అర్ధరాత్రి విషాదం
-
లారీ ఆటోను ఢీకొని నలుగురు మృతి
-
మరో ఐదుగురికి తీవ్ర గాయాలు
-
మృతులు బీహార్ వాసులు
-
భవన నిర్మాణ పనుల కోసం గుంటూరు రాక
-
స్వస్థలాలకు వెళ్తుండగా కుంచనపల్లి వద్ద ఘటన
ఆ అర్ధరాత్రి వారి జీవితాల్లో కాళరాత్రిగా మారింది..మృత్యువు వారిని వెంటాడిందా?..వారే మృత్యువును వెతుక్కుంటూ వచ్చారా ?..అనిపించేలా విధి విషాద రాత రాసింది. సొంతూరుకు వెళుతున్నామనే ఆనందంలో ఉన్న ఇద్దర్ని.. వారి కోసం వచ్చిన మరో ఇద్దరిన్ని లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు కబళించింది. తెల్లవారితే తమ వారు ఇంటికొస్తారని ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకు చావు వార్త పలకరించి..వారి గుండెలను కన్నీటి ధారలుగా మార్చింది.
మంగళగిరి (తాడేపల్లి) : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి రెండు గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. తాడేపల్లి పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుంటూరులో భవన నిర్మాణంలో పని చేస్తున్న ఎనిమిదిమంది బిహారీలు తమ సొంత ఊరు వెళ్లేందుకు ఆటోలో విజయవాడ రైల్వేస్టేషన్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో ఆటో కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు రక్షక్ వాహనంలో ఘటనా స్థలానికి చేరుకుని ఆటోను బయటకు తీసి క్షతగాత్రులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈలోగా విషయం తెలియడంతో బిహారీలను కూలికి తీసుకువచ్చిన మేస్త్రీ గుంటూరు చంద్రమౌళినగర్‌కు చెందిన మసుమళ్ల అరుణ్‌కుమార్ (35), తన స్నేహితుడు రాజశేఖర్(32)ను తీసుకుని ద్విచక్రవాహనంపై ప్రమాద స్థలానికి చేరుకుని రక్షక్ వాహనం వెనుక ఆపి నిలబడ్డారు. ఆటోలో ప్రయాణిస్తూ గాయపడిన టెక్‌బహుదూర్(45), రాంబహుదూర్(42)లను ఆస్పత్రికి తరలించేందుకు రోడ్డుపైకి చేర్చారు. ఇంతలో అదే మార్గంలో అతి వేగంగా వచ్చిన లారీ వారిద్దరితోపాటు అరుణ్‌కుమార్, రాజశేఖర్‌లను, రక్షక్ వాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోయింది. టెక్‌బహుదూర్, రాంబహుదూర్ అక్కడికక్కడే మృతి చెందగా.. అరుణ్‌కుమార్, రాజశేఖర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. రక్షక్ వాహనంలో ఉన్న హెడ్‌కానిస్టేబుల్ సైదాతోపాటు డ్రైవర్ లూర్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ఉన్న ఆరుగురు గాయాలపాలవడంతో ఆస్పత్రికి తరలించారు. మంగళగిరి రూరల్ సీఐ హరికృష్ణ, తాడేపల్లి ఎస్‌ఐ వినోద్‌కుమార్ ఘటనాస్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించి మృతుల బంధువులకు సమాచారమిచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.