
కన్నీరే మిగిలిందిక నేస్తం..!
నిత్యం పంటలతో తొణికిసలాడే ఉద్దానం విషాదాలకు నిలయంగా మారింది. ఏ ఇంటి తలుపుతట్టినా కన్నీటిచారలే కనిపిస్తున్నాయి. గుండెలను పిండేసే కిడ్నీ బాధలు అడుగడుగునా తారసపడుతున్నాయి. ఇంటికి పెద్ద దిక్కు కిడ్నీ వ్యాధితో మంచాన పడితే.. ఆ పెద్ద దిక్కును దక్కించుకోవడానికి ఉన్నదంతా అమ్మేసి రోడ్డున పడ్డ కుటుంబాల దర్శనమిస్తున్నాయి. ఎదిగొచ్చిన కన్న కొడుకు కిడ్నీ వ్యాధితో కళ్లేదుటే కూలిపోతుంటే భరించలేని ఆ తల్లిదండ్రులు, భారీగా అప్పులు చేసి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. ఆ కుటుంబాలను ఒకసారి పలకరిస్తే... – ఇచ్ఛాపురం రూరల్
ఇల్లు అమ్మేశాం
భర్తే సర్వస్వంగా భావించి తన ఐదో తనాన్ని కాపాడుకునేందుకు నీడనిచ్చే ఇంటిని అమ్మేసి అతడిని రక్షించుకునే పనిలో పడింది ఈ ఇల్లాలు. ఇచ్ఛాపురం మండలం నీలాపపుట్టుగ గ్రామానికి చెందిన కోనేటి తులసీరావు, దమయంతి దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఒకరి కొకరు కంటి పాపల్లా బతుకుతున్నారు. విసనకర్రలు తయారు చేస్తూ ఊరూరా తిరిగి అమ్ముతూ, వచ్చే ఆదాయంతో కడుపునింపుకునేవారు. అయితే ఈ దంపతులపై కిడ్నీ భూతం పంజా విసిరింది. ఐదేళ్ల క్రితం కిడ్నీ వ్యాధికి గురైన తులసీరావును రక్షించుకునేందుకు శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో భర్తను చేరి్పంచింది. ఖరీదైన వైద్యం కోసం భార్య దమయంతి రెండు ఇళ్లను అమ్మేసింది. 8 నెలలు నుంచి వ్యాధి మరింత తీవ్రరూపం దాల్చడంతో ప్రస్తుతం కవిటిలో డయాలసిస్ చేయిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న అరకొర మందులతో ఇబ్బంది పడుతున్న భర్త బాధను చూడలేక ప్రస్తుతం తాము నివసిస్తున్న ఇంటిని సైతం తాకట్టుపెట్టింది. రోజుకు పది విసనకర్రలు తయారు చేసి అమ్మితే రూ.100లు వస్తుందని, అయితే ఆ డబ్బులు మందులకే సరిపోవడం లేదని వాపోతోంది.
ఉన్నదంతా వైద్యానికే
ఇచ్ఛాపురం మండలం సన్యాసిపుట్టుగ గ్రామానికి చెందిన ఆయన పేరు నందూరి విజయ భూషణ్. ఛండీగడ్‌లో కూలి పనులు చేసుకొని కుటుంబాన్ని పెంచుకుంటూ వస్తున్న దశలో కిడ్నీ మహమ్మారికి గురయ్యాడు. శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఖరీదైన చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం కనిపించలేదు. రూ.లక్షలు అప్పులు చేసి నెలకు రూ.20 వేలు చొప్పున చెల్లించి ఏడాది పాటు డయాలసిస్ చేయించుకున్నాడు. ప్రస్తుతం కవిటిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. డయాలసిస్‌కు వెళ్లిన ప్రతిసారి కేవలం ఆటో ఖర్చులే రూ.600 వరకు అవుతున్నాయని, ప్రభుత్వం ఇచ్చే పింఛన్ ఆటో ఖర్చులకే అయిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కళ్లముందు అప్పులు కనిపిస్తుంటే తమ కుటుంబ భవిష్యత్తు ఎలా ఉంటుందోననే భయమేస్తోందని విచారం వ్యక్తం చేస్తున్నాడు. మునుపటిలా 108 వాహనం ద్వారా తమను ఆస్పత్రికి తీసుకెళ్లడం, రావడం వంటి సదుపాయాలు కల్పించాలని కోరుతున్నాడు.
ఇదీ చదవండి: అప్పుడు వెడ్డింగ్ గౌను, ఇపుడు ఎంగేజ్‌మెంట్ రింగ్ : సమంత అంత పనిచేసిందా?
నాడు భర్త, కొడుకు – నేడు తల్లి
కవిటి మండలం బొరివంక గ్రామంలోని హరిజనవాడకు చెందిన ఈమె పేరు బలగ కామాక్షి. భర్త తలయారీగా పనిచేస్తూ పన్నెండేళ్ల కిత్రం మూత్రపిండాల వ్యాధితో మృతి చెందగా, తండ్రి ఉద్యోగాన్ని సంపాదించిన కొడుకు బాలరాజు తల్లితో పాటు భార్య, పిల్లలను సాకుతూ వచ్చాడు. విధి ఆడిన వింత నాటకంలో కొడుకు బాలరాజు సైతం కిడ్నీవ్యాధి బారినపడ్డాడు. కొడుకు వైద్యం కోసం తల్లి అప్పులు చేసినా ఎంతో కాలం బతకలేదు. ఈ పిరిస్థితుల్లో కోడలు పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. దీంతో ఎదిగొచ్చిన పిల్లలను పెంచి పోషించే బాధ్యత కామాక్షిపై పడింది. అప్పులు చేసి పిల్లలకు పెళ్లి చేసిన కామాక్షి, ఇప్పుడు తాను సైతం కిడ్నీ భూతం కబంధ హస్తాల్లో చిక్కుకుంది. నెలకు సుమారు రూ.10 వేలు వరకు వైద్యానికే ఖర్చవుతోందని, ప్రభుత్వం వితంతు పింఛన్ మాత్రమే ఇస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది
Comments
Please login to add a commentAdd a comment