఎన్న డూ లేనివిధంగా మొదట్లో రూ.25 నుంచి రూ.35 వరకు ధర పలికింది. తాజాగా కిలో రూ.16 వరకు విక్రయిస్తు న్నారు. హోలీ తర్వాత కాయలకు డిమాండ్ పడిపోతుంది. ఈ నేపథ్యంలో ముందుగానే కాయలను చెట్ల నుంచి కోసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. పనసలో రెండు రకాలు ఉంటాయి. అందులో ఖర్జూరం రకం కాయలను పండ్లు గా విక్రయించేందుకు చెట్లకే ఉంచేశారు. ముదిరితే పనికిరాని గుజ్జు రకం కాయలను మార్కెట్‌కు సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా సీతంపేట, పాలకొండ ఏజెన్సీలతో పాటు ఉద్దానం నుంచి పూండి, పలాస, హరిపురం, కవి టి, కంచిలి మార్కెట్‌కు ప్రతి రోజూ 350 టన్నుల వరకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి కాన్పూర్, కోల్‌కతా తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసి లాభాలు ఆర్జిస్తున్నారు. విరగకాసిన పనస.. తిత్లీ తుఫాన్ వచ్చి మూడేళ్లు పూర్తవుతున్న సమయంలో చెట్లన్నీ మళ్లీ పునర్వైభవం సంతరించుకుంటున్నాయి. దీంతో పనసకాయలు విరగకాస్తున్నాయి. బరంపురం, గుజరాత్, కోల్‌కతా తదితర ప్రాంతాల్లో జరిగే పెళ్లిళ్లలో పనసకాయల వినియోగం ఎక్కువ. ముఖ్యంగా పచ్చళ్లకు, పకోడీలు తదితర ఆహార పదార్థాల్లో అధికంగా వాడుతుంటారు. -
‘ఉత్తమమైన దొంగతనం.. అద్భుతం’
-
వైరల్: ‘ఉత్తమమైన దొంగతనం.. అద్భుతం’
న్యూఢిల్లీ: ఓ ఏనుగు పిల్ల చెట్టెక్కి పనస కాయలను కోస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెట్టుకు ఉన్న ఆ పనస కాయలను కోయడానికి ఏనుగు చేస్తున్న ప్రయత్నం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. 29 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఆటవీ శాఖ అధికారి సాకేత్ బడోలా సోమవారం ట్విటర్లో షేర్ చేశాడు. (ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు: లక్షలాది మిడతలు..) దీనికి ‘జాక్‌ఫ్రూట్ పట్ల మీకున్న మక్కువ.. అది మిమ్మల్ని చెట్లు ఎక్కేలా చేస్తుంది’ అంటూ ట్వీట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటీ వరకు వేలల్లో వ్యూస్, వందల్లో కామెంట్స్ వచ్చాయి. గజరాజు పనస కాయల కోసం చెట్టు ఎక్కడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘ఉత్తమమైన దొంగతనం’, ‘మనసుంటే మార్గం ఉంటుంది’, ‘అద్భుతం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (కంటతడి పెట్టించావురా బుడ్డోడా..) -
తలపై పండు పడింది, కరోనా వచ్చింది!
తిరువనంతపురం: కేరళలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పండు తల మీద పడటంతో తీవ్రగాయాలపాలైన వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. వివరాల్లోకి వెళ్తే.. బేలూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ మే19న పనస పండు కోసం చెట్టెక్కాడు. ఈ క్రమంలో పెద్ద పండు నెత్తి మీద పడటంతో చెట్టు మీద నుంచి కింద పడ్డాడు. దీంతో అతని వెన్నెముక, మెడకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడి కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కసరగడ్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి పరియార్‌లోని కన్నూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా సర్జరీ చేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. (ఎక్కడి కేరళ.. ఎక్కడి అస్సాం) అయితే ఆసుపత్రి ప్రోటోకాల్ ప్రకారం ముందుగా కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఖంగు తిన్న డాక్టర్లు అతని కుటుంబసభ్యులకు విషయం తెలియజేశారు. అయితే అతనికి ట్రావెల్ హిస్టరీ కానీ, లేదా కరోనా బాధితులను కలిసిన దాఖలాలు కానీ లేవని వారు పేర్కొన్నారు. దీంతో అతనికి ఎలా వైరస్ సోకిందన్న విషయంపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అతనితో సన్నిహితంగా మెలిగిన కుటుంబ సభ్యులతో పాటు 18 మందిని క్వారంటైన్లో ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా వుండగా లాక్డౌన్ సడలింపుల వల్ల అతను ఆటో నడిపించాడని, కానీ ఎవరెవరు ఆ ఆటోలో ప్రయాణించారనేది తమకు తెలియదని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. (బేకరీ ఓనర్‌కు కరోనా: 300 మందికి పరీక్షలు) -
కేరళలో భారీ పనస పండు
కొల్లాం : పనస తొనల తియ్యదనం చెప్పాలంటే మాటలు చాలవు. పనస పొట్టు కూర ప్రత్యేక మైన రుచితో శాఖాహారుల నోరూరిస్తూ ఉంటుంది. వేసవికాలం వచ్చిందంటే పనసపండ్లు అందుబాటులోకి వస్తాయి. పండ్లజాతిలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద పండుగా పేరున్న పనసపండు సాధారణంగా 5 కేజీల నుంచి 20 కేజీల బరువుతో కాస్తాయి. అయితే కేరళలోని కొల్లాంలో ఎదాములక్కల్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం తమ పొలంలో కాసిన పనస పండు ఏకంగా 50 కేజీలకుపైగానే తూగడంతో వారి ఆనందానికి అవుధులు లేకుండా పోయింది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత బరువైన పనసపండు 42.7 కిలోలు అవ్వడంతో, వారు గిన్నిస్ బుక్ వారి సంప్రదించారు. తమ పొలంలో కాసిన పనస 51.4 కిలోల బరువుతో 97 సెంటిమీటర్ల వెడల్పుతో ఉందని జాన్ కుట్టి అన్నారు. గిన్నిస్ బుక్‌తోపాటూ లిమ్కా బుక్ బుక్ ఆఫ్ రికార్డులకు కూడా దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. -
పనస వ్యర్థాలతో అల్ట్రాకెపాసిటర్లు
పనసపండులో మనం తినేది పిసరంతైతే.. వృథాగా పారబోసేది బోలెడంత. అయితే ఆస్ట్రేలియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ వ్యర్థానికి కొత్త అర్థం చెప్పారు. పనసతోపాటు దీని తోబుట్టువుగా భావించే డ్యూరియన్ పండు వ్యర్థాలను విద్యుత్తును నిల్వ చేసుకోగల అల్ట్రా కెపాసిటర్లుగా మార్చవచ్చునని వీరు ప్రయోగాత్మకంగా నిరూపించారు. అల్ట్రా కెపాసిటర్లకు, బ్యాటరీలకు కొంచెం తేడా ఉంటుంది. రెండింటిలోనూ విద్యుత్తును నిల్వ చేసుకోవచ్చుగానీ.. అల్ట్రా కెపాసిటర్లలో విద్యుత్తు విడుదల చాలా వేగంగా జరిగిపోతుంది. అంతే వేగంగా ఛార్జ్ కూడా అవుతుంది. వీటితో కొన్ని సెకన్లలోనే మన ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేసుకోవచ్చు. పనస, డ్యూరియన్ పండ్ల వ్యర్థాలను తాము ముందుగా కార్బన్ ఏరోజెల్‌గా మార్చామని, ఈ ఏరోజెల్ సాయంతో ఎలక్ట్రోడ్లను నిర్మించి పరీక్షించినప్పుడు ఆశ్చర్యకరమైన ఫలితాలు లభించాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త విన్సెంట్ జేమ్స్ తెలిపారు. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న అల్ట్రా కెపాసిటర్ల కంటే పనస, డ్యూరియన్ పండు వ్యర్థాలతో చేసిన అల్ట్రా కెపాసిటర్ల సామర్థ్యం చాలా ఎక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని చెప్పారు. ఈ కొత్త అల్ట్రా కెపాసిటర్లను చాలా చౌకగా తయారు చేసుకోవచ్చు కాబట్టి.. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను చౌకగా రీఛార్జ్ చేసుకునేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయని విన్సెంట్ గోమ్స్ వివరించారు. భూతాపోన్నతి నేపథ్యంలో వాతావరణ మార్పులను అడ్డుకునేందుకు సంప్రదాయేతర ఇంధన వనరులను మరింత సమర్థంగా ఉపయోగించుకునేందుకు ఈ కొత్త అల్ట్రా కెపాసిటర్లు ఎంతో ఉపయోగపడతాయని విన్సెంట్ గోమ్స్ చెప్పారు. -
పనస.. ఉంది ఎంతో పస
సిమ్ల యాపిల్‌లా ఎర్రగా ఆకర్షణీయంగా ఉండదు దోరమగ్గిన జాంపండులా చూడగానే కొరుక్కు తినాలనిపించదు మధురమైన మామిడిలా పళ్లల్లో రారాజు కూడా కాదు కానీ ఆ పండు ఒక రత్నమూ, మాణిక్యమే మన పెద్దలు ఎప్పుడో ఈ విషయాన్ని గుర్తించారు. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్న మాణిక్యాలు, మనవలు బొమ్మరాళ్లు అంటూ ఆ పండు చుట్టూ ఒక పొడుపు కథనే అల్లేసారు. పనస పండులో ఓ పస ఉంది. ఆ విషయాన్ని ఇప్పుడిప్పుడే మనమూ గుర్తిస్తున్నాం.. పాశ్చాత్య దేశాలు కూడా పనసను మనసారా ఆస్వాదించడం మొదలు పెట్టాక ఆ పండు విలువ ఆకాశమే హద్దుగా సాగిపోయింది. వీగన్ డైట్ ఫాలోయర్లకు పనస పండు ఒక వరంగా మారింది. పనసలో ఉండే ప్రయోజనాలు అందరికీ తెలియజెప్పడానికే జులై 4న ప్రపంచ పనసపండు దినోత్సవం జరుపుకుంటున్నారు. పనస. అదొక కల్పవృక్షం. ఆ పండులో తొనలే కాదు, పై తొక్క, పిక్కలు, చెట్టు ఆకులు, బెరడు.. దాని కర్ర.. ఇలా ప్రతీ భాగమూ అత్యంత విలువైనవి. దాని చుట్టూ ఉన్న మార్కెట్‌ని చూస్తే విస్తుపోతారు. భారీ సైజు, రవాణాలో సంక్లిష్టత, పండు పై తొక్క తీసి తొనల్ని వలవడం అదో పెద్ద ప్రహసనం కావడంతో జనసామాన్యంలోకి అంతగా వెళ్లలేదు..పనసలో ఆరోగ్య విలువలు గ్రహించాక తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రాష్ట్రీయ ఫలంగా ప్రకటించి మార్కెట్‌ని విస్తరించే పనిలో ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్ జాతీయ ఫలం కూడా పనసే. వాళ్లు ఎప్పట్నుంచో పనసతో సొమ్ము చేసుకునే పనిలో ఉన్నాయి అమెరికా, యూరప్, బ్రిటన్ దేశాల్లో ఈ పనసంటే పడి చచ్చిపోతారు. కేవలం కేరళ రాష్ట్రం నుంచి ఈ పండు ఎగుమతులు గత ఏడాది 500 టన్నులకు చేరుకున్నాయి. ఈ ఏడాది చివరికి 800 టన్నులు దాటేస్తుందని ఒక అంచనా. పనస కేరళ రాష్ట్రానికి 15 వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతూ కాసుల వర్షం కురిపిస్తోంది. పనసపండుకి పుట్టినిల్లు భారత దేశంలోని పశ్చిమ కనుమలు. పండ్లల్లో అతి పెద్దది. ఒక్కో పండు 5 నుంచి 50 కేజీల వరకు తూగుతుంది. 3 అడుగుల వరకు పొడవు పెరుగుతుంది. పనసలో ఏకంగా 300 రకాలు జాతులు ఉన్నాయి. ఉత్పత్తి అయ్యే పళ్లలో రెండేళ్ల క్రితం వరకు 80 శాతం వృథా అయ్యేవి. వీటి విలువ 2వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా పనసతో 200 రకాల వంటకాలు చేయొచ్చు. పనసపొట్టు కూర, పసన దోసెలు వంటి సంప్రదాయ వంటల నుంచి అటు వెస్ట్రన్ ఘుమఘులైన పిజ్జాలు, బర్గర్లు, చిప్స్, ఐస్‌క్రీమ్ వరకు ఎన్నో రకాలు ఉన్నాయి. చివరికి పనస వైన్ కూడా తయారు చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలో డైరెక్టర్ పదవిని వదులుకొని వచ్చి మరీ జేమ్స్ జోసెఫ్ అనే కేరళకు చెందిన వ్యక్తి పనసపండులో ప్రయోజనాలు ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారు. జాక్‌ఫ్రూట్ 365 అన్న కంపెనీ ప్రారంభించి జాక్ ఫ్రూట్ మ్యాన్‌గా గుర్తింపు సంపాదించారు. శ్రీ పాడ్రే అన్న జర్నలిస్టు తాను నడిపే అడికె పత్రికలో పనస పండుకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.ప్రతీ నెల వచ్చే ఈ మ్యాగజైన్లో ఇప్పటివరకు పసనపైనే 32 కవర్ స్టోరీలు వచ్చాయి పరిపూర్ణ ఆహారం పనస పరిపూర్ణ ఆహారానికి మరో రూపం. ఈ పండులో అత్యధికంగా ప్రొటీన్లు ఉంటాయి. విటమిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది.. ఒక కప్పు అన్నంలో కంటే కప్పు పనస తొనల్లో కార్బోహైడ్రేట్లు 40% తక్కువగా ఉంటాయి. ఇక ఫైబర్ నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. వరి, గోధుమలో ఉండే గ్లూకోజ్‌లో సగం కంటే తక్కువ పనస పండులో ఉంటుంది. థైరాయిడ్, ఆస్తమా వంటి రోగాలను నియంత్రిస్తుంది. మధుమేహం ఆమడదూరం కేరళ డయాబెటీస్‌కు కేరాఫ్ అడ్రస్. ఇప్పుడిప్పుడే మధుమేహ గ్రస్తుల్లో వరి, గోధుమ రొట్టెలకు బదులుగా పనస పొట్టు, పనస తొనలు, పిక్కలతో చేసే ఆహారాన్ని రోజూ తీసుకోవాలన్న స్పృహ పెరుగుతోంది. చక్కెర వ్యాధిని నియంత్రించే శక్తి పనస కాయకి ఉండడంతో దానికి డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది రోమ్‌లో జరిగిన ఒక అధ్యయనంలో కేరళలో డయాబెటీస్ మందుల అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయినట్టు తేలింది. పేరు వెనుక కథ పనసకున్న శాస్త్రీయ నామం ఆర్టోకార్పస్, గ్రీకు భాష నుంచి ఈ పదం వచ్చింది. గ్రీకులో ఆర్టో అంటే బ్రెడ్ అని కార్పస్ అంటే పండు అని అర్థం. బ్రెడ్ అంటేనే అందరి కడుపు నింపేది. దానికి తోడు అది పండు కూడా కావడంతో పరిపూర్ణమైన ఆహారంగా మన పూర్వీకులే గుర్తించారు. కానీ అది ప్రాచుర్యంలోకి రావడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. 1563 సంవత్సరంలో పోర్చుగీస్‌కు చెందిన ఒక స్కాలర్ గరిక డా ఓర్టా అన్న పుస్తకంలో పనసని ప్రస్తావించారు. ఈ పండుని జాకా అని రాశారు. క్రమంగా ఇంగ్లీషులో అది జాక్ ఫ్రూట్‌గా మారింది. పనసకి ‘‘జేమ్స్’’ బాండ్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు పేరు జేమ్స్ జోసెఫ్. కొంత కాలం క్రితం వరకు మైక్రోసాఫ్ట్ కంపెనీలో డైరెక్టర్. ఓసారి ముంబైలో తాజ్‌మహల్ ప్యాలెస్‌లో తన క్లయింట్లకి డిన్నర్ ఇచ్చారు. ఆ డిన్నర్ ఆయన జీవితాన్నే మార్చేసింది. అక్కడ భోజనంలో చెఫ్ హేమంత్ ఓబరాయ్ ఒక వెరైటీ వంటకాన్ని తయారు చేసి అతిథులకు వడ్డించారు. వాస్తవానికి ఆ పదార్థం పీతలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. కానీ ఆ చెఫ్ కాస్త వినూత్నంగా ఆలోచించి వెజిటేరియన్లు కూడా ఇష్టంగా తింటారని పుట్టగొడుగులతో తయారు చేశారు. రుచి చూస్తే ఆహా అనిపించింది. అతిథులందరూ మైమరిచి తిన్నారు. అప్పుడే జోసెఫ్ మదిలో మష్రూమ్స్కి బదులుగా పనసపళ్లని వాడి ఉంటే దాని రుచి వంద రెట్లు పెరిగేది కదా అన్న ఆలోచన వచ్చింది.. జోసెఫ్‌ది కేరళ. చిన్నప్పట్నుంచి పనస పండు రుచి బాగా తెలుసు. మాంసం, పుట్టగొడుగుల కంటే పసనపండులోనే ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి కదా! దీనినో ప్రత్యామ్నాయ ఆహారంగా ఎందుకు ప్రపంచానికి పరిచయం చేయకూడదు అనుకున్నారు. అమెరికాకు తిరిగి వెళ్లినా అవే ఆలోచనలు ఆయనను వెంటాడాయి. వాటికో రూపం ఇవ్వడానికి కొంతమంది చెఫ్‌లను సంప్రదించారు. పనస పండుతో విన్నూత్నమైన రుచులు చేయవచ్చునని మాంసాహారానికి బదులుగా ఈ పండుని వాడితే ఆహార భద్రతని అధిగమించవచ్చునన్నది ఆయన ఆలోచన. పనస పళ్ల సీజన్ వచ్చాక ఆ పండుని తెప్పించి తనకు బాగా తెలిసిన చెఫ్‌తో దగ్గరుండి జోసెఫ్ బర్గర్ చేయించారు. ఆ తొనల్లో మెత్తదనం, ఒక రకమైన తియ్యటి కమ్మదనం, దానిపై డెకరేషన్‌కు వాడిని పసన పిక్కలు. ఓహో అదో అద్భుతమైన రుచి. ఆలూ బర్గర్ కంటే యమ్మీ యమ్మీగా ఉంది. ఇక పనస పండుతో కేక్ కూడా తయారు చేశారు. వాటి రుచికి సాటిపోటి లేదని అనిపించింది, మెక్‌డొనాల్డ్‌లో అమ్మకానికి పెడితే హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. అంతే జోసెఫ్ ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోయింది. ఉన్న పళంగా నెలకి ఆరెంకలు వచ్చే జీతం, మైక్రోసాఫ్ట్‌లాంటి సంస్థలో డైరెక్టర్ హోదా అన్నీ వదిలేసుకున్నారు. జాక్‌ఫ్రూట్ 365 అన్న కంపెనీ ప్రారంభించారు. కొద్ది ఏళ్లల్లోనే పనసతో కోట్లకు పడగలెత్తడమే కాదు, నిలువెత్తు ధనం కుమ్మరించినా రాని పేరు అంతర్జాతీయంగా సంపాదించారు. జాక్ ఫ్రూట్ మ్యాన్‌గా గుర్తింపు సంపాదించారు. వీగన్లకి వరం వీగన్ డైట్ అంటే ఏమిటో తెలుసు కదా.. పూర్తిగా మొక్కల మీద పండిన ఆహారమే ఈ డైట్. ఈ మధ్య కాలంలో క్రీడాకారులందరూ వీగన్ డైట్‌ను తెగ ఫాలో అవుతున్నారు. భారత్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కొహ్లీ కూడా వీగన్‌గా మారడంతో అసలు ఏమిటీ డైట్ అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగింది. మాంసాహారం మాత్రమే కాదు జంతువుల నుంచి వచ్చే పాలు, పెరుగు, తేనె వంటి పదార్థాలు కూడా ఈ డైట్లో తీసుకోరు. ఒక్క ముక్కలో చెప్పాలంటే శుద్ధశాకాహారులన్న మాట. కక్క ముక్క లేనిదే ముద్ద దిగని వారు రాత్రికి రాత్రి మాంసాహారానికి దూరం కావడం అంత ఈజీ కాదు. అలాంటి వారికి పనస ప్రాణ సమానంగా అనిపిస్తోంది. మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా పనసపండుని పాశ్చాత్య దేశాలు గుర్తించాయి. దీనికి కారణం ఆ పండు తొనలే. వాటిని నములుతుంటే మెత్తగా, రుచిగా అచ్చంగా మాంసం తింటున్న ఫీల్ వస్తుంది. తొనల చుట్టూ ఉండే పీచు కూడా విదేశీయులు ఇష్టంగా తింటారు. మొక్కలతో ప్రొటీన్ వచ్చే ఆహారాలైన పప్పుదినుసులు, గింజలు, పనస వంటి ఇతర పళ్ల మార్కెట్ గత ఏడాది 105 కోట్ల డాలర్ల నుంచి 2025 నాటికి 163 కోట్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా. గ్రీన్హౌస్ పోరాటంలో కీలకపాత్ర మాంసాన్ని ఉత్పత్తి చేయడం ఎంతో ఖర్చుతో కూడిన పని. దీనికి భారీ భూమి, జల వనులు, పశుపోషణకు ఇతర వనరులు కావాలి. దీని వల్ల 14.5% గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతాయి. కానీ పనస అలా కాదు. గ్రీన్ హౌస్ వాయువుల్ని ఆ చెట్టు అత్యధికంగా తీసుకుంటుంది. వరి, గోధు, మొక్క జొన్న పంటల కంటే భవిష్యత్‌లో పనసకే డిమాండ్ పెరుగుతుందని ఒక అంచనా. ఎందుకంటే పనస చెట్టు పెంచడానికి పెద్దగా శ్రమించనక్కర్లేదు. గాలికి, ధూళికి కూడా పెరిగిపోతుంది. సరిహద్దుల్లేని పనస గత రెండు మూడేళ్లుగా మన దేశంలో పసన విలువ గ్రహించాం కానీ విదేశాలు ఎప్పుడో ఈ పని చేశాయి. వియాత్నం 15 ఏళ్ల క్రితమే పనసపండుకి ప్రాచుర్యం కల్పించడం మొదలు పెట్టింది. 50 వేల హెక్టార్లలో పనసని పండిస్తున్నారు. మలేసియా, ఫిలిప్పీన్స్, కంబోడియా, శ్రీలంక కూడా పనసకి పెద్ద పీటే వేస్తున్నారు. శ్రీలంక వ్యవసాయ శాఖ ఈ పండుని గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు పంపిణీ చేస్తూ పోషాకాహార లోపాలను అధిగమిస్తోంది. పనసకి కొత్త కొత్త రుచులు కల్పించి రకరకాల పదార్థాలను తయారు చేయడంలో వియాత్నం నెంబర్ వన్. మలేసియా జాతీయ విధానంలో పనసకు భాగం ఉంది. అన్ని రంగాల్లో దూసుకుపోయే చైనా 1992 నుంచే పనసను పెంచుతోంది కానీ దానిని సొమ్ము చేసుకోవడంలో ఆ దేశమే నెంబర్ వన్. రోడ్డుకి ఇరువైపులా పనస చెట్లనే నాటిస్తోంది. ఇక ఫిలీప్పీన్స్ పనస పంటపై ఏకంగా కోర్సులే మొదలు పెట్టింది. పనస భలే పసందు జాక్‌ఫ్రూట్ మ్యాన్‌గా పేరు పొందిన జేమ్స్ జోసెఫ్ ఎన్ని రకాలు వంటకాలు చేయొచ్చో స్వయంగా ఆలోచించి ప్రయోగాలు చేశారు. రుచికి రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం కావడంతో జోపెఫ్ పంట పండింది. పనసతో ఆయన తయారు చేసిన కబాబ్, బిర్యానీ, మసాల దోశ, పనస రోల్స్, పాయసం, కేకులు, వైన్, పకోడీలు, పిజ్జాలు, బర్గర్లు, ఇలా ఒకటేమిటి అటు సంప్రదాయ వంటలు, ఇటు వెస్ట్రన్ స్టైల్ ఘుమఘుమలు ఎన్నో తయారు చేశారు. జాక్ ఫ్రూట్ అంబాసిడర్ అవార్డు కూడా అందుకున్నారు. కేవలం కేరళలోనే మొత్తం 30 కంపెనీలు పనసకి సంబంధించిన రకరకాల పదార్థాలు చేసి అమ్ముతున్నాయి. పనస ఐస్‌క్రీమ్‌లు, చిప్స్, జ్యూస్‌లు ఒకటేమిటి ఏడాది పొడవునా నిల్వ చేసుకునే ఎన్నో రకాలు తయారై మార్కెట్‌ని ముంచెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాలోన్లూ పంట పండుతోంది తెలంగాణలో ఆదిలాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, చిత్తూరులో పనస విస్తారంగా పండుతుంది. ఏపీలో మొత్తం 1197 హెక్టార్లలో, ప్రతీ ఏడాది ఇంచుమించుగా 41 వేల మిలియన్ టన్నుల పంట పండుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పనసకుండే మార్కెట్‌ని గ్రహించి ప్రోసెసింగ్ యూనిట్లు, చిప్స్ తయారీ ఫ్యాక్టరీలు నెలకొల్పడానికి సన్నాహాలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి వెల్లడించారు. ఈ పండుని రవాణా చేయడానికి వీలుగా చిన్న సైజులో పండేలా సంకర జాతి పనస పండించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 12.4 కోట్లమంది ఇంకా ఆకలితో మాడిపోతున్నారని ప్రపంచ ఆకలి సూచి చెబుతోంది. ఆకలి కేకల్ని తగ్గించడానికి, వివిధ రుచుల్ని ఆస్వాదించడానికి పెద్దగా శ్రమ లేకుండానే ఇళ్లల్లో, వీధుల్లో పనస చెట్లు పెంచితే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆదాయానికి ఆదాయం. ఆహార భద్రత కూడా. పనస విలువ ఎంతటిదో తెలిసింది కదా, మరింకేం ఈ రుచిని మనసారా ఆస్వాదించండి. జీవితాంతం ఆరోగ్యంగా ఉండండి. అరవింద న్యాయపతి -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పనసారా తినండి
విస్తట్లో ఎన్ని కూరలు వడ్డించినా, పనస కూర పడనిదే పొట్ట నిండినట్టు అనిపించదు కొందరికి. రుచులందు పనస రుచి వేరయా అన్నాట్ట వెనకటికి ఓ పనస ప్రియుడు. ఇంకేం మరి.. ఈ శుభకార్యాల సీజన్లో మీ విస్తరిలో పనస రుచిని కూడా పడనివ్వండి. పనసారా తినండి... మనసారా ఆస్వాదించండి. పనస బిర్యానీ కావలసినవి: పనస ముక్కలు – అర కేజీ; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; బిర్యానీ ఆకు – 2; లవంగాలు – 2; ఏలకులు – 1; మరాఠీ మొగ్గ – చిన్నది; జాజి పువ్వు – తగినంత; ఉల్లి తరుగు – అర కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; చిక్కటి కొబ్బరి పాలు – 2 కప్పులు; ఎండు కొబ్బరి తురుము – అర కప్పు; పుదీనా తరుగు – అర కప్పు తయారీ: ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక మసాలా దినుసులు వేసి వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►టొమాటో తరుగు జత చేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి ►పనస ముక్కలు వేసి బాగా వేయించాలి ►అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మరోమారు వేయించాలి ►తగినంత ఉప్పు జత చేసి మరోమారు కలియబెట్టాలి ►చిక్కటి కొబ్బరి పాలు జత చేయాలి ►పచ్చి కొబ్బరి తురుము వేయాలి ►తగినన్ని నీళ్లు పోయాలి ∙పుదీనా తరుగు వేయాలి ►బాగా కడిగిన బియ్యం జత చేసి బాగా కలియబెట్టి, మూత ఉంచాలి ►బాగా ఉడికిన తరవాత దింపేయాలి. పనస కోఫ్తా కర్రీ కావలసినవి: పనస కాయ ముక్కలు – ఒక కప్పు; బంగాళ దుంప తరుగు – ఒక కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; అల్లం ముద్ద – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 3 (మెత్తగా ముద్ద చేయాలి); జీలకర్ర – ఒక టీ స్పూను; కిస్మిస్ – ఒక టేబుల్ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 4; ఉప్పు – తగినంత; సెనగ పిండి – 2 టేబుల్ స్పూన్లు; మిరప కారం – ఒక టీ స్పూను; నూనె – 2 టేబుల్ స్పూన్లు; బిర్యానీ ఆకు – 2; ఎండు మిర్చి – 2; పసుపు – పావు టీ స్పూను తయారీ: ►స్టౌ మీద బాణలిలో తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి ►పసన ముక్కలను శుభ్రంగా కడిగి, ఆ నీళ్లలో వేసి బాగా ఉడికించాలి ►బాగా చల్లారాక మిక్సీలో వేసి (తడి ఉండకూడదు) ఉప్పు జత చేసి మెత్తగా చేయాలి ►సగం ఉల్లి తరుగును మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►మిక్సీలో ఎండు మిర్చి, జీలకర్ర వేసి మెత్తగా చేయాలి ►ఉడికిన పసన ముక్కలను ఒక పాత్రలోకి తీసుకోవాలి ►సగం కిస్మిస్లను సన్నగా తరగాలి ►ఒక పాత్రలో మెత్తగా చేసిన పనస ముక్కలు, అల్లం పేస్ట్, ఉల్లి పేస్ట్, పచ్చి మిర్చి తరుగు, సెనగ పిండి, ఉప్పు, పసుపు, మిరప కారం వేసి పునుగుల పిండిలా కొద్దిగా గట్టిగా కలపాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, కలిపి ఉంచుకన్న పిండిని చిన్న చిన్న కోఫ్తాలుగా చేసి వేయించి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►స్టౌ మీద బాణలిలోనూనె వేసి కాగాక బిర్యానీ ఆకు, ఎండుమిర్చి వేసి వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►బంగాళదుంప ముక్కలు జత చేసి మరోమారు బాగా కలిపి, ఉప్పు, పసుపు జత చేయాలి ►ముందుగా తయారుచేసి ఉంచుకున్న ఉల్లి పేస్ట్, అల్లం పేస్ట్లను ఒకదాని తరవాత ఒకటి వేసి కలియబెట్టాలి ►తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి మూత ఉంచి ఉడికించి, చల్లారాక మూత తీయాలి ►తయారుచేసి ఉంచుకున్న కోఫ్తాలను జత చేయాలి ►బాగా ఉడికించి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►వేడి వేడి అన్నంలోకి బంగాళదుంప, కోఫ్తాలను కలిపి తింటే రుచిగా ఉంటుంది. పనస తొనల హల్వా కావలసినవి: పనస తొనలు – 6; పనస గింజలు – 6; జీడి పప్పులు – ఒక టేబుల్ స్పూను; కిస్ మిస్ – ఒక టేబుల్ స్పూను; పంచదార – ఒక కప్పు; నెయ్యి – ఒక కప్పు తయారీ: ►పనస గింజలను ఉడికించి, తొక్కలు తీసి ముక్కలు చేసి, మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచాలి ►పనస తొనలను సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ►స్టౌ మీద బాణలి పెట్టి నెయ్యి వేసి కరిగించాలి ►జీడి పప్పులు, కిస్ మిస్ వేసి దోరగా వేయించి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►అదే బాణలిలో పనస ముక్కలు వేసి వేయించి, కొద్దిసేపు మూత ఉంచాలి (మంట బాగా తగ్గించాలి) ►మూత తీసి మరోమారు బాగా కలియబెట్టి దింపేయాలి ►స్టౌ మీద బాణలిలో నీళ్లు పోసి మరిగించాలి ►పంచదార జత చేసి కరిగే వరకు కలుపుతుండాలి ►పనస గింజల ముద్ద వేసి కలియబెట్టి, బాగా ఉడికించాలి ►పనస ముక్కలు జత చేసి కలియబెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించి, దింపేయాలి ►జీడిపప్పు, కిస్మిస్లతో అలంకరించి అందించాలి. పనస పొట్టు ఆవపెట్టిన కూర కావలసినవి: పనన పొట్టు – పావు కేజీ; తరిగిన పచ్చి మిర్చి – 6; అల్లం తురుము – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను + ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 5; కరివేపాకు – 3 రెమ్మలు; కొత్తిమీర – 2 టీ స్పూన్లు; చింతపండు రసం – అర టేబుల్ స్పూను (చిక్కగా ఉండాలి); ఉప్పు – తగినంత; నూనె – ఒక టేబుల్ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను. తయారీ: ►పనసపొట్టును శుభ్రంగా కడగాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, పచ్చిసెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరసగా ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ►కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం తురుము వేసి మరోమారు వేయించాలి ►పనస పొట్టు వేసి బాగా కలిపి, కొద్దిగా నీళ్లు పోసి, మూత పెట్టి ఉడికించాలి ►ఉప్పు, పసుపు, చింతపండు రసం వేసి కలియబెట్టాలి ►ఆవాలకు కొద్దిగా నీళ్లు జతచేసి మెత్తగా చేసి, కూరలో వేసి మరోమారు కలపాలి ►బాగా ఉడికిన తరవాత కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి. పనస కాయ గుజ్జు కూర కావలసినవి: పసన కాయ ముక్కలు – అర కేజీ; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 10; పసుపు – అర టీ స్పూను; గరం మసాలా – ఒక టీ స్పూను; కొత్తిమీర – తగినంత; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్ స్పూన్లు; జీడి పప్పు + గరం మసాలా పేస్ట్ – 3 టేబుల్ స్పూన్లు; కారం – తగినంత; టొమాటో ముక్కలు – ఒక కప్పు (మిక్సీలో వేసి మెత్తగా గుజ్జు చేయాలి); అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టేబుల్ స్పూను; జీడి పప్పు పలుకులు – తగినన్ని తయారీ: ►ఒక పాత్రలో పనస ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, మసాలా పేస్ట్ వేయాలి ►తగినన్ని నీళ్లు జత చేసి బాగా కలిపి కుకర్‌లో ఉంచి స్టౌ మీద ఉంచాలి ►మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►పసుపు, మిరప కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి మరోమారు కలపాలి ►టొమాటో గుజ్జు వేసి బాగా కలియబెట్టి, ఐదునిమిషాల పాటు ఉడికించాలి ►కొద్దిగా నీళ్లు జత చేసి కలపాలి ►ఉడికించుకున్న పనస ముక్కల మిశ్రమం జత చేసి కలియబెట్టాలి ►తరిగిన పచ్చి మిర్చి జత చేయాలి ►కొత్తిమీర తరుగు, గరం మసాలా, జత చేసి కలిపి రెండు నిమిషాలు ఉడికించాలి ►కొద్దిగా కొత్తిమీర, జీడిపప్పులతో అలంకరించాలి ►వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. పనస ముక్కల కూర కావలసినవి: పనస ముక్కలు – అర కిలో; ఉల్లి తరుగు – ఒక కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; బిర్యానీ ఆకులు – 2; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – 2 టీ స్పూన్లు; ధనియాల పొడి + జీలకర్ర పొడి – 2 టీ స్పూన్లు; జీలకర్ర – ఒక టీ స్పూను; గరం మసాలా – ఒక టీ స్పూను; నూనె – 3 టేబుల్ స్పూన్లు; మిరియాల పొడి – పావు టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; కొత్తిమీర – తగినంత. తయారీ: ►మిక్సీలో టొమాటో ముక్కలు, ఉల్లి తరుగు వేసి మెత్తగా చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పనస ముక్కలు వేసి బాగా కలిపి, పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ►స్టౌ మీ కుకర్‌లో కొద్దిగా నూనె వేసి కాగాక బిర్యానీ ఆకులు, జీలకర్ర వేసి వేయించాలి ►ఉల్లి తరుగు జతచేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►అల్లం వెల్లుల్లి ముద్ద జతచేసి కలపాలి ►టొమాటో, ఉల్లి ముద్ద వేసి బాగా కలిపి, మంట బాగా తగ్గించాలి ►పసుపు, ఉప్పు, మిరప కారం, ధనియాలు, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి బాగా కలియబెట్టాలి ►వేయించిన పసన ముక్కలు జత చేసి కలియబెట్టాలి ►గ్లాసుడు నీళ్లు పోసి కుకర్ మూత ఉంచి, మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►చల్లారాక విజిల్ తీయాలి ►గరం మసాలా జత చేసి కలియబెట్టి, రెండు నిమిషాలు ఉడికించాలి ►కొత్తిమీర వేసి బాగా కలియ బెట్టి రెండు నిమిషాల తరవాత దింపేయాలి . పనస ముక్కల కేరళ కర్రీ కావలసినవి: పనస ముక్కలు – అర కేజీ; ఉప్పు – తగినంత; ధనియాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; లవంగాలు – 3; ఎండు మిర్చి – 3; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; ఎండు కొబ్బరి తురుము – అర కప్పు; చింతపండు గుజ్జు – ఒక టీ స్పూను; కొబ్బరి నూనె – 4 టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; కరివేపాకు – 3 రెమ్మలు; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 4 ; టొమాటో ప్యూరీ – ఒక కప్పు; ఉప్పు – తగినంత తయారీ: ►ఒక పాత్రలో పనస ముక్కలు, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ►మరో స్టౌ మీద బాణలి వేడయ్యాక ధనియాలు వేసి వేయించాలి ►జీలకర్ర, లవంగాలు జత చేసి మరోమారు వేయించి దింపేయాలి ►మిక్సీలో ఎండు మిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, వేయించిన ధనియాల మిశ్రమం, కొబ్బరి తురుము, చింత పండు గుజ్జు వేసి, తగినన్ని నీళ్లు జత చేసి మెత్తగా చేయాలి ►స్టౌ మీద బాణలిలో నాలుగు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ►కరివేపాకు జత చేసి మరోమారు వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►పచ్చి మిర్చి తరుగు జత చేసి మరోమారు వేయించాలి ►టొమాటో ప్యూరీ జత చేసి ఉడికించాలి ►ఉడికించిన పసన ముక్కలను ఇందులో వేసి కలియబెట్టాలి ►మిక్సీ పట్టిన పదార్థాల మిశ్రమం జత చేసి, బాగా కలియబెట్టాలి ►తగినంత ఉప్పు జత చేసి కలియబెట్టి, మూత ఉంచాలి ►బాగా ఉడికిన తరవాత దింపేయాలి. పనస గింజలు – పెసర పప్పు కూర కావలసినవి: పనస గింజలు – పావు కేజీ; పెసర పప్పు – 100 గ్రా.; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి); పసుపు – పావు టీ స్పూను; కరివేపాకు – 3 రెమ్మలు; కొత్తిమీర – ఒక టేబుల్ స్పూను; నూనె – ఒక టేబుల్ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను తయారీ: ►ఒక గిన్నెలో పెసర పప్పుకు కొద్దిగా నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ►పనస గింజలకు తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి కుకర్‌లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►చల్లారాక మూత తీసి, గింజలను బయటకు తీసి, తొక్క వేరు చేయాలి ►గింజలను మధ్యకు కట్ చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి ►ఉడికించిన పెసర పప్పు, పనస గింజలు జత చేసి బాగా కలియబెట్టాలి ►పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి ►అన్నంలోకి రుచిగా ఉంటుంది. పసందైన పనస మార్కెట్లో రెడీమేడ్‌గా పనస పొట్టు దొరుకుతుంది. మనకు ముక్కలుగా కావాలంటే అలాగే ముక్కలుగా కూడా అమ్ముతారు. ఇంటి దగ్గర పనస పొట్టు ఎలా చేసుకోవాలి... ►దోరగా ఉన్న పనస కాయను ముందుగా శుభ్రంగా కడగాలి ►పనసకాయ కత్తికి నువ్వుల నూనె పూసి, కాయ పైన ముళ్లుగా ఉండే భాగాన్ని అంగుళం మందంలో చెక్కేయాలి ►పనస కాయకు నిండుగా నూనె పూయాలి ►పెద్ద ముక్కలు కావాలనుకుంటే ఆ పరిమాణంలోకి కట్ చేయాలి ►పనస పొట్టు కావాలనుకుంటే, అదే కత్తితో సన్నగా పొట్టులా వచ్చేవరకు కొట్టాలి ►పొట్టులో కూడా కొద్దికొద్దిగా నువ్వుల నూనె, పసుపు కలుపుతుండాలి. పనస తొనలు కావాలనుకుంటే... ►బాగా పండి, ఘుమఘుమలాడే పనస కాయను తెచ్చుకోవాలి ►పనస కాయ కత్తికి నూనె పూసి, పనస కాయను మధ్యకు చీల్చాలి ►చేతికి నూనె పూసుకుని, ఒక్కో తొనను చేతితో జాగ్రత్తగా బయటకు తీయాలి ►కొందరు పనస పెచ్చులతో కూడా పులుసు తయారుచేసుకుంటారు (సొర కాయ పులుసు మాదిరిగా) ►పనస తొనలలో ఉండే గింజలను వేరు చేసి, తగినంత ఉప్పు జత చేసి ఉడికించి తింటే రుచిగా ఉంటాయి ►వంకాయలకు ఈ గింజలు జత చేసి కూర చేస్తే రుచిగా ఉంటుంది ►పనస తొనలతో పాయసం కూడా చేసుకుంటారు ►పనస బిర్యానీ ఇప్పుడు పెళ్లిళ్లలో లేటెస్ట్ వంటకం. తండ్రి గర గర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్యమాణిక్యాలు... ఏంటో చెప్పుకోండి చూద్దాం. పనసకాయ... అంతేగా. చిన్నప్పటి నుంచి ఈ పండుకి సంబంధించిన పొడుపు కథ వింటూనే పెరిగాం. ►ప్రపంచంలోనే అతిపెద్ద పండును ఇచ్చే చెట్టు ఇదే. ఒక్కో పండు దాదాపు 35 కిలోల బరువు, 90 సెం.మీ. పొడవు, 50 సెం.మీ. వ్యాసంలో ఉంటుంది. పనస కాయను కోసేటప్పుడు చేతికి, చాకుకి కూడా తప్పనిసరిగా నూనె పూయాలి ►పనస తొనలలో అన్నిరకాల పోషకాలు ఉంటాయి ►దీనిని సంస్కృతంలో స్కంద ఫలం అంటారు ►విందు భోజనాల సమయంలో ఈ కూరను తప్పనిసరిగా తయారుచేస్తారు ►జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది ►వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది ►రక్తపోటును తగ్గిస్తుంది ►వేడి చేసిన పనస ఆకులను గాయాల మీద ఉంచితే త్వరగా ఉపశమనం లభిస్తుంది ►అధిక బరువును మలబద్దకాన్ని తగ్గిస్తుంది ►కొద్దిగా తయారయిన కాయను కోసి, పండ బెట్టుకుంటేనే పనస పండుకి రుచి ►ఇందులో పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి ►విటమిన్ ఏ, బి 1, బి 2, బి 3, బి 5, బి 6, బి 9, విటమిన్ సి, విటమిన్ ఈ ఉన్నాయి ►ఇందులో ఉండే క్యాల్షియం శరీరంలోని ఎముకలను, కండరాలను బలోపేతం చేస్తుంది ►పనస చెక్కతో తయారైన వీణలు శ్రేష్ఠమైనవి ►చిన్న చిన్న పడవల తయారీకి పసన చెక్కను ఉపయోగిస్తారు ►పనసాకులను విస్తరాకులుగా ఉపయోగిస్తారు ►పనస ఆకులలో ఇడ్లీ పిండి వేసి, ఇడ్లీలు కూడా తయారుచేస్తారు. వీటిని పొట్టిక్కలు అంటారు ►పనస వేర్లతో ఫొటో ఫ్రేములు తయారుచేస్తారు. -
కమ్మటి తొనలు కంటికి మేలు
పనసపండు రుచిలోనే కాదు... ఆరోగ్య పరిరక్షణ కోసం కూడా అంతే మంచిది. దాని వల్ల ఆరోగ్యానికి సమకూరే ప్రయోజనాలు అనేకం. వాటిలో కొన్నివి. పనసలో చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి క్యాన్సర్ కారకాలైన ఫ్రీ–రాడికల్స్‌ను నిర్మూలించి అనేక క్యాన్సర్లను నివారిస్తాయి. మరీ ముఖ్యంగా పెద్దపేగు, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్లను నివారిస్తుంది. ∙పనసలో విటమిన్–సి పాళ్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్–సితో వ్యాధి నిరోధక శక్తి సమకూరుతుంది. అందువల్ల పనస చాలా రకాల వ్యాధులు రాకుండా మనల్ని కాపాడుతుంది. పనస పండులో లోని కొన్ని పోషకాలు మంట, వాపు, నొప్పి (ఇన్ఫ్లమేషన్)ను తగ్గిస్తాయి. దెబ్బలు త్వరగా నయమయ్యేలా చూస్తాయి. పనసలోని ప్రత్యేకమైన ఫైటోన్యూట్రియెంట్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి పోషకాల సామర్థ్యం చాలా ఎక్కువ. అవి జీవకణాలలోని దెబ్బతిన్న డీఎన్ఏలను సైతం చక్కదిద్దగలవు. పనసలో విటమిన్–ఏ పాళ్లు ఎక్కువ. అందుకే అది కంటికి మేలు చేస్తుంది. అదీగాక క్యాటరాక్ట్, మాక్యులార్ డీ–జనరేషన్, రేచీకటి వంటి కంటి వ్యాధులను నివారిస్తుంది. పనసలోని విటమిన్–సి మన చర్మ ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తుంది. మేనిని నిగారించేలా చేస్తుంది. దాంతో వయసు పెరగడం (ఏజింగ్ ప్రక్రియ) చాలా ఆలస్యంగా జరుగుతుంది. పనసలో పొటాషియమ్ పాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల అది రక్తపోటును నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తుంది.పనస థైరాయిడ్ గ్రంథికి వచ్చే జబ్బులను నివారించడంతో పాటు థైరాయిడ్ జీవక్రియలకు అవసరమైన కాపర్‌ను సమకూరుస్తుంది. -
బడుగు రైతును ‘గట్టె’క్కించే పనస!
చల్లని ప్రాంతాల్లోనే కాదు.. వేడి వాతావరణం, కరువు ప్రాంతాలూ పనస సాగుకు అనుకూలమే పొలం గట్లపై పనస చెట్లు.. విదర్భ రైతుల మోముల్లో చిరునవ్వులు కరువొచ్చి పంటలు ఆదుకోకపోయినా.. బడుగు రైతు బతుకు బండిని సునాయాసంగా గట్టెక్కిస్తున్న పనస పండ్లు తమిళనాడులో వేల హెక్టార్లలో ప్రత్యేకంగా పనస తోటల సాగు పనసతో 40 రకాల ఉత్పత్తులు తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చిన కేరళ కేవీకే పనస పండ్ల (జాక్ ఫ్రూట్) సాగు అనగానే పుష్కలంగా వర్షం కురిసే కేరళ, తమిళనాడులోని ప్రాంతాలే గుర్తుకొస్తాయి. కేరళలో పదో పరకో పనస చెట్లు లేని పెరటి తోటలే కనపడవు. సంప్రదాయకంగా పనస సాగు, వినియోగంలోనూ కేరళ ముందంజలో ఉంది. ఇక తమిళనాడులోని కడలూరు జిల్లా పనృతి ప్రాంత రైతులైతే వేలాది ఎకరాల్లో ప్రత్యేకంగా పనస తోటలనే సాగు చేస్తున్నారు. హెక్టారుకు ఏడాదికి రూ. లక్షన్నర వరకు ఆదాయం పొందుతున్నారు. ఎరువులు, తెగుళ్లు, పురుగుల బెడద లేని పంట కాబట్టి నికరాదాయం ఉంటున్నది. అయితే, కేరళ, తమిళనాడు తీరప్రాంతాల్లో కన్నా తక్కువ వర్షపాతం, వేడి వాతావరణం పనస సాగుకు సరిపడదేమో?! బహుశా ఈ భావనతోనే కావచ్చు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పెరట్లో ఒకటీ అరా వేసుకోవడమే తప్ప పనస చెట్లను రైతుకు ఆదాయ భద్రతనిచ్చే పెద్ద భరోసాగా చూడలేదు. ఈ నేపథ్యంలో వేడి వాతావరణం, అత్యంత బెట్ట పరిస్థితుల్లోనూ ఈ చెట్లు కొండంత అండగా నిలిచి కాసులు కురిపిస్తాయని మహారాష్ట్రలోని విదర్భ ప్రాంత రైతుల అనుభవాలు చాటి చెబుతున్నాయి. రైతు ఆత్మహత్యలతో తరుచూ వార్తల్లో నిలిచే విదర్భ ప్రాంతంలోని యవత్మాల్, చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల్లో గత పదేళ్లుగా పొలం గట్లపై పనస చెట్ల సాగు విస్తరిస్తోంది. నాగపూర్ తదితర విదర్భ పట్టణాల్లో లేత పనస కాయలకు, పండ్లకు మంచి డిమాండ్ ఉండటంతో రైతులకు చక్కని ఆదాయం వస్తోంది. యవత్మాల్ జిల్లా కామత్వాడా చుట్టుపక్కల గల నల్లరేగడి పొలాల గట్లపై పనస చెట్లను విరివిగా సాగు చేస్తున్నారు. అక్కడి వాతావరణం, ఉష్ణోగ్రత తెలంగాణను పోలి ఉంటుంది. వర్షపాతం ఇంకా తక్కువ. అక్కడి రైతులు పత్తి, సోయాబీన్ వంటి పంటలను సాగు చేసి నష్టపోయిన సందర్భాల్లోనూ పనస చెట్లు ఫలసాయాన్నిస్తున్నాయి. పనస చెట్లున్న రైతుల కళ్లల్లో ఆత్మవిశ్వాసంతో కూడిన మెరుపు తళుక్కుమంటుంది. కామత్వాడాకు చెందిన రామ్‌బా, తుకారాం సోదరులు. తమ పొలం గట్లపై పనస చెట్లు వేశారు. కూరగాయలు, పనస చెట్ల ద్వారా క్రమం తప్పకుండా వస్తున్న ఆదాయంతోనే రామ్బాతన ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్లు చే శాడు. విదర్భ ప్రాంత రైతులు నల్లరేగడి నేలల్లో విజయవంతంగా సాగు చేస్తున్నారు. తేలికపాటి ఎర్ర నేలలు, కంకర నేలలు కూడా పనస సాగుకు అనుకూలమైనవే. అయితే, మొక్కల పెరుగుదల లోతైన నల్లరేగడి నేలల్లో అంత వేగంగా, బలంగా ఉండదు. ఇతర పంటలు సాగుకు అంతగా అనుకూలించని ఖాళీ నేలల్లోనూ పనస చెట్లను సాగు చేస్తున్న వాళ్లున్నారు. నీరు నిలబడే నేలలు పనసకు సరిపడవు. మెట్ట నేలల్లో పెరిగిన పనస తొనల రుచి ఎక్కువట. తొలి రెండేళ్లలో తగు మాత్రంగా నీరందిస్తే చాలు. ఎరువులు, పురుగుమందులు, తెగుళ్ల మందుల అవసరం ఉండదని నిపుణులు చెబుతున్నారు. పనస మొక్క నాటిన ఏడేళ్ల నుంచి పంట చేతికొస్తుందని, వందేళ్ల వరకు చెట్లు పండ్లనిస్తూ ఉంటాయని రైతులు చెబుతున్నారు. అంట్లు నాటుకుంటే 4-6 ఏళ్లలోనే కాపుకొస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. లేత కాయలు కొన్నిటిని తీసేస్తే (దీన్నే ‘థిన్నింగ్’ అంటున్నారు) మిగతా కాయలు బలంగా పెరుగుతాయి. పోషకాల గని పనస పండులో విటమిన్ ఏ, సీలు అధికంగా ఉన్నాయి. వీటితోపాటు పొటాషియం, క్యాల్షియం, భాస్వరం, ఇనుము, 12 శాతం పిండి పదార్థాలు, 6-7 శాతం మాంసకృత్తులు, 2-3 శాతం పీచుపదార్థాలు ఉన్నాయి. చెక్కెర శాతం తక్కువగా ఉండి సులభంగా జీర్ణమవుతుంది. హఠాత్తుగా చెక్కెర నిల్వలు పడిపోయే ప్రమాదాన్ని ఇది నివారిస్తుందని..ఓ అధ్యయనంలో తేలింది. ‘ఆంటీ ఆక్సిడెంట్స్ ఫ్లేవనాయిడ్స్ ఉండటంతో క్యాన్సర్ నిరోధకంగానూ పనిచేస్తుంది. అకాల వృద్ధాప్యాన్ని దరి చేరనివ్వదు’ అని బెంగళూరు వ్యవసాయ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. శ్యామలా రెడ్డి అంటున్నారు. ఎన్నెన్నో వంటకాలు లేత పనస కాయలతో చేసే కూరలకు మహారాష్ట్రలోని హోటళ్లలో మంచి గిరాకీ ఉంది. దీన్ని మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా తింటున్నారు. కేరళ ప్రజల మెనూలో పనస ఉత్పత్తులు అనేకం ఉంటాయి. పచ్చళ్లు, జామ్‌లు, స్క్వాష్‌లు, జెల్లీలు, హల్వా సహా పలు రకాల ఉత్పత్తులను తయారు చేసి వాడుతున్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పనస ఉత్పత్తుల తయారీ, విక్రయంపై ఇటీవల దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. బెంగళూరు సమీపంలోని టూబుగెరె ప్రాంతంలో పెరటి తోటల్లో పనస చెట్లు పెంచుతున్న వాళ్లంతా సహకార సంఘంగా ఏర్పడి తమ ఉత్పత్తులను అమ్ముతూ చెట్టుకు ఏడాదికి రూ. 3 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. కేరళలోని పాతనంతిట్ట జిల్లా తిరువళ్ల సమీపంలోని తెల్లియార్లో గల కృషి విజ్ఞాన్ కేంద్రం పనసతో 40 రకాల ఉత్పత్తులను తయారు చేసే సాంకేతిక విజ్ఞానాన్ని రూపొందించింది. 6 నెలల నుంచి 12 నెలల వరకు నిల్వ చేసుకొని అమ్మేందుకు వీలుందని శాస్త్రవేత్తలు తెలిపారు. పనస సాగు, ఉత్పత్తుల తయారీపై ఈ కేవీకే శిక్షణ కూడా ఇస్తోంది. తిరువనంతపురానికి చెందిన ‘గాంధీ సెంటర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్’ కూడా శిక్షణ ఇస్తోంది. వరి, గోధుమలకు బదులుగా పనస ఉత్పత్తులను ప్రధానాహారంగా తీసుకోవడానికీ వీలుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రోసెసింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి ప్రభుత్వం పనస తోటల సాగును ప్రోత్సహించవచ్చు. - సాగుబడి డెస్క్ అంట్లు 4-6 ఏళ్లలో కాపుకొస్తాయి పనస ఏ నేలల్లోనైనా పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోకన్నా తెలంగాణలో కొంచెం ఫలసాయం తక్కువగా ఉంటుంది. మేం పదేళ్ల క్రితం పనస మొక్కలు నాటి అధ్యయనం చేస్తున్నాం. పొలం గట్ల మీద, ఖాళీ స్థలాల్లో నాటుకుంటే రైతులకు అదనపు ఆదాయం వస్తుంది. ఇతర పండ్ల తోటల్లో కొన్ని మొక్కలు నాటుకోవచ్చు. అయితే, వాణిజ్యపరంగా తోటలుగా సాగు చేయాలంటే.. ప్రోసెసింగ్, మార్కెటింగ్ సదుపాయాలు చూసుకోవాలి. మామిడి సీజన్లోనే పనస పంట వస్తుంది. సపోటాకూ ఇదే ఇబ్బంది. - డా. ఎం. రాజశేఖర్ (73826 33660), సీనియర్ శాస్త్రవేత్త, పండ్ల తోటల పరిశోధనా స్థానం, డా. వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ, వెంకట్రామన్నగూడెం. పెట్టుబడి లేదు.. రిస్క్ తక్కువ.. పనస మొక్కలకు ఎరువులు, తెగుళ్లు, పురుగు మందుల ఖర్చుండదు. కాబట్టి పెట్టుబడి అవసరం లేదు. మహారాష్ట్రలోని యవత్మాల్ వంటి జిల్లాల్లో వార్షిక పంటలు విఫలమైనప్పుడు, కరువు కాలంలోనూ పనస చెట్లు రైతులను పోషకాహారపరంగా, ఆర్థికపరంగా ఆదుకుంటున్నాయి. అక్కడి హోటళ్లలో లేత పనస కాయలతో చేసే కూర మాంసం కూరను మరిపిస్తుంది. ప్రతి రైతూ పొలం గట్ల మీద 5-10 పనస మొక్కలు నాటుకుంటే మేలు. ఈ లక్ష్యంతోనే రైతు రామ్‌బా వద్ద నుంచి వెయ్యి మొక్కలు తీసుకొని రైతులకు పంచాం. - డా. బి. రాజశేఖర్ (83329 45368), సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్ పనస చెట్టు ద్వారా రూ. 11 వేల ఆదాయం 13 ఏళ్ల క్రితం మా పొలం గట్లపైన 15 పనస మొక్కలు నాటాను. ఏడేళ్ల నుంచి కాపు మొదలైంది. ఏడాదికి ఒక్కో చెట్టును రూ. 11 వేలకు వ్యాపారులకు గుత్తకు ఇచ్చాను. పనస మొక్కల నర్సరీ పెట్టి మొక్క రూ. 20 చొప్పున అమ్ముతున్నాను. 500 మంది వరకు రైతులు నా దగ్గర మొక్కలు కొని నాటుకొని.. మంచి ఆదాయం పొందుతున్నారు. - రామ్‌బా, కామత్వాడా గ్రామం, యవత్మాల్ జిల్లా, మహారాష్ట్ర