బ్రెడ్‌ఫ్రూట్ (ఆర్టోకార్పస్ ఆల్టిలిస్) చెట్లు ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతాయి. పనస, బ్రెడ్‌నట్, అంజీర, మల్బరీలకు దగ్గరి జాతికి చెందినదే. తెలుగులో ‘సీమ పనస’, ‘కూర పనస’ అంటారు. ఫిలిప్పీన్స్, న్యూగినియా, మలుకు దీవులు, కరిబియన్ దీవుల ప్రాంతం దీని పుట్టిల్లు. ఇప్పుడు దక్షిణాసియా, ఈశాన్య ఆసియా, పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతాలు, కరిబియన్, సెంట్రల్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో సాగవుతోంది.
ఈ చెట్లకు కాచే కాయలు లేత ఆకుపచ్చని రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ కాయలనే (పండుగా కాదు) అనేక రూపాల్లో తింటూ ఉంటారు. పసిఫిక్ దీవుల్లోని ప్రజలు అనాదిగా దీన్ని బ్రెడ్ లేదా బంగాళ దుంపల మాదిరిగా దైనందిన ఆహారంగా తింటున్నారు.
బ్రెడ్‌ఫ్రూట్ చెట్లలో విత్తనాలు ఉన్న, లేని రెండు రకాలున్నాయి. ఈ చెట్టు 26 మీటర్ల ఎత్తువరకు పెరుగుతుంది. అదే చెట్టుకు ఆడ, మగ పూలు పూస్తాయి. లేతగా ఉన్నప్పు లేత ఆకుపచ్చగా, పండినప్పుడు ముదురు పసుపు రంగులో దీని కాయలు ఉంటాయి. తొక్కపైన చిన్నపాటి బుడిపెలు ఉంటాయి. లోపలి గుజ్జు లేత గోధుమ రంగులో చక్కని వాసనతో కొంచెం తియ్యగా ఉంటుంది. దీని కాయలు కిలో నుంచి 5 కిలోల వరకు బరువు పెరుగుతాయి.
పోషక విలువలు
బ్రెడ్‌ఫ్రూట్ తినగానే జీర్ణమైపోయేది కాదు. నెమ్మదిగా అరుగుతుంది. దీనిలో కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్లు, జీర్ణమయ్యే పీచుపదార్థం, ముఖ్యమైన విటమిన్లు, విటమిన్ సి, పొటాషియం వంటి ఖనిజాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లకు కూడా ఇది నెలవు.
ఉత్పాదకత, సుస్థిరత
ఎదిగిన ఒక బ్రెడ్‌ఫ్రూట్ చెట్టు ఏడాదికి 200 కిలోలకు పైగా కాయలు కాస్తుంది. నాటిన తర్వాత వేరూనుకొని బతికితే చాలు. తర్వాత ఢోకా ఉండదు. మొండిగా పెరిగి, కాయలనిస్తుంది. ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొని, నిస్సారమైన భూముల్లోనూ బతుకుతుంది. అందువల్లే ఉష్ణమండల ప్రాంతాల్లో ప్రజలకు కరువు కాలాల్లో కూడా సుస్థిరంగా ఆహారాన్ని అందిస్తుంది.
ఎన్నో రకాలుగా తినొచ్చు
బ్రెడ్‌ఫ్రూట్‌ను పచ్చిగా, లేతగా, పండుగా.. ఇలా ఏ దశలోనైనా తినొచ్చు. పూర్తిగా మగ్గిన పండుకు బంగాళ దుంప రుచి వస్తుంది కాబట్టి అనేక వంటకాలు చేసుకోవచ్చు. పెరిగిన కాయను ఉడకబెట్టుకొని, కుమ్ములో పెట్టుకొని, వేపుకొని, కాల్చుకొని తినొచ్చు. పచ్చి బ్రెడ్‌ఫ్రూట్ కాయలను పిండి చేసి పెట్టుకొని, బేకరీ ఉత్పత్తుల్లో కూడా కలుపుకోవచ్చు. ఇందులో గ్లుటెన్ ఉండదు కాబట్టి సెలియాక్ జబ్బు ఉన్న వారు కూడా తినొచ్చు. తీపి పదార్ధాల్లో, రుచికరమైన ఆహార పదార్థాల్లో భాగం చేసుకోవచ్చు.
పోషక విలువలు
బ్రెడ్‌ఫ్రూట్‌లో పోషకవిలువలతో పాటు ఔషధ విలువలు కూడా ఉన్నాయి. మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడే ముఖ్యమైన అమినోయాసిడ్లు, ప్రొటీన్లు, పీచుపదార్థం ఇందులో ఉంటాయి. విటమిన్ సి, బి1, బి5తో పాటు పొటాషియం, రాగి వంటి మినరల్స్ ఉన్నాయి.
చదవండి: వయసు 28, తులసి పంట రారాజు ఫిలిప్పో సక్సెస్ స్టోరీ.. ఆదాయం ఎంతో తెలుసా?
ఈ కాయలో కొవ్వు, సోడియం స్వల్పంగా, పీచుపదార్థం అధికంగా ఉంటాయి. రెండు కప్పుల బ్రెడ్‌ఫ్రూట్ ముక్కల్లో 4.4 మిల్లీ గ్రాముల సోడియం, 60 గ్రాముల పిండిపదార్థాలు, 2.4 గ్రాముల మాంసకృత్తులు, 227 కేలరీల శక్తి, 24.2 గ్రాముల చక్కెర, 0.5 గ్రామలు కొవ్వు, 10.8 మిల్లీ గ్రాముల పీచు పదార్థం ఉంటాయి. రెండు కప్పుల బ్రెడ్‌ఫ్రూట్ ముక్కలు తింటే ఆ రోజుకు సరిపోయే పొటాషియంలో 23% లభించినట్లే.
రోగనిరోధక శక్తి
పుష్కలంగా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లను అందించటం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించటం, ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచగలగటం బ్రెడ్‌ఫ్రూట్ ప్రత్యేకత. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలను నిర్మూలించటం, దీర్ఘరోగాల బెడదను తగ్గించటంతో పాటు దేహం బరువును తగ్గించుకోవటానికి ఉపకరిస్తుంది. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉండటం వల్ల ఎముక పుష్టికి దోహదపడుతుంది. విటమిన్ ఎ ఉండటం వల్ల కంటి చూపునకు కూడా మంచిదే. వెంటనే అరిగిపోకుండా క్రమంగా శక్తినిస్తుంది కాబట్టి రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment