
తిరువనంతపురం: కేరళలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పండు తల మీద పడటంతో తీవ్రగాయాలపాలైన వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. వివరాల్లోకి వెళ్తే.. బేలూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ మే19న పనస పండు కోసం చెట్టెక్కాడు. ఈ క్రమంలో పెద్ద పండు నెత్తి మీద పడటంతో చెట్టు మీద నుంచి కింద పడ్డాడు. దీంతో అతని వెన్నెముక, మెడకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడి కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కసరగడ్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి పరియార్‌లోని కన్నూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా సర్జరీ చేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. (ఎక్కడి కేరళ.. ఎక్కడి అస్సాం)
అయితే ఆసుపత్రి ప్రోటోకాల్ ప్రకారం ముందుగా కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఖంగు తిన్న డాక్టర్లు అతని కుటుంబసభ్యులకు విషయం తెలియజేశారు. అయితే అతనికి ట్రావెల్ హిస్టరీ కానీ, లేదా కరోనా బాధితులను కలిసిన దాఖలాలు కానీ లేవని వారు పేర్కొన్నారు. దీంతో అతనికి ఎలా వైరస్ సోకిందన్న విషయంపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అతనితో సన్నిహితంగా మెలిగిన కుటుంబ సభ్యులతో పాటు 18 మందిని క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా వుండగా లాక్‌డౌన్ సడలింపుల వల్ల అతను ఆటో నడిపించాడని, కానీ ఎవరెవరు ఆ ఆటోలో ప్రయాణించారనేది తమకు తెలియదని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. (బేకరీ ఓనర్‌కు కరోనా: 300 మందికి పరీక్షలు)