మహాకవి జాషువా ఆధునిక కవితా యుగ ప్రవర్తకుడు. కవిత్వంలో నూత్నప్రత్యామ్నాయ ఆవిష్కరణలు చేసిన ప్రయోక్త. సామాజిక జీవితం లోని వైవిధ్యాలకు అద్దం పట్టిన చిత్ర కారుడు. అస్పృశ్యతా భారతంలోని వేదనను అక్షరదృశ్యాలు చేసి, ఆకాశ నక్షత్రాలుగా వెలిగించిన సృష్టికర్త. గతించి అర్ధ శతాబ్ది అయినా కవికి మరణం లేదని నిరూపించిన పునరుజ్జీవుడు. వస్తువు ఏదైనా శృతిహితంగా తెలుగు నుడికారపు సొగసుతో చెప్పగలిగిన ధీశాలి. ‘రాజు మరణించె ఒక తార రాలిపోయే. సుకవి మర ణించె ఒక తార గగనమెక్కే’; ‘రాజు జీవించు రాతి విగ్రహ ములయందు. సుకవి జీవించు ప్రజల నాల్కలయందు’ అని చెప్పిన జాషువా ప్రజల నాల్కల మీద నర్తిస్తున్నాడు.
ఆయన రచించిన ‘గబ్బిలం’ నాకు లండన్ మ్యూజియం లైబ్రరీలో సాక్షాత్కరించింది. వినుకొండ నుండి గుంటూరుకు, గుంటూరు నుండి ఢిల్లీకి, ఢిల్లీ నుండి లండన్‌కు ఎగబాకిన విశ్వకవి జాషువా. ‘గబ్బిలం’ తెలుగు సాహిత్యంలోని పంచకావ్యాలకు ప్రత్యామ్నాయ కావ్యంగా మలచబడింది. ‘చిక్కిన కాసుచే తనివి చెందు అమాయ కుడు’ ఆయన నాయకుడు. గబ్బిలం అనే నామకరణం ద్వారా అస్పృశ్య జీవుని గురించే కాదు, అస్పృశ్యమైన పక్షుల గురించి కూడా ఆయన గానం చేశాడు. ఆయన కవితా ఖండి కల్లో ‘శ్మశానవాటిక’ అద్భుతమైంది. అందులో దళిత తాత్త్విక వాదాన్ని ప్రవేశపెట్టాడు. ‘ఏలే బుగ్గల సౌరు రూపరి యెనో యేముద్దు నిద్రించేనో! యేలీలావతి గర్భ గోళమున వహ్నిజ్వాల జీవించెనో’ అంటూ సాగిన కవితలో దళితవాడ తత్త్వం ఉంది. ఒక గాఢమైన సామాజిక ప్రపంచం ఉంది. జాషువా కవితలో ఒక సత్యం కళతో మమేకమై ఉంటుంది.
‘ఎన్నో యేండ్లు గతించి పోయినవి గానీ’; ‘కన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొక్కడైనన్ లేచిరాడు; ‘ఎన్నాళ్లీ చల నంబు లేని శయనంబు’; ‘ఏ తల్లులల్లాడిరో’; ‘కన్నీ టంబడి క్రాగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్’; పద్యాన్ని వేదనా ప్రకటనకు, జ్వలిత చైతన్య విస్ఫోటనకు, సమస మాజ నిర్మాణోద్యమ సారథ్యానికి ప్రబలవాహికగా మలుచు కున్న క్రాంతదర్శి జాషువా అనుటలో అత్యుక్తి లేదు. ‘చల నంబులేని శయనంబు’ వంటి చిన్నచిన్న పదబంధాలు గుండెను తొలిచివేస్తాయి. మానవ వాక్కులకందతగిన ఆనం దకరమైనట్టియు, రసస్ఫోరకమైనట్టి, నిర్దుష్టమైనట్టి రచనా శిల్పమే కవిత్వం అన్న ఆంగ్ల విమర్శకుని వ్యాఖ్యానంలోని శిల్పం జాషువా కవిత్వంలో భాసిస్తుంది. కరుణరసప్లావి తమైనపుడు ఏమాత్రం హృదయ స్పందన ఉన్నవాణ్ణి కూడా అంతర్ముఖుణ్ణి చేయగల శక్తి ఆయన కవితకున్నది.
జాషువా కవిత్వంలో కులతత్వ నిరసన ప్రధానాంశం. ఆయన ముందు ప్రకృతిని పరిశీలించారు. అందులో అసమానతలు లేవు. మనుషుల్లో అసమానతలు ఎక్కువ. ఇవన్నీ కల్పించుకున్నవే. కొందరు కేవలం ప్రకృతి కవులు. మరికొందరు ప్రకృతి ఆరాధకులు. ప్రకృతిలో ఉన్న సహజ జీవిత గుణాలను మానవులకు ఉత్తేజంగొల్పే దిశగా వర్ణించడం ఉన్నత కవుల లక్షణం. ఆ ఔన్నత్యమే జాషు వాను మహాకవిని చేసింది. ‘ముసలివాడైన బ్రహ్మకు బుట్టి నారు నలువురు కుమారులనుట విన్నాము గాని, పసర మున కన్న హీనుడభాగ్యుడైన ఐదవ కులస్థుడె వ్వరమ్మా! సావిత్రీ?’ ఈ మాటలు కలంలోనుంచి వచ్చినవి గానీ, గళంలోనుంచి జారినవి గానీ కాదు; ఇవి గుండె రాపిడిలో నుంచి లేచిన నిప్పురవ్వలు. ‘అసమ సమాజం బాకులు గుమ్మినపుడు, అంటరానితనం నిషాగ్నులు చిమ్మిన పుడు, దుర్భర దారిద్య్రం వెన్నుడికినపుడు, దురంత వేదన గుండె లలో తుక తుక ఉడికినపుడు’ పెల్లుబికిన ప్రశ్నల వెల్లువ. భారతమ్మోరిని, భారతీయుల్ని నిలదీసి అడుగు తుంది జాషువా కవిత.
ఆయన నిజజీవితంలో కూడా కరుణార్ద్ర హృదయుడు. కుక్కలను ఎంతో ఇష్టంగా పెంచేవారు. పక్షులకు గింజలేసి ఆదరించేవారు. ఆయన నివసించిన వినుకొండ రామణీ యకమైన ప్రదేశం. ఒక పక్క కొండ, మరో పక్క నది, ఇంకో పక్క అడవి, మరో పక్క ఊరు–వాడ. ఆ ప్రదేశాన్ని చూసిన ప్పుడే కవిత్వమొస్తుంది. తండ్రి వీరయ్య యాదవులు. తల్లి లింగమాంబ దళిత స్త్రీ. తలిదండ్రులిద్దరూ వర్ణాంతర వివా హాన్ని ఆ రోజుల్లోనే ధైర్యంగా చేసుకున్నారు. తండ్రి క్రైస్తవ ఫాదర్. తల్లి ప్రేమమూర్తి. తండ్రిలోని గొల్ల సుద్దుల శ్రుతి వచ్చింది. బైబిల్‌లోని శాంతి, కరుణ, ప్రేమ కవిత్వంలో ప్రవ హించింది. వీరి ‘క్రీస్తుచరిత్ర’కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. వీరి కావ్యాల్లో ‘ఫిరదౌసి’ అత్యుత్తమ మైనది. మోసపోయిన కవి ఆవేదనను దిక్కులు పిక్కటిల్లేలా చెప్పారు.
జాషువా మతమౌఢ్యాన్ని నిరసించారు. ‘వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకింప సంశ యించు’; ‘వారు చెమ్మటలలోడ్చి ప్రపంచమునకు భోజనం బెట్టు వానికి భుక్తి లేదు’ అని సామాజిక ఆర్థిక దోపిడీని ఎలుగెత్తి చాటారు. పగటి దివిటీలతో ఆయన్ని ఊరేగిం చారు. పద్మశ్రీ, పద్మ భూషణ్ వరించాయి. నవయుగ కవి చక్రవర్తిగా కీర్తించ బడ్డారు. శ్రీనాథుడిలా కవిసార్వభౌ ముడు. వేమనలా కవితా సందేశం, తిక్కనలా తెలుగు నుడికారపు విన్నాణవ్‌ు చాటారు.
దళితులకు ఆత్మగౌరవం, ఆత్మ సై్థర్యం నేర్పారు. భారత దేశ సృష్టికర్తలుగా వారిని పేర్కొన్నారు. ఆధునిక దళిత కవితా యుగాన్ని సృష్టించారు. శత్రువుల్ని కూడా ఆశ్చర్య చకితుల్ని చేశారు. తన కూతురు హేమలతను సంస్కర్త అయిన గోరా కుమారుడు లవణంకు ఇచ్చి పెళ్లి చేసి విశ్వజ నీనతను చాటాడు. ‘ముంతాజ్ మహల్’, ‘కాందిశీకులు’, ‘బాపూజీ’, ‘నేతాజీ’ వంటి అనేక కావ్యాలు తెలుగు భాషకు సమర్పించాడు. ‘సాలీడు’, ‘గిజిగాడు’ వంటి ఎన్నో కావ్య చిత్రాలు గీశారు. శిశువు, శ్మశానవాటిక వంటి అమేయమైన కవితా ఖండికలు ఒక్కొక్క కావ్యంతో సమానం.‘వాక్యం రసాత్మకం కావ్యం’ అనేది జాషువాలోనే చూస్తాము. జాతీ యత, మానవత, నవ్యత, శ్రవ్యత, సమత, మమత వంటి అనేక గుణాల శిల్పమే మహాకవి జాషువా. ఆయన పేరు మీద ఒక గొప్ప కళాక్షేత్రాన్ని నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రతి మండలంలో జాషువా సాహితీ గ్రంథాలయాలు నిర్మించి ఆయన రచనలను 6వ తరగతి నుండి ఎంఏ వరకు పాఠ్యగ్రంథాలుగా పెట్టి ఆయన కవితా జీవనవ్యవస్థకు ప్రతిష్ట కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వా లకు ఉంది. ఈ 50వ వర్ధంతిని ఆయన ప్రజ్వలిత కవితా జీవన మార్గంగా భావిద్దాం. ఆ స్ఫూర్తితో పయనిద్దాం.
వ్యాసకర్త ఐసీఎస్‌ఎస్‌ఆర్ సీనియర్ రీసెర్చ్ ఫెలో
(నేడు గుర్రం జాషువా 50వ వర్ధంతి)
Comments
Please login to add a commentAdd a comment