పనసారా తినండి | This is The Tree That Gives the Largest Fruit in the World | Sakshi
Sakshi News home page

పనసారా తినండి

Published Sat, May 11 2019 12:21 AM | Last Updated on Sat, May 11 2019 12:21 AM

This is The Tree That Gives the Largest Fruit in the World - Sakshi

విస్తట్లో ఎన్ని కూరలు వడ్డించినా, పనస కూర పడనిదే పొట్ట నిండినట్టు అనిపించదు కొందరికి. రుచులందు పనస రుచి వేరయా అన్నాట్ట వెనకటికి ఓ పనస ప్రియుడు.  ఇంకేం మరి.. ఈ శుభకార్యాల సీజన్‌లో మీ విస్తరిలో పనస రుచిని కూడా పడనివ్వండి.  పనసారా తినండి... మనసారా ఆస్వాదించండి.

పనస బిర్యానీ
కావలసినవి: పనస ముక్కలు – అర కేజీ; నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు; బిర్యానీ ఆకు – 2; లవంగాలు – 2; ఏలకులు – 1; మరాఠీ మొగ్గ – చిన్నది; జాజి పువ్వు – తగినంత; ఉల్లి తరుగు – అర కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; చిక్కటి కొబ్బరి పాలు – 2 కప్పులు; ఎండు కొబ్బరి తురుము – అర కప్పు; పుదీనా తరుగు – అర కప్పు

తయారీ:
►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక మసాలా దినుసులు వేసి వేయించాలి
►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
►టొమాటో తరుగు జత చేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి
►పనస ముక్కలు వేసి బాగా వేయించాలి
►అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మరోమారు వేయించాలి
►తగినంత ఉప్పు జత చేసి మరోమారు కలియబెట్టాలి
►చిక్కటి కొబ్బరి పాలు జత చేయాలి
►పచ్చి కొబ్బరి తురుము వేయాలి
►తగినన్ని నీళ్లు పోయాలి ∙పుదీనా తరుగు వేయాలి
►బాగా కడిగిన బియ్యం జత చేసి బాగా కలియబెట్టి, మూత ఉంచాలి
►బాగా ఉడికిన తరవాత దింపేయాలి.

పనస కోఫ్తా కర్రీ
కావలసినవి: పనస కాయ ముక్కలు – ఒక కప్పు; బంగాళ దుంప తరుగు – ఒక కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; అల్లం ముద్ద – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 3 (మెత్తగా ముద్ద చేయాలి); జీలకర్ర – ఒక టీ స్పూను; కిస్‌మిస్‌ – ఒక టేబుల్‌ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 4; ఉప్పు – తగినంత; సెనగ పిండి – 2 టేబుల్‌ స్పూన్లు; మిరప కారం – ఒక టీ స్పూను; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; బిర్యానీ ఆకు – 2; ఎండు మిర్చి – 2; పసుపు – పావు టీ స్పూను

తయారీ:
►స్టౌ మీద బాణలిలో తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి
►పసన ముక్కలను శుభ్రంగా కడిగి, ఆ నీళ్లలో వేసి బాగా ఉడికించాలి
►బాగా చల్లారాక మిక్సీలో వేసి (తడి ఉండకూడదు) ఉప్పు జత చేసి మెత్తగా చేయాలి
►సగం ఉల్లి తరుగును మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
►మిక్సీలో ఎండు మిర్చి, జీలకర్ర వేసి మెత్తగా చేయాలి
►ఉడికిన పసన ముక్కలను ఒక పాత్రలోకి తీసుకోవాలి
►సగం కిస్‌మిస్‌లను సన్నగా తరగాలి
►ఒక పాత్రలో మెత్తగా చేసిన పనస ముక్కలు, అల్లం పేస్ట్, ఉల్లి పేస్ట్, పచ్చి మిర్చి తరుగు, సెనగ పిండి,  ఉప్పు, పసుపు, మిరప కారం వేసి పునుగుల పిండిలా కొద్దిగా గట్టిగా కలపాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, కలిపి ఉంచుకన్న పిండిని చిన్న చిన్న కోఫ్తాలుగా చేసి వేయించి ఒక పాత్రలోకి తీసుకోవాలి
►స్టౌ మీద బాణలిలోనూనె వేసి కాగాక బిర్యానీ ఆకు, ఎండుమిర్చి వేసి వేయించాలి
►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
►బంగాళదుంప ముక్కలు జత చేసి మరోమారు బాగా కలిపి, ఉప్పు, పసుపు జత చేయాలి
►ముందుగా తయారుచేసి ఉంచుకున్న ఉల్లి పేస్ట్, అల్లం పేస్ట్‌లను ఒకదాని తరవాత ఒకటి వేసి కలియబెట్టాలి
►తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి మూత ఉంచి ఉడికించి, చల్లారాక మూత తీయాలి
►తయారుచేసి ఉంచుకున్న కోఫ్తాలను జత చేయాలి
►బాగా ఉడికించి ఒక పాత్రలోకి తీసుకోవాలి
►వేడి వేడి అన్నంలోకి బంగాళదుంప, కోఫ్తాలను కలిపి తింటే రుచిగా ఉంటుంది. 

పనస తొనల హల్వా
కావలసినవి: పనస తొనలు – 6; పనస గింజలు – 6;  జీడి పప్పులు – ఒక టేబుల్‌ స్పూను; కిస్‌ మిస్‌ – ఒక టేబుల్‌ స్పూను; పంచదార – ఒక కప్పు; నెయ్యి – ఒక కప్పు

తయారీ:
►పనస గింజలను ఉడికించి, తొక్కలు తీసి ముక్కలు చేసి, మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌ చేసి పక్కన ఉంచాలి
►పనస తొనలను సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి
►స్టౌ మీద బాణలి పెట్టి నెయ్యి వేసి కరిగించాలి
►జీడి పప్పులు, కిస్‌ మిస్‌ వేసి దోరగా వేయించి ఒక పాత్రలోకి తీసుకోవాలి
►అదే బాణలిలో పనస ముక్కలు వేసి వేయించి, కొద్దిసేపు మూత ఉంచాలి (మంట బాగా తగ్గించాలి)
►మూత తీసి మరోమారు బాగా కలియబెట్టి దింపేయాలి
►స్టౌ మీద బాణలిలో నీళ్లు పోసి మరిగించాలి
►పంచదార జత చేసి కరిగే వరకు కలుపుతుండాలి
►పనస గింజల ముద్ద వేసి కలియబెట్టి, బాగా ఉడికించాలి
►పనస ముక్కలు జత చేసి కలియబెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించి, దింపేయాలి
►జీడిపప్పు, కిస్‌మిస్‌లతో అలంకరించి అందించాలి.

పనస పొట్టు ఆవపెట్టిన కూర
కావలసినవి: పనన పొట్టు – పావు కేజీ; తరిగిన పచ్చి మిర్చి – 6; అల్లం తురుము – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను + ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 5; కరివేపాకు – 3 రెమ్మలు; కొత్తిమీర – 2 టీ స్పూన్లు; చింతపండు రసం – అర టేబుల్‌ స్పూను (చిక్కగా ఉండాలి); ఉప్పు – తగినంత; నూనె – ఒక టేబుల్‌ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను.

తయారీ:
►పనసపొట్టును శుభ్రంగా కడగాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, పచ్చిసెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరసగా ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి
►కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం తురుము వేసి మరోమారు వేయించాలి
►పనస పొట్టు వేసి బాగా కలిపి, కొద్దిగా నీళ్లు పోసి, మూత పెట్టి ఉడికించాలి
►ఉప్పు, పసుపు, చింతపండు రసం వేసి కలియబెట్టాలి
►ఆవాలకు కొద్దిగా నీళ్లు జతచేసి మెత్తగా చేసి, కూరలో వేసి మరోమారు కలపాలి
►బాగా ఉడికిన తరవాత కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి.

పనస కాయ గుజ్జు కూర
కావలసినవి: పసన కాయ ముక్కలు – అర కేజీ; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 10; పసుపు – అర టీ స్పూను; గరం మసాలా – ఒక టీ స్పూను; కొత్తిమీర –  తగినంత; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; జీడి పప్పు + గరం మసాలా పేస్ట్‌ – 3 టేబుల్‌ స్పూన్లు; కారం – తగినంత; టొమాటో ముక్కలు – ఒక కప్పు (మిక్సీలో వేసి మెత్తగా గుజ్జు చేయాలి); అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టేబుల్‌ స్పూను; జీడి పప్పు పలుకులు – తగినన్ని

 తయారీ:
►ఒక పాత్రలో పనస ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, మసాలా పేస్ట్‌ వేయాలి
​​​​​​​►తగినన్ని నీళ్లు జత చేసి బాగా కలిపి కుకర్‌లో ఉంచి స్టౌ మీద ఉంచాలి
​​​​​​​►మూడు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి
​​​​​​​►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
​​​​​​​►పసుపు, మిరప కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి మరోమారు కలపాలి
​​​​​​​►టొమాటో గుజ్జు వేసి బాగా కలియబెట్టి, ఐదునిమిషాల పాటు ఉడికించాలి
​​​​​​​►కొద్దిగా నీళ్లు జత చేసి కలపాలి
​​​​​​​►ఉడికించుకున్న పనస ముక్కల మిశ్రమం జత చేసి కలియబెట్టాలి
​​​​​​​►తరిగిన పచ్చి మిర్చి జత చేయాలి
​​​​​​​►కొత్తిమీర తరుగు, గరం మసాలా, జత చేసి కలిపి రెండు నిమిషాలు ఉడికించాలి
​​​​​​​►కొద్దిగా కొత్తిమీర, జీడిపప్పులతో అలంకరించాలి
►వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది.

పనస ముక్కల కూర
కావలసినవి: పనస ముక్కలు – అర కిలో; ఉల్లి తరుగు – ఒక కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; బిర్యానీ ఆకులు – 2; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – 2 టీ స్పూన్లు; ధనియాల పొడి + జీలకర్ర పొడి – 2 టీ స్పూన్లు; జీలకర్ర – ఒక టీ స్పూను; గరం మసాలా – ఒక టీ స్పూను; నూనె – 3 టేబుల్‌ స్పూన్లు; మిరియాల పొడి – పావు టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; కొత్తిమీర – తగినంత.

తయారీ:
​​​​​​​►మిక్సీలో టొమాటో ముక్కలు, ఉల్లి తరుగు వేసి మెత్తగా చేయాలి
​​​​​​​►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పనస ముక్కలు వేసి బాగా కలిపి, పచ్చి వాసన పోయేవరకు వేయించాలి
​​​​​​​►స్టౌ మీ కుకర్‌లో కొద్దిగా నూనె వేసి కాగాక బిర్యానీ ఆకులు, జీలకర్ర వేసి వేయించాలి
​​​​​​​►ఉల్లి తరుగు జతచేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
​​​​​​​►అల్లం వెల్లుల్లి ముద్ద జతచేసి కలపాలి
​​​​​​​►టొమాటో, ఉల్లి ముద్ద వేసి బాగా కలిపి, మంట బాగా తగ్గించాలి
​​​​​​​►పసుపు, ఉప్పు, మిరప కారం, ధనియాలు, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి బాగా కలియబెట్టాలి
​​​​​​​►వేయించిన పసన ముక్కలు జత చేసి కలియబెట్టాలి
​​​​​​​►గ్లాసుడు నీళ్లు పోసి కుకర్‌ మూత ఉంచి, మూడు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి
​​​​​​​►చల్లారాక విజిల్‌ తీయాలి
​​​​​​​►గరం మసాలా జత చేసి కలియబెట్టి, రెండు నిమిషాలు ఉడికించాలి
​​​​​​​►కొత్తిమీర వేసి బాగా కలియ బెట్టి రెండు నిమిషాల తరవాత దింపేయాలి . 

పనస ముక్కల కేరళ కర్రీ
కావలసినవి: పనస ముక్కలు – అర కేజీ; ఉప్పు – తగినంత; ధనియాలు –  ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; లవంగాలు – 3; ఎండు మిర్చి – 3; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; ఎండు కొబ్బరి తురుము – అర కప్పు; చింతపండు గుజ్జు – ఒక టీ స్పూను; కొబ్బరి నూనె – 4 టేబుల్‌ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; కరివేపాకు – 3 రెమ్మలు; ఉల్లి తరుగు –  అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 4 ; టొమాటో ప్యూరీ –  ఒక కప్పు; ఉప్పు – తగినంత

తయారీ:
​​​​​​​►ఒక పాత్రలో పనస ముక్కలు, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి
​​​​​​​►మరో స్టౌ మీద బాణలి వేడయ్యాక ధనియాలు వేసి వేయించాలి
​​​​​​​►జీలకర్ర, లవంగాలు జత చేసి మరోమారు వేయించి దింపేయాలి
​​​​​​​►మిక్సీలో ఎండు మిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, వేయించిన ధనియాల మిశ్రమం, కొబ్బరి తురుము, చింత పండు గుజ్జు వేసి, తగినన్ని నీళ్లు జత చేసి మెత్తగా చేయాలి
​​​​​​​►​​​​​​​స్టౌ మీద బాణలిలో నాలుగు టేబుల్‌ స్పూన్లు కొబ్బరి నూనె  వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి
​​​​​​​►కరివేపాకు జత చేసి మరోమారు వేయించాలి
​​​​​​​►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
​​​​​​​►పచ్చి మిర్చి తరుగు జత చేసి మరోమారు వేయించాలి
​​​​​​​►టొమాటో ప్యూరీ జత చేసి ఉడికించాలి
​​​​​​​►ఉడికించిన పసన ముక్కలను ఇందులో వేసి కలియబెట్టాలి
​​​​​​​►మిక్సీ పట్టిన పదార్థాల మిశ్రమం జత చేసి, బాగా కలియబెట్టాలి
​​​​​​​►తగినంత ఉప్పు జత చేసి కలియబెట్టి, మూత ఉంచాలి
​​​​​​​►బాగా ఉడికిన తరవాత దింపేయాలి.

పనస గింజలు – పెసర పప్పు కూర
కావలసినవి: పనస గింజలు – పావు కేజీ; పెసర పప్పు – 100 గ్రా.; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి); పసుపు – పావు టీ స్పూను; కరివేపాకు – 3 రెమ్మలు; కొత్తిమీర – ఒక టేబుల్‌ స్పూను; నూనె – ఒక టేబుల్‌ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను

తయారీ:
​​​​​​​►ఒక గిన్నెలో పెసర పప్పుకు కొద్దిగా నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి
​​​​​​​►పనస గింజలకు తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి కుకర్‌లో ఉంచి నాలుగు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి
​​​​​​​►చల్లారాక మూత తీసి, గింజలను బయటకు తీసి, తొక్క వేరు చేయాలి
​​​​​​​►గింజలను మధ్యకు కట్‌ చేయాలి
​​​​​​​►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి
​​​​​​​►ఉడికించిన పెసర పప్పు, పనస గింజలు జత చేసి బాగా కలియబెట్టాలి
​​​​​​​►పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి
​​​​​​​►అన్నంలోకి రుచిగా ఉంటుంది.

పసందైన పనస
మార్కెట్‌లో రెడీమేడ్‌గా పనస పొట్టు దొరుకుతుంది. మనకు ముక్కలుగా కావాలంటే అలాగే ముక్కలుగా కూడా అమ్ముతారు.

ఇంటి దగ్గర పనస పొట్టు  ఎలా చేసుకోవాలి...

​​​​​​​►దోరగా ఉన్న పనస కాయను ముందుగా శుభ్రంగా కడగాలి
​​​​​​​►పనసకాయ కత్తికి నువ్వుల నూనె పూసి, కాయ పైన ముళ్లుగా ఉండే భాగాన్ని అంగుళం మందంలో చెక్కేయాలి
​​​​​​​►పనస కాయకు నిండుగా నూనె పూయాలి
​​​​​​​►పెద్ద ముక్కలు కావాలనుకుంటే ఆ పరిమాణంలోకి కట్‌ చేయాలి
​​​​​​​►పనస పొట్టు కావాలనుకుంటే, అదే కత్తితో సన్నగా పొట్టులా వచ్చేవరకు కొట్టాలి
​​​​​​​►పొట్టులో కూడా కొద్దికొద్దిగా నువ్వుల నూనె, పసుపు కలుపుతుండాలి.

పనస తొనలు కావాలనుకుంటే...
​​​​​​​►బాగా పండి, ఘుమఘుమలాడే పనస కాయను తెచ్చుకోవాలి
​​​​​​​►పనస కాయ కత్తికి నూనె పూసి, పనస కాయను మధ్యకు చీల్చాలి
​​​​​​​►చేతికి నూనె పూసుకుని, ఒక్కో తొనను చేతితో జాగ్రత్తగా బయటకు తీయాలి
​​​​​​​►కొందరు పనస పెచ్చులతో కూడా పులుసు తయారుచేసుకుంటారు (సొర కాయ పులుసు మాదిరిగా)
​​​​​​​►పనస తొనలలో ఉండే గింజలను వేరు చేసి, తగినంత ఉప్పు జత చేసి ఉడికించి తింటే రుచిగా ఉంటాయి
​​​​​​​►వంకాయలకు ఈ గింజలు జత చేసి కూర చేస్తే రుచిగా ఉంటుంది
​​​​​​​►పనస తొనలతో పాయసం కూడా చేసుకుంటారు
​​​​​​​►పనస బిర్యానీ ఇప్పుడు పెళ్లిళ్లలో లేటెస్ట్‌ వంటకం.

తండ్రి గర గర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్యమాణిక్యాలు... ఏంటో చెప్పుకోండి చూద్దాం. పనసకాయ... అంతేగా. చిన్నప్పటి నుంచి ఈ పండుకి సంబంధించిన పొడుపు కథ వింటూనే పెరిగాం.
​​​​​​​►ప్రపంచంలోనే అతిపెద్ద పండును ఇచ్చే చెట్టు ఇదే. ఒక్కో పండు దాదాపు 35 కిలోల బరువు, 90 సెం.మీ. పొడవు, 50 సెం.మీ. వ్యాసంలో ఉంటుంది. పనస కాయను కోసేటప్పుడు చేతికి, చాకుకి కూడా తప్పనిసరిగా నూనె పూయాలి
​​​​​​​►పనస తొనలలో అన్నిరకాల పోషకాలు ఉంటాయి
​​​​​​​►దీనిని సంస్కృతంలో స్కంద ఫలం అంటారు
​​​​​​​►విందు భోజనాల సమయంలో ఈ కూరను తప్పనిసరిగా తయారుచేస్తారు
​​​​​​​►జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది
​​​​​​​►వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది
​​​​​​​►రక్తపోటును తగ్గిస్తుంది
​​​​​​​►వేడి చేసిన పనస ఆకులను గాయాల మీద  ఉంచితే త్వరగా ఉపశమనం లభిస్తుంది
​​​​​​​►అధిక బరువును మలబద్దకాన్ని తగ్గిస్తుంది
​​​​​​​►కొద్దిగా తయారయిన కాయను కోసి, పండ బెట్టుకుంటేనే పనస పండుకి రుచి
​​​​​​​►ఇందులో పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి
​​​​​​​►విటమిన్‌ ఏ, బి 1, బి 2, బి 3, బి 5, బి 6, బి 9, విటమిన్‌ సి, విటమిన్‌ ఈ ఉన్నాయి
​​​​​​​►ఇందులో ఉండే క్యాల్షియం శరీరంలోని ఎముకలను, కండరాలను బలోపేతం చేస్తుంది 
​​​​​​​►పనస చెక్కతో తయారైన వీణలు శ్రేష్ఠమైనవి 
​​​​​​​►చిన్న చిన్న పడవల తయారీకి పసన చెక్కను ఉపయోగిస్తారు
​​​​​​​►పనసాకులను విస్తరాకులుగా ఉపయోగిస్తారు
​​​​​​​►పనస ఆకులలో ఇడ్లీ పిండి వేసి, ఇడ్లీలు కూడా తయారుచేస్తారు. వీటిని పొట్టిక్కలు అంటారు
​​​​​​​►పనస వేర్లతో ఫొటో ఫ్రేములు తయారుచేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement