దుండగులు వదిలి వెళ్లిన కారు
రంగారెడ్డి/యాలాల(తాండూరు): అర్ధరాత్రి వేళ నిలిపి ఉంచిన లారీల నుంచి డీజిల్‌ను తస్కరించే ముఠాకు యాలాల పీఎస్‌కు చెందిన ఓ హోంగార్డు చెమటలు పట్టించాడు. నలుగురు సభ్యులున్న ఈ ముఠాను ఒక్కడే ధైర్యంగా దాదాపు 10 కిలోమీటర్ల వరకు వెంటాడటంతో దుండగులు తాము ప్రయాణిస్తున్న కారును వదిలేసి పారిపోయారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో బుధవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. యాలాల ఠాణాలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న భీంరెడ్డి విధుల్లో భాగంగా బుధవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో ఎస్సై ప్రభాకర్‌రెడ్డిని తాండూరులో వదిలేసి తిరిగి యాలాల ఠాణాకు వాహనంలో ఒంటరిగా వెళుతున్నాడు. మార్గమధ్యలో లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో నిలిపి ఉంచిన లారీల పక్కన ఓ తెల్లటి కారు (ఏపీ 28 ఏటీ 2889) అనుమానాస్పదంగా ఉండటం గమనించాడు.
కారు దగ్గరకు వెళ్లి పరిశీలించగా నిలిపి ఉంచిన లారీ నుంచి డీజిల్‌ను తస్కరిస్తున్నట్లు గుర్తించాడు. వెంటనే తేరుకుని భీంరెడ్డి వారిని పట్టుకునేందుకు యత్నించాడు. భీంరెడ్డి రాకను గమనించిన ముఠా.. కారును కొడంగల్ మార్గంలో ముందుకు పోనిచ్చారు. భీంరెడ్డి పోలీసు వాహనంలోనే దుండగుల కారును వెంబడించాడు. ఇలా దాదాపు 10 కిలోమీటర్ల వరకు వెంటాడగా, దౌలాపూర్–తిమ్మాయిపల్లి మార్గంలో ఉన్న మైసమ్మ ఆలయం వద్ద దుండగులు కారును వదిలేసి చెరో వైపు పరారయ్యారు. ఘటన స్థలంలో నిలిపి ఉంచిన కారు టైర్లలోంచి గాలిని తీసేసిన భీంరెడ్డి జరిగిన విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే పలు లారీల నుంచి తస్కరించిన దాదాపు 250 లీటర్ల డీజిల్ డబ్బాలను కారులోంచి స్వాధీనం చేసుకున్నారు. కారును యాలాల ఠాణాకు తరలించారు. కారు నెంబరు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా హోంగార్డు చేసిన సాహసంపై తోటి ఉద్యోగులు, మండలవాసులు అభినందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment