
ఉద్దానం పనసకు భలే గిరాకీ
ఉత్తరాదికి విరివిగా ఎగుమతి
వజ్రపుకొత్తూరు: ఉద్దానం పనస ఉత్తరాదికి తరలి వెళుతోంది. హోలీ, ఉగాది పర్వదినాలు ముందుండడంతో ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి ఊపందుకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో పనసతో చేసే విందులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. పనస హల్వా, పొట్టు కూర, పకోడి, గింజల కూర, ఇడ్లీ పచ్చళ్లు, బూరెలు లాంటి వంటకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇక స్థానికంగా ఉద్దానం ప్రాంతంలోని పెళ్లిళ్లలో పనస ముక్కల బిర్యాని, గూన చారు, పొట్టు కూరకు మంచి పేరుంది. ఇటీవల శాస్త్ర పరిశోధనల్లో పనస గింజలు, పొట్టుతో తయారు చేసే పొడితో షుగర్ వ్యాధికి ఇన్సులిన్ అదుపులో ఉంచుకునేందుకు అవసరమైన ఫైబర్ ఎక్కువ ఉందని తేలడంతో పనస ఆధారిత వంటకాలకు ప్రాధాన్యత పెరిగింది.
సహజ సిద్ధంగా కల్తీ లేకుండా పెరిగే పనస ప్రతీ వయసు వారు తినేందుకు అనుకూలమైన ఫలం కావడం విశేషం. 70 శాతం ఎగుమతి చేసే ఒక్క కాయలోనే కాదు. 30 శాతం ఫలాలుగా తినే పండులోనూ మంచి పోషకాలు ఉంటాయని న్యూట్రీషియన్‌లు చెబుతున్నారు.
మిశ్రమ పంటగా..
శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం, గిరిజన ప్రాంతాల్లో ప్రధాన పంటగా కాకుండా 16వేల హెక్టార్లలో మిశ్రమ అంతర పంటగా దీన్ని రైతులు పండిస్తారు. సీతంపేటతో పాటు వజ్రపుకొత్తూరు, పలాస, మందస, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం, నందిగాం మండలాల్లో ఏటా ఏప్రి ల్, మే నెలల్లో కాపునకు వచ్చే ఈ పంట ప్రస్తుతం ఫిబ్రవరి ప్రారంభంలోనే కాపునకు వచ్చింది.
మే నెల వరకు వచ్చే కాపులో 70 శాతం మేర కాయలను ఉత్తరాది రాష్ట్రాలైన ఒడిశా, బీహార్ ఉత్తరప్రదేశ్, కోల్‌కతాలకు ఎగుమతి చేస్తున్నారు. పూండి, పలాస, హరిపురం, పాలకొండ కేంద్రాలుగా కిలో పనస కాయ రూ.25 ధరతో రోజుకు 55 టన్నుల వరకు ఎగుమతి చేస్తున్నారు. అంటే రోజుకు జిల్లా నుంచి రూ. 13.75 లక్షలు టర్నోవర్ జరుగుతోంది. దీంతో రైతులకు మే నెల వరకు మంచి ఆదాయం సమకూరుతుంది.
అదనపు ఆదాయం
పనస రైతులకు అదనపు ఆదాయ వనరు. జీడి, కొబ్బరి తోటల్లోని గట్లపై ఖాళీ స్థలాల్లో మిశ్రమ అంతర పంటగా సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఎలాంటి చీడ పీడ లు ఆశించకుండా పంట కాసింది. పంట ప్రారంభం కాబట్టి కిలో రూ.25ల వరకు ధర ఉంది. ఎకరాకి 4 నుంచి 10 చెట్లు వరకు గిరిజన, ఉద్దానం ప్రాంతాల్లో రైతులు పనసను పండిస్తున్నారు. ఏడాదికి రైతు రూ.20 వేలు వరకు ఆర్జిస్తున్నారు.
– కె.సునీత, ఉద్యానవన శాఖ అధికారి, పలాస
పనస ప..ద..ని..స
వంటకాలు: హల్వా, పొట్టు కూర, పకోడి, గింజల కూర, ఇడ్లీ పచ్చళ్లు, బూరెలు
ఉద్దానం ప్రాంతంలోని పెళ్లిళ్లలో పనస ముక్కల బిర్యాని, గూన చారు, పొట్టు కూర
ఔషధ విలువలు: పనస గింజలు, పొట్టుతో తయారు చేసే పొడితో షుగర్ వ్యాధికి సంబంధించి ఇన్సులిన్ అదుపులో ఉంచుకునేందుకు అవసరమైన ఫైబర్ ఎక్కువ ఉందని శాస్త్ర పరిశోధనల్లో తేలింది.
ఎగుమతి ఎక్కడికి: ఒడిశా, బీహార్ ఉత్తరప్రదేశ్, కోల్‌కతా
Comments
Please login to add a commentAdd a comment