పనసపండులో మనం తినేది పిసరంతైతే.. వృథాగా పారబోసేది బోలెడంత. అయితే ఆస్ట్రేలియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ వ్యర్థానికి కొత్త అర్థం చెప్పారు. పనసతోపాటు దీని తోబుట్టువుగా భావించే డ్యూరియన్ పండు వ్యర్థాలను విద్యుత్తును నిల్వ చేసుకోగల అల్ట్రా కెపాసిటర్లుగా మార్చవచ్చునని వీరు ప్రయోగాత్మకంగా నిరూపించారు. అల్ట్రా కెపాసిటర్లకు, బ్యాటరీలకు కొంచెం తేడా ఉంటుంది. రెండింటిలోనూ విద్యుత్తును నిల్వ చేసుకోవచ్చుగానీ.. అల్ట్రా కెపాసిటర్లలో విద్యుత్తు విడుదల చాలా వేగంగా జరిగిపోతుంది. అంతే వేగంగా ఛార్జ్ కూడా అవుతుంది. వీటితో కొన్ని సెకన్లలోనే మన ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేసుకోవచ్చు. పనస, డ్యూరియన్ పండ్ల వ్యర్థాలను తాము ముందుగా కార్బన్ ఏరోజెల్‌గా మార్చామని, ఈ ఏరోజెల్ సాయంతో ఎలక్ట్రోడ్‌లను నిర్మించి పరీక్షించినప్పుడు ఆశ్చర్యకరమైన ఫలితాలు లభించాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త విన్సెంట్ జేమ్స్ తెలిపారు.
ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అల్ట్రా కెపాసిటర్ల కంటే పనస, డ్యూరియన్ పండు వ్యర్థాలతో చేసిన అల్ట్రా కెపాసిటర్ల సామర్థ్యం చాలా ఎక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని చెప్పారు. ఈ కొత్త అల్ట్రా కెపాసిటర్లను చాలా చౌకగా తయారు చేసుకోవచ్చు కాబట్టి.. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను చౌకగా రీఛార్జ్ చేసుకునేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయని విన్సెంట్ గోమ్స్ వివరించారు. భూతాపోన్నతి నేపథ్యంలో వాతావరణ మార్పులను అడ్డుకునేందుకు సంప్రదాయేతర ఇంధన వనరులను మరింత సమర్థంగా ఉపయోగించుకునేందుకు ఈ కొత్త అల్ట్రా కెపాసిటర్లు ఎంతో ఉపయోగపడతాయని విన్సెంట్ గోమ్స్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment