పనస.. ఉంది ఎంతో పస | Special Article On Jack Fruit Day In Sakshi | Sakshi
Sakshi News home page

పనస.. ఉంది ఎంతో పస

Published Thu, Jul 4 2019 3:25 PM | Last Updated on Thu, Jul 4 2019 4:32 PM

Special Article On Jack Fruit Day In Sakshi

సిమ్ల యాపిల్‌లా ఎర్రగా ఆకర్షణీయంగా ఉండదు
దోరమగ్గిన జాంపండులా చూడగానే కొరుక్కు తినాలనిపించదు
మధురమైన మామిడిలా పళ్లల్లో రారాజు కూడా కాదు
కానీ ఆ పండు ఒక రత్నమూ, మాణిక్యమే
మన పెద్దలు ఎప్పుడో ఈ విషయాన్ని గుర్తించారు. 
తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్న మాణిక్యాలు, మనవలు బొమ్మరాళ్లు అంటూ ఆ పండు చుట్టూ ఒక పొడుపు కథనే అల్లేసారు. పనస పండులో ఓ పస ఉంది.  ఆ విషయాన్ని ఇప్పుడిప్పుడే మనమూ గుర్తిస్తున్నాం.. పాశ్చాత్య దేశాలు కూడా పనసను మనసారా ఆస్వాదించడం మొదలు పెట్టాక ఆ పండు విలువ ఆకాశమే హద్దుగా సాగిపోయింది. వీగన్‌ డైట్‌ ఫాలోయర్లకు పనస పండు ఒక వరంగా మారింది. పనసలో ఉండే ప్రయోజనాలు అందరికీ తెలియజెప్పడానికే జులై 4న ప్రపంచ పనసపండు దినోత్సవం జరుపుకుంటున్నారు. 

పనస. అదొక కల్పవృక్షం. ఆ పండులో తొనలే కాదు, పై తొక్క, పిక్కలు, చెట్టు ఆకులు, బెరడు.. దాని కర్ర..  ఇలా ప్రతీ భాగమూ అత్యంత విలువైనవి. దాని చుట్టూ ఉన్న మార్కెట్‌ని చూస్తే విస్తుపోతారు. భారీ సైజు, రవాణాలో సంక్లిష్టత,  పండు పై తొక్క తీసి తొనల్ని వలవడం అదో పెద్ద ప్రహసనం కావడంతో జనసామాన్యంలోకి అంతగా వెళ్లలేదు..పనసలో ఆరోగ్య విలువలు గ్రహించాక తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రాష్ట్రీయ ఫలంగా ప్రకటించి మార్కెట్‌ని విస్తరించే పనిలో ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్‌ జాతీయ ఫలం కూడా పనసే. వాళ్లు ఎప్పట్నుంచో పనసతో సొమ్ము చేసుకునే పనిలో ఉన్నాయి  అమెరికా, యూరప్, బ్రిటన్‌ దేశాల్లో ఈ పనసంటే పడి చచ్చిపోతారు. కేవలం కేరళ రాష్ట్రం నుంచి ఈ పండు ఎగుమతులు గత ఏడాది 500 టన్నులకు చేరుకున్నాయి. ఈ ఏడాది చివరికి 800 టన్నులు దాటేస్తుందని ఒక అంచనా. పనస కేరళ రాష్ట్రానికి 15 వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతూ కాసుల వర్షం కురిపిస్తోంది.

పనసపండుకి పుట్టినిల్లు భారత దేశంలోని పశ్చిమ కనుమలు. 
పండ్లల్లో అతి పెద్దది. ఒక్కో పండు 5 నుంచి 50  కేజీల వరకు తూగుతుంది. 3 అడుగుల వరకు పొడవు పెరుగుతుంది. 
పనసలో ఏకంగా 300 రకాలు జాతులు ఉన్నాయి. 
ఉత్పత్తి అయ్యే పళ్లలో రెండేళ్ల క్రితం వరకు 80 శాతం వృథా అయ్యేవి. వీటి విలువ 2వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా
పనసతో 200 రకాల వంటకాలు చేయొచ్చు. పనసపొట్టు కూర, పసన దోసెలు వంటి సంప్రదాయ వంటల నుంచి అటు వెస్ట్రన్‌ ఘుమఘులైన  పిజ్జాలు, బర్గర్‌లు, చిప్స్,  ఐస్‌క్రీమ్‌ వరకు ఎన్నో రకాలు ఉన్నాయి. చివరికి పనస వైన్‌ కూడా తయారు చేస్తున్నారు. 

మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థలో డైరెక్టర్‌ పదవిని వదులుకొని వచ్చి మరీ జేమ్స్‌ జోసెఫ్‌ అనే కేరళకు చెందిన వ్యక్తి  పనసపండులో ప్రయోజనాలు ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారు. జాక్‌ఫ్రూట్‌ 365 అన్న కంపెనీ ప్రారంభించి జాక్‌ ఫ్రూట్‌ మ్యాన్‌గా గుర్తింపు సంపాదించారు. 

శ్రీ పాడ్రే అన్న జర్నలిస్టు తాను నడిపే అడికె పత్రికలో  పనస పండుకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.ప్రతీ నెల వచ్చే ఈ మ్యాగజైన్‌లో ఇప్పటివరకు పసనపైనే 32 కవర్‌ స్టోరీలు వచ్చాయి

పరిపూర్ణ ఆహారం
పనస పరిపూర్ణ ఆహారానికి మరో రూపం. ఈ పండులో అత్యధికంగా ప్రొటీన్లు ఉంటాయి. విటమిన్‌ ఏ సమృద్ధిగా లభిస్తుంది.. ఒక కప్పు అన్నంలో కంటే కప్పు పనస తొనల్లో కార్బోహైడ్రేట్లు 40% తక్కువగా ఉంటాయి. ఇక ఫైబర్‌ నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. వరి, గోధుమలో ఉండే గ్లూకోజ్‌లో సగం కంటే తక్కువ పనస పండులో ఉంటుంది. థైరాయిడ్, ఆస్తమా వంటి రోగాలను నియంత్రిస్తుంది. 

మధుమేహం ఆమడదూరం 
కేరళ డయాబెటీస్‌కు కేరాఫ్‌ అడ్రస్‌. ఇప్పుడిప్పుడే మధుమేహ గ్రస్తుల్లో వరి, గోధుమ రొట్టెలకు బదులుగా పనస పొట్టు, పనస తొనలు, పిక్కలతో చేసే ఆహారాన్ని రోజూ తీసుకోవాలన్న స్పృహ పెరుగుతోంది. చక్కెర వ్యాధిని నియంత్రించే శక్తి పనస కాయకి ఉండడంతో దానికి డిమాండ్‌ పెరిగింది. ఈ ఏడాది రోమ్‌లో జరిగిన ఒక అధ్యయనంలో కేరళలో డయాబెటీస్‌ మందుల అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయినట్టు తేలింది.  

పేరు వెనుక కథ
పనసకున్న శాస్త్రీయ నామం ఆర్టోకార్పస్, గ్రీకు భాష నుంచి ఈ పదం వచ్చింది. గ్రీకులో ఆర్టో అంటే బ్రెడ్‌ అని కార్పస్‌ అంటే పండు అని అర్థం. బ్రెడ్‌ అంటేనే అందరి కడుపు నింపేది. దానికి తోడు అది పండు కూడా కావడంతో పరిపూర్ణమైన ఆహారంగా మన పూర్వీకులే గుర్తించారు. కానీ అది ప్రాచుర్యంలోకి రావడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. 1563 సంవత్సరంలో పోర్చుగీస్‌కు చెందిన ఒక  స్కాలర్‌ గరిక డా ఓర్టా అన్న పుస్తకంలో పనసని ప్రస్తావించారు. ఈ పండుని జాకా అని రాశారు.  క్రమంగా ఇంగ్లీషులో అది జాక్‌ ఫ్రూట్‌గా మారింది.

పనసకి ‘‘జేమ్స్‌’’ బాండ్‌
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు పేరు జేమ్స్‌ జోసెఫ్‌. కొంత కాలం క్రితం వరకు మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో డైరెక్టర్‌.  ఓసారి ముంబైలో  తాజ్‌మహల్‌ ప్యాలెస్‌లో తన క్లయింట్లకి డిన్నర్‌ ఇచ్చారు. ఆ డిన్నర్‌ ఆయన జీవితాన్నే మార్చేసింది. అక్కడ భోజనంలో చెఫ్‌ హేమంత్‌ ఓబరాయ్‌ ఒక వెరైటీ వంటకాన్ని తయారు చేసి అతిథులకు వడ్డించారు. వాస్తవానికి ఆ పదార్థం పీతలతో చేస్తే టేస్ట్‌ అదిరిపోతుంది. కానీ ఆ చెఫ్‌ కాస్త వినూత్నంగా ఆలోచించి వెజిటేరియన్లు కూడా ఇష్టంగా తింటారని పుట్టగొడుగులతో తయారు చేశారు. రుచి చూస్తే ఆహా అనిపించింది. అతిథులందరూ మైమరిచి తిన్నారు. అప్పుడే జోసెఫ్‌ మదిలో  మష్‌రూమ్స్‌కి బదులుగా పనసపళ్లని వాడి ఉంటే  దాని రుచి వంద రెట్లు పెరిగేది కదా అన్న ఆలోచన వచ్చింది.. జోసెఫ్‌ది కేరళ. చిన్నప్పట్నుంచి పనస పండు రుచి బాగా తెలుసు. మాంసం, పుట్టగొడుగుల కంటే పసనపండులోనే ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి కదా!  దీనినో ప్రత్యామ్నాయ ఆహారంగా ఎందుకు ప్రపంచానికి పరిచయం చేయకూడదు అనుకున్నారు. అమెరికాకు తిరిగి వెళ్లినా అవే ఆలోచనలు ఆయనను వెంటాడాయి. వాటికో రూపం ఇవ్వడానికి కొంతమంది చెఫ్‌లను సంప్రదించారు.

పనస పండుతో విన్నూత్నమైన రుచులు చేయవచ్చునని మాంసాహారానికి బదులుగా ఈ పండుని వాడితే ఆహార భద్రతని అధిగమించవచ్చునన్నది ఆయన ఆలోచన.  పనస పళ్ల సీజన్‌ వచ్చాక ఆ పండుని తెప్పించి తనకు బాగా తెలిసిన చెఫ్‌తో దగ్గరుండి జోసెఫ్‌ బర్గర్‌ చేయించారు. ఆ తొనల్లో మెత్తదనం, ఒక రకమైన తియ్యటి కమ్మదనం, దానిపై డెకరేషన్‌కు వాడిని పసన పిక్కలు. ఓహో అదో అద్భుతమైన రుచి.  ఆలూ బర్గర్‌ కంటే యమ్మీ యమ్మీగా ఉంది. ఇక పనస పండుతో కేక్‌ కూడా తయారు చేశారు. వాటి రుచికి సాటిపోటి లేదని అనిపించింది, మెక్‌డొనాల్డ్‌లో అమ్మకానికి పెడితే హాట్‌ కేకుల్లా అమ్ముడు పోయాయి. అంతే జోసెఫ్‌ ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోయింది. ఉన్న పళంగా నెలకి ఆరెంకలు వచ్చే జీతం, మైక్రోసాఫ్ట్‌లాంటి సంస్థలో డైరెక్టర్‌  హోదా అన్నీ వదిలేసుకున్నారు. జాక్‌ఫ్రూట్‌ 365 అన్న కంపెనీ ప్రారంభించారు. కొద్ది ఏళ్లల్లోనే పనసతో కోట్లకు పడగలెత్తడమే కాదు, నిలువెత్తు ధనం కుమ్మరించినా రాని పేరు అంతర్జాతీయంగా సంపాదించారు. జాక్‌ ఫ్రూట్‌ మ్యాన్‌గా గుర్తింపు సంపాదించారు. 

వీగన్లకి వరం 
వీగన్‌ డైట్‌ అంటే ఏమిటో తెలుసు కదా.. పూర్తిగా మొక్కల మీద పండిన ఆహారమే ఈ  డైట్‌. ఈ మధ్య కాలంలో క్రీడాకారులందరూ వీగన్‌ డైట్‌ను తెగ ఫాలో అవుతున్నారు. భారత్‌ క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ కూడా వీగన్‌గా మారడంతో అసలు ఏమిటీ డైట్‌ అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగింది. మాంసాహారం మాత్రమే కాదు  జంతువుల నుంచి వచ్చే పాలు, పెరుగు, తేనె వంటి పదార్థాలు కూడా ఈ డైట్‌లో తీసుకోరు. ఒక్క ముక్కలో చెప్పాలంటే శుద్ధశాకాహారులన్న మాట.  కక్క ముక్క లేనిదే ముద్ద దిగని వారు  రాత్రికి రాత్రి మాంసాహారానికి దూరం కావడం అంత ఈజీ కాదు. అలాంటి వారికి పనస ప్రాణ సమానంగా అనిపిస్తోంది. మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా పనసపండుని పాశ్చాత్య దేశాలు గుర్తించాయి. దీనికి కారణం ఆ పండు తొనలే. వాటిని నములుతుంటే మెత్తగా, రుచిగా అచ్చంగా మాంసం తింటున్న ఫీల్‌ వస్తుంది. తొనల చుట్టూ ఉండే పీచు కూడా విదేశీయులు ఇష్టంగా తింటారు. మొక్కలతో ప్రొటీన్‌ వచ్చే ఆహారాలైన పప్పుదినుసులు, గింజలు, పనస వంటి ఇతర పళ్ల మార్కెట్‌ గత ఏడాది 105 కోట్ల డాలర్ల నుంచి 2025 నాటికి 163 కోట్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా. 

గ్రీన్‌హౌస్‌ పోరాటంలో కీలకపాత్ర
మాంసాన్ని ఉత్పత్తి చేయడం ఎంతో ఖర్చుతో కూడిన పని. దీనికి భారీ భూమి, జల వనులు, పశుపోషణకు ఇతర వనరులు కావాలి. దీని వల్ల 14.5% గ్రీన్‌ హౌస్‌ వాయువులు విడుదలవుతాయి. కానీ పనస అలా కాదు. గ్రీన్‌ హౌస్‌ వాయువుల్ని ఆ చెట్టు అత్యధికంగా తీసుకుంటుంది. వరి, గోధు, మొక్క జొన్న పంటల కంటే భవిష్యత్‌లో పనసకే డిమాండ్‌ పెరుగుతుందని ఒక అంచనా. ఎందుకంటే పనస చెట్టు పెంచడానికి పెద్దగా శ్రమించనక్కర్లేదు. గాలికి, ధూళికి కూడా పెరిగిపోతుంది. 

సరిహద్దుల్లేని పనస
గత రెండు మూడేళ్లుగా మన దేశంలో పసన విలువ గ్రహించాం కానీ విదేశాలు ఎప్పుడో ఈ పని చేశాయి. వియాత్నం  15 ఏళ్ల క్రితమే పనసపండుకి ప్రాచుర్యం కల్పించడం మొదలు పెట్టింది. 50 వేల హెక్టార్లలో పనసని పండిస్తున్నారు. మలేసియా, ఫిలిప్పీన్స్, కంబోడియా, శ్రీలంక కూడా పనసకి పెద్ద పీటే వేస్తున్నారు. శ్రీలంక వ్యవసాయ శాఖ ఈ పండుని గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు పంపిణీ చేస్తూ పోషాకాహార లోపాలను అధిగమిస్తోంది. పనసకి కొత్త కొత్త రుచులు కల్పించి రకరకాల పదార్థాలను తయారు చేయడంలో వియాత్నం నెంబర్‌ వన్‌. మలేసియా జాతీయ విధానంలో పనసకు భాగం ఉంది. అన్ని రంగాల్లో దూసుకుపోయే చైనా 1992 నుంచే పనసను పెంచుతోంది కానీ  దానిని సొమ్ము చేసుకోవడంలో ఆ దేశమే నెంబర్‌ వన్‌. రోడ్డుకి ఇరువైపులా పనస చెట్లనే నాటిస్తోంది. ఇక ఫిలీప్పీన్స్‌ పనస పంటపై ఏకంగా కోర్సులే మొదలు పెట్టింది. 

పనస భలే పసందు 
జాక్‌ఫ్రూట్‌ మ్యాన్‌గా పేరు పొందిన జేమ్స్‌ జోసెఫ్‌ ఎన్ని రకాలు వంటకాలు చేయొచ్చో స్వయంగా ఆలోచించి ప్రయోగాలు చేశారు. రుచికి రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం కావడంతో జోపెఫ్‌ పంట పండింది. పనసతో ఆయన తయారు చేసిన కబాబ్, బిర్యానీ, మసాల దోశ, పనస రోల్స్, పాయసం, కేకులు, వైన్, పకోడీలు, పిజ్జాలు, బర్గర్‌లు,  ఇలా ఒకటేమిటి అటు సంప్రదాయ వంటలు, ఇటు వెస్ట్రన్‌ స్టైల్‌ ఘుమఘుమలు  ఎన్నో తయారు చేశారు. జాక్‌ ఫ్రూట్‌ అంబాసిడర్‌ అవార్డు కూడా అందుకున్నారు. కేవలం కేరళలోనే మొత్తం 30 కంపెనీలు పనసకి సంబంధించిన రకరకాల పదార్థాలు చేసి అమ్ముతున్నాయి. పనస ఐస్‌క్రీమ్‌లు, చిప్స్, జ్యూస్‌లు ఒకటేమిటి ఏడాది పొడవునా నిల్వ చేసుకునే ఎన్నో రకాలు తయారై మార్కెట్‌ని ముంచెత్తుతున్నాయి.  

తెలుగు రాష్ట్రాలోన్లూ పంట పండుతోంది
తెలంగాణలో ఆదిలాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, చిత్తూరులో పనస విస్తారంగా పండుతుంది. ఏపీలో మొత్తం 1197 హెక్టార్లలో, ప్రతీ ఏడాది ఇంచుమించుగా 41 వేల మిలియన్‌ టన్నుల పంట పండుతుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా పనసకుండే మార్కెట్‌ని గ్రహించి ప్రోసెసింగ్‌ యూనిట్లు, చిప్స్‌ తయారీ ఫ్యాక్టరీలు నెలకొల్పడానికి సన్నాహాలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ఉద్యానవన శాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరి వెల్లడించారు. ఈ పండుని రవాణా చేయడానికి వీలుగా చిన్న సైజులో పండేలా సంకర జాతి పనస పండించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 12.4 కోట్లమంది ఇంకా ఆకలితో మాడిపోతున్నారని ప్రపంచ ఆకలి సూచి చెబుతోంది. ఆకలి కేకల్ని తగ్గించడానికి, వివిధ రుచుల్ని ఆస్వాదించడానికి  పెద్దగా శ్రమ లేకుండానే ఇళ్లల్లో, వీధుల్లో పనస చెట్లు పెంచితే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆదాయానికి ఆదాయం. ఆహార భద్రత కూడా.  పనస విలువ ఎంతటిదో తెలిసింది కదా, మరింకేం ఈ రుచిని మనసారా ఆస్వాదించండి. జీవితాంతం ఆరోగ్యంగా ఉండండి. 

అరవింద న్యాయపతి
-సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement