
అర్ధరాత్రి హల్‌చల్
* మహిళతో అసభ్యప్రవర్తన
* 9 మంది యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
కాటేదాన్: బెంగుళూరు జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న 9 మంది యువకులను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై లక్ష్మీకాంత్‌రెడ్డి ప్రకారం... మలక్‌పేట్, బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాలకు చెందిన జోహెల్(28), డేవిడ్(20), జోహెల్ అహ్మద్(20), సాయికుమార్‌యాదవ్(18), పుక్రూద్(20), స్వప్లింగ్(25), అబ్దుల్ రెహ్మాన్(20), సాయికిశోర్(20), హష్మి (18) విలువైన స్పోర్ట్స్ బైక్‌లపై మంగళవారం రాత్రి మాదాపూర్‌లో జరిగిన విందుకు ఆలస్యంగా వెళ్లారు. అప్పటికే ఫంక్షన్ పూర్తికావడంతో చేసేదిలేక శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని నోవాటెల్ హోటల్‌లో విందు చేసుకొనేందుకు మాదాపూర్ నుంచి రాత్రి 12 గంటలకు బయల్దేరారు.
బుద్వేల్ రైల్వేస్టేషన్ ప్రాంతంలోని బెంగళూరు జాతీయ రహదారిపక్కనే గల పెట్రోల్‌పంప్ వద్ద వాహనాల్లో పెట్రోల్ పోసుకునేందుకు వచ్చారు. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉండటంతో జాతీయ రహదారిపై బైక్ రేసింగ్ నిర్వహించేందుకు యత్నించారు. దారినవెళ్లే ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవరిస్తూ, కేకలు వేస్తూ నానా హంగామా సృష్టించారు. ఇదే క్రమంలో ఆరాంఘర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి, అల్లరి చేశారు. ఆమె పోలీసు కంట్రోల్ (100)కు సమాచారం అందించింది.
కంట్రోల్ రూమ్ సిబ్బంది మైలార్‌దేవ్‌పల్లి పోలీసులను అప్రమత్తం చేయడంతో వెంటనే వారు తొమ్మిది మంది యువకులతో పాటు 9 స్పోర్ట్స్ బైక్‌లను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బుధవారం ఉదయం యువకుల తల్లిదండ్రులను పిలిపించారు. మరోసారి ఇలాంటి సంఘటనలకు పాల్పడకుంటా పోలీసు లు యువకులతో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించా రు. మరో రోడ్లపై బైక్‌రేసింగ్ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుటుంబసభ్యుల హామీ మేరకు కౌన్సెలింగ్ అనంతరం యువకులను వదిలిపెట్టారు.