ఉత్తరాంధ్రలో కిడ్నీ వ్యాధుల బాధితులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పలాసలో కొత్తగా నెలకొల్పిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలసి పని చేస్తాయని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాన్ని దశాబ్దాలుగా వేధిస్తున్న కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తూ రూ.700 కోట్లతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును కంచిలి మండలం మకరాంపురంలో సీఎం జగన్ గురువారం తొలుత ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం రూ.85 కోట్లతో పలాసలో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ బాలుర వసతి గృహాన్ని వరŠుచ్యవల్‌గా ఆరంభించారు. నూతన పారిశ్రామికవాడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలాస రైల్వే గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు.
నేను విన్నాను.. నేను చేశాను
2018 డిసెంబర్ 30న ఇదే పలాసలో పాదయాత్రలో మాటిచ్చా. నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఆ రోజు చెప్పా. మన ప్రభుత్వం ఏర్పడ్డాక ఇక్కడే 200 పడకలతో కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని తెస్తామని చెప్పా. 2019 సెప్టెంబర్‌లో రూ.85 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల ఆస్పత్రిని మంజూరు చేశాం. పనులకు శంకుస్థాపన చేసి ఎక్కడా ఆలస్యం లేకుండా పూర్తి చేశాం. ఉద్దానం ప్రాంతానికి సురక్షిత మంచి నీటిని తెచ్చేందుకు హిర మండలం రిజర్వాయర్ నుంచి పైపులైన్లు వేసి ఇంటింటికి తాగునీరు అందించేందుకు 2020 సెప్టెంబర్‌లో సుజలధార పథకం మంజూరు చేశాం. ఈ రెండు పథకాలు ఈ రోజు పూర్తి చేసి జిల్లా ప్రజలకు అంకితం చేస్తూ మీ బిడ్డ మీ కళ్ల ఎదుట నిలబడ్డాడు.
ఫిబ్రవరిలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందించేలా జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఇక్కడి కిడ్నీ రీసెర్చ్, సూపర్ స్పెషాలటీ ఆస్పత్రి పని చేస్తుంది. ఈ ఆస్పత్రిలో డయాలసిస్ బెడ్లు, నెఫ్రాలజీ, యూరాలజీ విభాగంలో ఐసీయూ బెడ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. కాసేపటి క్రితం హెల్త్ సెక్రటరీ కృష్ణబాబుతో మాట్లాడా. ఈ ఫిబ్రవరిలోనే ఇక్కడ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ (మూత్రపిండాల మార్పిడి చికిత్స) కూడా చేసి కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ఎంత గొప్పగా పనిచేస్తోందో రాష్ట్రానికి, దేశానికి చూపించాలని చెప్పా. కచ్చితంగా ఈ ఫిబ్రవరిలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కార్యక్రమం జరుగుతుంది.
మన ప్రాంతంలోనే బ్రహ్మాండమైన వైద్యం
ఆస్పత్రిలో క్యాజువాలిటీ బ్లాక్, సెంట్రల్ ల్యాబ్ ఉంది. రేడియో డయోగ్నోసిస్, ఓటీ కాంప్లెక్స్, నెఫ్రాలజీ డయాలసిస్, యూరాలజీ వార్డులతో పాటు రీసెర్చ్ ల్యాబ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక సీటీ స్కాన్, డిజిటల్ ఎక్స్‌రే, యూరాలజీకి అవసరమైన హోల్మియం లేజర్, యూరో డైనమిక్ మిషన్ లాంటి సదుపాయాలన్నీ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయి. ఎక్కడికో పరుగెత్తాల్సిన అవసరం లేకుండా మన ప్రాంతంలోనే బ్రహ్మాండమైన వైద్యం అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఈ రోజు పలాసలో ఉంది. ఇదే కిడ్నీ ఆస్పత్రిలో 42 మంది వైద్యులు, 154 మంది పారామెడికల్ సిబ్బందితో పాటు సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ పోస్టుల్లో మరో 220 మంది పని చేస్తున్నారు. మొత్తంగా 375 మంది సేవలందించేందుకు ఈ రోజుమీ అందరికీ అందుబాటులో ఉన్నారు.
7 మండలాల్లో స్క్రీనింగ్
ఉద్దానం ప్రాంతంలో ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించగలిగితే వెంటనే మెరుగైన వైద్యం పేద ప్రజలకు అందించగలుగుతామనే తపన, తాపత్రయంతో కిడ్నీ ప్రభావిత మండలాల్లో స్క్రీనింగ్ కార్యక్రమం ఇప్పటికే చేపట్టాం. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, వజ్రపుకొత్తూరు, పలాసలో క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయిస్తున్నాం. 25 ఏళ్లు పైబడిన వారిలో 2,32,898 మందిని స్క్రీనింగ్ చేయగా 19,532 మందికి సాధారణం కంటే సీరం క్రియాటిన్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు తేలింది. వీరిని గుర్తించి వైద్యం అందిస్తున్నాం. ఉద్దానంలో 10 పీహెచ్‌సీలు, 5 అర్బన్ పీహెచ్‌సీలు, 6 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో సెమీ ఆటో ఎనలైజర్లు అందుబాటులోకి తెచ్చాం.
ఉచితంగా 37 రకాల మందులు
కిడ్నీ వ్యాధుల చికిత్స కోసం నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులు నిర్ధారించిన 37 రకాల ఔషధాలను అన్ని పీహెచ్‌సీలలో అందుబాటులోకి తెచ్చాం. వీటిని వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లకు అనుసంధానం చేస్తున్నాం. ఈ మందులన్నీ ప్రతి పేదవాడికీ గడప ముంగిటికే ఉచితంగా ఇచ్చేందుకు శ్రీకారం చుడుతున్నాం. ఇప్పటికే కవిటి, సోంపేట, పలాస, హరిపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, టెక్కలి జిల్లా ఆస్పత్రిలో 69 డయాలసిస్ యంత్రాలను విస్తరించాం. బారువ, ఇచ్ఛాపురం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, కంచిలి పీహెచ్‌సీలో కూడా ఏర్పాటు చేయబోతున్నాం.
రోగులకు రూ.10 వేల పెన్షన్
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.2,500 మాత్రమే ఉన్న పెన్షన్‌ను మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకంగా రూ.10 వేలకు పెంచాడు. నాన్ డయాలసిస్ పేషెంట్లు, తీవ్ర కిడ్నీ వ్యాధులతో సీకేడీ డిసీజ్‌తో బాధపడుతున్న వారిని కూడా గుర్తించి వారికి రూ.5 వేల పింఛన్ ఇచ్చేలా చేసింది మనందరి ప్రభుత్వమే. గత సర్కారు హయాంలో కిడ్నీ పేషెంట్ల కింద డయాలసిస్ చేసుకుంటున్న వారు, పింఛన్లు పొందుతున్న వారు కేవలం 3,076 మంది మాత్రమే ఉన్నారు. వారి కోసం ఖర్చు చేసింది అప్పట్లో కేవలం నెలకు రూ.76 లక్షలు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా 13,140 పింఛన్లు పెంచాం. నెలా నెలా ఇందుకు ఖర్చవుతున్న సొమ్ము రూ.12.54 కోట్లు. ఇలా 55 నెలలుగా ప్రతీ నెలా ఖర్చు చేస్తున్నాం.
శాశ్వత పరిష్కారం దిశగా..
ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలకు కారణాలను అన్వేషించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐసీఎంఆర్‌తో పాటు జార్జ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేపట్టింది. నాలుగు దశల అధ్యయనంలో ఇప్పటికే మూడు దశలు పూర్తయ్యాయి. ప్రపంచంలో అత్యుత్తమ వైద్యసంస్థగా పేరు పొందిన హార్వర్డ్ మెడికల్ స్కూల్‌తో పాటు నార్త్ కరోలినా యూనివర్సిటీతో కలసి పనిచేసేలా మనందరి ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంటోంది. ఈ కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఒక నోడల్ సెంటర్‌గా వ్యవహరించనుంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలోనూ ఇలాంటి సమస్య ఉందని గుర్తించడంతో తాగునీటికి ఉపరితల జలాలను అందించేందుకు వెలుగొండ టన్నెళ్లను పరుగెత్తించాం. మార్కాపురంలో మెడికల్ కాలేజీ, కిడ్నీ సేవల కోసం నెఫ్రాలజీ, యూరాలజీ డివిజన్ కూడా ఏర్పాటు చేశాం.
చిత్తశుద్ధితో శాశ్వత పరిష్కారం
ఉద్దానంలో ఒక్క కిడ్నీ ఆస్పత్రితోనే సరిపుచ్చకుండా సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఎవరి ఊహకూ అందని విధంగా రూ.700 కోట్లు ఖర్చు చేసి మరీ హిరమండలం నుంచి పైపుల ద్వారా నీళ్లు తెచ్చి ఈ ప్రాంతానికి మంచి చేసేలా అడుగులు వేశాం. ఇదీ మీపట్ల మీ జగన్‌కు ఉన్న కమిట్‌మెంట్. ఈ కమిట్‌మెంటే గత పాలకులకు, మనకు మధ్య తేడాను తెలియచేస్తుంది. మొత్తం 807 గ్రామాలకుగానూ ఈ నెలాఖరుకల్లా ప్రతి గ్రామం పూర్తిగా కనెక్ట్ అవుతుంది. 1.98 లక్షల కుటుంబాలు, 6.78 లక్షల జనాభాకు సురక్షిత తాగునీటిని అందించే ఒక గొప్ప పథకం ఈరోజు ప్రారంభమైంది. ఈ పథకాన్ని ఫేజ్ 2 కింద ఇంకా విస్తరించబోతున్నాం. రూ.265 కోట్లతో పాతపట్నం నియోజకవర్గంలో 448 గ్రామాలకు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా మేలు చేసేలా అడుగులు ముందుకు వేస్తున్నాం. దీనికి టెండర్లు, అగ్రిమెంట్లు, సర్వే పూర్తైంది. సంక్రాంతి తర్వాత ఆ పనులు మొదలుపెడతారు.
Comments
Please login to add a commentAdd a comment