అంబాజీపేట(కోనసీమ జిల్లా): చెట్లకు సాధారణంగా పువ్వు నుంచి పిందె, పిందె నుంచి కాయ వచ్చి అది పండుగా మారుతుంది. కాని పనస పండు పుట్టిక మాత్రం అలా జరగదు. ఈ చెట్టు కాండం నుంచే పిందెలు దిగి అవి కాయులు, పండ్లుగా తయారవుతాయి. కనుకనే పనస చెట్టు మొదలు నుంచి చివరి వరకూ కాండంపై కాయలు నిండి ఉంటాయి. సువాసనలు వెదజల్లుతూ నోరూరించే పనసపండు అంటే అందరికీ ఇష్టమే.
పనసపండులో శరీరానికి అవసరమైన పలు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును ఆంగ్లంలో జాక్‌ఫ్రూట్ అంటారు. దీని వృక్షశాస్త్ర నామ థేయం ఎట్రోకార్పస్ ఇంటి గ్రిఫోలియా. ఏటా మార్చి నుంచి జూలై వరకూ పనస పండ్లు ఎక్కువగా దొరుకుతాయి. ఒక్కొక్క చెట్టుకు 100 వరకూ కాయలు దిగుబడులు వస్తాయి. ఒక్కొక్క కాయ 10 నుంచి 20 కేజీల బరువు ఉంటాయి. కాగా కాయ ఎంత బరువున్నా అందులో 30 శాతం మాత్రమే తినడానికి ఉపయోగపడుతుంది. కాగా అంబాజీపేట పరిసర ప్రాంతాల్లో దొరకే పనస పండ్లకు మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ డిమాండ్ ఉంది.
పనసలో పలు రకాలు
బంగారు పనస, కొబ్బరి పనస, ఖర్జూర పనస, వేరు పనస, చిన్నకోల పనస, గుండ్రు పనస, గులాబి పనస, కర్ణపనస, తేనెపనస అనే రకాలు ఉన్నాయి. వివాహాది శుభ కార్యాలయాల్లో పనసకాయ కూర చేస్తారు. పనసకాయను పొట్టుగా కొట్టి కూర వండితే తినతివారు ఉండరు. అంతేకాకుండా లేత పనస కాయలను చిన్న ముక్కలుగా తరిగి మషాలా కూరల్లో ఉపయోగిస్తారు.
పోషకాలు ఇలా..
పనస పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయని, ఏడాదికి ఒకసారైనా కచ్చితంగా పనసపండు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. పనస పండులో మాంసకృతులు 1.9 శాతం, చక్కెర 19.8 శాతం, కొవ్వులు 0.1 శాతం, కెరోటిన్ 175 మైక్రో గ్రాములు, థియోమిన్ 0.3 మిల్లీ గ్రాములు, విటమిన్ సి 7 మిల్లీ గ్రాములు, పీచు పదార్థం 1.1 శాతం, సున్నం 20.0 మిల్లీ గ్రాములు, ఇనుము 0.56 మిల్లీ గ్రాములు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment