సాక్షి, అమరావతి: దేశంలో నూటికి 80 శాతం మంది కౌమార దశలో ఉన్న పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వీరిలో ఎక్కువమంది పేదలే. ఇవి ప్రైవేటు సంస్థలో, వ్యక్తులో చెప్పిన మాటలు కాదు. సాక్షాత్తు ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉండే యూనిసెఫ్ భారతదేశానికి సంబంధించి ఇటీవల ఇచ్చిన నివేదిక. మారుతున్న రోజులకు ఇదో సవాలు. దీన్ని ఎదుర్కొనేందుకు అనేక పరిష్కార మార్గాలు మన చేతుల్లోనే ఉన్నా వాటిని చిన్నచూపు చూస్తున్న ఫలితమే ఈ దుర్గతి అని ఆహార నిపుణులు ఆవేదన చెందుతున్నారు. ఈనేపథ్యంలో పోషకాహార లేమిని తరిమి కొట్టేందుకు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్శిటీ నిపుణులు అనేక పరిష్కారాలను సూచిస్తున్నారు. వాటిల్లో అత్యంత ఆచరణాత్మకమైంది పెరటి తోటల పెంపకం.
పెరటి తోటలకు పెరిగిన గిరాకీ
పోషకాహార లోపం, కాలుష్యం, హిడెన్ హంగర్ (పౌష్టికాహర లేమి)కు ఏదీ అతీతం కాకపోవడంతో ఇటీవలి కాలంలో పెరటి తోటలకు బాగా గిరాకీ పెరిగింది. పోషకాహారలోప నివారణలో వీటి పాత్ర కీలకమైంది. ఆహార ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా భారత్ రెండో స్థానంలో ఉన్నప్పటికీ పోషకాహార లోపంలోనూ అదేస్థాయిలో ఉంది. పెరుగుతున్న జనాభాను, పోషకాహార లోపాలను, కూరగాయల లభ్యతను, ధరలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన కూరగాయలను ఏడాది పొడవునా అందుబాటులో ఉంచేందుకు ఈ పోషకాహార పెరటి తోటలు ఉపయోగపడతాయి. అందుకే వీటిని ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. రసాయన ఎరువులు, సస్యరక్షణ, కలుపు నివారణ మందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకోవడం అనివార్యమని శాస్త్రవేత్తలు సైతం సలహా ఇస్తున్నారు.
ఒక్కో మనిషికి ఎన్నెన్ని గ్రాములు కావాలంటే..
సగటున ప్రతి మనిషికి రోజుకు కనీసం 85 గ్రాముల పండ్లు, 75 నుంచి 125 గ్రాముల ఆకుకూరలు, 85 గ్రాముల ఇతర కూరగాయలు, 85 గ్రాముల దుంప కూరలు కావాలి. ఇలా తీసుకున్నప్పుడే శరీరానికి అవసరమైన పోషకాలు సమకూరతాయి. ప్రస్తుత లెక్క ప్రకారం ఇంతకన్నా తక్కువ తీసుకుంటున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్ల నేపథ్యంలో ఆకుకూరలకు రోజువారీ ఆహారంలో చోటు తక్కువైంది. ఫలితంగా విటమిన్ల లోపం ఏర్పడుతోంది. విటమిన్–ఎ లోపంతో రేచీకటి వస్తుంది. ఐరన్ లోపంతో రక్తహీనత వస్తుంది. దాదాపు సగంమంది మహిళలు, పిల్లలు, యుక్త వయస్కులు రక్తహీనతతో బాధపడుతున్నారు. విటమిన్–బి లోపంతో ఆకలి మందగించడం, నోటిచివర పగుళ్లు, నాలుకపై పూత వస్తాయి. ఈ లోపాలను నివారించాలంటే ఆకుకూరలు, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి. సమగ్ర జాతీయ పోషకాహార సర్వే లెక్క ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు సరైన పోషకాహారం అందడంలేదు. 2 నుంచి 4 ఏళ్ల వయసున్న పిల్లల్లో విటమిన్–ఎ లోపం తీవ్రంగా ఉంది. కూరగాయల వినియోగం తక్కువగా ఉంది.
పెరటి తోటల్లోని ఆకుకూరలతో..
పోషకాహార పెరటి తోటలు పెంచడం వల్ల కుటుంబ ఆరోగ్యం బాగవుతుంది. దీనికి కావాల్సిందల్లా ఆసక్తే. చాలామందికి పెరళ్లు ఉంటాయి. లేనివారు కుండీల్లోను పెంచుకోవచ్చు. ఏడాది పొడవునా బెండ, వంగ, టమోటా, మిరప, పాలకూర, మెంతికూర, గోంగూర, తోటకూర, చుక్కకూర, బచ్చలి, సిర్రాకు, నిమ్మ, జామ, అరటి, బొప్పాయి, మామిడి, దానిమ్మ వంటి వాటిని పెంచుకోవచ్చు. అదనపు ఆదాయం పొందవచ్చు. ఇవి పోషకాహార లోపాన్ని నివారిస్తాయి. ఇళ్లల్లో మనకున్న స్థలాన్ని చిన్న మడులుగా విడగొట్టి తీగ జాతి కూరగాయలను కంచె మీదికి పాకించవచ్చు. దంప కూరలను గట్లపై పెంచవచ్చు. పండ్ల చెట్లను పెరట్లో ఏదైనా మూలగా వేసుకోవచ్చు. పెరట్లోనే ఒక పక్క కంపోస్టు గుంతను ఏర్పాటు చేసుకుని సేంద్రియ ఎరువును తయారు చేసుకుని దాన్నే ఉపయోగించుకోవచ్చు. బయటి నుంచి నారు తెస్తే 3, 4 వారాల మధ్య నాటుకోవాలి. నాటే సమయంలో 2, 3 గంపల పశువుల ఎరువులు వేయాలి.
ఉపయోగాలు ఏమిటంటే..
కూరగాయల వినియోగం పెరిగితే పోషకాహార లోపం, సూక్ష్మపోషకాల లోపాలను నివారించుకోవచ్చు. కుటుంబ ఆహార అవసరాలను తీర్చుకోవచ్చు. తాజా కూరగాయలతో పోషకాలు మెండుగా వస్తాయి. వ్యాధుల నుంచి రక్షణ ఉంటుంది. ఖనిజాలు, పోషకాలు, విటమిన్లు సరేసరి. డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రాలు ఈ పోషకాహార తోటలు పెంచుకోవడానికి సూచనలు, సలహాలు ఇస్తున్నాయి. ఇళ్లల్లో పెంచుకోవడానికి ఆకుకూరల విత్తనాలు కూడా సరఫరా చేస్తున్నట్లు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం గృహ విజ్ఞానశాస్త్ర విభాగం శాస్త్రవేత్తలు డాక్టర్ బి.విజయలక్ష్మి, డాక్టర్ కె.మల్లికార్జునరావు, బి.గోవిందరాజులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment