Special Article
-
President Droupadi Murmu: ఆవేదనతో చలించిపోయా..
న్యూఢిల్లీ: పశి్చమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఆ భయానక సంఘటన గురించి తెలుసుకొని చలించిపోయానని చెప్పారు. ఇలాంటి దారుణాలు ఇకపై జరగడానికి వీల్లేదని స్పష్టంచేశారు. మహిళలపై నేరాల పట్ల మనమంతా ఆత్మపరిశీలన చేసుకోవాలని బుధవారం పీటీఐ వార్తా సంస్థకు రాసిన ప్రత్యేక ఆరి్టకల్‌లో రాష్ట్రపతి సూచించారు. జూనియర్ డాక్టర్ హత్యపై రాష్ట్రపతి స్పందించడం ఇదే మొదటిసారి. తల్లులు, అక్కచెల్లెమ్మలపై జరుగుతున్న అరాచకాలపై దేశం మేల్కోవాల్సిన సమయం వచ్చిందని ఆమె ఉద్ఘాటించారు. మహిళల పట్ల నీచమైన అభిప్రాయాలు ఉంటే వారిని ఒక వస్తువుగా చూసే అలవాటు పెరుగుతుందని తెలిపారు. స్త్రీలను బలహీనులుగా, తెలివిలేనివారుగా పరిగణించే ఆలోచనా ధోరణిని అందరూ మార్చుకోవాలని హితవు పలికారు. మహిళల పట్ల ప్రజల దృష్టికోణం మారితే సమాజంలో వారిపై నేరాలు జరగబోవని అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి ముర్ము ఇంకా ఏం చెప్పారంటే... మనం పాఠాలు నేర్చుకున్నామా? దేశంలో సోదరీమణులపై ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. ఆగస్టు 9న కోల్‌కతాలో వైద్యురాలపై జరిగిన అఘాయిత్యం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. నాగరిక సమాజంలో ఆడబిడ్డలు ఇలాంటి అరాచకాల బారిన పడడానికి వీల్లేదు. జూనియర్ డాక్టర్ హత్య పట్ల దేశమంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందులో నేను కూడా ఉన్నాను. కోల్‌కతాలో విద్యార్థులు, వైద్యులు, పౌరులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుండగానే, మరోచోట నేరగాళ్లు చెలరేగిపోయారు. మహారాష్ట్రలో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డారు. 12 ఏళ్ల క్రితం జరిగిన నిర్భయ ఘటన తర్వాత మహిళలపై నేరాలు జరగకుండా వ్యూహాలు రూపొందించుకున్నాం. ప్రణాళిక అమల్లోకి తీసుకొచ్చాం. అయినా నేరాలు ఆగడం లేదు. గత 12 ఏళ్లలో లెక్కలేనన్ని దారుణాలు జరిగాయి. కొన్ని మాత్రమే అందరి దృష్టికి వచ్చాయి. మనం నిజంగా పాఠాలు నేర్చుకున్నామా? ఆందోళనలు ముగిసిపోగానే ఘోరాలు మరుగునపడిపోతున్నాయి. వాటిని మనం మర్చిపోతున్నాం. మరో ఘోరం జరిగాక పాత ఘోరాలను గుర్తుచేసుకుంటున్నాం. ఇది సరైన విధానం కాదు. మహిళలపై వక్రబుద్ధిని మొదట్లోనే అడ్డుకోవాలి మహిళలు తమ హక్కుల గురించి తెలుసుకోవాలి. వాటిని పోరాడి సాధించుకోవాలి. మహిళలకు మరిన్ని హక్కులు దక్కకుండా, హక్కుల విస్తరణ జరగకుండా కొన్ని సామాజిక అచారాలు, సంప్రదాయాలు అడ్డుపడుతున్నాయి. మహిళలను ప్రాణంలేని వస్తువుగా చూసే ధోరణి వారిపై నేరాలకు పురిగొల్పుతోంది. ఈ పరిస్థితిలో కచి్చతంగా మార్పురావాలి. వారి హక్కులను అందరూ గౌరవించాలి. స్త్రీల పట్ల జనంలో ఉన్న దురభిప్రాయాన్ని మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు, సమాజంపై ఉంది. చరిత్రను ఎదిరించే సమయం వచ్చింది. స్త్రీలపై నేరాల పట్ల నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారిపై అత్యాచారాలు, హత్యలు జరగకుండా మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. జరిగిన తప్పులను సరిదిద్దుకోకపోతే సమాజంలోని సగం జనాభా మిగతా సగం జనాభాలాగా నిర్భయంగా జీవించలేదు. మీడియా ధైర్యంగా పనిచేయాలి ప్రసార మాధ్యమాలు ధైర్యంగా పని చేయాలని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సూచించారు. ఒత్తిళ్లకు లొంగకుండా, ఎవరికీ భయపడకుండా ప్రజలకు నిజాలు తెలియజేయాలని అన్నారు. దేశాన్ని, సమాజాన్ని సక్రమంగా తీర్చిదిద్దడంలో ఫోర్త్ ఎస్టేట్ పాత్ర అత్యంత కీలకమని వివరించారు. మీడియా ఎప్పటికీ సత్యానికే అండగా ఉండాలని చెప్పారు. సత్య మార్గం నుంచి పక్కకు మళ్లొద్దని కోరారు. ‘మనసు ఎక్కడ నిర్భయంగా ఉంటుందో’ అని రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన పద్యాన్ని రాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. పీటీఐ 77వ వార్షికోత్సవం సందర్భంగా వార్తాసంస్థల ఎడిటర్లు బుధవారం రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన దేశంలో మహిళలను దేవతలుగా పూజిస్తుంటామని, మరోవైపు మన రోజువారీ ప్రవర్తనలో ఆ భావన కనిపించకపోవడం తనను అప్పుడప్పుడు ఆవేదనకు గురి చేస్తోందని ముర్ము వ్యాఖ్యానించారు. -
వందేళ్లకుపైగా చరిత్ర.. లక్షల తీర్పులు
సాక్షి, హైదరాబాద్: మూసీనది ఒడ్డున ఠీవిగా నిల్చున్న అద్భుత కట్టడం.. భారీ గుమ్మటాలతో చూడగానే ఆకట్టుకునేలా నిర్మాణం.. వందేళ్లకు పైగా చరిత్ర. ఎందరో గొప్ప మేధావులు న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా పని చేసిన భవనం. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన వారూ అనేకమే. కోట్లాది మందికి న్యాయాన్ని అందించిన సజీవ సాక్ష్యం. గులాబీ, తెలుపు గ్రానైట్లతో రూపుదాల్చిన విశాల భవంతి. నాటి నిజాం ప్రభుత్వానికి, ఉమ్మడి ఏపీ సర్కార్‌కు, ప్రత్యేక తెలంగాణ సర్కార్‌కు ఉన్నత న్యాయస్థానంగా నగరం నడిబొడ్డున సేవలందించిన భారీ కట్టడం. ఈ హైకోర్టును బుద్వేల్‌కు తరలించాలని కొందరు.. వద్దు ఇక్కడే కొనసాగించాలని మరికొందరు.. ఈ వాదనల నేపథ్యంలో కొద్దికాలం క్రితం బుద్వేల్‌లో కొత్త హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు 105 ఏళ్ల క్రితం పురుడుపోసుకున్న హైకోర్టు భవనంపై ప్రత్యేక కథనం.హైకోర్టు ఏర్పాటు ఇలా...’ఆంగ్లేయుల పాలనలో రూపొందించిన అనేక నిబంధనలు నిజాం ప్రభుత్వం అధీనంలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఇతర ప్రాంతాల్లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విధంగా ఇక్కడ కూడా కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొలుత పత్తర్ఘాట్లో హైకోర్టును నెలకొల్పారు. 1908లో వచ్చిన వరదల తర్వాత లాల్‌బాగ్‌లో ఉండే ఆస్మాన్ ఝా నవాబ్ నివాస గృహంలోకి మార్చారు. 1912లో నగరంలో కలరా వ్యాధి రావడంతో పబ్లిక్ గార్డెన్స్ హాల్‌కు, అక్కడి నుంచి సాలార్జంగ్ బహదూర్ నివాసానికి తరలించారు. అక్కడ స్థలం సరిపోక ఇబ్బందిపడాల్సి వచ్చింది. దీంతో సైఫాబాద్ని సర్తాజ్‌జంగ్ నవాబ్ ఇంటికి మార్చారు.హైకోర్టు భవనానికి రూపకల్పన...1915, ఏప్రిల్ 15న ప్రస్తుత హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. జైపూర్‌కు చెందిన శంకర్‌లాల్ ఆర్కిటెక్ట్‌గా, మెహర్ అలీఫజల్ ఇంజనీర్‌గా వ్యవహరించారు. శంషాబాద్ వద్ద గగ న్పహాడ్లోని కొండలను తొలిచి, ఇండో ఇస్లామిక్ శైలిలో పాతబస్తీలోని మూసీనది ఒడ్డున నిర్మించారు. 1919, మార్చి 31న భవన నిర్మాణం పూర్తయింది. మూసీపై నయాపూల్ వంతెన పక్కన హైకోర్టు భవనం ఠీవిగా కొలువుదీరింది. నిజాం కాలం నాటి 18,22,750 సిక్కాల వ్యయంతో 9 ఎకరాల్లో నిర్మించిన ఈ భవనాన్ని 1920, ఏప్రిల్ 20న ఏడో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రారంభించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1956, నవంబర్ 5న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా మార్చారు. ఆ తర్వాత పలు అవసరాల నిమిత్తం కొత్త భవనాలు నిర్మిస్తూ వచ్చారు. హైన్ మహల్, నది మహల్, కుతుబ్ షాహీ నిర్మాణాల శిథిలాలపై ఈ చారిత్రక, వారసత్వ హైకోర్టు భవనాన్ని నిర్మించారు.ప్రత్యేక రాష్ట్రం తర్వాత...2014, జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా.. ఒకే భవనంలో ఏపీ, తెలంగాణ హైకోర్టులు కొనసాగుతూ వచ్చాయి. 2018, డిసెంబర్ 26న రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడంతో 2019, జనవరి 1న ఏపీ హైకోర్టు అమరావతికి తరలివెళ్లిపోయింది. తర్వాత ఈ భవనం పూర్తిగా తెలంగాణ హైకోర్టుకు కేటాయించారు.ముఖ్యాంశాలు...⇒ నిజాం కాలంలో మొదటి ప్రధాన న్యాయమూర్తి: నిజామత్ జంగ్ ⇒ స్వాతంత్య్రానికి పూర్వం జడ్జీల నియామకం చేసింది: నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్⇒ 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైకోర్టుకు తొలి సీజే: జస్టిస్ కోకా సుబ్బారావు⇒ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర హైకోర్టు తొలి సీజే: జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా ⇒ పూర్తిస్థాయిలో తెలంగాణ హైకోర్టు రూపకల్పన (ఏపీ హైకోర్టు తరలిన) తర్వాత తొలి సీజే: జస్టిస్ టీబీ రాధాకృష్ణన్⇒ 2019లో నిర్మాణం వందేళ్లు పూర్తి చేసుకుంది⇒ 1948 నుంచి 1950 వరకు ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ కూడా పనిచేసింది. ఉర్దూ అధికారిక భాష కావడంతో ఇక్కడ ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు. ⇒ ప్రధాన భవనంలో 32 కోర్టు హాళ్లు, 38 చాంబర్లు ఉంటాయి. జడ్జీల సంఖ్య పెరిగిందిలా... ప్రస్తుత హైకోర్టు భవనం ప్రారంభించే నాటికి ఉన్న న్యాయమూర్తులు 6 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైకోర్టు న్యాయమూర్తులు 12 1970లో న్యాయమూర్తుల సంఖ్య 321987లో న్యాయమూర్తుల సంఖ్య 362014లో న్యాయమూర్తుల సంఖ్య 61విభజన సమయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 242021లో న్యాయమూర్తుల సంఖ్య 42 -
కల సాకారం కోసం తపించే స్నే‘హితుడు’..
ప్రస్తుతం సినిమాటోగ్రాఫర్‌గా రాణిస్తున్న పీజీ.వింద (అష్టాచెమ్మా, సమ్మోహనం, జెంటిల్మన్..ఫేం) నిజమైన హితుడు అని చెప్పాలి. తన కల సాకారంతో పాటు మిత్రులందిరివీ కలిపి మన కలలను సాకారం చేయాలని ఆరాటపడతాడు. సిటీలోని జేఎన్టీయూలో చదివేటప్పుడు నాకు సహాధ్యాయి. ఇద్దరికీ కళలపట్ల ఆసక్తి, ఏదో సాధించాలన్న తపన.. మా స్నేహబంధంతో పాటు బలపడుతూ వచి్చంది. బేగంపేట్‌లో ఓ చిన్న గదిలో అద్దెకుంటూ చాలీ చాలని డబ్బులతో బిస్కట్లు, సమోసాలతో కడుపు నింపుకుంటూ.. బహుశా ఇవన్నీ ఎదిగే క్రమంలో చాలా మందికి అనుభవమే కావచ్చు. కానీ.. మా లాంటి స్నేహం మాత్రం అతి కొద్దిమందికే దక్కింది అని సగర్వంగా చెప్పగలను. దర్శకులు శేఖర్ కమ్ములకు నన్ను పీజీ.వింద పరిచయం చేసి కాస్ట్యూమ్ డిజైనర్‌గా అవకాశం ఇప్పించకపోతే.. బహుశా సినీరంగానికి దూరంగానే ఉండేవాడినేమో. నాలాంటి మరికొంత మంది స్నేహితుల కలల సాకారానికి కూడా సాయం అయ్యాడు. అందుకే ఎందరో ఫ్రెండ్స్.. కానీ కొందరే స్నే‘హితులు’.. అలాంటివారిలో బెస్ట్ పీజీ.వింద. –అరవింద్ జాషువా, ఫ్యాషన్ డిజైనర్, తెలుగు సినీ దర్శకుడు -
‘ఆధునిక హైదరాబాద్’ ఆ ఇద్దరు మిత్రులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఒక అందమైన నగరం. నాలుగు వందల ఏళ్ల చారిత్రక సోయగం. ప్రేమ పునాదులపై వెలసిన భాగ్యనగరం ఇది. విభిన్న మతాలు, భాషలు, సంస్కృతులు ఒకే పాదు నుంచి పూచిన పూలై వికసించాయి. వైవిధ్యభరితమైన స్నేహ సంబంధాలు వెల్లివిరిశాయి. హైదరాబాద్ అంటేనే ఆతీ్మయమైన నగరం. ఎంతోమంది గొప్ప స్నేహితులు ఈ నేలపైన పుట్టిపెరిగారు. చరిత్రను సృష్టించారు. ఆదర్శప్రాయమైన స్నేహితులుగా నిలిచారు. నిజాం నవాబుల కాలంలో రాజులకు, ఉన్నతాధికారులకు మధ్య చక్కటి స్నేహ సంబంధాలు ఉండేవి. ఆధునిక హైదరాబాద్ నిర్మాణాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టించిన దార్శనికుడు ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్, ఆయన దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్ ఫక్రుల్ముల్క్ బహదూర్. ఇద్దరూ గొప్ప స్నేహితులుగా చరిత్రలో నిలిచిపోయారు. హైదరాబాద్ అభివృద్ధికి వారిద్దరూ కలిసి ప్రణాళికలను రూపొందించారు. హైదరాబాద్ చరిత్రను మలుపు తిప్పారు. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదర్శప్రాయమైన, అజరామరమైన వారి స్నేహంపైన ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. అది స్వర్ణయుగం.. ఆ ఇద్దరి స్నేహం హైదరాబాద్ చరిత్రలో స్వర్ణ యుగం. మీర్ మహబూబ్ అలీఖాన్ ఆధునిక హైదరాబాద్ నగరానికి బాటలు పరిచిన గొప్ప పాలకుడు. ఆయన ఆశయాన్ని, ఆలోచనలను ఆచరణలో పెట్టిన పరిపాలనాదక్షుడు ఫక్రుల్ముల్్క. విధినిర్వహణ దృష్ట్యా ప్రధానమంత్రి. ఇద్దరి అభిరుచులు చాలా వరకూ ఒకేవిధంగా ఉండేవి. 1892 నుంచి 1901 ఫక్రుల్ముల్క్ ప్రధానిగా పనిచేశారు. ఇంచుమించు సమయసు్కలు కావడం వల్ల వారి మధ్య స్నేహం ఏర్పడింది. నాలుగు దశాబ్దాల పాటు ఆ స్నేహం కొనసాగింది.. బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప ప్రతిభావంతుడైన ఫక్రుల్కు సంగీతం, సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. మహబూబ్ అలీఖాన్ కూడా గొప్ప సాహిత్యాభిరుచి కలిగిన వ్యక్తి. ఇద్దరూ కలిసి కవి సమ్మేళనాలు, ముషాయిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొనేవారు. ఉర్ధూ సాహిత్య వికాసం కోసం మహబూబ్ అలీ ఎంతో కృషి చేశారు. ఆధునిక విద్యకు శ్రీకారం చుట్టింది ఆయనే. ఎంతోమంది కవులను, కళాకారులను. పండితులను ప్రోత్సహించారు. ఇద్దరు థారి్మక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అండగా నిలిచారు. అనాథలు, నిస్సహాయులను ఆదుకొనేందుకు ఫక్రుల్ స్వచ్ఛంద సంస్థలకు ధారాళంగా విరాళాలు ఇచ్చేవారు. నిజాంకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా అనేక సమావేశాల్లో, విధానపరమైన అంశాల్లో కీలకంగా వ్యవహరించారు. ‘విజన్ హైదరాబాద్’ లక్ష్యంగా... భావితరాల అవసరాలను, నగర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ‘విజన్ హైదరాబాద్’ లక్ష్యంగా ఇద్దరూ కలిసి అనేక నిర్మాణాలను కొనసాగించారు. రహదారులను నిర్మించారు. కొత్త భవనాలను కట్టించారు. నాటి సంపన్నులు, నవాబుల పిల్లల ఉన్నత చదువుల కోసం 1887లోనే నిజామ్స్ కళాశాలను నిర్మించారు. అనంతర కాలంలో అన్ని వర్గాలకూ చేరువైంది. బాలికల విద్య కోసం మహబూబియా కళాశాల, హైకోర్టు భవనం, అసెంబ్లీహాల్, రైల్వే నిర్మాణం, టెలిఫోన్, బ్యాంకింగ్ వ్యవస్థ, తాగునీటి వ్యవస్థ వంటి కార్యక్రమాలు మహబూబ్ అలీ హయాంలో చేపట్టినవే. స్కూళ్లు, కళాశాలలు కట్టించారు. ఈ నిర్మాణాలన్నింటిలోనూ నిజాంకు ఫక్రుల్ కుడిభుజంగా నిలిచారు.ఎర్రమంజిల్ ఒక కళాఖండం.. ఆ ఇద్దరి అపురూపమైన, ఆదర్శప్రాయమైన స్నేహానికి చిహ్నంగా ఫక్రుల్ అద్భతమైన ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను కట్టించాడు. ఇండో యూరోపియన్ శైలిలో నిర్మించిన ఈ రాజ మందిరం అద్భుతమైన మాన్యుమెంట్గా నిలిచింది. ఎత్తయిన ప్రదేశంలో ఈ అందమైన ప్యాలెస్‌ను కట్టించారు. 1890లో నిర్మాణ పనులు ప్రారంభించగా పదేళ్ల పాటు పనులు కొనసాగాయి. 1900లో ఈ భవన నిర్మాణం పూర్తయింది. దేశంలోని మొఘల్, కుతుబ్‌షాహీ వాస్తు శిల్పాన్ని, యురప్లోని విక్టోరియన్, గోథిక్ నిర్మాణ శైలిని మేళవించి ఈ చారిత్రక కట్టడాన్ని నిర్మాంచారు. ఫక్రుద్దీన్ నివాస మందిరం ఇది. సభలు, సమావేశాలు, వేడుకలు, విందులు, వినోదాలతో ఈ ప్యాలెస్ నిత్యం సందడిగా ఉండేది. -
అలా నటించిన ఒకే ఒక్కడు.. సూపర్ స్టార్ కృష్ణ
సూపర్‌స్టార్ కృష్ణ అంటే తెలుగు సినీ ప్రపంచంలో తెలియని వారుండరు. అంతలా ఆ పేరు ప్రేక్షకుల గుండెల్లో అంతలా పాతుకుపోయింది. ఆయన నటనకు ప్రతిరూపం. అలనాటి తెలుగు సినిమాల్లో ఆయన ముద్ర చెరిగిపోని స్వప్నం. ఎన్నో అరుదైన రికార్డులు ఆయన సొంతం. టాలీవుడ్ నటుల్లో ఆయనది ప్రత్యేక శైలి. ఏ హీరో సాధించని అరుదైన రికార్డును సాధించిన ఏకైక స్టార్ కృష్ణ మాత్రమే. అందుకే ఆయన పేరు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం. (చదవండి: కృష్ణ మరణానికి కారణం ఇదే.. వైద్యులు) తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులు సృష్టించిన ఘట్టమనేని కృష్ణ.. నటనతోనే ఆగిపోకుండా దర్శకుడు, నిర్మాతగా, ఎడిటర్‌గానూ పని చేశారు. సినీ పరిశ్రమలో కృష్ణ కెరీర్ దాదాపు 5 దశాబ్దాల పాటు కొనసాగిందంటే ఆయన నటనకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారో తెలుస్తోంది. దాదాపు 350 సినిమాల దాకా నటించారాయన. హ్యాట్రిక్ రోల్స్‌తో అబ్బురపరిచిన స్టార్ సాధారణంగా సినిమాల్లో ద్విపాత్రాభినయం పోషించే నటులను చూస్తాం. కానీ ఒకే సినిమాలో ఒకే నటుడు బహుళ పాత్రల్లో నటించడం అనేది చాలా అరుదుగా కనిపించే దృశ్యం. అలాంటి పాత్రల్లో అవలీలగా నటించడం ఒక్క సూపర్ స్టార్కే సాధ్యమైంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ త్రిపాత్రాభినయం చేశారు. ఒకే సినిమాలో మూడు పాత్రల్లో నటించడం ఆయనకే సాధ్యమైంది. ఇలా మూడు పాత్రల్లో కనిపించడం ఒక్క సినిమాతోనే ఆగిపోలేదు. కుమారరాజా, డాక్టర్-సినీ యాక్టర్, రక్త సంబంధం, పగపట్టిన సింహం.. ఇలా మూడు కంటే ఎక్కువ సినిమాల్లో ఆయన త్రిపాత్రాభియనంతో అలరించారు. ఆ చిత్రాలు ఇవే.. ఒకే ఏడాదిలో 17 సినిమాల్లో నటించిన ఏకైక నటుడిగా టాలీవుడ్లో అరుదైన రికార్డు సృష్టించారు. ఆపై త్రిపాత్రాభినయ చిత్రాల్లో.. మొదటి సినిమా కుమారరాజాలో తొలిసారిగా మూడు పాత్రల్లో నటించారాయన. ఇది కన్నడ చిత్రం శంకర్ గురుకి రీమేక్. పి సాంబశివరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు వర్షన్లో కృష్ణ తండ్రిగా, ఇద్దరు కొడుకులుగా మూడు పాత్రలు ఆయనే పోషించారు. ఈ చిత్రం సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత కృష్ణ తన ప్రతిభతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. కృష్ణ త్రిపాత్రాభినయం చేసిన రెండో చిత్రం విజయనిర్మల దర్శకత్వం వహించిన డాక్టర్ సినీ యాక్టర్. సినిమాలో తండ్రి పాత్రతో పాటు కొడుకుగా, మేనల్లుడి పాత్రల్లో ఆయనే నటించారు. ఆ తర్వాత 'పగపట్టిన సింహం' సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ మళ్లీ అదే ట్రెండ్ రిపీట్ చేశాడు. ఈ చిత్రానికి పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విలన్‌గా, పోలీసాఫీసర్‌గా, లాయర్‌గా మూడు పాత్రల్లో మెప్పించారు. సిరిపురం మొనగాడు, బంగారు కాపురం, బొబ్బిలి దొర వంటి ఇతర చిత్రాలలో కూడా బహుళ పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు సూపర్ స్టార్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నోటి దురుసుతో అనర్ధాలు
నరంలేని నాలుక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో మాట్లాడాలి. దైవానికి భయపడుతూ ఆచి తూచి ప్రయోజనకరమైన మాటలనే పలకాలి. దురుసుగా, పరుషంగా, అనాలోచితంగా మాట్లాడకూడదు. పరుల మనసు గాయపడేవిధంగా, వారు బాధపడే విధంగా పరుష పదజాలం ఉపయోగించకూడదు. మానవులకు దేవుడు ప్రసాదించిన వరాలు అనంతం. వాటిని లెక్కించడం గాని, ఊహించడం గాని, వర్ణించడం గాని అసాధ్యం. అటువంటి అసంఖ్యాక అనుగ్రహాల్లో ‘నోరు’ కూడా ఒకటి. కేవలం తినడానికి, తాగడానికి మాత్రమేకాదు, సంభాషణకు, సంవాదానికి, మానవుల మధ్య పరస్పర సంబంధాలకు ఇదేవారధి. దీని వినియోగ తీరుపైనే జయాపజయాలు, సాఫల్య వైఫల్యాలు ఆధారపడి ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకుంటే అమృతపు జల్లు జాలువారుతుంది, ప్రేమామృత కుసుమాలను వికసింపజేస్తుంది. మంచిని పంచి మనిషి గౌరవ మర్యాదల్ని ఇనుమడింప జేస్తుంది. సంఘంలో ఉన్నత స్థానాన్ని సమకూర్చి పెడుతుంది. స్నేహ సౌభ్రాత్రతలను, శాంతి సామరస్యాలను పరిఢవిల్లజేస్తుంది. దుర్వినియోగం చేస్తేమాత్రం విద్వేషం చిలకరిస్తుంది. సమాజంలో అగ్గి రాజేస్తుంది. అశాంతి, అలజడులను సృష్టిస్తుంది. స్థాయిని దిగజారుస్తుంది. ఇహపర లోకాల్లో ఆపదలు తెచ్చి పెడుతుంది. వైఫల్యాలకు కారణమవుతుంది. దైవం దృష్టిలో నోటిదురుసు, దుర్భాష, అశ్లీలం తీవ్రమైన నేరాలు. దీనికి ఇహలోకంలో పరాభవం, పరలోకంలో నరక శిక్ష అనుభవించవలసి ఉంటుంది. ఇతరుల మనోభావాలు గాయపరిచేవారిని, అశ్లీలపు మాటలు పలికే వారిని, దుర్భాషలాడేవారిని దేవుడు అసహ్యించుకుంటాడు. కొంతమంది పైకి ఎంతో చదువుకున్నవారిలా, ఎంతో భక్తి పరులుగా కనిపిస్తారు. కాని నోటితో ఇతరుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. పరుల మనసు గాయపరుస్తారు. ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త వారితో ఇలా విన్నవించుకున్నాడు. ‘ఒక స్త్రీ ఎన్నెన్నో నఫిల్ నమాజులు చేస్తుంది. మరెన్నో నఫిల్ ఉపవాసాలు పాటిస్తుంది. పెద్ద ఎత్తున దానధర్మాలు చేస్తూ ఉంటుంది. ఈ సత్కార్యాల కారణంగా ఆమె గొప్పదాతగా ప్రసిద్ధి చెందింది. కానీ ఆమెకు నోటిదురుసు ఎక్కువ. ఏదో ఒకటి అని పొరుగువారి మనసు బాధ పెడుతుంది.’ అని నివేదించాడు. ‘అయితే ఆమె నరకానికి పోతుంది.’ అన్నారు ప్రవక్త మహనీయులు. తరువాత ఆ వ్యక్తి ‘‘దైవప్రవక్తా! ఒక స్త్రీ ఫర్జ్ నమాజులు ఫర్జ్ రోజాలు (అంటే, విధిగా పాటించవలసినవి) మాత్రమే ఆచరిస్తుంది. నఫిల్ నమాజులు నఫిల్ రోజాలు (ఐఛ్ఛికం) పాటించడం చాలా అరుదు. దానధర్మాలు కూడా పెద్దగా ఏమీ చేయదు. ఉన్నంతలోనే అప్పుడప్పుడూ కొన్ని జున్నుముక్కలు దానం చేస్తుంది. అయితే ఆమె ఎప్పుడూ ఇరుగు పొరుగు వారిని పల్లెత్తుమాట అనదు. వారి మనసు నొప్పించదు. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తుందని జనం చెప్పుకుంటూ ఉంటారు’ అని విన్నవించు కున్నాడు. ఈ మాట విని ప్రవక్త మహనీయులు, ‘ఆమె స్వర్గవాసి’ అని సెలవిచ్చారు. కనుక నరంలేని నాలుక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో మాట్లాడాలి. దైవానికి భయపడుతూ ఆచి తూచి ప్రయోజనకరమైన మాటలనే పలకాలి. దురుసుగా, పరుషంగా, అనాలోచితంగా మాట్లాడకూడదు. పరుల మనసు గాయపడేవిధంగా, వారు బాధపడే విధంగా పరుష పదజాలం ఉపయోగించకూడదు. హుందాగా సౌమ్యం, నమ్రత ఉట్టిపడే విధంగా మాట్లాడాలి. ఉపయోగంలేని ఉబుసుపోక మాటలకన్నా మౌనంగా ఉండడం ఎంతో మేలు. లేకపోతే అనర్ధాలు జరిగిపోతాయి. ప్రజలకు, ప్రభుత్వాలకు వివరణలు, సంజాయిషీలు ఇచ్చుకోవలసి ఉంటుంది. అంతేకాదు, మాట్లాడిన ప్రతి మాటకూ, పలికిన ప్రతి పదానికీ దైవానికి కూడా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. దైవం మనందరికీ ఆచితూచి మంచి మాట్లాడే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఆంతరంగిక శుద్ధి
మనిషికి బాహ్య అంగాల శుద్ధి కంటే ఆంతరంగిక శుద్ధి అవసరం అంటుంది బౌద్ధం. ఈ మనోశుద్ధి వల్ల మనస్సు మలిన రహితం అవుతుంది. తేటదనం ఉట్టిపడుతుంది. శారీరక శుద్ధి కంటే మనోశుద్ధే మేలు. మనో వాక్కాయ కర్మల్లో మనో శుద్ధి ఉంటే వాక్కులూ చేసే పనులూ, వాటంతట అవే శుద్ధి అయిపోతాయి. అందుకే అన్నింటికీ అగ్రగామి మనసే’’ అంటుంది ధమ్మపదం. ఎంత విన్నా, ఎంత చదివినా హీనబుద్ధి గలవాడు తమగుణం మానలేడు అంటారు. దేహాన్ని ఎంత శుద్ధిగా ఉంచుకున్నా అవగుణం ఉన్నవాడికి ఒక్కసారి కాకపోతే ఎప్పుడో ఒక్కసారైనా దేహశుద్ధి తప్పదు. మనోశుద్ధి ఉంటే వారు మణిలా జీవితాంతం రాణిస్తారు. కానీ శారీరక శుద్ధి వల్ల పాపాలు పోయి పుణ్యం వచ్చిపడుతుంది అని నమ్మే పండితుడు చివాట్లు తిన్న కథ ఇది. మగధ దేశంలో మల్లిక అనే ఒక దాసి ఉండేది. ఆమె ఎంతో అందగత్తె. నిండు యవ్వనంలో ఉన్నా నిలకడ గల మగువ. ఒకరోజు తెల్లవారు జామునే నీటికోసం నదికి పోయింది. మంచు పట్టి ఉంది. చలి వణికిస్తోంది. ఆమె నదీతీరం చేరి అక్కడ నదిలోకి కట్టి ఉన్న మెట్ల మీద నుండి దిగింది. అప్పటికే అక్కడ ఒక పండితుడు నీటిలో స్నానం చేస్తూ ఉన్నాడు. బుడింగిన మునిగి పైకి లేచాడు. ఎదురుగా మల్లిక కనిపించింది. ఆమె అప్పటికే నీరు ముంచుకుని కడవ నడుమున పెట్టింది. ఆ క్షణంలో ఆమె అందాన్ని, వయ్యారాన్ని చూసి, పండితుని మనస్సు చలించింది. అలాగే నిలబడి చలికి వణుకుతూ ఆమె వంకే చూస్తుండిపోయాడు. అతని వాలకం మల్లిక పసిగట్టి– ‘‘అయ్యా నేను దాసిని. ఈ తెల్లవారు వేళ నీటికోసం ఈ నదికి రాక తప్పదు. చలి బాధను భరించకా తప్పదు. కానీ, మీరు దాసులు కారే? తమరెందుకు ఈ వేళ ఇక్కడికి వచ్చారు? ఈ నీట్లో దిగి ఇలా వడ వడ వణికిపోతున్నారు?’’ అని అడిగింది. ‘‘మల్లీ! నీకు ఆమాత్రం తెలియదా? ఈ జలం పవిత్రమైనది. దీనిలో స్నానం చేస్తే ఎప్పటి పాపాలు అప్పుడు కొట్టుకుపోతాయి. ఈ నీట్లో దిగి మూడు మునకలు వేస్తే సరి. చేసిన దోషాలన్నీ హరించుకుపోయి, పుణ్యం పోగుపడుతుంది. ఆ మాత్రం తెలియని అజ్ఞానివి’’ అంటూ మునిగి లేచాడు. మల్లిక నడుమున ఉన్న నీటి కడవను సరిచేసుకుని – ‘‘అయ్యా! నిజమా! నీటిలో మునిగితేనే పాపాలు హరించుకుపోతాయా?’’ అంది అమాయకంగా! ‘‘అవును మల్లికా! ఇది శాస్త్రం’’ అన్నాడు. ‘‘అయితే స్వామీ! మీ కంటే ఎప్పుడూ ఈ నీటిలోనే ఉండే కప్పలు, చేపలు, పీతలు, జలగలు ఎంతో పుణ్యశాలురన్నమాట. మూడు మునకలకే మీకు పుణ్యం పోగుపడితే.. నిరంతరం మునకలేసే అవి ఎంతటి పుణ్యాన్ని పోగుపెట్టుకుని ఉంటాయి? అవును లెండీ, మీకంటే కప్పలే గొప్ప’’ అంటూ నవ్వుతూ మెట్లెక్కి వెళ్ళిపోయింది. తనకు చిత్తశుద్ధి లేదని తెలియ చెప్పడానికే మల్లి అలా వ్యంగ్యంగా మాట్లాడిందని పండితుడు గ్రహించాడు. శారీరక శుద్ధి కంటే ఆంతరంగిక శుద్ధే గౌరవాన్ని తెచ్చిపెడుతుందని తెలుసుకున్నాడు. ఆంతరంగిక శుద్ధి జరగాలంటే బుద్ధుని బోధనలే శరణు అని బుద్ధుణ్ణి శరణు వేడాడు. ఆ తరువాత గొప్ప పండితునిగా... శీలవంతునిగా కీర్తిగాంచాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
వైద్యుడా.. వందనం.. డాక్టర్స్ డే వెనుక చరిత్ర ఇదే
ఆరోగ్యమే మహాభాగ్యమంటారు. మనిషికి ఎంత సంపద ఉన్నా దాన్ని అనుభవించే ఆరోగ్యం లేకపోతే అదంతా వృథాయే. అనారోగ్యంతో బాధపడే వారిని ప్రమాద స్థితి నుంచి కాపాడే శక్తి కేవలం వైద్యునికే ఉంది. అందుకే ప్రజలు వైద్యుడిని సాక్షాత్తు దేవుడిగా భావిస్తారు. ప్రాణాలు నిలిపినందుకు అతడిని దేవుడే అంటూ ప్రజలు దండాలు పెడతారు. పవిత్రమైన ఈ వృత్తిలో రాణిస్తూ విశేష సేవలు అందించే వైద్యులు చరిత్రలో నిలిచిపోతారు. నేడు వైద్యుల దినోత్సవం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. చదవండి: చింత చిగురు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? కడప కల్చరల్(వైఎస్సార్ జిల్లా): బెంగాల్‌కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ బిదన్ చంద్రారాయ్ సంస్మరణగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని దేశమంతటా నిర్వహిస్తున్నారు. ఆదర్శ వైద్యుడిగా ఆయనకుగల ఖ్యాతిని యేటా ఆయన జన్మదినం నాడు డాక్టర్స్ డేగా నిర్వహిస్తూ ఇతర వైద్యులు స్ఫూర్తి పొందేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బిదన్ చంద్రారాయ్ బెంగాల్ ముఖ్యమంత్రిగా కూడా సేవలు అందించారు. ఆయన 1882 జులై 1వ తేదిన జన్మించారు. 1962 జులై 1నే కన్నుమూశారు. 1991 నుంచి ఆయన సంస్మరణగా వైద్య లోకం డాక్టర్స్ డే నిర్వహిస్తోంది. పవిత్రమైన వృత్తి సమాజంలో అత్యంత పవిత్రమైన, కీలకమైన వృత్తి వైద్యం. ఆపద సమయంలో ప్రజలందరికీ ఆపద్బాం«ధవుడిలా కనిపించే వైద్యులను ప్రజలు ఎంతగానో గౌరవిస్తారు. సాక్షాత్తు దేవుడులాంటివాడివంటూ హృదయ పూర్వకంగా నమస్కారం చేస్తారు. అందుకే ఆయనను ‘వైద్యో నారాయణో హరి’ అంటూ గౌరవిస్తారు. అందుకే ఈ వృత్తికి సమాజంలో ప్రథమస్థానం ఉంది. తల్లిదండ్రుల్లో ఎక్కువ మంది తమ పిల్లలను డాక్టర్ కమ్మని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇతరుల ప్రాణాలు నిలిపే అవకాశం డాక్టర్ వృత్తికి మాత్రమే ఉండడంతోపాటు ప్రస్తుత సమాజంలో ఆశించే ధనం కూడా ఈ వృత్తిలో పుష్కలంగా లభిస్తుంది. గనుక వైద్య వృత్తికి అంతటి డిమాండ్ ఉంది. పెరుగుతున్న కాలానికి అనుగుణంగా వైద్యుల సంఖ్య, మెడికల్ కళాశాలల సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఉంది. దీన్ని గుర్తించి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కళాశాలను ప్రకటించింది. ఈ ప్రణాళిక సాకారమైతే రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ వైద్యుల కొరత ఉండదు. దేవ వైద్యుడు మానవులకే కాకుండా దేవతలకు కూడా వైద్యుడు ఉన్నాడు. ఆయనే ధన్వంతరి. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పుష్పగిరిలోని శ్రీ వైద్యనాథస్వామి ఆలయంలో మూల విరాట్ ఎదురుగా గోడపై ధన్వంతరి కుడ్య శిల్పం ఉంది. పురాణాలు ఆయనను దేవతల వైద్యునిగా పేర్కొంటున్నాయి. అందుకే ఈ దేవాలయంలోని శివునికి వైద్య నాథుడు అని పేరొచ్చింది. ఒకప్పుడు దేవాలయాలే వైద్యాలయాలుగా కూడా సేవలు అందించేవి. చుట్టుపక్కలగల అడవుల్లో లభించే ఆకులు, గరుడు, వేర్లు తదితరాలను ఆలయాల అరుగులపై గుండ్రాళ్లతో మెత్తగా నూరేవారు. ఆ పసర్లతో స్థానికులకు వైద్యం చేసేవారని, అందుకు నిదర్శనంగా జిల్లాలోని పలు దేవాలయాల అరుగులపై నేటికీ మందులు నూరిన గుర్తుగా కల్వాలు (అరుగులపై మందును నూరిన గుర్తులు) కనిపిస్తాయి. పుష్పగిరిలోని వైద్య నాథస్వామి ఆలయానికి అప్పట్లో జిల్లా నలుమూలల నుంచి రోగులు వచ్చి వైద్య సేవలు పొందేవారని తెలుస్తోంది. చరిత్రలో జిల్లాను బ్రిటీషు వారు పాలించే రోజుల్లో కడప నగరంలో హకీం మంజుమియాకు మంచి వైద్యునిగా పేరుంది. యునాని వైద్యునిగా ఆయన ఎంతో విశిష్ఠత సాధించారు. దేశం నలుమూలల నుంచి ప్రజలు వైద్యం పొందేందుకు ఆయన వద్దకు వచ్చేవారు. ప్రస్తుతం కడప నగరంలోని సిండికేట్బ్యాంకు ఉన్నచోట ఆయన వైద్యశాల ఉండేదని, పేదల వద్ద ఎలాంటి రుసుము తీసుకోకుండా మందులు కూడా ఉచితంగా ఇచ్చేవారని తెలుస్తోంది. ఎందరో నవాబులు, రాజులు తమ సంస్థానానికి వస్తే పెద్ద ఎత్తున ధనం, గౌరవం ఇస్తామని ఆశ పెట్టినా ఆయన కడపలోని పేదలకు వైద్య సేవలు అందించాలని ఇక్కడే ఉండిపోయారు. ఆయన ప్రతిభ గురించి ఎన్నో విశేషమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. రోగి స్వయంగా రాలేకపోయినా వారి తల వెంట్రుకగానీ, గోరుగానీ చూపితే వ్యాధి నిర్ధారణ చేసి రోగాలు నయం చేసేవారని ప్రచారంలో ఉంది. ముఖం చూసిన వెంటనే వ్యాధి ఏమిటో చెప్పగలిగే వారని కూడా ఆయనకు పేరుంది. డాక్టర్ల వీధి కడప నగరం క్రిస్టియన్లేన్కు డాక్టర్ల వీధిగా పేరుంది. దాదాపు వంద మీటర్ల పొడవు గల ఆ వీధిలో ఒక్కటంటే ఒక్కటి కూడా నివాస గృహం లేదంటే అతిశయోక్తి కాదు. రోడ్డుకు ఇరువైపుల దాదాపు అన్ని వైద్యశాలలే. అవిగాక స్కానింగ్ సెంటర్లు, ల్యాబోరేటరీలు, అడుగడుగునా మందుల దుకాణాలు ఉన్నాయి. తెలుగునాట ఇలాంటి వీధి మరేది లేదంటారు. -
స్వయం శిక్షణ
నేడు మారుతున్న కాలానికనుగుణంగా పురోభివృద్ధితో పాటు సమాజంలో పగ, వైరం, ద్వేషం, అసూయ, అల్పబుద్ధి, హింస పెరిగి పోతున్నాయి. నైతిక స్వభావంలో లోపం ఏర్పడడం వల్లనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అభ్యుదయాత్మకమైన మనోవైఖరి అలవరచుకుంటే అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చన్న విషయాన్ని అవగతం చేసుకోవాలి. నిశ్చయాత్మకంగా ఉండే లక్షణం అలవడినపుడు కష్టాలు ఎదురైనా మనస్సు అదుపు తప్పదు. ఈ క్రమంలో... పరిస్థితులకు భయపడని వాడు తనకు తాను మిత్రుడవుతాడు. స్వయంశిక్షణ అంటే తన ఆలోచనలను, తన అధీనంలో ఉంచుకోవడం. ఇది ఒక వ్యక్తికి నిశ్చయాత్మకంగా ఆలోచించే శక్తినిస్తుంది. స్వయంశిక్షణ మనస్సును అన్ని రకాలైన బలహీనతల నుంచి రక్షించి జీవితానికి ఒక ప్రత్యేక విలువనూ, యోగ్యతనూ ఇస్తుంది. నైతిక ప్రమాణాలను విశ్వాసంతో క్రమబద్ధంగా అనుష్టించడం ద్వారా విశ్వాసం పెరిగి పరిణితి లభిస్తుంది. ఈ విశ్వాసం పెరగాలంటే క్రమశిక్షణ అనేది అత్యంత ఆవశ్యకమని గుర్తెరగాలి. క్రమశిక్షణ అనేది ఏదో కొన్ని విషయాలల్లో కాకుండా అన్నింటిలోనూ అలవరచుకోవాలి. ఒక ఇనుప కడ్డీని అయస్కాంతంగా మారిస్తే, అది దాని బరువు కన్నా 12 రెట్లు అధికంగా ఉన్న బరువును ఎత్తగలదు. అయితే అది దాని అయస్కాంత శక్తిని కోల్పోతే మాత్రం ఒక చిన్న గుండు సూదిని కూడా ఎత్తలేదు. మనిషి మనస్సు కూడా అంతే. నిశ్చయాత్మకంగా, నిర్మలంగా, నిలకడగా ఉంటే మనిషి పరిస్థితులను తన అ«ధీనంలో ఉంచుకుని అద్భుతాలు చెయ్యగలడు. ప్రపంచంలోని గొప్ప గొప్ప వారందరికీ గుర్తింపు రావడానికి కారణం వ్యతిరేక భావాలను అధిగమించే శక్తి. నిశ్చయాత్మకంగా ఉండడమేనని, వారు తమ మనస్సును నిశ్చయాత్మక భావనలతో నింపి ఉంచడం వల్లనే ఆ స్థాయికి వెళ్ళారని అవగతం చేసుకోవాలి. మనిషి స్వప్రయత్నం తో తనను తాను ఉద్ధరించుకోవాలని, తనను తాను కించపరచుకోకుండా ఉండాలని భగవద్గీతలో కృష్ణపరమాత్మ అర్జునుడికి తెలియ చేశాడు. మనిషి తనకు తానే శత్రువు, అలాగే, తనకు తానే మిత్రుడు కూడా. ప్రపంచం పట్ల, తమ పట్ల సానుకూలమైన, నిర్మాణాత్మకమైన, నిర్మలమైన స్నేహ వైఖరిని అలవరచుకుని తమకు తామే మిత్రులవ్వాలి. వ్యతిరేక భావాలతో వ్యతిరేక చర్యలు చేపట్టేవారికి బతుకు వ్యర్థం అవుతుంది. దీనికి మన నిత్య జీవితంలో కనిపించే చీమలు మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. తమను ఎవరైనా ఆపినా, లేక వాటి మార్గంలో ఏదైనా అడ్డు వచ్చినా చీమలు ఆగవు. అడ్డంగా ఉన్న దాని మీదకు ఎక్కి దానిని దాటుతాయి. లేదంటే మరో మార్గంలో ముందుకు వెళతాయి. కానీ అవి ఆగవు. అంటే దీనివల్ల చేపట్టిన పని పూర్తయ్యే వరకు లక్ష్యాన్ని సాధించే వరకూ ఆగకూడదని నిగూఢం గా చీమలు మనకు తెలియ చేస్తున్నాయి. అలాగే, చీమలు వేసవి కాలంలో శీతాకాలం గురించే ఆలోచిస్తాయి. చలి కాలానికి కావల్సిన ఆహారాన్ని కూడా అవి వేసవిలోనూ సేకరిస్తాయి. అంతేకాదు రుతువుల్లోని మార్పులకు అవి అసంతృప్తి ప్రకటించవు. సముద్రపుటొడ్డున ఇసుకలో సూర్యరశ్మిలో ఆనందిస్తున్నట్టే, ఈత కొట్టడానికి దిగే ముందు సముద్రపు అడుగునుండే బండరాళ్ళ గురించి ఆలోచించాలి. అందువల్ల ఎప్పుడూ ఆచరణాత్మకంగా ఉండాలి, నిశ్చయాత్మకంగా ఆలోచించాలని తెలుసుకోవాలి. చీమ శీతాకాలం గురించి ఆలోచిస్తూనే, ఎంతోకాలం అది ఉండదని, త్వరలోనే దానినుంచి బయటపడతామని తనకి తాను సర్ది చెప్పుకుంటుంది. అలాగే మనిషి కూడా ఎల్లపుడూ కష్టాల గురించి ఆలోచించకుండా నిశ్చయాత్మకంగా ఆలోచించాలి. ఎందుకంటే చీకటి తరువాత వెలుతురు కూడా వస్తుందని గుర్తెరిగి మసలుకోవాలి. జీవితం పట్ల ఆసక్తి, నిశ్చయాత్మక మనో వైఖ రుల వల్ల ప్రతిబంధకాలను సైతం అధిగమించవచ్చు. మానవ దేహాన్ని, మనస్సును కావల్సిన విధంగా మలచుకోవచ్చు. అంకిత భావం, క్రమ శిక్షణ, ఆత్మ విశ్వాసం, నిశ్చయాత్మక మనో వైఖరి, కష్టపడి పనిచేయడం అనేవి మానవ మేధకు ప్రోత్సాహానిస్తాయి. అలాగే, అపరాధ భావం, వైరం, విచారం లాంటి వ్యతిరేక భావాల్ని తొలగించుకుని ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతత, స్వయంశిక్షణ లాంటి విశిష్ట గుణాలు అభివృద్ధి చేసుకుంటే జీవితం నందనవనం అవుతుంది. అదే విధంగా ప్రతి ఒక్కరిలోనూ నమ్మశక్యం కానంతటి దక్షత, కౌశలం, దివ్యసంపద ఉన్నాయి. అయినా వాటిని చాలా మంది గుర్తించడం లేదు. అందువల్ల మన గురించి మనం స్వయంగా తెలుసుకోవడానికి మానసికంగా మనల్ని మనం శోధించి, పరిశీలించుకోవాలి. దీనివల్ల మనకు కీడు జరగదు. దీనికి కావల్సింది స్వయంశిక్షణ. గొప్ప పరిశోధనలూ, జీవితంలోని అన్ని రంగాల్లోనూ పరిపూర్ణ విజయ సాధకులకూ వెనుక ఉన్న రహస్యం ఇదే. వారంతా స్వయం శిక్షణ అలవరచుకోవడమే. ఆరోగ్యకర ఆహారాన్ని స్వీకరించడం, యోగాసనాలు, తదితర వ్యాయామాల ద్వారా శారీరక క్రమశిక్షణ అలవడుతుంది. అలాగే జీవశక్తుల్ని ప్రాణాయామం ద్వారా నియంత్రించి శ్వాస పీల్చడంలో క్రమశిక్షణను అలవరచుకోవచ్చు. వ్యర్థ ప్రసంగాలతో కాలాన్ని, శక్తిని వృథా చేయకుండా మౌనంగా ఉండడం మాటలాడడంలో క్రమశిక్షణ ను తెలుపుతుంది. అలాగే గ్రంథపఠనం ద్వారా ఆలోచనలు, భావనలు పవిత్రం చేసుకోవడం ద్వారా భావనల్లో క్రమశిక్షణ అలవడుతుంది. ప్రార్థనలు, తీవ్రమైన జప ధ్యానాలు చేయడం ద్వారా వివేచన కలిగి అంతర్గత స్వభావంలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. దారంపోగు ఒక్కటిగా ఉన్నపుడు చాలా బలహీనంగా ఉంటుంది. అయితే అలాంటి ఎన్నో దారం పోగులను కలిపి తాడుగా పేనినట్లయితే ఆ తాడు ఏనుగును కూడా బంధించగలదు. అలాగే నిశ్చయాత్మకమైన భావనలు అనే బలవర్ధకమైన నియమిత ఆహారాన్ని మన మనస్సులలోకి ఎక్కించాలి. అప్పుడే మనం యోగ్యులుగా పరిణితి చెందుతాం. వ్యతిరేక భావనల్ని అధిగమించడంలో స్వయం శిక్షణ బాగా తోడ్పడుతుంది. కష్టాలను, ఆపదలనూ ఎదుర్కొనేందుకు దృఢమైన విశ్వాసం కావాలి. ఈ విశ్వాసం ప్రోది చేసుకోవడానికి క్రమ శిక్షణ ఆ క్రమశిక్షణ ద్వారా స్వీయ శిక్షణ అలవడుతుందన్న వాస్తవాన్ని గ్రహించాలి. అలాగే, మనలో పేరుకుపోయిన వ్యతిరేక భావాల్ని సహజమైన క్రమశిక్షణ ద్వారా తొలగించడం సాధ్యమేనన్న విషయాన్ని గుర్తించి మసలుకోవాలి. – దాసరి దుర్గా ప్రసాద్ -
Good Friday Special: వెలుగు పూలు పూయించిన కలువరి సిలువ
మానవాళి రక్షణ కోసం మహోన్నతుని సిలువ యాగం మరణ భయాన్ని పటాపంచలు చేసింది. సాతాను కోరలు చీల్చి వేసింది. అంధకార బంధురమైన జీవితాల్లో వెలుగు పూలు పూయించింది. నిరీక్షణ లేని జీవితాల్లో వెలుతురు కిరణాలు ఉదయింపజేసింది. కరుణామయుని శిలువ యాగం గెత్సెమనే తోట నుంచే ప్రారంభమయింది. శుక్రవారం సిలువకు అప్పగించకముందే గెత్సెమనే తోటలో తన రక్తం స్వేదబిందువులుగా మారే వరకూ ప్రార్థనలో గడిపాడు. లోక పాపాన్నంతా తన వీపుపైన మోసేందుకు సిద్ధమయ్యాడు. ఓ తరుణంలో తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నానుండి తొలగించమని ప్రార్థించినా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేందుకే సిద్ధమయ్యాడు. ఈ లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందుటకే ఏర్పాటు చేసిన మార్గం సిలువ మార్గం. ఒకవైపు గెత్సెమనే తోటలో రాత్రంతా ప్రార్థిస్తూ మానవ సాయం కోసం తన శిష్యుల వైపు చూశాడు. శోధనలో పడకుండా మెళకువగా వుండి ప్రార్థించండి అని చెప్పినా వారు నిద్రమత్తులై ఉన్నారు. అప్పుడే తాను ప్రేమించిన శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా క్రీస్తు సిలువలో ప్రధాన పాత్రధారిగా మారి 30 వెండి నాణెములకు క్రీస్తును అప్పగించేందుకు మత పెద్దలతో ఒప్పందం కుదుర్చుకొని గెత్సెమనేలో ముద్దుపెట్టుకొని మరీ యేసును అప్పగించాడు. యేసును ఒక బందిపోటు దొంగమీదికి వచ్చినట్లు కత్తులతో వచ్చిన వారిని చూసి కనికరపడ్డాడు తప్ప ఒక్క మాటయినను పలుకలేదు. తన శిష్యులు తనను వదిలి పారిపోగా ఒంటరియైన యేసు ప్రధాన యాజకుడైన కయప వద్దకు తీసుకువచ్చి వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి, ఇష్టము వచ్చినట్టు గుద్దారు. మరికొంతమంది అర చేతులతో కొట్టి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని హేళన చేశారు. ‘తన ప్రియ కుమారుని నలుగగొట్టడానికి ఆ దేవాది దేవునికి ఇష్టమాయెను’ అన్న లేఖనాలు ఈ విధంగా నెరవేరాయి. ఉదయం యేసును బంధించి అధిపతియైన పొంతి పిలాతుకు క్రీస్తును అప్పచెప్పారు. చివరకు అన్యాయపు తీర్పే గెలిచింది. యూదా మత పెద్దలకు భయపడి పొంతి పిలాతు యేసును సిలువకు అప్పగించాడు. వారు యేసును గొల్గొతా కొండకు తీసుకు వచ్చి చేతులు, కాళ్ళలో శీలలు కొట్టి సిలువకు వేలాడదీశారు. ఇరు పక్కల ఇద్దరు బందిపోటు దొంగలను సిలువ వేశారు. ‘‘దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కడతానన్నావుగా చేతనైతే నిన్ను నీవు రక్షించుకో, నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగిరా’’ అంటూ దూషిస్తూ ‘‘వీడు ఇతరులను రక్షించెను గానీ తన్ను తాను రక్షించుకోలేడంటూ’’ అపహాస్యం ఒకపక్క, రోమా సైనికుల కాఠిన్యం మరోపక్క యేసును బాధపెట్టినా తన తండ్రి మానవుల రక్షణ కొరకు తలపెట్టిన బలియాగంలో తాను సమి«ధగా మిగిలి పోవడానికే సిద్ధపడ్డాడు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సిలువ మధ్యాహ్నం 3 గంటల వరకూ సాగింది. మిట్ట మధ్యాహ్నం ఆ ఎండ వేడికి తాళలేక యేసు మూర్ఛబోయాడు. దాహం అని అడుగగా చేదు చిరకను అందించారు. కొరడాలతో, మేకులతో ఒళ్ళంతా రక్తం ధారలుగా కారుతుండగా చనిపోయాడో లేదోనని పక్కలో బల్లెంతో పొడిచారు. ఆ సమయంలో యేసు మాటలాడిన ఏడు మాటలు ఎంతో శ్రేష్టమైనవి. తనను హింసిస్తున్న వారిని చూసి యేసు ప్రభువు ‘తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు’మంటూ చేసిన ప్రార్థన నభూతో న భవిష్యతిగా చెప్పుకుంటారు. మనలను హింసించే వారి కోసం ప్రార్థించాలి అన్న యేసు సిలువలో తనను చంపుతున్న వారి కోసం చేసిన ప్రార్థన అది సాధ్యమే అని నిరూపించాడు. తనతోపాటు సిలువ వేయబడిన కుడివైపు దొంగ, ‘ప్రభువా నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకోవాలి’ అంటే ఆ క్షణంలో రక్షణను అనుగ్రహించి నీవు నేడు నాతో కూడా పరదైసులో ఉందువు అని అభయమొసంగిన జాలిగల ప్రభువు. విశ్వాసంతో ప్రార్థిస్తే ఎటువంటి వారికైనా రక్షణ భాగ్యం దొరుకుతుందన్న ఆశావాదాన్ని కలిగించాడు. క్రీస్తు సిలువ మార్గం, ముక్తి మార్గం పాపంలో నశించిపోతున్న మానవాళి ముక్తి కొరకు ఒక మంచి గొర్రెల కాపరిగా తాను ప్రేమించి గొర్రెల కోసం తన ప్రాణాన్ని కలువరిపై ధారపోసి మరణ భయంతో ఉన్నవారికి నిత్యజీవం అనే వెలుగును ప్రసాదించాడు క్రీస్తు.. రెండు వేల సంవత్సరాలైనా ఆ వెలుగు పూలు అందరి మదిలో వెలుగుతూనే ఉన్నాయి. – బ్రదర్ బందెల స్టెర్జిరాజన్ -
ఆ స్ఫూర్తిని మర్చిపోతున్నామా?
చరిత్రలోని అతి గొప్ప సంఘటనలన్నీ మౌనంలోంచే పుట్టుకొచ్చాయి. తిరిగి అవి నిశ్శబ్దంగా వెనక్కు వెళ్లిపోతున్నాయి. ఒక శతాబ్దం క్రితం అంటే 1920–21లో జరిగిన, చరిత్రను మలుపుతిప్పిన అనేక ఘటనలను ఈ 2021 ఆగస్ట్ నెల మళ్లీ అందరికీ గుర్తు చేస్తోంది. భారతీయ చరిత్రలోని ఆ విశిష్ట దశ అనేక ఘటనల కూర్పుతో నిండి ఉంది. వీటిలో కొన్నింటికి ఈనాటికీ ప్రాధాన్యం ఉండగా, మరికొన్ని తమ విశిష్టతను కోల్పోతున్నాయి. పైగా ఒక వైవిధ్యపూరితమైన సమాజంగా మనుగడ సాధించడం అనే భావనకు ఇప్పటికీ దేశం పూర్తిగా సిద్ధం కాలేదు. అదే సంవత్సరం జమ్షెడ్పూర్లో టాటా స్టీల్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ స్థాపన భారతీయ పారిశ్రామిక నగరీకరణ శకం ప్రారంభాన్ని నిర్వచించింది. నాగరికతా సంస్కృతికి ఉక్కు వెన్నెముకగా ఉంటూ వస్తోంది. 1921లో కోహినూర్ ఫిల్మ్ కంపెనీ కోసం కనాజీభాయ్ రాథోడ్ తీసిన భక్త విదుర్ సినిమాపై నిషేధం ఎంత గొప్ప జ్ఞాపకంగా ఉంటోందో.. అదేరకంగా బాబూరావ్ పెయింటర్ తీసిన సురేఖా హరణ్ సినిమాలో వి. శాంతారాం కీలక పాత్ర పోషిస్తూ నటనా జీవితంలోకి అడుగుపెట్టడం కూడా మర్చిపోని జ్ఞాపకమే.. జాతి అనే చారిత్రక ఆకాంక్షకు ప్రాతినిధ్యం వహించడంలో, భారత్ అనే సామూహిక భావనలోంచి పుట్టుకొచ్చిన సెల్యులాయిడ్ స్వప్నాలను దేని తోనూ పోల్చి చూడలేం. జాతీయ ఆకాంక్షను ముందుకు తీసుకుపోవడానికి రెండు మూకీ చిత్రాలు కూడా ఆ సంవత్సరమే ప్రారంభమయ్యాయి. ఈ రెండు సినిమాలు ఏకకాలంలోనే దేశాన్ని అటు కాల్ప నికత వైపు, ఆధునికతవైపు తీసుకుపోయాయి. వీటికి మించిన గొప్ప ఘటన డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్ తీసుకొచ్చిన ‘మూక్‌నాయక్’ పత్రిక. ప్రగతిశీలుడైన కొల్హాపూర్ రాజు సాహు అందించిన ఆర్థిక సహాయంతో ఈ ప్రచురణ వెలుగులోకి వచ్చింది. దళితులు రాసిన కథనాలను ప్రచురించడానికి ఆనాడు ప్రముఖ దినపత్రికలు ఏవీ సుముఖత చూపకపోవడంతో మూక్ నాయక్ ఒక ప్రత్యామ్నాయ మీడియాగా వచ్చింది. ఇది కొద్దికాలం మాత్రమే నడిచినా, అణగారిన వర్గాల హక్కుల పోరాటానికి ఇది నాంది పలికింది. నిశ్శబ్దంగా మొదలైన మరొక మూడు ఘటనలను కూడా ఈ సందర్భంగా పేర్కొనాలి. పరివర్తనా స్థలంగా ఆశ్రమ జీవితం అనే ప్రాచీన భారతీయ భావనను ఇవి వెలుగులోకి తీసుకొచ్చాయి. వేదకాలపు రుషులను మళ్లీ గుర్తుకు తెచ్చే ఈ ముగ్గురు విశిష్ట వ్యక్తులను ప్రపంచం గురుదేవ్, మహాత్మా, మహర్షి అని గుర్తించింది. వారు ఎవరో కాదు. రవీంద్రనాథ్ టాగూర్ (1861–1941), ఎం.కె. గాంధీ (1869–1947), అరబిందో ఘోష్ (1872–1950). వీరిలో చిన్నవాడు ఘోష్. 1947కి 75 సంవత్సరాల ముందు జన్మించిన ఘోష్ బెంగాల్ విభజన తర్వాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేక పోరాటంలో కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలో రాజద్రోహ ఆరోపణలకు గురై సంవత్సరం పాటు జైలుశిక్షను అనుభవించారు. అనంతరం భారతీయ తత్వశాస్త్రంలోని పలు ప్రాపంచిక దృక్పథాలను పునర్నిర్వచిం చడం వైపుగా తన శక్తియుక్తులను మళ్లించారు. పాండిచ్చేరికి తరలి వెళ్లాక, సంప్రదాయాలకు కొత్త భాష్యం చెబుతూ అసమాన శక్తితో వ్యాసాలు రాశారు. ఉనికిలో ఉన్న ప్రతి సంప్రదాయాన్ని ప్రశ్నిస్తూ అతిగొప్ప తాత్విక రచనలను సృష్టిం చారు. ఆయన వ్యాసాలు తొలుత తాను ప్రారంభించిన ‘ఆర్య’ పత్రికలో ప్రచురితమయ్యాయి. ఆ తర్వాత ది డివైన్ లైఫ్, ది సింథసిస్ ఆఫ్ యోగా, ఎస్సేస్ ఆన్ ది గీతా, ది సీక్రెట్స్ ఆఫ్ ది వేదా, హైమ్స్ టు ది మిస్టిక్ ఫైర్, ది రినైజాన్స్ ఆఫ్ ఇండియా, ది హ్యూమన్ సైకిల్ అండ్ ఫ్యూచర్ పోయెట్రీ వంటి పుస్తకాలు రాసి ప్రచురించారు. తన తాత్విక రచనా కృషి అద్భుతంగా కొనసాగుతుండగా 1920లో ఘోష్, ఆర్య పత్రిక ప్రచురణను నిలిపివేశారు. ఉత్కృష్టమైన ధ్యాన యోగ మహాకావ్యం ‘సావిత్రి’పై కేంద్రీకరించేందుకు తన రచనా కృషిని మొత్తంగా నిలిపివేశారు. తర్వాత మూడు దశాబ్దాల తన జీవితాన్ని మానవ జాతి మహా పరివర్తన కోసం, తన యోగ కృషి ద్వారా భూమ్మీదికి అత్యున్నత చైతన్యాన్ని తీసుకు రావడానికి అంకితం చేశారు. ఈ త్రిమూర్తులలో పెద్దవాడైన రవీంద్రనాథ్ టాగూర్ 1921 నాటికి నోబెల్ అవార్డు కూడా పొందారు. ప్రపంచమంతటా రుషిలాగా కీర్తిపొందిన టాగూర్ 1921లోనే విశ్వభారతి విద్యా సంస్థను ప్రారంభించారు. విశ్వమానవ భావనను పెంపొందించే లక్ష్యంతో నేర్చుకునే, సృజనాత్మక కృషిని సాగించే మౌలిక సంస్థ విశ్వభారతి. ఘోష్ లాగే టాగూర్ కూడా ఒక వర్గం మనుషులకోసం, ఒకే జాతి కోసం కాకుండా యావత్ ప్రపంచాన్ని పరిరక్షించేందుకోసం జీవి తాన్నే ప్రయోగశాలగా మార్చుకున్నారు. అయితే గాంధీ ప్రయత్నిం చిన ఆత్మ పరివర్తన మరింత మౌలికమైనది. 1920 ఆగస్టులో తిలక్ మృతితో లాల్ బాల్ పాల్ (లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్) శకం ముగిసిపోయింది. ఆ శూన్యంలోకి ఎం.కె. గాంధీ ఒక శతఘ్నిలా దూసుకొచ్చారు. దేశవ్యాప్తంగా పర్యటనలు చేసి కాంగ్రెస్‌లోని వేరువేరు బృందాలను ఒకటి చేశారు. ముస్లింలు, హిందువులు, క్రైస్తవులను భాగం చేసి సేవా దళ్ ఏర్పర్చి జాతీయ స్వాతంత్య్ర పోరాటంలో యువతకు ప్రేరణగా నిలిచారు. 1920 అక్టోబర్‌లో గాంధీ గుజరాత్ విద్యాపీఠాన్ని నెలకొల్పారు. ఇది కమ్యూనిటీ శ్రమజీవుల విశ్వవిద్యాలయం. ఇక 1921 డిసెంబర్లో కలకత్తా సమావేశాల్లో కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతను చేపట్టారు. తర్వాత జరిగిందంతా చరిత్రే. భారత్‌లో గాంధీ ఆశ్రమం తొలి సంవత్సరాలు సాదాసీదాగా మొదలయ్యాయి. ప్రారంభంలో కొచార్బ్లో ఒక ఆశ్రమాన్ని ఏర్పర్చారు. తర్వాత అహ్మదాబాద్ నగరానికి సమీపంలో సబర్మతి నది ఒడ్డుకు దాన్ని మార్చారు. మొదట్లో దీనికి సత్యాగ్రహ ఆశ్రమం అని పేరు పెట్టారు. నది ఒడ్డున ఏర్పర్చిన ఈ ఆశ్రమం తర్వాత సబర్మతి ఆశ్రమంగా పేరొందింది. ఒక దశాబ్దం తర్వాత దండికి మహాత్ముడు తలపెట్టిన పాదయాత్ర బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదలించివేసింది. సబర్మతి ఆశ్రమ వాతావరణం, అక్కడ పాటించిన సిద్ధాంతాలు, నిరాడంబరత్వానికి మహా త్ముడి జీవితమే కీలక శక్తిగా పనిచేసింది. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకున్నా లేదా విస్మరించినా సరే ఈ మూడు ఆశ్రమాల విశిష్ట గాథలు భారత చరిత్రలోనే అత్యంత కీలక అంశాలుగా ఉంటున్నాయి. అయితే 2021లో సబర్మతి ఆశ్రమాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక ఆకర్షణగా మార్చడం రూపంలో అది పెను ప్రమాదాన్ని ఎదుర్కొం టోంది. దీని కోసం ప్రభుత్వం రూ. 1200 కోట్ల మొత్తాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలో వివాదాస్పదమైన సెంట్రల్ విస్టా నిర్మాణాన్ని చేపట్టిన సంస్థే సబర్మతి ఆశ్రమ శిబిరాన్ని ఆధునీకరించే బాధ్యతలు చేపట్టింది. గాంధీ అసాధారణమైన నిరాడంబరత్వం ద్వారానే ప్రపంచంలోనే అత్యంత విశిష్టమూర్తిగా నిలిచి ఉంటున్నారు. ఆయన నిర్మించిన ఆశ్రమం వద్ద ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపాదించిన వీఐపీ గెస్ట్ హౌస్, ఆడిటోరియం వంటివి గాంధీని, ఆయన నిరాడంబరత్వాన్ని మనం మర్చిపోయేలా చేస్తాయి. సబర్మతి ఆశ్రమ ఆధునీకరణ పథకాలు గాంధీ ఆదర్శాలను గుర్తుకు తీసుకురావడం కాకుండా వాటిని అందరూ మర్చిపోయేలా చేస్తున్నాయి. మన స్వాతంత్య్ర పోరాటాన్ని, టాగూర్ ప్రవచించిన బౌద్ధిక స్వాతంత్య్రాన్ని, అరబిందో ఘోష్ దార్శనికత ప్రబోధించిన ఆధ్యాత్మిక స్వాతంత్య్రాన్ని మొత్తంగా మర్చిపోవాలంటూ తన సమాచార ఫ్యాక్టరీల ద్వారా మనకు చెప్పడంలో క్షణం తీరిక లేకుండా ఉంటున్న ప్రస్తుత పాలనా వ్యవస్థ నుంచి ఇంతకు మించి మనం ఆశించేది ఏమీ ఉండదు. జీఎన్ డెవీ వ్యాసకర్త సాహితీ విమర్శకుడు, సాంస్కృతిక కార్యకర్త -
మనిషి మనీషిగా మారాలంటే..?
►నడక మన శరీరానికి చక్కని ఆకృతినిస్తుంది. గుండె, ఊపిరితిత్తుల పని సక్రమంగా ఉండేటట్టు చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మరి నడత? ►నడత మనిషికి చక్కని శీలసంపదనిస్తుంది. మంచి శీలమంటే సుగుణాలరాశి. ఇది చక్కని వ్యక్తిత్వాన్ని ప్రోదిచేస్తుంది. ఆ సంపద నివ్వటంలో తల్లిదండ్రుల, గురువులు, పెద్దల పాత్ర ఎంతో అమూల్యమైనది. ►ఎదుటివారితో ప్రేమగా మాట్లాడటం , అసహాయులు, బాధా సర్పదస్టుల మీద కరుణ కలిగి ఉండటం, నిజాయితీగా ఉండటం, చేసే పని లేదా వృత్తిలో నిబద్ధత, ధర్మచింతన, సమదృష్టి, సంస్కారయుతంగా నడచుకోవటం.. ఇత్యాది విషయాలు మనిషిలో ఉండే సహజ లక్షణాలు. నిషి పక్షిలా ఆకాశంలో ఎగరగలడు, నీటి అడుగునా ఈదగలడు. భూమిని తొలిచే శక్తి ఉన్నవాడు. భూమి మీద నడవగలిగితే ఈ రోజు ప్రపంచమే స్వర్గమవుతుంది’ అన్నాడు టామి డగ్లస్ అనే కెనడా దేశపు తత్వవేత్త.ఎంత అర్థవంతమైన మాటలు! ఎంత లోతుగా ఆలోచింపచేస్తున్నాయి!! చిత్తశుద్ధితో ఆత్మశోధన చేసుకోమనటం లేదూ!!! మనిషి శక్తి సామర్థ్యాలను, మనిషికున్న పెద్ద లోపాన్ని ఎత్తిచూపుతున్నాయి ఈ మాటలు.తమ ప్రవర్తనను పరిశీలించుకుని, మదింపు చేసుకుని దానిలోని మంచి చెడులను తెలుసుకుని చెడును పరిహరించుకోవలసిన ఆవశ్యకతను సూచిస్తున్నాయి. మనిషి విస్మరిస్తున్న బాధ్యతను గుర్తుచేస్తున్నాయి. మనిషి మనిషిగా ఉండటం చాలా కష్టమన్న ఓ కవి మాటల్ని రుజువు చేస్తున్నాయి. ఆ విషయాన్ని సుస్పష్టం చేస్తూ మనిషిని అప్రమత్తుణ్ణి చేస్తున్నాయి. ఇక్కడ నడవడమంటే మనిషి నడుచుకునే తీరు అని అర్ధం. అంటే ప్రవర్తన. దీనిలో అనేక అంశాలు... మనం ఇతరులతో మాట్లాడే పద్ధతి, నలుగురిలో మసలే తీరు, ఎదుటి వారి గురించి మనం చేసే ఆలోచనలు, సభ లో మనం నడుచుకునే విధానం, వివాహాది సందర్భాలలో మనముండే పద్ధతి... ఇమిడి ఉన్నాయి. మన ముఖకవళికలు, కనుబొమ ల కదలికలు, నేత్రద్వయ విన్యాసం, కరచరణాల అభినయం మన ఆలోచనా పోకడకు, మనసుకు చిత్తరువులవుతాయి. ఇవే మన నడతకు భాష్యం చెపుతాయి. మన వ్యక్తిత్వాన్ని ఇతరులకు స్ఫురింపచేస్తాయి. మనకు సమా జంలో ఒకగౌరవాన్ని, హుందాతనాన్ని తేవచ్చు లేదా అవి పోయేటట్టు చెయ్యచ్చు. మనలోని భావోద్వేగాలు అక్షరాకృతిని పొంది శబ్దరూపం దాల్చటానికి ముందే మన హావభావాలు, ఆంగికవిన్యాసం మన నడవడిని ఎదుటివారికి చూపిస్తాయి. మనమేమిటో చెప్పేస్తాయి. మనం ఒకరిని నోరారా ప్రేమతో పిలిచినా, ఆ పిలుపు అదే భావనలో వారికి చేరాలంటే వాటికి హావభావాలు తోడవ్వాలి. అప్పుడే వాటి మధ్య ఒక సమన్వయం ఏర్పడుతుంది. లేకపోతే, నోటితో పలకరిస్తూ నొసటితో వెక్కిరించటమే అవుతుంది. ఇదీ ప్రవర్తనలో అంతర్భాగమే. అందుకనే మన మాటలను, వాటిని ముందుగానే సూచించే శారీరక సంకేతాలమీద, ముద్రల మీద కూడ మనకు నియంత్రణ కావాలి. అది కష్టసాధ్యమే కాని, అసాధ్యమేమి కాదు. అపుడే ఇతరులను నొప్పించకుండా మనగలం. దీనికోసం ప్రయత్నం చేయాలి. మన మాటలతో కాని, చేతలతో కాని ఎదుటివారిని బాధ పెట్టకూడదు. ‘ఒరులేయవి యొనరించిన...’ అన్న శ్లోక సారాంశమిదే. ఇటువంటి వర్తనను అలవరుచుకోగలిగితే మన సంబంధ బాంధవ్యాలు హాయిగా, ఆనందంగా సాగిపోతాయి.నడక మన శరీరానికి చక్కని ఆకృతినిస్తుంది. గుండె, ఊపిరితిత్తుల పని సక్రమంగా ఉండేటట్టు చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మరి నడత?మనిషికి చక్కని శీలసంపదనిస్తుంది. మంచి శీలమంటే సుగుణాలరాశి. ఇది చక్కని వ్యక్తిత్వాన్ని ప్రోది చేస్తుంది. ఆ సంపద నివ్వటం లో తల్లిదండ్రుల, గురువులు, పెద్దల పాత్ర ఎంతో అమూల్యమైనది.ఎదుటివారితో ప్రేమగా మాట్లాడటం, అసహాయుల, బాధా సర్పదస్టుల మీద కరుణ కలిగి ఉండటం, నిజాయితీగా ఉండటం, చేసే పని లేదా వృత్తిలో నిబద్ధత, ధర్మచింతన, సమదృష్టి, సంస్కారయుతంగా నడచుకోవటం.. ఇత్యాది విషయాలు మనిషిలో ఉండే సహజ లక్షణాలు. వీటిని గొప్ప విషయాలుగా భావిస్తాం. వీటి గురించి చర్చించడం వల్ల ఉపయోగమే లేదు. ఈ అంతర్గత శక్తులు లేదా సుగుణాలను మనం అలవాటు చేసుకోవాలి. మన జీవితంలో ఆచరించగలగాలి. అంటే త్రికరణ శుద్ధి అవసరం. అలా ఆచరించిన వారినే శీలసంపన్నులంటాం. కొన్ని వేలమాటలకు దక్కని ఫలితం, విలువ ఆచరణ వల్ల వస్తుంది. అపుడే ఆ సుగుణాలు మరింతగా శోభిస్తాయి. మనిషికి మంచి నడత చాలా ముఖ్యం. అందుకే అది అంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒక వంటపదార్ధపు రుచి దాని గురించి ఎంతగా మాట్లాడినా, వివరించినా తెలియదు. దాన్ని రుచి చూసినపుడే తెలుస్తుంది. అదే బోధనకు, ఆచరణకు ఉన్న భేదం. అటువంటి వారినే సమాజం గౌరవిస్తుంది. వారే ఆదర్శప్రాయులు. ప్రాతః స్మరణీయులు. వారే మార్గదర్శకులు అవుతారు. మంచి నడత గలవారి మాటలకు ఎనలేని శక్తి వస్తుంది. వారే ఎందరినో ప్రభావితం చెయ్యగలరు. సన్మార్గం చూపించగలరు.టామి డగ్లస్ చెప్పిన మాటల సారమిదే. మనిషి తనలోని శక్తులను మేల్కొలపాలి. నడతకున్న ప్రాముఖ్యతను గుర్తెరగాలి. అదే తనను మంచి మార్గంలో నడిపించగల శక్తి అని తెలుసుకోవాలి. మనిషిని మనీషిగా మార్చే శక్తి నడతే. అపుడు అందరిలోనూ, అంతటా ఆనందమే. – బొడ్డపాటి చంద్రశేఖర్ ఆంగ్లోపన్యాసకులు -
మానవీయ సమాజం కోసమే... ‘ఆద్యకళ’
కళ నేటి మనిషికి విశ్రాంతే కాదు, నిన్నటి మానవుడి చరిత్ర కూడా. చరిత్ర పట్ల ఆసక్తిలేని భారతీయులకు కళల చరిత్ర గురించి ఆసక్తి లేకపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ, భిన్న సమాజాలు సహజీవనం చేసే దేశంలో సమతను సాధించా లంటే భిన్నత్వాన్ని కాపాడుకోవాలి. ఆధిపత్య వర్గాల వెలి వేతకు, పీడనకు గురవుతున్న బాధిత సమూహాల సాంస్కృతిక జీవనం చరిత్ర పొడవునా ధ్వంసమైంది. రాజాస్థానాలను ఆశ్రయించి, మతం నీడలో బతికిన కళలకు నేటికీ అదే ఆదరణ దక్కుతోంది. కానీ, ఉత్పత్తి కులాల కళలు కొన్ని శతాబ్దాలు బతికి బట్టకట్టినా ఇక బతికే పరిస్థితులు లేవు. ఉత్పత్తిలో భాగమైన మనిషి పనిముట్లను ఎట్లా సృష్టిం చాడో అట్లనే ఉత్పత్తి సంబంధాల్లోని ప్రేమానురాగాల్ని చాటు కోవడానికి అనురాగాల పల్లవి అల్లుకున్నాడు. ఆ పల్లవికి రాగాలు పలికే నాదాలు తయారు చేసిండు. పాటతోపాటే ఆటలోకీ అడుగుపెట్టిన మనిషి తాళగతులను నేర్చాడు. చరిత్రలో మానవ సమూహాలు ఎన్ని దారులగుండా నడిచొ చ్చాయో అన్ని వాద్యాలను మోసుకుంటూ ఇక్కడికి వచ్చాయి. ఆ తాళగతులు మనిషి ఆత్మను ప్రతిబింబిస్తే, ఆ కాలపు సమూహాల చరిత్రను వాద్యాలు గుర్తుచేస్తాయి. విశ్వకర్మలు వెయ్యేళ్ల కిందనే ‘రుంజ’ను గఢగఢ మోగించినట్లు సాహిత్య చరిత్ర చెబుతోంది. నాయకపోడు ఆదివాసీల ‘మూగడోలు’, బైండ్లవారు వాయించే ‘జమిడిక’, రాజన్నలు వాయించే ‘చామల్లాలి’, డమడమ మోగే మాదిగ ‘డప్పు’, ఆఫ్రికానుంచి వలసొచ్చిన సిద్దీల ‘మర్ఫా’, కోయల డోలు, చెంచుల ‘జేగంటలు’, గొత్తికోయ మహిళల ‘గుజ్జిడి మొగ్గలు’ సంగీ తంలోని వైవిధ్యాన్నే కాదు, సామాజిక కూర్పులోని వైవిధ్యాన్ని ఎరుకజేస్తాయి. ఈ కళలు మానవ సమాజ వికాసాన్ని చెప్పే పాఠాలు. జానపదుల కళలు అంతరించడమంటే మనిషి అంత రించిపోవడమే. దేవర కొలుపు, పెండ్లి, చావు, సమావేశం డప్పు మోగకుండా మొదలుకాలేదు. యుద్ధబేరీలు మోగించిన చరిత్ర సంగీతానిది. ఉత్పత్తి సంబంధాలు బలహీనపడిన ప్పుడు మానవ సంబంధాలు యాంత్రికమయ్యాయి. ఆ యాంత్రికతలో ఆటపాటలు తగ్గిపోయాయి. సంగీత వాయి ద్యాల అవసరమూ పోయింది. రాజాస్థానాలకు చేరి జావళీలు పాడిన కళలు ఎట్లా బతికాయో ఇప్పుడు సబ్బండ కులాల కళలు కూడా సాంస్కృతిక సారథుల పోషణలో బతుకు తున్నాయి. కానీ, అవి ఉత్పత్తి సంబంధాల్లోని ఆర్తిని వదిలేసి, పాటల పల్లకీలో ప్రభువుల్ని మోస్తున్నాయి. చరిత్రను కూడా ఒక పావుగా వాడుకునే చాతుర్యం ఉన్న పాలకుల పాలనలో ఉన్నాం. కాకతీయుల్ని కమ్మవారిలో కలిపే యమని కోరిన పాలకుడికి లొంగని పండితుడు వాస్తవ చరిత్రను నిలబెట్టినట్టే, సాంస్కృతిక ఆధిపత్యాన్ని ధిక్కరించే వారంతా జానపదుల సాంస్కృతిక వారసత్వాన్ని ఎలుగెత్తి చాటాలి. ‘‘నెత్తురుమండే, శక్తులు నిండే యువకుల్లారా రారండి’ అన్న పిలుపులు పోయి, మార్కుల కోసం, ర్యాంకుల కోసం వ్యక్తిత్వాలను త్యాగం చేయమంటోంది. మనం చూసున్న నేరాలన్నీ యాంత్రిక జీవనం, మార్కెట్ మనస్త త్వాలు పెంచిన సంకుచిత భావాల ఫలితమే. కాలాన్ని బట్టి బతుకుదెరువుని వెదుక్కునే సంచారుల బతుకు దారితప్పింది. ఆ కళలను కాపాడ లేకున్నా వాటి చరిత్రనైనా కాపాడుకుందాం. పంట లాభాలు ఇవ్వకపోయినా, మరో పంటకు విత్తనాలు పండితే మళ్లీ ఎవుసం చేయాలంటాడు రైతు. ఉత్పత్తి కులాల కళాకారులను తయారు చేయకున్నా విత్తనాల్లాంటి ఆ కళల వాయిద్యాలు పరిరక్షించుకుందామని ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు అంటున్నాడు. రేపటి సేద్యం కోసం జయధీర్ జానపదుల వాయిద్యాలను విత్తనాల్లా పదిలం చేసిండు. తెలం గాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఆయన సేకరిం చిన కళాఖండాలన్నిటినీ హైదరాబాద్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో తెలుగు విశ్వవిద్యాలయం ప్రదర్శనకు ఉంచింది. మన తాతలు రాగాలు పలికించిన ఊదు వాద్యాలు, కొలుపులో మోగిన డప్పులు, పెళ్లిలో పలికిన సన్నాయిలు... ఎన్నెన్నో ఇందులో కొలువుదీర్చారు. సంగీతంతోపాటే వికసిం చిన లిపిని కూడా ఆయన పదిలం చేసే ప్రయత్నం చేసిండు. తొలి శతాబ్దాల నుంచి ఆధునిక కాలం వరకు లిపి పరిణా మాన్ని చెప్పే ఎముకలు, తోలు, తాళప్రతులు, వస్త్రాలు, దస్తావేజులను సేకరించిండు. నలభై ఏళ్లపాటు భద్రపరిచిన ఆ చారిత్రక భాండాగారాన్ని చూద్దాం రమ్మని ‘ఆద్యకళ’ ప్రదర్శ నకు ఆహ్వానిస్తున్నారు. నేడు (1 ఆగస్టు 2021న ఉదయం 11 గంటలకు) ప్రారంభమవుతున్న ఈ ప్రదర్శన కళలకు దూర మైన తరాన్ని మేల్కొలిపి, రేపటికి కొత్తదారులు వేస్తుందని ఆశిద్దాం. పదండి, జయధీర్ చెప్పే ప్రాచీన మానవుడి ‘తొవ్వ ముచ్చట్లు’ వింటూ కొత్తదారిలోకి నడుద్దాం. – నాగవర్ధన్ రాయల జర్నలిస్ట్ -
నవ కవితా యుగ ప్రవర్తకుడు
మహాకవి జాషువా ఆధునిక కవితా యుగ ప్రవర్తకుడు. కవిత్వంలో నూత్నప్రత్యామ్నాయ ఆవిష్కరణలు చేసిన ప్రయోక్త. సామాజిక జీవితం లోని వైవిధ్యాలకు అద్దం పట్టిన చిత్ర కారుడు. అస్పృశ్యతా భారతంలోని వేదనను అక్షరదృశ్యాలు చేసి, ఆకాశ నక్షత్రాలుగా వెలిగించిన సృష్టికర్త. గతించి అర్ధ శతాబ్ది అయినా కవికి మరణం లేదని నిరూపించిన పునరుజ్జీవుడు. వస్తువు ఏదైనా శృతిహితంగా తెలుగు నుడికారపు సొగసుతో చెప్పగలిగిన ధీశాలి. ‘రాజు మరణించె ఒక తార రాలిపోయే. సుకవి మర ణించె ఒక తార గగనమెక్కే’; ‘రాజు జీవించు రాతి విగ్రహ ములయందు. సుకవి జీవించు ప్రజల నాల్కలయందు’ అని చెప్పిన జాషువా ప్రజల నాల్కల మీద నర్తిస్తున్నాడు. ఆయన రచించిన ‘గబ్బిలం’ నాకు లండన్ మ్యూజియం లైబ్రరీలో సాక్షాత్కరించింది. వినుకొండ నుండి గుంటూరుకు, గుంటూరు నుండి ఢిల్లీకి, ఢిల్లీ నుండి లండన్‌కు ఎగబాకిన విశ్వకవి జాషువా. ‘గబ్బిలం’ తెలుగు సాహిత్యంలోని పంచకావ్యాలకు ప్రత్యామ్నాయ కావ్యంగా మలచబడింది. ‘చిక్కిన కాసుచే తనివి చెందు అమాయ కుడు’ ఆయన నాయకుడు. గబ్బిలం అనే నామకరణం ద్వారా అస్పృశ్య జీవుని గురించే కాదు, అస్పృశ్యమైన పక్షుల గురించి కూడా ఆయన గానం చేశాడు. ఆయన కవితా ఖండి కల్లో ‘శ్మశానవాటిక’ అద్భుతమైంది. అందులో దళిత తాత్త్విక వాదాన్ని ప్రవేశపెట్టాడు. ‘ఏలే బుగ్గల సౌరు రూపరి యెనో యేముద్దు నిద్రించేనో! యేలీలావతి గర్భ గోళమున వహ్నిజ్వాల జీవించెనో’ అంటూ సాగిన కవితలో దళితవాడ తత్త్వం ఉంది. ఒక గాఢమైన సామాజిక ప్రపంచం ఉంది. జాషువా కవితలో ఒక సత్యం కళతో మమేకమై ఉంటుంది. ‘ఎన్నో యేండ్లు గతించి పోయినవి గానీ’; ‘కన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొక్కడైనన్ లేచిరాడు; ‘ఎన్నాళ్లీ చల నంబు లేని శయనంబు’; ‘ఏ తల్లులల్లాడిరో’; ‘కన్నీ టంబడి క్రాగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్’; పద్యాన్ని వేదనా ప్రకటనకు, జ్వలిత చైతన్య విస్ఫోటనకు, సమస మాజ నిర్మాణోద్యమ సారథ్యానికి ప్రబలవాహికగా మలుచు కున్న క్రాంతదర్శి జాషువా అనుటలో అత్యుక్తి లేదు. ‘చల నంబులేని శయనంబు’ వంటి చిన్నచిన్న పదబంధాలు గుండెను తొలిచివేస్తాయి. మానవ వాక్కులకందతగిన ఆనం దకరమైనట్టియు, రసస్ఫోరకమైనట్టి, నిర్దుష్టమైనట్టి రచనా శిల్పమే కవిత్వం అన్న ఆంగ్ల విమర్శకుని వ్యాఖ్యానంలోని శిల్పం జాషువా కవిత్వంలో భాసిస్తుంది. కరుణరసప్లావి తమైనపుడు ఏమాత్రం హృదయ స్పందన ఉన్నవాణ్ణి కూడా అంతర్ముఖుణ్ణి చేయగల శక్తి ఆయన కవితకున్నది. జాషువా కవిత్వంలో కులతత్వ నిరసన ప్రధానాంశం. ఆయన ముందు ప్రకృతిని పరిశీలించారు. అందులో అసమానతలు లేవు. మనుషుల్లో అసమానతలు ఎక్కువ. ఇవన్నీ కల్పించుకున్నవే. కొందరు కేవలం ప్రకృతి కవులు. మరికొందరు ప్రకృతి ఆరాధకులు. ప్రకృతిలో ఉన్న సహజ జీవిత గుణాలను మానవులకు ఉత్తేజంగొల్పే దిశగా వర్ణించడం ఉన్నత కవుల లక్షణం. ఆ ఔన్నత్యమే జాషు వాను మహాకవిని చేసింది. ‘ముసలివాడైన బ్రహ్మకు బుట్టి నారు నలువురు కుమారులనుట విన్నాము గాని, పసర మున కన్న హీనుడభాగ్యుడైన ఐదవ కులస్థుడె వ్వరమ్మా! సావిత్రీ?’ ఈ మాటలు కలంలోనుంచి వచ్చినవి గానీ, గళంలోనుంచి జారినవి గానీ కాదు; ఇవి గుండె రాపిడిలో నుంచి లేచిన నిప్పురవ్వలు. ‘అసమ సమాజం బాకులు గుమ్మినపుడు, అంటరానితనం నిషాగ్నులు చిమ్మిన పుడు, దుర్భర దారిద్య్రం వెన్నుడికినపుడు, దురంత వేదన గుండె లలో తుక తుక ఉడికినపుడు’ పెల్లుబికిన ప్రశ్నల వెల్లువ. భారతమ్మోరిని, భారతీయుల్ని నిలదీసి అడుగు తుంది జాషువా కవిత. ఆయన నిజజీవితంలో కూడా కరుణార్ద్ర హృదయుడు. కుక్కలను ఎంతో ఇష్టంగా పెంచేవారు. పక్షులకు గింజలేసి ఆదరించేవారు. ఆయన నివసించిన వినుకొండ రామణీ యకమైన ప్రదేశం. ఒక పక్క కొండ, మరో పక్క నది, ఇంకో పక్క అడవి, మరో పక్క ఊరు–వాడ. ఆ ప్రదేశాన్ని చూసిన ప్పుడే కవిత్వమొస్తుంది. తండ్రి వీరయ్య యాదవులు. తల్లి లింగమాంబ దళిత స్త్రీ. తలిదండ్రులిద్దరూ వర్ణాంతర వివా హాన్ని ఆ రోజుల్లోనే ధైర్యంగా చేసుకున్నారు. తండ్రి క్రైస్తవ ఫాదర్. తల్లి ప్రేమమూర్తి. తండ్రిలోని గొల్ల సుద్దుల శ్రుతి వచ్చింది. బైబిల్లోని శాంతి, కరుణ, ప్రేమ కవిత్వంలో ప్రవ హించింది. వీరి ‘క్రీస్తుచరిత్ర’కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. వీరి కావ్యాల్లో ‘ఫిరదౌసి’ అత్యుత్తమ మైనది. మోసపోయిన కవి ఆవేదనను దిక్కులు పిక్కటిల్లేలా చెప్పారు. జాషువా మతమౌఢ్యాన్ని నిరసించారు. ‘వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకింప సంశ యించు’; ‘వారు చెమ్మటలలోడ్చి ప్రపంచమునకు భోజనం బెట్టు వానికి భుక్తి లేదు’ అని సామాజిక ఆర్థిక దోపిడీని ఎలుగెత్తి చాటారు. పగటి దివిటీలతో ఆయన్ని ఊరేగిం చారు. పద్మశ్రీ, పద్మ భూషణ్ వరించాయి. నవయుగ కవి చక్రవర్తిగా కీర్తించ బడ్డారు. శ్రీనాథుడిలా కవిసార్వభౌ ముడు. వేమనలా కవితా సందేశం, తిక్కనలా తెలుగు నుడికారపు విన్నాణవ్ు చాటారు. దళితులకు ఆత్మగౌరవం, ఆత్మ సై్థర్యం నేర్పారు. భారత దేశ సృష్టికర్తలుగా వారిని పేర్కొన్నారు. ఆధునిక దళిత కవితా యుగాన్ని సృష్టించారు. శత్రువుల్ని కూడా ఆశ్చర్య చకితుల్ని చేశారు. తన కూతురు హేమలతను సంస్కర్త అయిన గోరా కుమారుడు లవణంకు ఇచ్చి పెళ్లి చేసి విశ్వజ నీనతను చాటాడు. ‘ముంతాజ్ మహల్’, ‘కాందిశీకులు’, ‘బాపూజీ’, ‘నేతాజీ’ వంటి అనేక కావ్యాలు తెలుగు భాషకు సమర్పించాడు. ‘సాలీడు’, ‘గిజిగాడు’ వంటి ఎన్నో కావ్య చిత్రాలు గీశారు. శిశువు, శ్మశానవాటిక వంటి అమేయమైన కవితా ఖండికలు ఒక్కొక్క కావ్యంతో సమానం.‘వాక్యం రసాత్మకం కావ్యం’ అనేది జాషువాలోనే చూస్తాము. జాతీ యత, మానవత, నవ్యత, శ్రవ్యత, సమత, మమత వంటి అనేక గుణాల శిల్పమే మహాకవి జాషువా. ఆయన పేరు మీద ఒక గొప్ప కళాక్షేత్రాన్ని నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రతి మండలంలో జాషువా సాహితీ గ్రంథాలయాలు నిర్మించి ఆయన రచనలను 6వ తరగతి నుండి ఎంఏ వరకు పాఠ్యగ్రంథాలుగా పెట్టి ఆయన కవితా జీవనవ్యవస్థకు ప్రతిష్ట కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వా లకు ఉంది. ఈ 50వ వర్ధంతిని ఆయన ప్రజ్వలిత కవితా జీవన మార్గంగా భావిద్దాం. ఆ స్ఫూర్తితో పయనిద్దాం. వ్యాసకర్త ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ రీసెర్చ్ ఫెలో (నేడు గుర్రం జాషువా 50వ వర్ధంతి) -
‘అసలు జాకీకి ఒంట్లో భయమే లేదా’
జాకీచాన్ అసలు పేరు చాన్ కాంగ్–సాంగ్. ‘లిటిల్ జాక్’ అనే నిక్‌నేమ్ ఉండేది. అది కాస్తా ‘జాకీ’గా మారింది. ఆతరువాత ‘చాన్’ వచ్చి చేరి ‘జాకీ చాన్’ అయింది. జాకీ చాన్ ఫైటర్ మాత్రమే కాదు... చక్కని గాయకుడు కూడా. ‘ఒపేరా అకాడమీ’ లో కుంగ్ఫూతోపాటు సంగీత పాఠాలు కూడా నేర్చుకున్నాడు. 11 మ్యూజిక్ ఆల్బమ్‌లను విడుదల చేశాడు. ‘బెస్ట్ సింగర్’ అవార్డ్ కూడా అందుకున్నాడు. ►సీఫూ(గురువు) చెప్పేదానికి ప్రకారం మార్షల్ ఆర్ట్స్‌లో జాకీకి అసాధారణమైన ప్రతిభ ఏమీలేదు. కానీ చిలిపితనం, నవ్వించే గుణం ఎక్కువ. గంభీరమైన మార్షల్ ఆర్ట్స్‌కు కడుపుబ్బా నవ్వించే కామెడీని జత చేసి వెండితెరపై తనదైన శైలిని సృష్టించుకున్నాడు. ►బ్రూస్లీ లెవెల్‌కు తీసుకువెళదామనే ఉద్దేశ్యంతో ఒక హాంకాంగ్ నిర్మాత జాకీకి ‘బికమ్ ది డ్రాగన్’ అనే స్క్రీన్‌నేమ్ తగిలించాడు. అయితే అది అట్టే కాలం నిలవలేదు. ►‘డ్రాగన్ లార్డ్’లో ఒక సీన్ కోసం ఏకంగా 2,500 టేక్‌లు తీసుకున్నాడట! ఇది అనధికార గిన్నిస్ రికార్డ్. ఇక నిజమైన రికార్డ్ విషయానికి వస్తే ‘చైనీస్ జోడియాక్’ అనే సినిమా కోసం దర్శకత్వం, నిర్మాణం, నటన,సంగీతం, ఆర్ట్ డైరెక్టర్, యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్, ఫైట్ కొరియోగ్రఫీ, సినిమాటోగ్రాఫర్. కేటరింగ్... ఇలా పదిహేను విభాగాల్లో పనిచేసి గిన్నిస్‌బుక్ రికార్డ్ సృష్టించాడు. ►‘అసలు ఇతడి ఒంట్లో భయమే లేదా’ అనుకునే జాకీకి రెండు భయాలు ఉన్నాయి. ఒకటి సూదులు, రెండోది జనాల మధ్య మాట్లాడడం. ►జీవితంలో తాను పశ్చాత్తాప పడే ప్రధాన విషయం...తాను సరిగా చదువుకోకపోవడం అంటాడు. పిల్లలకు ‘రోల్ మోడల్’గా ఉండాలనేది కల. ఒకప్పుడు తన రోల్ మోడల్ చార్లీ చాప్లిన్. -
13 రాష్ట్రాల నుంచి 50 మంది అమ్మాయిలు...
నడిపించడమా, కలిసి నడవడమా.. ఏది లీడర్షిప్? రెండూ! ‘యు గో దట్ సైడ్’ అని వేలూ చూపించాలి’, ‘ఇదిగో నాతో రా.. ’ అని చెయ్యీ అందివ్వాలి. పాలిటిక్స్‌లో మహిళలు ప్రజలకు మరింతగా అందుబాటులో, మరింతగా ప్రజామోదంతో ఎందుకు ఉంటారంటే.. ఇందుకే! ఈ రెండు లీడర్షిప్ క్వాలిటీలూ వాళ్లలో అంతర్నిర్మాణంగా ఉన్నందుకే! అలాంటిది.. శిక్షణ కూడా తోడైతే? ఆమె లీడ్ చేస్తుంది. వర్తమానాన్ని, భవిష్యత్తునీ! అలా పొలిటికల్ లీడర్‌షిప్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న ఫస్ట్ బ్యాచ్ మహిళా బృందం నేడు బయటికి వస్తోంది. 13 రాష్ట్రాల నుంచి 50 మంది అమ్మాయిలు... ‘జన గణ మన.. జన మొర విన, కల నిజమయ్యే.. కాలం ఇదే.. ఛక్ ఛక్ ఛక్..’ మంటూ వస్తున్నారు! అన్ని రంగాల్లోనూ నాయకత్వ స్థానంలో మహిళలు అద్వితీయ శక్తి సామర్థ్యాలతో సంస్థల్ని ముందుకు నడిపిస్తున్నా కూడా రాజకీయ రంగం మాత్రం వాళ్లను వెనక్కి లాగుతోంది. నిజానికి మహిళలు రాణించడానికి, సమాజాన్ని సంస్కరించడానికి తగిన వేదిక రాజకీయాలే. అందుకే ‘స్త్రీ శక్తి’ స్వచ్ఛంద సంస్థ, సి.ఎ.పి.ఎఫ్. (చీవెనింగ్ ఆలుమ్నీ ప్రాజెక్ట్ ఫండ్) కలిసి మహిళల కోసం ‘షి లీడ్స్’ అనే రాజకీయ శిక్షణా కార్యక్రమాన్ని ఫిబ్రవరి 24న వర్చువల్‌గా ప్రారంభించాయి. ఫస్ట్ బ్యాచ్ అది. శిక్షణ నేటితో పూర్తవుతుంది. ఈ లోపే రెండో బ్యాచ్ మొన్న శనివారమే మొదలైంది. తొలి బ్యాచ్‌లో 13 రాష్ట్రాలకు చెందిన 50 మంది మహిళలు కోర్సు పూర్తి చేశారు. రాజకీయ నాయకత్వంతోనే సమానత్వ సాధన షీ లీడ్స్ కోర్సులో శిక్షణ ఇస్తున్నవారంతా అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులే! రాజకీయ రంగ ప్రవేశం, ఎన్నికల్లో పోటీ చేయడం, చట్టసభల్లో ప్రజా సమస్యల్ని లేవనెత్తడం అనేవి షీ లీడ్స్ సిలబస్‌లోను ప్రధాన అధ్యాయాలు. వాటిల్లో మళ్లీ ఉప–అధ్యాయాలు. రోజుకు 5 గంటల పాటు వారం రోజులు శిక్షణ ఉంటుంది. కోర్సు పూర్తి చేయగానే సర్టిఫికెట్ వస్తుంది. ‘‘అయితే సర్, ఈ సర్టిఫికెట్ మాకు రాజకీయ రంగ ప్రవేశానికి యోగ్యతనిస్తుందా?’’ అని ఓ అభ్యర్థి తొలి రోజు క్లాసులోనే అడిగారు!సహజంగా వచ్చే సందేహమే. ‘‘అసలు మీకు ఈ కోర్సులో చేరాలన్న ఆలోచన రావడమే మీ యోగ్యత. సర్టిఫికెట్ అనేది మీ పాలనా పరమైన పరిజ్ఞానానికి థియరీ రూపం మాత్రమే. ప్రాక్టికల్‌గా మీరెప్పుడో లీడర్స్ అయిపోయారు’’ అని ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్, కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్రమంత్రి మార్గరెట్ అల్వా చెప్పడం ఫస్ట్ బ్యాచ్ ‘యువ పొలిటీషియన్స్’కి స్ఫూర్తినిచ్చే సమాధానం అయింది. స్ఫూర్తి మాత్రమే కాదు. ఉత్సాహం కూడా. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రాజీవ్ గౌడ, బీజేపీ లోక్‌సభ ప్రస్తుత ఎంపీ హీనా గవిట్, సమాజ్‌వాదీ ప్రతినిధి ఘనశ్యామ్ తివారీ ‘షీ లీడ్స్’ ఫస్ట్ బ్యాచ్‌కి రాజకీయ పాఠాలు చెప్పినవారిలో ఉన్నారు. ఈ కోర్సుకు ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ డెమొక్రసీ’, నేత్రి, శక్తి సంస్థలు కూడా సహకారం అందించాయి. ‘‘మహిళా నాయకుల్ని ప్రజలు అంగీకరిస్తారు. మహిళా నాయకులూ ప్రజలకు అందుబాటు లో ఉంటారు. అందుకే మహిళలు చొరవగా రాజకీయాల్లోకి రావాలి’’ అని అల్వా తరగతుల ప్రారంభంలోనే చెప్పారు. ‘‘మీరొస్తే రాజకీయాల్లో కులాల ప్రభావం తగ్గుతుంది’’ అంటూ.. రాజకీయాల్లోకి మహిళలు ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల సమాజానికీ, దేశానీ జరిగే మంచి గురించి మాట్లాడారు హీనా గవిట్. రెండో బ్యాచ్ ‘షీ లీడ్స్’ క్లాసులకు ఆప్ పార్టీ నుంచి పృథ్వీరెడ్డి, వందనా కుమారి, మాజీ బీజేపీ ఎంపీ అర్చనా చిత్నిస్ వస్తున్నారు. అసలు ఇలాంటి కోర్సు ఎందుకు అనే ప్రశ్న కూడా క్లాస్ రూమ్‌లో ఓ విద్యార్థినిని నుంచి వచ్చింది. ‘మంచి ప్రశ్న’ అన్నారే కానీ, ‘ఇలాంటి కోర్సులో ఎందుకు చేరావు?’ అని రాజకీయ గురువులు అడగలేదు. ‘‘పాలిటిక్స్‌లోనూ ఇదే విధమైన సావధానత ఉండాలి. అలా మహిళా నేతలు మాత్రమే ఉండగలరు. భారతదేశ మహిళా రాజకీయ శక్తిని బలోపేత చేయడం కోసం ఇలాంటి ఒక కోర్సు అవసరం అని మేము భావించాం’’ అని ‘స్త్రీశక్తి’ సంస్థ వ్యవస్థాపకురాలు రేఖా మోడీ అన్నారు. త్వరలోనే కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో షీ లీడ్స్ సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా ఆమె తెలిపారు. మహిళల స్వభావంలోనే నాయకత్వ గుణాలు ఉంటాయి. అయితే పురుషాధిక్యత ఆ గుణాలను మాటలతో, చేతలతో ఏళ్లుగా అప్రాముఖ్యం చేస్తూ వస్తోంది. బాధితులు ఎవరైతే అవుతారో సహజంగానే వారి స్వరం ప్రశ్నిస్తుంది. వారి పిడికిలి బిగుస్తుంది. వారి గళం నినదిస్తుంది. అందుకే సామాజికంగా కూడా అణచివేతల్ని, అవకతవకల్ని, దౌర్జన్యాలను చూస్తున్నప్పుడు మహిళలే ముందుగా స్పందిస్తారు. వాళ్లే ఎందుకు ముందుగా స్పందిస్తారంటే.. ప్రతి అపసవ్యత పర్యవసానం చివరికి వారి మీదే పడుతుంది. మరీ ఈ రాజకీయ కోర్సులో చేరడానికి అర్హత ఏమిటి? రాజకీయ రంగ ప్రవేశానికి ఈ కోర్సు దారి చూపుతుందా? మళ్లీ రెండు ప్రశ్నలు. రేషన్ క్యూలో నిలుచుని ఉన్నప్పుడు మీ కంటపడిన డీలర్ అక్రమాన్ని మీరు చూస్తూ ఊరుకోకుండా జనం తరఫున వేలెత్తి చూపిన క్షణమే మీరు రాజకీయ రంగ ప్రవేశం చేసినట్లు. రాజకీయ శిక్షణలో చేరేందుకు కూడా ఆ అడిగే తత్వమే, నిలదీసే ఆగ్రహమే క్వాలిఫికేషన్. -
హ్యాపీ న్యూ ఇయర్ సిల్వీ
జీవితాన్ని ముఖ్యమైనదిగా తప్ప ఇష్టమైనదిగా గడిపే అవకాశాన్ని నిరాకరించే అననుకూలతలు స్త్రీలకే ఎక్కువ. తనకు ఇష్టమైన కలలతో పాటు.. తన భర్తకు, పిల్లలకు ముఖ్యమైన కలల్నీ ఆమె నిజం చేసుకోవాలి! సాధ్యం అవుతుందా? అవుతుంది. ఇల్లు సపోర్ట్ ఇస్తే జీవితమూ పూలగుత్తితో వస్తుంది. మనస్ఫూర్తిగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతుంది. ‘‘నేనేం గ్రహించానో తెలుసా? జీవితం మనకు అస్సలు ఇష్టంలేని వాటికి సమయాన్ని వెచ్చించలేనంత చిన్నది..’’ అంటుంది సిల్వీ. ఉద్యోగం చేస్తుంటుంది తను. టీవీ స్టేషన్లో తనకు ఇష్టమైన ఉద్యోగం. ఉద్యోగంలా చేయదు. ఉద్యోగమే తన జీవితం అన్నంతగా చేస్తుంది. ఆమె జీవితంలో మరికొన్ని కూడా ఉంటాయి. ఇల్లు, వంట, భర్త, ఇంటికి వచ్చిపోతుండే అతిథులు. ‘‘అవన్నీ నువ్వే చూస్కో, నేను చేయలేను..’’ అంటుంది భర్తతో. ఆఖరికి అతిథుల్ని కూడా! ‘‘బాగోదు సిల్వీ.. అతిథులు ముఖ్యం కదా. కొన్నిరోజులు ఆఫీస్‌కి సెలవు పెట్టేయ్..’’ అంటాడు భర్త. ఆ ఘర్షణలోనే.. ‘జీవితం మనకు అస్సలు ఇష్టం లేనివాటికి సమయాన్ని వెచ్చించలేనంత చిన్నది..’ అని భర్తతో అంటుంది సిల్వీ. వాపోవడమది. సిల్వీస్ లవ్’ చిత్రంలో సిల్వీ పాత్రధారి టెస్సా థాంప్సన్ జీవితంలో ముఖ్యమైనవీ, ఇష్టమైనవీ రెండూ ఉంటాయి. రెండిటికీ కలిపి ఒకే సమయం ఉంటుంది. ముఖ్యమైనవీ, ఇష్టమైనవీ వేటికవి జరిగిపోతున్నా.. ఇష్టమైనవి చేయనివ్వకుండా ముఖ్యమైనవి అడ్డుపడుతున్నప్పుడే.. ‘జీవితం పొద్దెక్కిపోతోందే’ అని మనసు త్వరపడి బలాన్ని కూడదీసుకుని ఇష్టమైనవాటి వైపు పరుగులు తీయాలని చూస్తుంది. ఆ వెనకే.. స్ట్రెస్. కన్నీళ్లు. ఇక్కడ సిల్వీ కూడా ఏడుస్తుంది. అర్థం చేసుకోగలిగిన భర్త అయుండీ, అర్థం చేసుకోలేకపోతున్న స్థితిలో మృదువుగా నెమ్మదైన స్వరంతో సిల్వీతో వాదించి ఆమె గదిలోంచి వెళ్లిపోతాడు. ఇంట్లోని గెస్ట్‌లకు మర్యాదలు అందించే పనిలో పడతాడు. అది అతడికి ముఖ్యమైన పని కాకుండా, ఇష్టమైన పని అయి ఉంటే కనుక అతడికోసం సిల్వీ తనకు ఇష్టమైన పనిని వదిలి, అతడికి ఇష్టమైన పనిని తన ముఖ్యమైన పనిగా మీద వేసుకుని గెస్ట్‌లు ఉన్న హాల్లోకి వెళ్లి ఉండేదేమో. ఇష్టమైన పని చేయడానికి వీల్లేకపోవడం ఎంత తీవ్రమైన మానసికమైన ఒత్తిడో ఆమెకు తెలుసు కాబట్టి వెళ్లి ఉండేదే..నేమో. కొండంత పని కలిగించే ఒత్తిడి కన్నా, ఇష్టమైన పనిని పిసరంతైనా చేయడానికి వీల్లేకపోవడం కొండంత ఒత్తిడి. నోటిఫికేషన్ పడకుండానే, దరఖాస్తు చేయకుండానే, ఇంటర్వ్యూ లేకుండానే, అసలు ఇష్టమే లేకుండానే వెళ్లిపోయి తప్పనిసరిగా చేయవలసిన ఉద్యోగం స్త్రీకి.. పెళ్లి, భర్త, ఇల్లు! ఆమెకు ఇష్టమైన ఉద్యోగం వేరే చోట ఎక్కడైనా ఉండొచ్చు సిల్వీకి టీవీ స్టేషన్లో ఉన్నట్లు. ఈ ‘ముఖ్యం’–‘ఇష్టం’ మధ్య ఆ గోడకూ ఈ గోడకూ షటిల్ అవుతూ కింద పడిపోకుండా జీవితాన్ని లాగించేవాళ్లలో స్త్రీలు మాత్రమే ఉంటారని కాదు. జీవితాన్ని ముఖ్యమైనదిగా తప్ప ఇష్టమైనదిగా గడిపే అవకాశాన్ని నిరాకరించే అననుకూలతలు స్త్రీలకే ఎక్కువే. తనకు ఇష్టమైన కలలతో పాటు.. తన భర్తకు, పిల్లలకు ముఖ్యమైన కలల్నీ ఆమె నిజం చేసుకోవాలి! సాధ్యం అవుతుందా? అంత సమయాన్ని ఆమెకు ఉదారంగా ఇచ్చేందుకు జీవితమేమీ స్త్రీవాది కాదు. జీవితం మనకు అస్సలు ఇష్టంలేని వాటికి సమయాన్ని వెచ్చించలేనంత చిన్నది అంటే, జీవితం మనకు అస్సలు ఇష్టం లేని పనులను చేసుకుంటూ పోగలిగినంత పెద్దది కాదనే. ముఖ్యమైన పని ‘స్టేటస్’ను ఇస్తే ఇవ్వొచ్చు. ఇష్టమైన పని ‘సాఫల్యత’ను ఇస్తుంది. ఇంటిముందుకు ఖరీదైన కొత్త కారు రావడం స్టేటస్. స్టేటస్ లేట్ అవుతుంటే ‘ఏంటండీ.. మీరింకా కారే కొనలేదు’ అని ఇంటి ముందుకొచ్చి ఎవ్వరూ అడిగిపోతుండరు. సాఫల్యతకు సమయం మించిపోతుంటేనే.. ‘గడియారం చూసుకున్నావా? జీవితం ఎంతైందో తెలుసా!..’ అని మనసు అదేపనిగా అడగడానికొస్తుంది. సిల్వీపాత్ర ఇటీవలి హాలీవుడ్ చిత్రం ‘సిల్వీస్ లవ్’ లోనిది. సిల్వీ వర్కింగ్ ఉమన్. ఈ కొత్త సంవత్సరం సిల్వీలందరినీ వారికి ఇష్టమైన ఉద్యోగాలను హాయిగా చేసుకోనివ్వాలి. ఇల్లు సపోర్ట్ ఇస్తే జీవితమూ పూలగుత్తితో వస్తుంది. మనస్ఫూర్తిగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతుంది. -
ఆ శిశువు మాత్రం...
చుట్టూ గాఢాంధకారం... నల్లని మబ్బుల చాటున చంద్రుడు గుర్రు పెట్టి నిదరోతున్నాడు. గ్రామం గాఢ నిద్రలో ఉంది కదా అని ప్రకృతి కూడా అప్పుడే నిద్రకు ఉపక్రమించింది. పైరగాలి మాత్రం కొద్దిగా మేలుకొని మెల్లని, చల్లని గాలులను వీయిస్తోంది. ఆ గాలికి మైమరచి కొండలు ప్రశాంతంగా నిద్రపోతున్నాయి. ఆ కొండల పక్కనే ఓ చిన్న బొరియ. దాని నిండా పలు రకాల పశువులు. ఇంతలో దూరంగా ఇద్దరు వ్యక్తులు.. చూడటానికి భార్యాభర్తల్లా ఉన్నారు. అసలే అర్ధరాత్రి. చలి గజగజ వణికిస్తోంది. చలికి ఆ స్త్రీ రెండు చేతులు చెవులపై అదిమి పెట్టింది. భార్య చలికి తట్టుకోలేక పోవడాన్ని గమనించి అతడు తన పై వస్త్రాన్ని తీసి ఆమెకు కప్పాడు. సరిగ్గా అప్పుడే చంద్రుడు నిద్రలేచాడు. నల్లని మబ్బుల కనురెప్పలను తెరచి లోకాన్ని చూసాడు. ఏదో చూడకూడని దాన్ని చూశాడు కాబోలు.. తన బాహువులను చూడమన్నట్లు వెన్నెలను విరగబూయించడం ప్రారంభించాడు. గాఢ నిద్రలో మునిగిన గ్రామం చంద్రుడి వెలుగును పట్టించుకోలేదు. ఆ జాబిల్లి వెలుగులో పశువులన్నీ ఓ మానవీయ ఘటనను చూశాయి. తమ వద్దకు వస్తున్న ఆ జంట చూడముచ్చటగా ఉంది. ఆమె నిండు గర్భిణి. ఏ క్షణమైనా ప్రసవం జరిగేలా ఉంది. వీరికి దారి చూపడానికే చంద్రుడు నిద్ర లేచాడా అన్నట్లు ఉందా పరిస్థితి. పసుల పాకలోని జంతువులు నిద్ర లేచాయి. ‘‘ఏంటి వీళ్ళు... ఇటే వస్తున్నారు. ఇప్పటికే ఇరుకుగా ఉంది. వీరెక్కడ సరిపోతారు’’ అందో గాడిద. ‘‘సరేలే ఉన్న దాంట్లో ఇరుక్కుంటారేమో నీకేంటి?’’ అంది పక్కనే ఉన్న మరో గాడిద. ‘‘సరిగ్గా చూడండెహే.. పాపం ఆవిడ ప్రసవానికి సిద్ధంగా ఉంది. నోర్మూసుకుని దారి ఇవ్వండి లేకపోతే తెలుసుగా, కొమ్ములకు ఈ మధ్యే పదును పెట్టా..’’ అని హెచ్చరించింది పక్కనే ఉన్న ఓ పొట్టేలు. ‘‘నిజమే.. అందరూ లేవండి.. మనం ఆ మూలకు వెళదాం’’ అంది గొర్రె. అప్పుడే నిద్ర లేచిన ఓ బుజ్జి మేక తనను కొంటె చూపుతో చూస్తున్న చంద్రుణ్ణి చూసింది. తర్వాత వాళ్ళ అమ్మతో.. ‘‘అమ్మా ఏమయిందే, ఇంకా తెల్లారలేదుగా.. అప్పుడే ఎందుకు లేపుతున్నావ్?’’ అని అడిగింది. ఇంతలో వారు లోనికి రానేవచ్చారు. పశువులన్నీ మరో మూలకు చేరి వారికి కొంచెం చోటిచ్చాయి. అనుకున్నదే అయింది. ఆ స్త్రీ వచ్చిన కొద్దిసేపటికే బంగారులాంటి కొడుకు పుట్టాడు. బుజ్జి మేక ఆ బాలుడి దగ్గర చేరి చెంగు చెంగున గెంతుతోంది. అది చూసి మిగిలిన బుజ్జి మేకలు, గొర్రె పిల్లలు మే.. మే అని పిల్లాడి చుట్టూ చేరి ఆడుకుంటున్నాయి. ‘‘ఎవరి సహాయం లేకపోయినా సుఖ ప్రసవం జరిగింది.. సంతోషం’’ అంది పొట్టేలు పక్కనే ఉన్న గాడిదతో... ‘‘నిజమే బాలుడు చూడ ముచ్చటగా ఉన్నాడు, నా మీద ఎక్కి కూర్చుంటే నగరమంతా తిప్పుతాను’’ అంది గాడిద. ఇంతలో ఓ గొర్రె పిల్ల కల్పించుకొని.. ‘‘అమ్మా చూడవే... ఈ బాబు అచ్చం నాలాగే ఉన్నాడు’’అంది. ‘‘నిజమేలేవే.. కొంచెం దూరంగా గెంతు.. బిడ్డ మీద పడేలా ఉన్నావు’’ అంది తల్లి. ఇంతలో బిడ్డ దగ్గరకు ఓ ఆవు, పెయ్య దూడ కలిసి వచ్చాయి. ఆ పెయ్య దూడ తన తల్లితో.. ‘‘అమ్మా.. బాబు చూడు నాలాగే ఎర్రగా ఉన్నాడు. ఒక్క మచ్చ కూడా లేదు’’ అంది. నిజమేనన్నట్లు ఆ ఆవు తలూపింది. ఇంతలో మబ్బులన్నీ నిద్ర లేచి గట్టిగా ఆవులించాయి. ఆ శబ్దానికి జంతువులన్నీ భయపడ్డాయి. ఇంతలో ఆ పాకలో గొప్ప వెలుగు పుట్టింది. ఆ వెలుగులో రెక్కలు కట్టుకున్న అందమైన జీవులు ప్రత్యక్షమయ్యాయి. ఏమిటీ వింత అని పెద్ద జంతువులన్నీ గుడ్లు మిటకరించి చూస్తున్నాయి. చిన్ని గాడిదలు, బుజ్జి మేకలు, గొర్రె పిల్లలు, పెయ్య దూడలు, కోడె దూడలు మాత్రం ఆనందంతో శబ్దాలు చేస్తూ చెంగు చెంగున గెంతుతూ నాట్యం చేస్తున్నాయి. బిడ్డ పుట్టుకతో, జంతు నాట్యాలతో పరవశులైన ఆ రెక్కల జీవులు బిడ్డను పొగిడి తిరిగి వెళ్లిపోయారు...అప్పటి వరకూ ఎగిరిన పసు పిల్లలు అన్నీ అలసిపోయి బిడ్డ చుట్టూ హాయిగా పడుకున్నాయి. పెద్ద జంతువులన్నీ కాసేపు ముచ్చట్లు కొనసాగించి అలాగే నిద్రపోయాయి. వేదనను అనుభవించిన ఆ స్త్రీ సంతోష మైకంతో, ఆత్మీయ ఆనందంతో నిద్రలోకి జారుకుంది. అప్పటివరకు గర్భవతియైన తన భార్యను కాపాడిన భర్త కూడా పడుకున్నాడు. అప్పుడే కన్ను తెరిచిన ఆ బిడ్డ మాత్రం కళ్లు ఇంతింత చేసుకుని లోకాన్ని ప్రేమ, కరుణ, శాంతి దిశగా మేల్కొలపాల్సిన అవసరం ఉందని అనుకుంటూ, తనకు జన్మనిచ్చిన తల్లి వైపు... ఆదరించిన తండ్రి వైపు కృతజ్ఞతతో చూశాడు. ఆ బిడ్డ మాత్రం... సంతోషంతో తనవైపే చూస్తున్న జాబిల్లిని, ఆనంద బాష్పాలను మంచు రూపంలో కురిపిస్తున్న నల్లని మబ్బులను... తన పుట్టుకను గాంచి మిగుల ఆనందపడిన పశు పిల్లలను, వాటి తల్లులను చూస్తున్నాడు. ఏదో ఒక రోజు నీ మీద నగరానికి వస్తానని గాడిదకు మనసులోనే మాటిచ్చాడు. అచ్చం నాలాగే ఉన్నాడన్న గొర్రె పిల్లకు, ఎర్రగా ముద్దుగా ఒక్క మచ్చ కూడా లేదన్న పెయ్య దూడకు మీరన్నవన్నీ నిజమే అని తన మనసులో అనుకుంటూ చిరునవ్వుల వర్షం కురిపించాడు. – సృజన్ సెగెవ్ సాక్షి, హైదరాబాద్ -
సర్వోన్నతుడే దీనుడై దిగివచ్చిన క్రిస్మస్
ఆది నుండీ ఉన్న యేసుక్రీస్తు అనే ’జీవవాక్యాన్ని’ తాము చెవులారా విన్నామని, ఆయన్ను కళ్లారా చూశామని, మూడున్నరేళ్ళపాటు ఆయన్ను నిదానించి అనుభవించామని, తమ చేతులతో ఆయన్ను తాకామని ఆయన శిష్యుడైన యోహాను ప్రభువుతో ఉన్న తన అనుబంధాన్ని తన పత్రికలో అత్యద్భుతంగా వర్ణించాడు(1 యోహాను 1:1). కారు, ఇల్లు, టివి, కుర్చీలు, సోఫాలుఇలాంటి విలువైన వస్తువులన్నీ పాతబడిపోతాయి. కానీ తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళతో ఉన్న సజీవమైన అనుబంధాలు మాత్రం పాతబడవు. ఇక దేవునితో ఉండే బాంధవ్యమైతే అసలు పాతబడేదికాదు కదా, అది నిత్యనూతనమైనదని యోహాను అంటాడు. అందుకే యోహాను యేసుకు ’జీవవాక్యం’ అనే బిరుదుని చ్చాడు. పౌలు స్థాపించిన ఎఫెసీ అనే గొప్ప చర్చికి యోహాను చాలాకాలం పాస్టర్ గా ఉన్నాడు. ఆ చర్చిలో గ్నోస్టిక్స్ అంటే, విశ్వాసం కన్నా దేవుని గూర్చిన జ్ఞానం చాలా గొప్పదని వాదించే ‘మహాజ్ఞానులతో’ ఆయన చాలా సమస్యలనెదుర్కొన్నాడు. తాను మనిషికి అర్ధమై అతనితో కలిసి పోయేందుకు వీలుగా, అత్యంత సామాన్యుడు, నిరాడంబరుడైన వ్యక్తిగా ఈ లోకానికి దిగివచ్చి, అందరిలాగా ‘నేను పరిచారం చేయించుకోవడానికి కాదు, పరిచారం చెయ్యడానికి వచ్చిన దాసుడినని’ యేసుప్రభువే ప్రకటించుకుంటే(మత్తయి 20:28), దేవుడు నరుడు, దాసుడు కావడమేమిటి? లాంటి ‘అతిభక్తిపూర్వక’ ప్రశ్నలు లేవెనెత్తి, తన జీవనశైలిద్వారా ఆయన నిరూపించుకున్న అత్యున్నతమైన మానవీయ విలువలను కాక, ఆయనకు ఎలాగూ ఉన్న దైవత్వాన్ని మాత్రమే విశ్వసించడానికి, ప్రకటించడానికి పూనుకున్న ఆ ‘జ్ఞానుల’ వాదనలను యోహాను తన స్వీయానుభవపూర్వకమైన ఈ విశ్వాస ప్రకటన ద్వారా నిర్వీర్యం చేశాడు. దేవుడే తగ్గాడంటే, తాము కూడా తగ్గాల్సి వస్తుందని జంకే బాపతువాళ్ళు ‘ఈ జ్ఞానులు’. అందుకే ఆయన పరలోకంలో ఉండే దేవుడు మాత్రమే కాదు, ఈ లోకంలో తాను తాకిన, చూసిన, విన్న, అనుభవించిన దేవుడు అంటాడు యోహాను. తాను పరలోకాధిపతి అయి ఉండి కూడా, ఈ లోకంలోని సాధారణ మనుషులు తనను విని, చూసి, తాకి, తనతో సహవసించడానికి వీలుగా, వారిలో ఒకడిగా జీవించేందుకు గాను మనకు తోడుగా ఉండే’ ఇమ్మానుయేలు’ దేవుడుగా ప్రభువు దిగి వచ్చిన సందర్భమే క్రిస్మస్’ సంబరం, సంరంభం. దేవుడే మనిషిగా దిగిరాగా, మనిషి మాత్రం లేనిపోని డాంబికాలకు పోయి తనను తాను దేవునికన్నా గొప్పవాడిగా ఉహించుకొంటూ, కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, ప్రాంతాల పేరిట తోటి మనుషులను దూరంగా పెట్టడం ఎంత ‘అమానవీయమో’ తెలిపే సందర్భమే క్రిస్మస్. దేవుడే దీనుడై యేసుక్రీస్తుగా దిగివచ్చి మానవాళికి దీనత్వాన్ని ప్రబోధించాడు. తనను తాను తగ్గించుకోవడం అనే ‘దీనత్వం’ సర్వోత్కృష్టమైన మానవ ధర్మమని, దేవుడు అహంకారాన్ని ఏవగించుకొని దీనులను ఆదరిస్తాడని ‘బైబిల్’ చెబుతోంది. మానవాళి దీనత్వాన్ని అలవర్చుకోవాలన్నదే క్రిస్మస్ ఇచ్చే నిరంతర సందేశం!! – రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
ప్రభాస్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
డార్లింగ్ ప్రభాస్ నేడు 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన పుట్టిన రోజు అభిమానులకు పండగరోజుతో సమానం. దీంతో ఫ్యాన్స్ తాము అరాధించే హీరోకు వీర లెవల్లో బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. పుట్టిన రోజు శుభాకాంక్షలతో ట్విటర్లో మోత మోగుతోంది. అయితే ప్రభాస్ అభిమానులకు నేడు డబల్ ధమాకా.. ఎందుకంటే ఈ రోజు డార్లింగ్ పుట్టినరోజుతోపాటు ఆయన నటించిన రాధే శ్యామ్ సినిమా నుంచి ‘బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్’ విడుదల కానుంది. దీని కోసం అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్నారు. మరి ప్రభాస్ గురించి మీకు ఎంత వరకు తెలుసు.. అతని పూర్తి పేరు, చదివింది ఎక్కడ.. ఇలాంటి ఆసక్తికర విషయాలు మీకు ఎన్ని తెలుసు. ప్రభాస్ గురించి కొన్ని విషయాలు ఇక్కడ చుద్దాం.. చదవండి: ప్రభాస్ ఫోటోతో సిటీ పోలీస్ ట్వీట్.. 1.. ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. 2.. ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు, శివ కుమారి కొడుకు ప్రభాస్. ఇతను ఇంట్లో చిన్నవాడు. తనకు అన్నయ్య ప్రబోధ్, అక్క ప్రగతి ఉన్నారు. 3.. భీమవరంలోని డీఎన్ఆర్ స్కూల్లో చదువుకున్నారు. 4.. ప్రభాస్ ఇంజనీర్ గ్రాడ్యూయేట్( శ్రీ చైతన్య ఇంజరీంగ్ కళశాల).. ముందుగా తను హోటల్ ఏర్పాటు చేయాలని అనుకున్నాడు.. కానీ హీరోగా మారారు. 5... హిందీలో బాహుబలి ప్రభాస్ మొదటి సినిమా కాదు. దీనికంటే ముందు ‘యాక్షన్ జాక్సన్’ అనే సినిమాలో ఆయన అతిథి పాత్ర పోషించారు. 6... బ్యాంకాక్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహాన్ని కలిగి ఉన్న మొదటి సౌత్ స్టార్ ప్రభాస్. 7.. కేవలం బాహుబలి సినిమా కోసం నాలుగేళ్లు ఏ సినిమాను ఒప్పుకోలేదు. 8. బాహుబలికి సినిమా కోసం ప్రిపేర్ అవ్వడానికి తన ఇంట్లో వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేసుకున్నాడు. 9. బాహుబలి కోసం ప్రభాస్ సుమారు 30 కిలోలు బరువు పెరిగాడు. 10.. బాహుబలి కోసం మిస్టర్ వరల్డ్ 2010 లక్ష్మణ్ రెడ్డి వద్ద శిక్షణ తీసుకున్నాడు. 11.. ప్రభాస్‌కు ఇష్టమైన నటుడు రాబర్ట్ డి నిరో. చదవండి: ‘రాధేశ్యామ్’ సర్ప్రైజ్.. ప్రభాస్ లుక్ అదుర్స్ -
కలెక్టర్‌నైనా అమ్మానాన్నకు బిడ్డనే..
అమృతాన్ని పంచేది అమ్మ.. అనురాగాన్ని అందించేది నాన్న.. బాల్యంలో చందమామ రావే అంటూ ఆకాశమే హద్దుగా అమ్మ చేసే ఉపదేశం, నాన్న గుండెలపై ఆడుకున్న క్షణాలు మనిషి జీవితంలో చెరగని జ్ఞాపకాలు. బిడ్డల ఆనందమే తమ ఆనందంగా భావిస్తారు తల్లిదండ్రులు.. వారి ప్రేమ, ఆప్యాయత, అనురాగం వెల కట్టలేనివి. ఈ లోకంలో మంచివాళ్లు.. చెడ్డవాళ్లు ఉంటారేమో గానీ.. ఎంత వెతికినా.. ప్రేమ లేని అమ్మ.. బాధ్యత లేని నాన్న ఉండరు. అందుకే పిల్లలపై వారి ప్రేమ అపూర్వమైనది.. అసాధారణమైనది. తల్లి జన్మనిస్తే.. ఆ జన్మకు సార్థకత చేకూర్చేందుకు నిత్యం శ్రమించే వ్యక్తి తండ్రి. పిల్లల ప్రతి మలుపులో.. ప్రతి బాధలో.. గెలుపులో తోడుగా నిలిచేది వారే. అందుకే తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు.. నేడు నేషనల్ పేరెంట్స్ డే సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం.. –సాక్షి ప్రతినిధి, కడప తల్లిదండ్రులందరికీ పేరెంట్స్‌డే శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మా తండ్రి డాక్టర్ విజయ్‌కుమార్ (గైనకాలజిస్ట్ కమ్ ఎండోస్కోపిక్ సర్జన్), ప్రభుత్వ వైద్యునిగా రిటైర్డ్, తల్లి పద్మజలను గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. లైఫ్‌లో ఎప్పుడూ ఒత్తిడి లేకుండా చూశారు. ‘నీ ఇష్టమైనదే చదువు. అందుకోసమే సన్నద్ధమై లక్ష్యం సాధించాలి’ అని చెప్పేవారు.కష్టపడితేనే సుఖం ఉంటుందని మార్గనిర్దేశం చేసేవారు. విమానంలో వెళ్లే స్థోమత ఉన్నా రైళ్లోనే ప్రయాణించమని చెప్పేవారు. ఏసీ కోచ్‌లో వెళ్లే అవకాశం ఉన్నా స్లీపర్‌లోనే పంపేవారు. కార్లున్నా ఆటోలోనే వెళ్లమనేవారు. ఏ పనైనా మనం చేసి చూపించిన తర్వాతనే అవతలి వాళ్లకు చెప్పి చేయించుకోవాలనేవారు. నా ఉద్యోగంలో నేను ఇప్పటికీ అదే పాటిస్తాను. నాన్న స్ట్రిట్...అమ్మ గారాబం. పరిస్థితి బ్యాలెన్స్‌గా ఉండేది. నేను ఒక జిల్లాకు కలెక్టర్ అయినా అమ్మానాన్నల బిడ్డనే. రోజూ ఫోన్లో మాట్లాడతారు...టైంకు భోం చేశావా అని అడుగుతారు. ఆరోగ్యం జాగ్రత్త అంటారు... ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించుకోవాలి. వారు లేకపోతే పెద్దవారు లేరన్న భరోసా పోతుంది. వారికి ఏమి కావాలో చూసుకోవాలి. మేము మీకు ఉన్నామన్న భరోసా కల్పించాలి. అప్పుడే వారు ఎక్కువ కాలం మనతో ఉంటారు. తల్లిదండ్రులు బిడ్డల కోసం పరితపిస్తుంటారు.. పిల్లలు పుట్టగానే ఉజ్వల భవిష్యత్తు కళ్లముందే సాక్షాత్కరిస్తున్నట్లు కలగంటారు. జీవితంలో క్షణం తీరిక లేకుండా బిడ్డల అభివృద్ధి కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటారు. గొప్పవాళ్లుగా తీర్చే ప్రయత్నంలో పుస్తెలు తాకట్టు పెట్టి, ఫీజులు కట్టిన తల్లులు ఉన్నారు. రక్తాన్ని స్వేదంగా మార్చి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దిన నాన్నలెందరో ఉన్నారు. మనకు జన్మనిచ్చి.. నిలబడటానికి ఆసరా ఇచ్చి.. తలెత్తుకు తిరగడానికి ఇంత మంచి జీవితాన్నిచ్చిన తల్లిదండ్రుల రుణం ఏమిచ్చి తీర్చుకోగలం! వృద్ధాప్యంలో ఒంటరిగా ఉన్నామనే భావన వారిలో కలగకుండా చూసుకుంటే చాలు కదా! అదే పిల్లల నుంచి తల్లిదండ్రులు కోరుకునేది. ఉద్యోగ రీత్యా మనం ఎంత బిజీగా ఉన్నా.. రోజుకు ఒక్కసారి, ఒక్క నిమిషం పలకరించినా కన్నవారు సంతోషిస్తారు. మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన అమ్మా నాన్నలు.. నిజంగా అమృత మూర్తులే. అందుకే మన పురాణాలు ‘మాతృ దేవోభవ... పితృదేవోభవ’అంటూ ఉపనిషత్తులు దేవతల స్థాయినిచ్చి గౌరవించాయి. ఆదివారం నేషనల్ పేరెంట్స్‌డే సందర్భంగా ప్రముఖుల తల్లిదండ్రుల గురించి వారి మాటల్లోనే... –సాక్షి నెట్వర్క్, కడప తల్లిదండ్రులతో ఎస్పీ అన్బురాజన్(ఫైల్) తోడు–నీడలా అమ్మానాన్న మాది తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు. నేను నాల్గవ తరగతి చదివేప్పుడు ఇతరుల పొలంలోని టెంకాయ చెట్టు ఎక్కి కాయ కోసుకుని తిన్నదీ గుర్తే....అప్పుడు తోట వాచ్మెన్ వచ్చి అరవడంతోపాటు మా నాన్న(కు) నాగేంద్రకుమార్‌కు ఫిర్యాదు చేశాడు. ఇంటికి తెచ్చి థర్డ్ డిగ్రీ చూపించారు. అప్పటి నుంచి తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నాను. తొమ్మిదో తరగతిలో కోయంబత్తూరులో ఐఏఎస్, ఐపీఎస్ (సివిల్స్)కు ప్రిపరేషన్ గురించి అవగాహన సదస్సు జరిగింది. దానికి కలెక్టర్, కమిషనర్లతో పెద్ద స్థాయి అధికారులు హాజరయ్యారు. మా నాన్న హెడ్మాస్టర్ కావడంతో నన్ను ఒక మంచి స్థాయిలో నిలుపాలన్న ఆశయంతో అక్కడికి తీసుకెళ్లి నాలో స్ఫూర్తి రగిలించారు. సివిల్స్‌లో మూడుసార్లు దగ్గరగా వచ్చి మిస్ అయిన సందర్భంలో అమ్మ షణ్ముగవల్లీ (టీచర్) చూపిన ఆదరణ ఎప్పటికీ మరిచిపోలేను. బాధలో ఉన్న నాకు ఆమె వెన్నంటే ఉండడంతోపాటు ఓదారుస్తూ మళ్లీ సివిల్స్‌లో నిలబడేలా చేసింది. ఆమె చూపిన ప్రోత్సాహం.... నాన్న స్ఫూర్తి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. తల్లిదండ్రులు ఇద్దరినీ మరిచిపోలేను. పేరెంట్స్‌డే సందర్భంగా తల్లిదండ్రులందరికీ శుభాకాంక్షలు. – కేకేఎన్ అన్బురాజన్, ఎస్పీ, కడప మా కోసం నాన్న దూరంగా గడిపేవారు... మాది రాజస్తాన్‌లోని జయపూర్.. నాన్న జశ్రాం మర్మట్ సీజీఎస్టీలో సూపరింటెండెంట్..అమ్మ విమల గృహిణి..కుటుంబాన్ని నడపడానికి నాన్న చాలా కష్టపడేవారు. పెద్ద కుటుంబం మాది. కష్టపడి పనిచేయడం ద్వారా ముందుకు వెళ్లాలనేది నాన్న మనస్తత్వం. జీవన గమనంలో ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఎనిమిదేళ్లపాటు ఒంటరిగా వేరే రాష్ట్రంలో ఉన్నారు. ఎందుకంటే నేను సివిల్స్...చెల్లి ఐఐటీ కోచింగ్ కోసం ప్రిపేరవుతుంటే అమ్మ మాతో ఉండేది. మాకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూసుకునేది. తరచూ మా ఇద్దరికీ మానసిక స్థైర్యాన్ని నూరిపోస్తూ ఉండేది. పెద్ద కుటుంబంలో నాన్న ఒక్కరిదే సంపాదన. మా అవసరాలకు ఎప్పుడూ ఇబ్బంది కలగకుండా చూసుకునేవారు. మా చదువుల సమయంలో వారెన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. నాన్న, అమ్మ తోడ్పాటుతో ఐఎఎస్(2019 బ్యాచ్)కు ఎంపికయ్యాను. తొలిసారి అసిస్టెంట్ కలెక్టర్‌గా కడపకు వచ్చాను. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలతో సన్నిహితంగా ఉండాలి.. స్నేహితుల మాదిరిగా కలిసిపోతే ఇబ్బందులు ఎదురుకావు. పిల్లలతో మాట్లాడుతుండాలి. వారి అభిరుచులు..ఆకాంక్షలను గుర్తించగలిగాలి.. అలా చేస్తే పిల్లలకు మానసిక ఒత్తిడి ఉండదని నా అభిప్రాయం. మా తల్లిదండ్రులు ఇలానే చేశారు. జీవితం ఒక్కసారే వస్తుంది..దాన్ని ఆనందమయంగా మలుచుకోవాలని మా అమ్మ చెప్పే మాటలు నాకు ఎప్పుడూ గుర్తొస్తాయి. -వికాస్ మర్మట్, అసిస్టెంట్ కలెక్టర్, కడప అమ్మ ఆదర్శం.. నాన్న లక్ష్యం మాది రేణిగుంట మండలంలోని ఓ గ్రామం. నాన్న ఎం.సూర్యప్రకాశ్‌రెడ్డి పారిశ్రామికవేత్త. కుటుంబంలో ఒకరిని అయినా ఉన్నత స్థానంలో నిలపాలని కలలు గన్నారు. అందుకు అనుగుణంగా నాన్న సోదరుడిని ఐఏఎస్‌లో పెద్ద స్థానంలో నిలబెట్టారు. అయితే మా కుటుంబంలోనూ ఒకరైనా ఉండాలన్న తలంపు నాన్నలో బలంగా ఉండింది. నన్ను సివిల్స్ వైపు నడిపించారు. ఆ రోజుల్లో సివిల్స్ త్రుటిలో మిస్సయినా తర్వాత గ్రూప్–1లో స్థానం సాధించాను. నాన్న లక్ష్యమంతా కూడా ప్రభుత్వ సంస్థలో ఉన్నతాధికారిగా ఉండి పేద వర్గాలకు సేవ చేసే అవకాశం లభిస్తుందని సివిల్స్ వైపు ప్రోత్సహించారు. అమ్మ సావిత్రి కూడా ఆడపిల్లలు ఆర్థికంగా బాగుండాలని చెబుతూ ఉండేది. అందుకు చదువే ముఖ్యం అని చెప్పేవారు. ఐఏఎస్ క్యాడర్ వచ్చిన తర్వాత బాధ్యతలు పెరిగాయి. భర్త రోహిత్ కూడా అండగా నిలిచారు. మా బాగు కోసం పరితపించిన కుటుంబ పెద్దలను ఎప్పటికీ మరిచిపోలేను. ఇప్పటికీ తల్లిదండ్రులు చూపిన దారిలోనే పయనిస్తున్నాను. – ఎం.గౌతమి, జాయింట్ కలెక్టర్, కడప పేరెంట్స్‌ను బాగా చూసుకోవాలి మా తండ్రి చంద్రకాంత్‌వర్మ (మద్రాసు ఫర్టిలైజర్స్ లిమిటెడ్ మార్కెటింగ్ విభాగంలో పనిచేసేవారు). తల్లి జ్ఞానేశ్వరి (రిటైర్డ్ స్కూలు టీచర్). ఇద్దరూ నన్నెంతగానో ప్రోత్సహించారు. నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో మా తల్లి గారు మరింత మద్దతు పలికారు. ఇంజనీరింగ్ ఐఐటీలో చేశాను. సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటిలో ఉంటూ సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాను. ఆ సమయంలో మా తండ్రి నాకు అవసరమైన పుస్తకాలు, ఇతరత్రా సామగ్రిని అందించేవారు. అమ్మ నన్ను అనుక్షణం జాగ్రత్తగా చూసుకుని మరింతగా ప్రోత్సహించారు. తల్లిదండ్రుల ప్రోత్సహంతోనే నేను ఈ స్థాయికి వచ్చాను. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలి. వారిని బాగా చూసుకోవడం మన బాధ్యత. అది చేయలేనపుడు ఏం సాధించినా ఉపయోగం లేదు. తల్లిదండ్రులను చూసుకోలేని వాడు దేనికీ పనికి రాడు. –సాయికాంత్‌వర్మ, జేసీ (అభివృద్ధి), కడప వారి కష్టం మాకు రాకూడదని... మాది వేంపల్లె మండలం రామిరెడ్డిగారిపల్లె. దిగువ మధ్యతరగతికి చెందిన సన్నకారు రైతుకుటుంబం. మా తల్లిదండ్రులు ఓబుల్‌రెడ్డి, గంగమ్మలకు మేము ముగ్గురు సంతానం. నేను పెద్దవాడిని, నాతరువాత తమ్ముడు, చెల్లెలు. అప్పట్లో మా పరిస్థితులు ఎలా ఉండేవంటే స్టోరు బియ్యం ఎప్పుడు ఇస్తారా ? అని ఎదురు చూసేవాళ్లం. మాకోసం అమ్మా, నాన్నలు చాలా కష్టపడేవారు. నేను ఇంటర్లో ఉండగా నాన్న చనిపోయారు. అప్పుడు మా చదువు బాధ్యతలను అమ్మ తన భుజస్కంధాలపైన వేసుకుంది. వ్యవసాయం చేసే అమ్మ అతికష్టం మీద చదివించింది. మా పెద్దనాన్న కూడా మాకు సహకరించారు. పిల్లలు సుఖంగా బతకడం కోసం తల్లిదండ్రులు పడే కష్టాన్ని స్వయంగా చూశాను. పీజీ చివరి సంవత్సరంలో అమ్మ కూడా చనిపోయింది. ఎంఏ ఎకనామిక్స్ పూర్తయ్యాక ఉద్యోగం ఇప్పించమని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వద్దకు వెళ్లాను. ఆయన గ్రూప్స్ రాయమని సలహా ఇచ్చారు. ఆ సమయంలో నా ఆర్థిక పరిస్థితి గురించి చెప్పాను. గ్రూప్స్ ప్రిపరేషన్‌కు అయ్యే ఖర్చుల విషయాలన్ని వైఎస్సార్ చూసుకున్నారు. ఫలితంగా ఇప్పుడు నేను ఆర్డీఓగా పనిచేస్తున్నాను. చిన్న ఉద్యోగం వస్తే చాలనుకున్న తల్లిదండ్రులు నేను ఈస్థాయికి చేరుకోక ముందే కాలం చేయడం నన్ను ఎప్పటికీ బాధిస్తుంటుంది. ఎప్పుడూ తల్లిదండ్రుల మనస్సు నొప్పించకండి. –ధర్మచంద్రారెడ్డి, ఆర్డీఓ, రాజంపేట విలువలే పునాదిగా పెంచారు.. మా తల్లిదండ్రులు లక్ష్మిదేవి, గోవిందరెడ్డి (విశ్రాంత ఎల్ఐసీ మేనేజర్) విలువలే పునాదిగా పెంచారు. మనకు ఉన్న దాంట్లో పదిమందికి సాయం చేయడం నేర్పారు. ప్రాథమిక, మాధ్యమిక, ఇంటర్ విద్య అంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే పూర్తిచేశాను. మా ఇంట్లో నాతో పాటు మా బంధువులు, తెలిసిన వారు కూడా కలిసిమెలిసి చదుకునేవాళ్లం. అందరినీ అమ్మ బాగా చూసుకునేది. 1984లో ఇంజినీరింగ్‌లో మహిళలు చదవడం తక్కువగా ఉండేది. నాకు ఎంతో ఇష్టమైన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదవాలనుకున్న సమయంలో తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు. 1984–88 విద్యాసంవత్సరంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఏకైక మహిళా విద్యార్థిని. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే 27 సంవత్సరాలకు పైగా బోధనా రంగంలో రాణించగలిగాను. ప్రస్తుతం వైవీయూకు వైస్ చాన్సలర్‌గా ఉన్నతస్థానంలో ఉన్నామంటే మా తల్లిదండ్రులు నేర్పిన జీవితపాఠాలే మార్గదర్శకం. వారు నేర్పిన విలువలనే మా పిల్లలకు కూడా నేర్పుతున్నాం. ఇప్పటికీ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాం. – ఆచార్య మునగాల సూర్యకళావతి, వైస్ చాన్సలర్, వైవీయూ తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిది మా సొంతూరు పుల్లంపేట మండలం వత్తలూరు. అమ్మ కృష్ణవేణి, నాన్న రామ్మోహన్‌రాజు. అమ్మ, నాన్న ఇద్దరు ప్రభుత్వ టీచర్లు. చిన్నప్పటి నుంచి మమ్మల్ని క్రమశిక్షణగా పెంచారు. మా తల్లిదండ్రులకు మేము ముగ్గురు సంతానం. నేను చివరి వాడిని. మా ముగ్గురినీ ప్రయోజకుల్ని చేయాలని అమ్మా, నాన్న బాగా తపన పడ్డారు. చిన్నప్పుడు బడిలో అమ్మ, నాన్న వద్దనే మేము చదువుకున్నా, అందరి పిల్లల్లానే మమ్మల్ని చూసేవారు. చదవకుంటే కొట్టేవారు. అప్పట్లో అమ్మ, నాన్నకు తక్కువ జీతాలు అయినా మాలో ఎవరికీ చిన్నలోటు కూడా చేయలేదు. పెద్దన్నయ్య చక్రధర్‌రాజు ప్రభుత్వ ఉపాధ్యాయుడు, రెండో అన్నయ్య శశిధర్‌రాజు విద్యుత్‌శాఖలో సబ్ఇంజనీర్, నేను రాష్ట్ర వ్యాయామ విద్య తనిఖీ అధికారిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ముగ్గురం అన్నదమ్ములం రాజంపేటలో ఒకేచోట నివాసముంటున్నాం. నాన్న కొన్నేళ్ల క్రితం చనిపోయారు. మా ఉన్నతిని చేసిన ఆయన ఎంతో సంతోషించారు. అమ్మకు ఏలోటు రానివ్వకుండా కంటికి రెప్పాలా చూసుకుంటున్నాం. -ఈ.భానుమూర్తిరాజు, రాష్ట్ర వ్యాయామ విద్య తనిఖీ అధికారి ప్రతి అడుగులోనూ వారి శ్రమే.. నాపేరు రాచకుంట నాగరాజు. నేను కోడూరులోని అనంతరాజుపేట వైఎస్సార్ ఉద్యాన పరిశోధనస్థానంలో హెడ్‌గా విధులు నిర్వస్తిన్నా. సొంతూరు పులివెందుల. నాన్న ఇడుపులపాయ ఎస్టేట్‌లో మేనేజర్‌గా పనిచేసేవారు. మాది చిన్న వ్యవసాయ కుటుంబం. నా ప్రతి అడుగులోనూ తల్లిదండ్రులు రాచకుంట నారాయణ, లక్ష్మీదేవి శ్రమనే కనపడుతుంది. మూడునెలలక్రితం అమ్మ కాలం చేశారు. ఇప్పటికీ వారు పడిన కష్టం, త్యాగం గుర్తుచేసుకుంటూ ఉంటాను. మార్గదర్శకులు మా అమ్మానాన్నలే నా జీవిత ఔన్నత్యానికి మార్గదర్శకులు. నాన్న చిత్తూరు జిల్లాలోని మా గ్రామానికి సర్పంచ్‌గా ప్రజల ఆదరాభిమానాలు పొందారు. అమ్మ గృహిణిగానేగాక నాన్నకు రాజకీయాల్లో స్నేహితురాలిగా ఉంటూ ప్రోత్సహించారు. బిడ్డల బాగోగుల కోసం ఎంత శ్రద్ధ చూపారో గ్రామం అభివృద్దికి కూడా అదే స్థాయిలో కృషి చేశారు. మా గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయించి నన్ను అందులోనే చదివించారు. చదువుకు మించిన ఆస్తి లేదని బోధించారు. కష్టాలు వచ్చినపుడు సవాలుగా స్వీకరించి విజయం సాధించేవారు పట్టువదలవద్దని నూరిపోశారు. చదువు వరకు పాఠశాల గురువులు మార్గదర్శకులైతే నా జీవితానికి ఉపయుక్తమైన మార్గదర్శనం చేసింది అమ్మా నాన్నలే! నాన్న ముగ్గురు ముఖ్యమంత్రుల నుంచి ఉత్తమ సర్పంచ్‌గా అవార్డును స్వీకరించారు. మా దంపతులం కూడా అమ్మనాన్నను ఆదర్శంగా తీసుకున్నాం. – శంకర్ బాలాజీ, అసిస్టెంట్‌కమిషనర్, జిల్లా దేవదాయశాఖ తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే... తమ పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలని తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారు. వారి కలలను సాకారం చేసినప్పుడే మన జన్మకు సార్థకత లభిస్తుంది. మానాన్న ఎస్ఐగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. నన్ను పోలీస్ డిపార్ట్మెంట్లో అధికారిగా చూడాలన్నది వారి ఆశ. ఈక్రమంలో చదివించేందుకు ప్రోత్సహించారు. నేను కూడా చిన్నప్పటి నుంచి బాగా చదువుకున్నా. మాసొంతూరు నందలూరు. విద్యాభ్యాసం రాజంపేటలోనే సాగింది. ఎంబీఏ హైదరాబాద్‌లో చేశా. ఆ తరువాత గ్రూప్స్ రాసి డీఎస్పీ అయ్యాను. ఇప్పుడు గుంటూరు డీఎస్పీగా పనిచేస్తున్నా. అమ్మా, నాన్నల కోరిక వల్లే నేను ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకున్నా. యూత్‌కి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. ‘‘ఫస్ట్ తల్లిదండ్రులను ప్రేమించండి, వారిని గౌరవించండి. వారు ఇచ్చే సలహాలు, సూచనలను పెడచెవిన పెట్టవద్దు’’. నిజమైన శ్రేయోభిలాషులు, ఆత్మీయులు తల్లిదండ్రులే. – సుప్రజ, డీఎస్పీ, గుంటూరు –(రాజంపేట టౌన్) -
జిరాక్స్ రాయ్
దేవుడికి నమూనాల అవసరం ఉంటుందా! ఆయన క్రియేటర్. అచ్చులు.. మూసలతో దేన్నీ రిపీట్ చెయ్యడు. ప్రతిదీ దేనికదే కొత్తది తయారవుతుందక్కడ. మరేమిటి.. ఐశ్వర్యారాయ్‌కి ఇక్కడిన్ని జిరాక్స్ కాపీలు?! రాయ్‌కి, ‘దేవ్’కి మధ్య ఒప్పందం జరిగిందా! ఇరవై ఏళ్ల క్రితం ఐశ్వర్యారాయ్ ఎలా ఉండేవారు? ఇప్పుడున్నట్లే ఉండేవారు. పెద్దగా ఛేంజ్ లేదు ఆమెలో ఎందుకో మరి! కిందికి వచ్చే ముందే పైన దేవుడితో డీల్ కుదిరి ఉండాలి. ‘స్వామీ.. నన్నెప్పటికీ ఒకేలా ఉంచండి’ అని ఐష్ అడిగితే.. ‘అలా కుదరదు గానీ అమ్మాయీ.. ఎవ్రీ ఇయర్ ఎక్కడో ఒక చోట నీలాంటి అమ్మాయిలు ‘పాప్–అప్’ అయి (పైకి లేస్తూ) అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు’ అని దీవించి ఉంటాడు ఆ దైవమాత్రుడు.. ఈ మానవకన్యను. ‘మిస్‌వరల్డ్’ అయినప్పుడు ఐశ్వర్య వయసు 21. తొలి సినిమా ‘ఇరువుర్’లో 24. పెళ్లి నాటికి 34. ఇన్ని ఏజ్లలోనూ ఇప్పటికీ ఐశ్వర్య ఒకేలా కనిపించడానికి ఆమె రూపంలో ఎప్పుడూ ఎవరో ఒకరు ఈ భువిపై మనకు సాక్షాత్కరిస్తూ ఉండటం ఒక కారణం అయి ఉండాలి. కొత్తగా అమ్యూజ్ అమృత అనే అమ్మాయి ఐశ్వర్యలా టిక్‌టాక్‌లో దర్శనం ఇస్తోంది. 2002 నాటి ‘కండుకొండైన్ కండుకొండైన్ (నేను కనుగొన్నాను. నేను కనుగొన్నాను) అనే తమిళ చిత్రంలో మమ్ముట్టికి, ఐశ్వర్యకు మధ్య చిన్న సంభాషణ ఉంది. ఆ సంభాషణను టిక్‌టాక్‌లో అమ్యూజ్ అమృత ఇమిటేట్ చేశారు. ఆ మాట్లాడ్డం, మాట్లాడుతూ పాజ్లు ఇవ్వడం, కళ్లు తిప్పడం, పెదవులు కదల్చడం.. సేమ్ జిరాక్స్ ప్రింటే ఐశ్వర్యకు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. అందులో శుద్ధ సంప్రదాయ కర్ణాటక ఐశ్వర్యలా కనిపించే అమృత తన ఇన్స్టాగ్రామ్ లో ‘మిలే సుర్ మేరా తుమ్హారా’ అన్నట్లు.. భారతదేశంలోని భిన్న సంస్కృతులలో ఐశ్వర్య హావభావాలతో కనిపిస్తుంది. అమ్యూజ్ అమృతను చూస్తే ఐశ్వర్య ఎలా ఫీల్ అవుతారో కానీ.. స్నేహా ఉల్లాల్‌ని చూసినప్పుడు మాత్రం ‘అరె!!’ అనుకున్నారట. ఐశ్వర్య ఫస్ట్ కాపీ స్నేహా ఉల్లాల్. ‘లక్కీ : నో టైమ్ ఫర్ లవ్’ (2005) చిత్రంతో సడన్‌గా ఉల్లాల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు.. ‘ఎక్కడ వెతికి పట్టుకున్నాడు ఈ అమ్మాయిని సల్మాన్?’ అని అంతా అనుకున్నారు. అందులో హీరో సల్మానే. ఐశ్వర్య తన ప్రేమను కాదన్నందుకు ఆమెకు పోటీగా సల్మాన్ ఏడు లోకాలు వెతికి ఉల్లాల్‌ను పట్టుకొచ్చాడని ఆ సినిమాతో పాటే రూమర్లూ రిలీజ్ అయ్యాయి. మస్కాట్‌లో పుట్టిన ఈ మంగుళూరు అమ్మాయి మన తెలుగులో కూడా నటించింది. ‘ఉల్లాసంగా.. ఉత్సాహంగా’, ‘సింహా’లలో లీడ్ రోల్స్ ఉల్లాల్వి. చక్కగా కుందనపు ఐశ్వర్యారాయ్‌లా ఉందనుకున్నారు ప్రేక్షకులు. ఆ మాట నచ్చినట్లు లేదు ఉల్లాల్‌కి. ‘‘మీరు అచ్చు ఐశ్వర్యలా ఉంటారని అంతా అంటుంటారు కదా..’’ అని ఒక ఇంటర్వూ్యలో అడిగిన ప్రశ్నకు.. ‘‘ఐశ్వర్యా! ఎవరూ?!’’ అని చికాకు పడ్డారు కూడా. మరీ ఉల్లాల్లా అచ్చుగుద్దినట్లు ఐశ్వర్యలా లేకపోయినా.. ‘ఆనందం’ (2001) సినిమాలో హీరోయిన్ రేఖా వేదవ్యాస్, అదే ఏడాది విడుదలైన ‘ఇట్లు.. శ్రావణి, సుబ్రహ్మణ్యం’లో తనూరాయ్ కొన్ని యాంగిల్స్‌లో ఐశ్వర్యను గుర్తుకు తెచ్చారు. ఏళ్లు గడిచాయి. ఐశ్వర్యలా కనిపించిన ఉల్లాల్, రేఖ, తనూరాయ్ మారిపోయారు కానీ, ‘అసలు ప్రతి’ ఐశ్వర్య మాత్రం అలానే ఉండిపోయారు. మరాఠీ నటి మానసీ నాయక్, బెంగాలీ నటి మిష్టీ చక్రవర్తిలో కూడా ఐశ్వర్య పోలికలు ఉంటాయి. అమ్యూజ్ అమృతకు కాస్త సీనియర్లు మానసీ, మిష్టి. మామూలుగానే మనిషిని పోలిన మనిషి కనిపించినప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఇక ఐశ్వర్యలాంటి వాళ్లు ఏడాదికొకరు అన్నట్లు ప్రత్యక్షం అవుతుంటే ఐశ్వర్యకు వయసు పెరుగుతుందా? వన్నె తగ్గుతుందా? ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’లో నటిస్తున్నారు ఐశ్వర్య. ఎన్ని గ్యాపులతో ఎన్ని సినిమాల్లో నటించినా ఐశ్వర్యకు అది ఎంట్రీనే తప్ప రీ–ఎంట్రీ అవకపోవడానికి ఆమె కాలాతీత అభినయ సౌందర్యం కానీ, ఆమె సౌందర్యాభినయం గానీ ఆమెలో ప్రధాన పాత్రను పోషిస్తూ ఉండి ఉండొచ్చు. -
అసత్యాల్నిచీల్చి చెండాడిన సత్యం!
యూదులు రెండువేల ఏళ్ళ క్రితం పస్కా పండుగనాడు యేసుక్రీస్తును శుక్రవారం రాత్రి సిలువ వేసి చంపి, అరిమతై యోసేపు అనే ఒక రహస్య క్రైస్తవునికి చెందిన రాతిసమాధిలో ఆయన్ను ఖననం చేశారు. అయితే యేసుక్రీస్తు తాను మునుపే ప్రకటించినట్టుగా, ఆదివారంనాటి తెల్లవారు జామునే పునురుత్థానుడు కాగా, తిరిగి సజీవుడైన యేసుక్రీస్తును విశ్వాసులైన స్త్రీలు మొదట చూశారు. వారిద్వారా ప్రభువు శిష్యులు తెలుసుకొని వెళ్లి ఖాళీ సమాధిని చూశారు. అయితే ప్రభువే వారికి ప్రత్యక్షమై తనను తాను కనపర్చుకున్నాడు. ఆ విధంగా యేసు పునరుత్థానమే పునాదిగా క్రైస్తవం ఆరంభమైంది. అలా చాలా కొద్దిమందితో, యేసును సిలువ వేసిన యెరూషలేమే కేంద్రంగా, ఆయన్ను సిలువ వేసిన యూదుల మధ్యే ఆరంభమైన క్రైస్తవంలోకి యూదులతో సహా ఎంతో మంది చేరుతూండగా అది ఎల్లలు దాటి ప్రపంచమంతా విస్తరించి, ఈనాడు 210 కోట్ల మంది విశ్వాసులున్న అతి పెద్దమతంగా ప్రపంచంలో సుస్థిరమైంది. ప్రపంచ చరిత్రలో అలా జరిగిన ఒక కుట్ర పటాపంచలై యేసుక్రీస్తు సారథ్యంలో ప్రేమ, క్షమాపణలే ముఖ్యాంశాలుగా ఆయన స్థాపించిన ప్రేమ సామ్రాజ్యంగా క్రైస్తవం తన ఉనికిని చాటుకుంది. పామరులు, పిరికివాళ్ళు, సమాజంలో ప్రాబల్యం లేనివాళ్లయిన విశ్వాసులతో కూడిన క్రైస్తవం ఇంతటి స్థాయికి ఈనాడు ఎలా ఎదిగింది? ఆ పిరికివాళ్ళనే దేవుడు తన శక్తితో నింపాడు. ‘మీరు జీవాధిపతిని చంపారు, కాని దేవుడు ఆయన్ను మృతులలో నుండి లేపాడు. అందుకు మేము సాక్షులము...’ అంటూ వేలాదిమంది యూదుప్రముఖుల సమక్షంలో యేసుక్రీస్తు సిలువ మరణాన్ని, ఆయన పునరుత్థాన మహా ఘటనను శిష్యులైన పేతురు,యోహాను కలిసి అవి జరిగిన కొద్దిరోజులకే యెరూషలేము మహాదేవాలయ ప్రాంగణంలో ప్రకటించారు. విశేషమేమిటంటే, నాడు పస్కాపండుగ రాత్రి గెత్సేమేనే తోటలో ప్రార్థనలో ఉన్న యేసుక్రీస్తును యూదా ఇస్కరియోతు అనే మరో శిష్యుని విద్రోహం కారణంగా రోమా సైనికులొచ్చి నిర్బంధించినపుడు, యేసు ఎవరో నాకసలు తెలియదంటూ మూడుసార్లు నిర్లజ్జగా బొంకి పేతురు పారిపోయిన ఉదంతాన్ని కూడా తన సువార్తలో ఎంతో విపులంగా ప్రస్తావించిన లూకా సువార్తికుడే, యేసును కుట్రచేసి చంపిన యూదు మతపెద్దలు, శాస్త్రులున్న గుంపును ఉద్దేశించి, పునరుత్థానుడైన యేసు ప్రభువును కళ్లారా చూసిన నూతనోత్తేజంతో ఇది జరిగిన దాదాపు 55 రోజులకే పేతురు ఆత్మవశుడై ఎంతో ధైర్యంగా చేసిన ఈ ప్రకటనను కూడా తన అపొస్తలుల కార్యాల గ్రంథంలో ప్రస్తావించాడు (లూకా 22:39–62), (అపో.కా 3:15). సిలువ వెయ్యడానికి సైనికులు యేసుక్రీస్తును నిర్బంధించి తీసుకెళ్తుంటే ప్రాణభయంతో ఆయన్ను వదిలేసి పారిపోయిన పిరికి పేతురుకు, అది జరిగి రెండు నెలలైనా కాకముందే ‘మీరంతా యేసు హంతకులు, యేసు హత్యకు, ఆయన పునరుత్థానానికి కూడా మేము సాక్షులం’ అంటూ నిలదీసే ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? అది క్రైస్తవానికి యేసుక్రీస్తువారి పునరుత్థాన శక్తి ద్వారా వచ్చింది. వాస్తవమేమిటంటే, క్రీస్తును తెలుసుకొని ఆయన అనుచరులముగా క్రైస్తవులమైతే అయ్యాము కానీ, ఆయన పునరుత్థానశక్తిని మాత్రం పూర్తిగా అవగాహన చేసుకోలేక దాన్ని పొందలేక పోతున్నాము. పునరుత్థానశక్తికి లోకపరమైన శక్తితో ఏమాత్రం పోలికలేదు. ఒక రాయిని కొండమీది నుండి భూమ్మీదికి తోసేందుకు తోడయ్యేది మామూలుగా లోకంలో అందరిలోనూ ఉండే శక్తి అయితే అదే బండరాయిని భూమ్మీదినుండి కొండ మీదికి దొరలించేందుకు ఉపకరించేది యేసుప్రభువు వారి పునరుత్థాన శక్తి!! యేసుప్రభువు వారి ప్రేమ, క్షమాపణ అనేవి అర్థమైతేనే ఈ శక్తి అర్థమవుతుంది, లభ్యమవుతుంది. రెండువేల ఏళ్ళ క్రితం నాటి ్రౖకైస్తవంలో ఎక్కువగా పామరులు, సామాన్యులే ఉన్నారు కాని వాళ్ళు క్రైస్తవాన్ని భూదిగంతాలకు విజయవంతంగా తీసుకువెళ్లడం వెనుక ఈ శక్తి ఉంది. అందుకే ఆ శక్తిని తాను తెలుసుకోవడానికే ప్రయాసపడుతున్నానని మహా అపొస్తలుడు పౌలు అన్నాడు (ఫిలిప్పి 3:11). – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
మహమ్మారిపై మహాపోరు
మందు కనిపెట్టే వరకే ఏ మహమ్మారి అయినా విజృంభిస్తుంది. కనిపెట్టాక తోక ముడుస్తుంది. కరోనా ఇప్పుడు తనకు మందు లేదని విర్రవీగుతోంది. కాని దాని పడగను నులిమేసే పరిశోధనలు సాగుతూ ఉన్నాయి. రాక్షస సంహారం చేసిన నారీమణులు మన పురాణాలలో ఉన్నారు. చరిత్రలో ఉన్నారు. ఇప్పుడు కరోనా తరిమివేతలోనూ ఉంటారు. లండన్ మెడికల్ రిసెర్చ్ కౌన్సిల్లో ఈ మహిళా పరిశోధకులు కరోనా గురించి చైతన్యం కలిగించడంలో ముందున్నారు. లండన్‌లో ఉన్న ‘మెడికల్ రిసెర్చ్ కౌన్సిల్’లో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మహిళా పరిశోధకులంతా కలిసి సంతోషంగా సంబరాలు జరుపుకోవాలనుకున్నారు. కాని అంతలోనే వారికి బాధ్యత గుర్తుకు వచ్చింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌పై తమ పరిశోధక శస్త్రాలను ఎక్కు పెట్టాలని సంకల్పం కలిగింది. అక్కడి బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఈ పరిశోధకులు కొవిడ్ 19 మహమ్మారికి సంబంధించి చర్చించి, ప్రజలకు ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందిస్తూ, ప్రజలకు ధైర్యాన్నివ్వాలనుకున్నారు. క్రిజిల్ డొన్నెల్లీ విదేశీయుల ద్వారా ఎంతమందికి ఈ వ్యాధి సోకింది, ఏ విధంగా నియంత్రించాలి అనే అంశాల గురించి చర్చిస్తున్నారు క్రిజిల్ డొన్నెల్లీ. ‘మా పరిశోధనలో తేలిన అంశాలను డబ్లుహెచ్‌ఓ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్)కి అందచేçస్తూ, యుకేలోని ప్రభుత్వ విభాగాలకు, పబ్లిక్ హెల్త్ సెంటర్స్‌కి వాటిని అందిస్తున్నాం. అదేవిధంగా ఐM్కఉఖఐఅఔ’S గిఉఆSఐఖీఉ లో కూడా ఉంచుతున్నాం. సమాచారాన్ని సంక్షిప్తంగా, ప్రతి ప్రాంతీయ భాషలలో అందచేస్తున్నాం. మీడియాకు సహకరించే బాధ్యత నాది. టీవీ, రేడియో, దినపత్రికలు, ఆన్లైన్ ఔట్లెట్స్ (లైవ్, రికార్డెడ్ ఇంటర్వూ్యలు).. అందరికీ అందుబాటులో ఉంచుతున్నాను. బిబిసి కరోనా వైరస్ పాడ్‌క్యాస్ట్‌లో మొట్టమొదటి ఇంటర్వూ్య ఇచ్చాను. ప్రపంచాన్ని వణికించిన ఎబోలా సమయలో ఈ విధంగా పనిచేసిన అనుభవం నాది’ అంటారు క్రిజిల్ డొన్నెల్లీ. డా. యాన్ కొరీ ‘స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఎపిథెమియాలజీ’లో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు డా.యాన్ కొరీ. ‘ప్రజలకు, ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేవారికి ఇది ఒక గడ్డుకాలం. అందరికీ సకాలంలో సరైన సమాచారం అందుతుందనే నమ్మకం లేదు. ఈ వ్యాధి వలన నిజంగానే ప్రమాదం ఉందా లేదా అనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవటం చాలా కష్టం. 2014 – 2016 మధ్య కాలంలో పశ్చిమ ఆఫ్రికాను గడగడలాడించిన ఎబోలా గురించి 2018 నుంచి డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎంత బాధ్యతగా పనిచేస్తున్నామో, ఇప్పుడు కూడా అదేవిధంగా పని చేస్తున్నాం. మేమంతా కలిసి ఎంతో జాగ్రత్తగా ఈ వ్యాధిని నివారించటానికి, నిర్మూలించటానికి కృషి చేస్తున్నాం’ అంటున్నారు డా. యాన్ కొరీ. వెండీ బార్క్లే కొవిడ్ 19 శ్వాసకోశంలోకి ఏ విధంగా ప్రవేశించి, వ్యాప్తి చెందుతుంది అనే విషయంలో పరిశోధిస్తున్నారు. కొత్త కొత్త శాస్త్రవేత్తల గురించి, నిపుణుల గురించి మీడియాకు విస్తృతంగా సమాచారం అందించిన అనుభవం వీరిది. ‘2000 సంవత్సరంలో సార్స్ విషయం బయట పడినప్పుడే గబ్బిలాలలో కరొనా వైర స్ విస్తృతంగా ఉందని తెలుసుకున్నాం. ఇదొక్కటే ఈ వ్యాధి వ్యాప్తికి కారణం కాదు. రెండు గబ్బిలాలలోని వైరస్ కలయిక వల్ల ఈ వ్యాధికి సంబంధించి వైరస్ పుడుతోందని తెలిసింది. ఇది నేరుగా గబ్బిలాల నుంచే మనుషులకు సోకుతోందా లేదా గబ్బిలాల నుంచి ఏదైనా మరొక వాహకం ద్వారా మనుషులకు సోకేలా చేస్తోందా అనేది ఇంకా నిర్థారించాలి’ అంటున్నారు వెండీ బార్క్లే. రెబెకా ప్రైస్ సార్స్ – కోవ్ 2 ఏ విధంగా కొవిడ్ 19కు కారకం అవుతున్నాయనే అంశం గురించి పని చేస్తున్న బృందంలో సభ్యురాలు. ‘దేశాలు, ప్రయోగ కేంద్రాల మధ్య అనుంధానం చాలా కష్టం అనుకున్నాను మొదట్లో. కాని ఎంతో అవగాహనతో బాధ్యతగా పనిచేస్తున్నారు’ అంటున్నారు రెబెకా ఫ్రైస్. డా. అన్నా బ్లాక్నీ (పోస్ట్ డాక్టరల్ రిసెర్చర్) ప్రొఫెసర్ రాబిన్ షటాక్స్ బృందంలో కొవిడ్ 19కి ప్రాథమిక వ్యాక్సిన్ తయారీలో పని చేస్తున్నారు. ‘ఈ వ్యాక్సిన్ తయారీకి మాకు 14 రోజుల సమయం పట్టింది. ఇదొక రికార్డు. అవసరమైన వైరస్‌ను సేకరించి, వ్యాక్సిన్‌ను రూపొందించాం. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ను జంతువులపై ప్రయోగిస్తున్నాం. మా బృందం రూపొందించిన వ్యాక్సిన్‌లో స్వయం నిరోధక శక్తి పెంచే ఆర్‌ఎన్‌ఎ ఉంది. అంటు వ్యాధులకు ఇది అడ్డుకట్ట వేస్తుంది’ అంటారు డా.అన్నా బ్లాక్నీ. ఒక చిన్న సూక్ష్మజీవి యావత్ ప్రపంచానికి తాళం వేసే స్థితి తీసుకువచ్చినా శాస్త్రవేత్తలు మాత్రం అనుక్షణం ఈ వైరసణ నిర్మూలన కోసం శ్రమిస్తున్నారు. ఈ యజ్ఞంలో కొందరు వైద్యులు ఇప్పటికే ఆహుతయ్యారు. వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషికి ఫలితం రావాలంటే, ప్రజలంతా తప్పనిసరిగా సహకరించాలి. ‘‘వ్యాధులు బాధలు ముసిరే వేళ మృత్యువు కోరలు సాచే వేళ/గుండెకు బదులుగా గుండెను పొదిగి.. కొన ఊపిరులకు ఊపిరులూదీ/జీవన దాతలై వెలిగిన మూర్తుల సేవాగుణం మాకందించరావా’’ అంటూ ప్రతి ఒక్కరూ వైద్యులను అభినందించాలి. శాస్త్రవేత్తలకు శిరసు వంచి నమస్కరించాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి. – వైజయంతి ప్రొఫెసర్ అజ్రా ఘనీ ‘సెంటర్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అనాలసిస్’లో తన తోటి ఉద్యోగులతో కలిసి అజ్రా ఘనీ ప్రభుత్వానికి కీలక సమాచారం అందించటంలో అహర్నిశలూ కృషి చేస్తున్నారు. కరొనా వైరస్‌కి సంబంధించిన అత్యంత ప్రధానమైన సమాచారాన్ని మార్చి 16వ తేదీన అందించారు. ‘మేమంతా కరొనాకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో హెచ్చరిస్తున్నాం. 2003లో విజృభించిన సార్స్ వైరస్ సమయంలోనూ, 2009 ఫ్లూ మహమ్మారి వచ్చినప్పుడూ సమాచారాన్ని అందిస్తూ ఏ విధంగా హెచ్చరించామో, ఇప్పుడు కొవిడ్ 19 గురించి కూడా అదే విధంగా హెచ్చరిస్తున్నాం. కేసులు పెద్ద సంఖ్యలో నమోదు కావటం ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ వైరస్ కారణంగా అంతకంతకు పెరుగుతున్న మరణాల సంఖ్య ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అత్యంత వేగంగా విస్తరిచండం కొవిడ్–19కు ఉన్న ప్రత్యేక లక్షణం, అదే సమయంలో అత్యంత ఆందోళనకరం. 50 మందికి పైగా శాస్త్రవేత్తలు కొవిడ్ – 19 గురించి శాస్త్రీయ సమాచారం ఇవ్వడానికి పరిశోధన చేస్తున్నారు’ అంటున్నారు ప్రొఫెసర్ అజ్రా ఘనీ. -
సంశయం! సంకోచం! సందేహం!
ఛత్రపతి శివాజీకి జిజియాబాయి జన్మనిచ్చిన రోజు ఇది. జన్మను మాత్రమే ఇవ్వలేదు జిజియా. జన్మభూమిని కాపాడే శౌర్యాన్ని ఇచ్చింది. స్త్రీలను, పరమతాలను గౌరవించడం నేర్పింది. భారత, రామాయణాల్ని చదివించింది. బలి చక్రవర్తి గాథల్ని వినిపించింది. యుద్ధతంత్రాలలో నిష్ణాతుడిని చేసి, ఖడ్గాన్ని చేతికి ఇచ్చింది. శివాజీ ఖడ్గధారకు అంతటి పదును తల్లి పట్టిన పాల వల్లనే! అతడొక గొప్పచక్రవర్తి అయ్యాడంటే.. ఆమె ఒక ధీశాలి అయిన తల్లి అవడం వల్లనే! మగపిల్లల్ని గొప్ప యోధులుగా తీర్చిదిద్దిన తల్లులే కాదు, గొప్ప యోధులై.. దేశమాతను కాపాడుకున్న ఆడబిడ్డలూ మన దేశ చరిత్రలో ఎందరో ఉన్నారు. రాణీ లక్ష్మీబాయి, రాణీ పద్మిని, రజియా సుల్తానా, అహల్యాబాయ్ హోల్కర్, మాతా భాగ్ కౌర్, ఒనకె ఓబవ్వ, కేలడి చెన్నమ్మ, బెలవాడి మల్లమ్మ, అబ్బక్క రాణి.. ఎన్ని యుగాలకైనా ధ్వని తీవ్రత క్షీణించని శంఖారావాలు. పునీతా అరోరా, పద్మావతీ బందోపాధ్యాయ, మిథాలి మధుమిత, ప్రియా ఝింగన్, దివ్యా అజిత్ కుమార్, నివేదిత చౌదరి, అంజనా బాధురియా, ప్రియా సేవమ్వాల్, దీపికా మిశ్రా, సోఫియా ఖురేషి, శాంటి టిగ్గా, గనెవె లాల్జీ, గంజన్ సక్సేనా, అవని చతుర్వేది, మోహనాసింగ్, భావనాకాంత్.. తానియా శేర్గిల్.. వర్తమాన రక్షణదళ మహిళా క్షిపణులు. ఐక్యరాజ్యసమితి భారతదళ సభ్యులుగా ఆఫ్రికా దేశాలలో, భారత రక్షణ సేనానులుగా పొరుగు దేశాల్లో.. శాంతిని స్థాపించి వచ్చిన లెఫ్ట్‌నెంట్ అనువందన జగ్గీ, మేజర్ గోపికా భట్తీ, మేజర్ మధు రాణా, మేజర్, మేజర్ ప్రీతీసింగ్, మేజర్ అనూజా యాదవ్.. యుద్ధభూముల్లో స్త్రీ శక్తిని చాటిన అస్త్రాలు. మహిళల్ని ఆర్మీలోకి కమాండర్లుగా తీసుకోవడం సాధ్యం కాదు అని సుప్రీంకోర్టులో సోమవారం కేంద్ర ప్రభుత్వం వాదిస్తున్నప్పుడు.. ‘ఎందుకు సాధ్యం కాదూ! సాధ్యం చేసిన, సాధ్యం చేస్తున్న వాళ్ల మాటేమిటి?’ అంటూ పైన ఉదహరించిన వారిలో పదమూడు మంది వర్తమాన మహిళా యోధుల పేర్లను సుప్రీంకోర్టు జడ్జిలు ప్రస్తావించారు. మూడు నెలల్లోగా మహిళల్ని కమాండింగ్ పోస్టులోకి తీసుకోవడం ప్రారంభించాలని తీర్పు చెప్పారు. సైన్యంలోని యుద్ధ విధుల్లో పని చేయాలన్న తపన ఉన్న యువతులకు ఇది ఉత్సాహాన్నిచ్చే తీర్పు. ఐరాస విధుల్లో భారత మహిళా జవాన్లు తొమ్మిదేళ్ల క్రితమే ఢిల్లీ హైకోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చినప్పటికీ, తీర్పును అమలు చేసేందుకు ప్రభుత్వం సంశయించింది. శత్రువుకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండని ఎయిర్‌ఫోర్స్‌లో, నేవీలో పర్వాలేదు కానీ.. శత్రువుకు ఎదురుగా వెళ్లి పోరాడవలసిన సైనికుల బృందానికి మహిళా కమాండర్లని సేనానులుగా పెట్టడం మంచిది కాదు అని ప్రభుత్వ వాదన. వాదన కాదు.. సంశయం! సంకోచం! సందేహం! మహిళల దేహ ధర్మాలు.. యుద్ధ ధర్మాలను సక్రమంగా నెరవేర్చనివ్వవని, మగ సైనికులు మహిళా కమాండర్ మాట వినరనీ, వీళ్లు బట్టలు మార్చుకుంటుంటే వాళ్లు తొంగిచూస్తుంటారనీ, శత్రువు చేతికి మన మహిళ చిక్కితే దేశ ప్రజల హృదయ స్పందనలు హద్దులు, సరిహద్దులు మీరే ప్రమాదం ఉందనీ స్వయంగా ఆర్మీ చీఫే అన్నారు. అయితే.. ‘‘ఇవన్నీ మీరు ఊహించుకుంటున్నవే కానీ.. కర్తవ్య నిర్వహణలో కమాండ్ చేసేందుకు మహిళలు ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటారు’’ అని తీర్పు వెలువరించడానికి ముందు సుప్రీం జడ్జిలు వ్యాఖ్యానించారు. దేశ రక్షణకు ఉవ్విళ్లూరుతున్న యువతుల్ని నిరుత్సాహపరిచేందుకు మనల్ని ప్రేరేపిస్తున్నది వాళ్ల రక్షణ, వాళ్ల భద్రత మాత్రమేనని అనిపిస్తున్నప్పటికీ దానివెనుక తెలియకుండా ఉన్నది వివక్ష మాత్రమే. అది ఉద్దేశ పూర్వకమైన వివక్ష కాకపోవచ్చు. ‘స్త్రీ, పురుషుడు సమానం కాదు’ అనే ఆదిమ భావన నుంచి నేటి ఆధునిక సమాజం కూడా బయటపడలేక పోతోంది. ఇక ఆర్మీలోనైతే చెప్పే పని లేదు. సైనిక పటాలాలను పురుషుడు మాత్రమే నియంత్రించగలడనీ, సమర వ్యూహాలు, ప్రతిభాపాటవాలు పురుషుడికి మాత్రమే ఉంటాయని దివి నుంచి భువికి ఎవరో చెప్పి పంపించినట్లుగా స్థిరపడిపోయింది. మహిళకు అవకాశం రాక (ఇవ్వక) పురుషుడు దేశ రక్షకుడయ్యాడు కానీ.. దేశ రక్షణ బాధ్యతను మోసే బలం మహిళలకు లేదని కాదు. సోఫియా ఖురేషి భారతదేశ రక్షణ వ్యవస్థలోని సైనిక, వైమానిక, నావికా దళాలలో రెండు రకాౖలñ న నియామకాలు ఉంటాయి. షార్ట్ సర్వీస్ కమిషన్. పర్మినెంట్ కమిషన్. షార్ట్ సర్వీస్‌లో విధి నిర్వహణ పదేళ్లు మాత్రమే. సామర్థ్యాన్ని బట్టి మరో నాలుగేళ్ల పొడిగింపు ఉంటుంది. పర్మినెంట్ సర్వీసులో ఉన్నవారు పదవీ విరమణ వయసు వచ్చేవరకు విధుల్లో ఉండొచ్చు. అయితే మహిళల్ని ఉదారంగా రక్షణ దళాల్లోకి తీసుకుంటున్న ప్రభుత్వం.. అంతే ఔదార్యంతో వారిని పర్మినెంట్ కమిషన్‌లోకి తీసుకోవడం లేదు. కోర్టులో దీనిపై తొమ్మిదేళ్లుగా సాగుతూ వస్తున్న వాదోపవాదనల్లోనే.. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు మహిళల్ని కూడా పర్మినెంట్ కమిషన్‌లోకి తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. దీంతో దళాల్ని ముందుకు నడిపించే (కమాండింగ్) బాధ్యతల్లోకి అతి త్వరలోనే మహిళలూ రాబోతున్నారు. ఈ కేసులో ప్రభుత్వం చేసిన ముఖ్యవాదన.. ‘గ్రామాల నుంచి వచ్చిన మగ జవానులు మహిళా కమాండ్ మాట వినరు.. దాంతో యుద్ధ సమయాలలో శుత్రువును కట్టడి చెయ్యడం మనకు కష్టం అవుతుంది. అది దేశ భద్రతకే ప్రమాదం..’ అని! 1992లో భారత సైన్యంలో చేరిన 25 మంది మహిళా అధికారులలో తొలి కేడెట్ అయిన మేజర్ ప్రియా ఝింగన్.. మొన్నటి సుప్రీంకోర్టు తీర్పుకు ఒకరోజు ముందు ఇచ్చిన ఒక ఇంటర్వూ్యలో మన ప్రభుత్వ వాదనకు తగిన సమాధానమే చెప్పారు. ‘‘జవాన్లు మాట వినరని మీరే అనడం ద్వారా.. ‘మహిళా కమాండర్ మాట వినొద్దు’ అని మీరు చెబుతున్నట్లుగా ఉంది’’ అన్నారు ఝింగన్. ఏ సిపాయి అయినా కమాండర్ మాట వినకపోతే సైనిక చట్టాల ప్రకారం పనిష్మెంట్లు ఉంటాయి. పనిష్మెంట్ ఉంటుందన్న భయం ఉంటే.. పై అధికారి పురుషుడైనా, మహిళ అయినా మాట వినే తీరుతారు. ‘మహిళలు కుటుంబం కోసం యుద్ధరంగాన్ని కాదనుకుని పోతారు’ అని మరొక వాదన. అదీ నిజం కాదు. సమర్థతతో, అంకితభావంతో, త్యాగనిర తితో ఏ బాధ్యతనైనా నిర్వర్తించే మనోబలం, నిబద్ధత మహిళల్లో ఉన్నాయి కనుకనే ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పెద్ద వ్యవస్థలు విజయవంతంగా, నిరంతరాయంగా నడుస్తున్నాయి. ప్రియా ఝింగన్ భారతీయ సైనికదళం నూట ఇరవై నాలుగేళ్లుగా ఉంది. అంతకు ఏడేళ్ల ముందు నుంచే సైన్యం కోసం మహిళా నర్సుల సేవలు సిద్ధంగా ఉన్నాయి! మొదటి, రెండు ప్రపంచ యుద్ధాలలో భారత సైన్యంలోని నర్సులు మూడు వందల యాభై మందికి పైగా మరణించడమో, బందీలుగా శత్రువుల చేతికి చిక్కడమో జరిగింది. మరికొందరు అసలు ఏమైపోయారో కూడా తెలీదు. ఆ తర్వాత నలభై ఏడేళ్లకు గానీ మహిళల్ని వైద్యేతర విభాగాల్లోకి తీసుకునే చొరవ చేయలేకపోయింది భారత సైన్యం. తొలిసారి 1992లో నాన్–మెడికల్ విధుల్లోకి మహిళలు ప్రవేశించారు. తర్వాత పదిహేనేళ్లకు మన దేశం నుంచి ఐక్యరాజ్యసమితి తరఫున వందమందికిపైగా మహిళా పోలీసులు శాంతిస్థాపనకోసం లైబీరియా వెళ్లి సమర్థంగా విధులు నిర్వర్తించి వచ్చారు. 2014 నాటికి భారతీయ సైనిక దళంలో 3 శాతానికి, నావికాదళంలో 2.8 శాతానికి, వైమానిక దళంలో 8.5 శాతానికి మహిళ సంఖ్య పెరిగింది. 2015లో తొలిసారి ఫైటర్ పైలట్లుగా మహిళలు యుద్ధవిధుల్లోకీ వచ్చేశారు.