pathetic
-
ఏ ఇంటి తలుపు తట్టినా... గుండెల్ని పిండేసే ఉద్దానం కథలు
నిత్యం పంటలతో తొణికిసలాడే ఉద్దానం విషాదాలకు నిలయంగా మారింది. ఏ ఇంటి తలుపుతట్టినా కన్నీటిచారలే కనిపిస్తున్నాయి. గుండెలను పిండేసే కిడ్నీ బాధలు అడుగడుగునా తారసపడుతున్నాయి. ఇంటికి పెద్ద దిక్కు కిడ్నీ వ్యాధితో మంచాన పడితే.. ఆ పెద్ద దిక్కును దక్కించుకోవడానికి ఉన్నదంతా అమ్మేసి రోడ్డున పడ్డ కుటుంబాల దర్శనమిస్తున్నాయి. ఎదిగొచ్చిన కన్న కొడుకు కిడ్నీ వ్యాధితో కళ్లేదుటే కూలిపోతుంటే భరించలేని ఆ తల్లిదండ్రులు, భారీగా అప్పులు చేసి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. ఆ కుటుంబాలను ఒకసారి పలకరిస్తే... – ఇచ్ఛాపురం రూరల్ ఇల్లు అమ్మేశాం భర్తే సర్వస్వంగా భావించి తన ఐదో తనాన్ని కాపాడుకునేందుకు నీడనిచ్చే ఇంటిని అమ్మేసి అతడిని రక్షించుకునే పనిలో పడింది ఈ ఇల్లాలు. ఇచ్ఛాపురం మండలం నీలాపపుట్టుగ గ్రామానికి చెందిన కోనేటి తులసీరావు, దమయంతి దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఒకరి కొకరు కంటి పాపల్లా బతుకుతున్నారు. విసనకర్రలు తయారు చేస్తూ ఊరూరా తిరిగి అమ్ముతూ, వచ్చే ఆదాయంతో కడుపునింపుకునేవారు. అయితే ఈ దంపతులపై కిడ్నీ భూతం పంజా విసిరింది. ఐదేళ్ల క్రితం కిడ్నీ వ్యాధికి గురైన తులసీరావును రక్షించుకునేందుకు శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో భర్తను చేరి్పంచింది. ఖరీదైన వైద్యం కోసం భార్య దమయంతి రెండు ఇళ్లను అమ్మేసింది. 8 నెలలు నుంచి వ్యాధి మరింత తీవ్రరూపం దాల్చడంతో ప్రస్తుతం కవిటిలో డయాలసిస్ చేయిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న అరకొర మందులతో ఇబ్బంది పడుతున్న భర్త బాధను చూడలేక ప్రస్తుతం తాము నివసిస్తున్న ఇంటిని సైతం తాకట్టుపెట్టింది. రోజుకు పది విసనకర్రలు తయారు చేసి అమ్మితే రూ.100లు వస్తుందని, అయితే ఆ డబ్బులు మందులకే సరిపోవడం లేదని వాపోతోంది.ఉన్నదంతా వైద్యానికే ఇచ్ఛాపురం మండలం సన్యాసిపుట్టుగ గ్రామానికి చెందిన ఆయన పేరు నందూరి విజయ భూషణ్. ఛండీగడ్‌లో కూలి పనులు చేసుకొని కుటుంబాన్ని పెంచుకుంటూ వస్తున్న దశలో కిడ్నీ మహమ్మారికి గురయ్యాడు. శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఖరీదైన చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం కనిపించలేదు. రూ.లక్షలు అప్పులు చేసి నెలకు రూ.20 వేలు చొప్పున చెల్లించి ఏడాది పాటు డయాలసిస్ చేయించుకున్నాడు. ప్రస్తుతం కవిటిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. డయాలసిస్‌కు వెళ్లిన ప్రతిసారి కేవలం ఆటో ఖర్చులే రూ.600 వరకు అవుతున్నాయని, ప్రభుత్వం ఇచ్చే పింఛన్ ఆటో ఖర్చులకే అయిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కళ్లముందు అప్పులు కనిపిస్తుంటే తమ కుటుంబ భవిష్యత్తు ఎలా ఉంటుందోననే భయమేస్తోందని విచారం వ్యక్తం చేస్తున్నాడు. మునుపటిలా 108 వాహనం ద్వారా తమను ఆస్పత్రికి తీసుకెళ్లడం, రావడం వంటి సదుపాయాలు కల్పించాలని కోరుతున్నాడు.ఇదీ చదవండి: అప్పుడు వెడ్డింగ్ గౌను, ఇపుడు ఎంగేజ్మెంట్ రింగ్ : సమంత అంత పనిచేసిందా?నాడు భర్త, కొడుకు – నేడు తల్లి కవిటి మండలం బొరివంక గ్రామంలోని హరిజనవాడకు చెందిన ఈమె పేరు బలగ కామాక్షి. భర్త తలయారీగా పనిచేస్తూ పన్నెండేళ్ల కిత్రం మూత్రపిండాల వ్యాధితో మృతి చెందగా, తండ్రి ఉద్యోగాన్ని సంపాదించిన కొడుకు బాలరాజు తల్లితో పాటు భార్య, పిల్లలను సాకుతూ వచ్చాడు. విధి ఆడిన వింత నాటకంలో కొడుకు బాలరాజు సైతం కిడ్నీవ్యాధి బారినపడ్డాడు. కొడుకు వైద్యం కోసం తల్లి అప్పులు చేసినా ఎంతో కాలం బతకలేదు. ఈ పిరిస్థితుల్లో కోడలు పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. దీంతో ఎదిగొచ్చిన పిల్లలను పెంచి పోషించే బాధ్యత కామాక్షిపై పడింది. అప్పులు చేసి పిల్లలకు పెళ్లి చేసిన కామాక్షి, ఇప్పుడు తాను సైతం కిడ్నీ భూతం కబంధ హస్తాల్లో చిక్కుకుంది. నెలకు సుమారు రూ.10 వేలు వరకు వైద్యానికే ఖర్చవుతోందని, ప్రభుత్వం వితంతు పింఛన్ మాత్రమే ఇస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది -
అర్ధరాత్రి విషాదం
లారీ ఆటోను ఢీకొని నలుగురు మృతి మరో ఐదుగురికి తీవ్ర గాయాలు మృతులు బీహార్ వాసులు భవన నిర్మాణ పనుల కోసం గుంటూరు రాక స్వస్థలాలకు వెళ్తుండగా కుంచనపల్లి వద్ద ఘటన ఆ అర్ధరాత్రి వారి జీవితాల్లో కాళరాత్రిగా మారింది..మృత్యువు వారిని వెంటాడిందా?..వారే మృత్యువును వెతుక్కుంటూ వచ్చారా ?..అనిపించేలా విధి విషాద రాత రాసింది. సొంతూరుకు వెళుతున్నామనే ఆనందంలో ఉన్న ఇద్దర్ని.. వారి కోసం వచ్చిన మరో ఇద్దరిన్ని లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు కబళించింది. తెల్లవారితే తమ వారు ఇంటికొస్తారని ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకు చావు వార్త పలకరించి..వారి గుండెలను కన్నీటి ధారలుగా మార్చింది. మంగళగిరి (తాడేపల్లి) : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి రెండు గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. తాడేపల్లి పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుంటూరులో భవన నిర్మాణంలో పని చేస్తున్న ఎనిమిదిమంది బిహారీలు తమ సొంత ఊరు వెళ్లేందుకు ఆటోలో విజయవాడ రైల్వేస్టేషన్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో ఆటో కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు రక్షక్ వాహనంలో ఘటనా స్థలానికి చేరుకుని ఆటోను బయటకు తీసి క్షతగాత్రులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈలోగా విషయం తెలియడంతో బిహారీలను కూలికి తీసుకువచ్చిన మేస్త్రీ గుంటూరు చంద్రమౌళినగర్‌కు చెందిన మసుమళ్ల అరుణ్‌కుమార్ (35), తన స్నేహితుడు రాజశేఖర్(32)ను తీసుకుని ద్విచక్రవాహనంపై ప్రమాద స్థలానికి చేరుకుని రక్షక్ వాహనం వెనుక ఆపి నిలబడ్డారు. ఆటోలో ప్రయాణిస్తూ గాయపడిన టెక్బహుదూర్(45), రాంబహుదూర్(42)లను ఆస్పత్రికి తరలించేందుకు రోడ్డుపైకి చేర్చారు. ఇంతలో అదే మార్గంలో అతి వేగంగా వచ్చిన లారీ వారిద్దరితోపాటు అరుణ్‌కుమార్, రాజశేఖర్‌లను, రక్షక్ వాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోయింది. టెక్బహుదూర్, రాంబహుదూర్ అక్కడికక్కడే మృతి చెందగా.. అరుణ్‌కుమార్, రాజశేఖర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. రక్షక్ వాహనంలో ఉన్న హెడ్‌కానిస్టేబుల్ సైదాతోపాటు డ్రైవర్ లూర్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ఉన్న ఆరుగురు గాయాలపాలవడంతో ఆస్పత్రికి తరలించారు. మంగళగిరి రూరల్ సీఐ హరికృష్ణ, తాడేపల్లి ఎస్ఐ వినోద్‌కుమార్ ఘటనాస్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించి మృతుల బంధువులకు సమాచారమిచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
సోదరులే కాలయుములు
కారంపూడి మండలం పేటసన్నెగండ్లలో భయానక హత్య ప్రాణం తీసిన పొలం వివాదం సోదరులే కాలయములయ్యారు. పొలం వివాదం నేపథ్యంలో పెదతండ్రి కొడుకునే చంపేశారు. తల నుంచి మొండేన్ని వేరుచేసి భయానకంగా హత్య చేశారు. కారంపూడి మండలం పేటసన్నెగండ్లలో మంగళవారం జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పేటసన్నెగండ్ల (కారంపూడి) : పొలం వివాదం అన్నదమ్ముల కుటుంబాల మధ్య చిచ్చు రేపింది. ఒకరి హత్యకు దారితీసింది. మండలంలోని పేటసన్నెగండ్ల గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన చప్పిడి మల్లయ్య, వెంకటేశ్వర్లు అన్నదమ్ములు. వారికి భాగపంపకాల్లో భాగంగా కొండ కింద ఉన్న రెండెకరాల పొలంలో చెరో ఎకరం వచ్చింది. గతంలో దాయాది భాగాన్ని కూడా తాను కొన్నానని, రెండెకరాలు తనదేనని వెంకటేశ్వర్లు కుమారుడు వెంకట నర్సయ్య కోర్టుకు వెళ్లడంతో ఇటీవల కోర్టు తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చింది. దీంతో వెంకటనర్సయ్య మంగళవారం పొలంలో జూట్ విత్తనాలు వేసేందుకు చెల్లెలు ఆదిలక్ష్మితో కలిÜ పొలం వెళ్లాడు. అంతకుముందే తండ్రి వెంకటేశ్వర్లు బాడుగ అరకతో పొలంలో ఉన్నాడు. ఇంతలో ట్రాక్టర్‌పై వచ్చిన పెదనాన్న మల్లయ్య కుమారులు విత్తనం వేయడాన్ని అడ్డుకున్నారు. పెద్ద మనుషుల సమక్షంలో తేల్చుకుందామని వాదులాడుకున్నారు. దీంతో వెంకట నర్సయ్య విత్తనం వేసే పనిని వాయిదా వేసుకుని బైక్‌పై చెల్లిని ఎక్కించుకుని ఇంటికి వెళ్లాలని యత్నిస్తుండగా అకస్మాత్తుగా ట్రాక్టర్‌తో బైక్‌ను ఢీకొట్టి వెంకటనర్సయ్య కళ్లలో కారం కొట్టి వేట కొడవళ్లు, గొడ్డళ్లతో దాడి చేసి విచక్షణారహితంగా నరికేశారు. తలను మొండెం నుంచి వేరు చేసి దారుణంగా హత్యచేశారు. ఆ వెంటనే అతని చెల్లెలు ఆదిలక్ష్మిపై దాడికి సిద్ధమయ్యారు. దీంతో ఆమె ప్రాణభయంతో తప్పించుకుని పారిపోయింది. అతని తండ్రి వెంకటేశ్వర్లుపై దాడి చేయడంతో ఆయన గాయాలతో తప్పించుకుని పారిపోయాడు. నలుగురు నిందితులు... ఈ కేసులో నలుగురు నిందితులు ఉన్నారని ఎస్ఐ నారాయణస్వామి తెలిపారు. చప్పిడి మల్లయ్య కుమారులు నరసింహారావు, అంజయ్య, అయ్యప్ప, శంకర్ హత్యకు పాల్పడ్డారని ఆయన వివరించారు. ఘటనాస్థలిని గురజాల డీఎస్పీ నాగేశ్వరరావు పరిశీలించారు. హతుని తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు. సీఐ శ్రీనివాసరావు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాలకు తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో భయానక వాతావరణం ఏర్పడింది. ఆస్తి వద్దన్నా వదల్లేదు... హత్యకు ప్రత్యక్ష సాక్షులైన హతుని తండ్రి వెంకటేశ్వర్లు, సోదరి ఆదిలక్ష్మి సంఘటనను పోలీసులకు వివరించారు. నరసింహారావు తన సోదరుని కళ్లలో కారం చల్లాడని, అంజయ్య వేటకొడవలితో తలపై నరికాడని ఆదిలక్ష్మి వివరించింది. తమ ఇద్దరిపైనా దాడికి దిగగా, తన తండ్రి, తాను తప్పించుకుని పారిపోయామని వివరించింది. ఇంట్లో పిల్లలను స్కూల్లో వదలి పెట్టి సోదరుడు చేనుకు వెళుతుంటే తాను కూడా వస్తానని బండి ఎక్కానని, ఇలా జరుగుతుందని ఊహించలేకపోయామని ఆమె కన్నీటి పర్యంతమైంది. ‘అయ్యా.. మాకీ ఆస్తి వద్దు.. మా తమ్ముడిని వదిలేయండని వేడుకున్నా వారు వినలేదని ఆదిలక్ష్మి బోరున విలపించింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకును కోల్పోయి సైదమ్మ, వెంకటేశ్వర్లు దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు. వెంకటనర్సయ్యకు భార్య సౌజన్య, కుమారుడు తనయ్ ఉన్నారు. సౌజన్య గర్భిణి. ఈ పొలం విషయంలో ఇది రెండో హత్య... ఈ పొలం వివాదం నేపథ్యంలో గతంలోనూ ఒక హత్య జరిగినట్లు తెలిసింది. తొమ్మిదేళ్ల క్రితం ఇదే పొలాన్ని చిన్నాన్న వెంకటేశ్వర్లు వద్ద కౌలుకు తీసుకుని మల్లయ్య కుమారుల్లో ఒకరైన చప్పిడి పాలయ్య సేద్యం చేస్తుండగా అప్పట్లో రేగిన వివాదం నేపథ్యంలో అతని కుటుంబ సభ్యుల్లోనే ఒకరు హత్యకు పాల్పడినట్లు సమాచారం.