కోట్లాది మంది రాజ్యాధికారానికి నోచుకోకుండా పోవడానికి రాజకీయాల్లో ఉన్న వర్ణతత్వమే కారణం అన్నారు అంబేడ్కర్. నిజానికి అంబేడ్కర్, మహాత్మా ఫూలే, పెరియార్ రామస్వామి నాయకర్ బహుజన వర్గాల సామాజిక, సాంస్కృతిక రాజకీయ విముక్తి కోసం బాటలు వేస్తూనే వచ్చారు. కానీ దళిత బహుజనులు, మైనారిటీలు మత భావాల ఊబిలో కూరుకుపోయారు. రాజ్యాధికారాన్ని అగ్రవర్ణ పార్టీల మీద ఆధారపడి పొందాలనే భావనలోనే ఇంకా ఉన్నారు. దేశంలో సామాజిక న్యాయం సంపూర్ణంగా జరగాలంటే కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించాలి. శూద్రులను రాజకీయంగా, ఆర్థికంగా పైకి తేవడం అన్ని పార్టీల తక్షణ కర్తవ్యం కావాలి.
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించిన బీసీ కుల గణన ఇండియా కూటమికి ప్రధాన ఎజెండాగా ఉంది. దేశంలో సామాజిక న్యాయం సంపూర్ణంగా జరగాలంటే కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించాలి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజ స్థాన్, మిజోరం, తెలంగాణ వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో దగ్గర దగ్గర 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో దళిత బహుజన మైనారిటీలు 85 శాతం. అభ్యర్థులుగా నిలబడుతున్న మెజారిటీ వర్గం అగ్ర కులాలే.
డబ్బును, మద్యాన్ని నియంత్రించడానికి ఈ రాష్ట్రాల్లో 970 చెక్‌పోస్టులు పెట్టారని చెబుతున్నారు. నిజానికి ఎన్నికల వ్యవహారం మొత్తం మద్యం, మాఫియా, డబ్బు పంపిణీలో మునిగిపోయి వుందని అందరికీ తెలుసు. ఎన్నికల బరిలో కోటీశ్వరులు, అవినీతి సమ్రాట్లు, కల్తీ వ్యాపారులు, విద్యా వ్యాపారులు ఎక్కువమంది నిలబడుతు న్నారు. కేసుల్లో ఉన్నవారు భారీగా ఉన్నారు. దీనికి పార్టీల భేదం లేదు. అందులో ఉన్నవారు ఇందులో ఉంటారు. ఆ పార్టీలో ఉన్నవారు టికెట్ లేకపోతే రెండో రోజే జంప్ అవుతారు. సామాజిక న్యాయానికి దూరంగా బతుకుతున్న పార్టీలు ఇవన్నీ. ఇంతకుముందు ఇచ్చిన మానిఫెస్టోనే మరలా కొత్తగా ప్రకటిస్తారు.
రాజ్యాంగాన్ని పూర్తి చేసిన తరువాత అంబేడ్కర్ చేసిన ప్రకటన చాలా విలువైనది. జనవరి 26, 1950 నుంచి వైరుద్ధ్యాల జీవితంలోకి మనం అడుగు పెడుతున్నాం. రాజకీయాల్లో, ఆర్థిక, సాంఘిక జీవి తాల్లో అసమానత్వం, వైరుధ్యాలను తొలగించకపోతే అసమానత్వంతో బాధపడుతున్న ప్రజలు ఈ రాజకీయ ప్రజాస్వామ్య వ్యవ స్థను పేల్చివేస్తారు అని హెచ్చరించారు. ఇది చాలా వాస్తవమైన ప్రక టన. రాజ్యాంగం ఇచ్చిన హక్కును గౌరవించలేని అంధత్వం సోకాల్డ్ రాజకీయ నాయకుల్ని వెంటాడుతోంది.
అంబేడ్కర్ భారతదేశానికి బ్రాహ్మణవాదం, పెట్టుబడిదారీ వాదాలను శత్రువులన్నాడు. బ్రాహ్మణవాదం అంటే ఇది బ్రాహ్మణు లకు పరిమితమైంది కాదు. నా కులమే అన్ని కులాల కంటే అధికమైందనే భావం, ఆ కుల భావంతో ఇతరులను కించపరచడం. నేను, నా కుటుంబం, నా కులం మాత్రమే ఆర్థికంగా పైకి రావాలని ఆలోచించడం. కులాన్ని, కుటుంబాన్ని దాటలేనివాడు రాజనీతిజ్ఞుడు కాలేడు.
అంబేడ్కర్ ఆలోచనలు ఆనాటి నుండి ఈనాటి వరకు సమ కాలీనంగానే ఉండడానికి కారణం సమాజంలో మార్పు చాలా ఆలస్యంగా జరుగుతోంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ బీసీలకు మొదటి నుండి అన్యాయం చేస్తూనే వచ్చింది. కాకా కాలేల్కర్ కమీషన్‌ను తొక్కిపెట్టింది. మండల్ కమిషన్‌ను తొక్కి పెట్టింది. ఇకపోతే 1951లో రాజ్యాంగంలో 15(4), 16(4) క్లాజులను పొందుపరచి రాజ్యాంగ పరంగా బీసీ రిజర్వేషన్లకు వున్న అడ్డంకి తొలగించబడింది.
అక్కడి నుండి 1978 వరకు పరిపాలనలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను తమ రాజకీయ చదరంగంలో పావులుగా వాడుకున్నదే తప్ప వారి సంక్షేమానికి ఇసుమంత సౌలభ్యాన్ని కూడా కలిగించలేదు. 2012– 1978న అప్పటి జనతాపార్టీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ పార్లమెంటులో చేసిన ప్రకటన మేరకు మాజీ పార్లమెంటు సభ్యులు బి.పి. మండల్ అధ్యక్షతన వెనుకబడిన తరగతుల కమీషన్ నియమింపబడింది. ఆ కమీషన్‌లో ఆర్.ఆర్. బోలె, దివాన్ మోహన్ లాల్, దీనబంధు సాహు, కె. సుబ్రహ్మణ్యం, యన్.యన్. గిల్ సభ్యులుగా వున్నారు. ఈ కమిషన్ మొత్తం 40 సిఫార్సులను చేసింది. అందులో ప్రధానమైనవి:
సాంఘికంగా, విద్యా విషయకంగా వెనుకబాటుతనం, ఆర్థిక పేదరికం అనేవి అంగవైకల్యం పొందిన కుల వ్యవస్థ తాలూకు రెండు ప్రత్యక్ష ఫలితాలు. వీటిని తొలగించడానికి తీవ్రమైన పరిపాలనా మార్పులు అవసరం; రిజర్వేషన్లు వుండడం వలన అర్హత, యోగ్యత ఏమీ దెబ్బతినవు. జనాభాలో 52 శాతం వున్న వీరికి ఆ జనాభాకు తగిన రిజర్వేషన్లు విద్యా ప్రభుత్వోద్యోగాల్లో వుండాలి; ఉద్యోగ నియా మకాలలో ప్రత్యక్షంగా భర్తీ చేసుకొనేటప్పుడు అభ్యర్థుల వయసు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల వలె పొడిగించాలి; ఆయా కులాల్లోని అభ్యర్థులు దొరకనపుడు ఖాళీలను మూడు సంవత్సరాల వరకు అట్టి పెట్టాలి; మిగులు భూముల పంపిణీ బీసీలకు కూడా జరపాలి; 3,743 కులా లను బీసీ కులాలుగా తేల్చారు.
మండల్ కమిషన్ నివేదిక అమలు జరపకపోవడం వల్లే ఆనాడు కాంగ్రెస్‌కు బీసీలు దూరమయ్యారు. ఆ తరువాత జనతా పార్టీ ఏర్పడిన తరువాత మండల్ కమీషన్ నివేదికలోని కొన్ని అంశాలు అమలు జరపడం గురించే జన సంఘ్ బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీగా రూపొందింది. బీసీల రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకటిగానే ఉన్నాయని మాజీ ప్రధాని వీపీ సింగ్ ఈ వ్యాసకర్తతో స్వయంగా అన్నారు. బీసీలంతా హిందువులే అని బీజేపీ ప్రకటిస్తుంది. శూద్రులను క్షత్రియత్వం నుండి కిందకి నెట్టి బాని సలుగా మార్చారని అంబేడ్కర్ చెప్పారు. ఏ బానిసత్వాన్ని అయితే వైదిక, బ్రాహ్మణవాదం, హిందూ వాదం బీసీలపై రుద్దిందో వారు అదే హిందూ ఆచారాలని ఆచరించడం ఆశ్చర్యాన్ని కొలిపే విషయం.
సామాజిక, రాజకీయ బానిసత్వం అనే భావజాలం కట్టు బాని సలుగా చేస్తుంది. శూద్రులను బానిసత్వం నుండి విముక్తి చేయడం కోసం, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో తీవ్రంగా కృషి చేశారు జ్యోతిబా ఫూలే. శూద్రులను రాజకీయంగా, ఆర్థికంగా పైకి తేవటం ప్రభుత్వ కర్తవ్యం. శూద్రుల మనస్సు çహృదయమూ సంతోషపడినట్ల యితే ముందు ముందు బ్రిటిష్ ప్రభుత్వం వారి విధేయత గురించి ఆలోచించవలసిన అవసరమే రాదు అన్నారు జ్యోతిబా. ఆయన ఉద్యమం 1840 నుండి 1880 వరకు బలంగా సాగింది. ఆయన సత్య శోధక్ సమాజాన్ని స్థాపించి శూద్రుల్లోనూ, దళితుల్లోనూ ఉత్తేజక రమైన మార్పులు తీసుకువచ్చాడు.
శూద్రుల్లోని భూస్వామ్య కులాలు ఓబీసీల నుండి విడిపోయాక బ్రాహ్మణవాదులు, భూస్వామ్య కులాలు కలసి ఓబీసీలను, దళితులను అణుస్తూ వచ్చాయి. నిజానికి 1870 దశకంలోనే జ్యోతిబా, ఆయన శ్రీమతి నిమ్న జాతుల పాఠశాలల కోసం సుమారు పది సంవత్సరాల పాటు కృషి చేశారు. అవి స్థిరపడ్డా యనుకొన్న తర్వాతనే ఇతర సాంఘిక, సేవా కార్యక్రమాలవైపు దృష్టి మళ్ళించారు. అయితే విదేశీయుల ఆదరణ తగ్గటం, స్థానికులు వాటిపై తగినంత శ్రద్ధ చూపకపోవటం వంటి కారణాల వల్ల అవి ప్రత్యేకంగా నిలబడలేకపోయాయి.
నిజానికి దళితులని, శూద్రులని ఎప్పటికప్పుడు నూత్నమైన నినాదాలతో అగ్రకుల పార్టీలు మోసం చేస్తూనే వస్తున్నాయి. అంబేడ్కర్, మహాత్మా ఫూలే, పెరియార్ రామస్వామి నాయకర్ ఈ వర్గాల సామాజిక, సాంస్కృతిక రాజకీయ విముక్తి కోసం బాటలు వేస్తూనే వచ్చారు. కానీ దళిత బహుజనులు, మైనార్టీలు మత భావాల ఊబిలో కూరుకుపోయారు. రాజ్యాధికారాన్ని అగ్రవర్ణ పార్టీల మీద ఆధారపడి పొందాలనే భావనలోనే ఇంకా ఉన్నారు.
ఇండియా కూటమి ఒక దళితుడిని ప్రధానమంత్రిగా ప్రకటించే స్థాయిలో ఎందుకు లేదు? నిరంతరం రాజ్యాంగ సూత్రాలను ధ్వంసం చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్న బీజేపీని కొన్ని ప్రయోజనాలను ఆశించో, కొన్ని ఆచారాలకు లోబడో, మళ్ళీ మళ్ళీ ఎన్నుకుంటున్నారు. వారి గంభీరమైన ఉపన్యాసాలకు మైమరచిపోయి వారికి సామాజిక, రాజకీయ బానిసత్వం చేస్తూనే వస్తున్నారు. కోట్లాది మంది రాజ్యాధికారానికి నోచుకోకుండా పోవడానికి కారణం రాజకీయాల్లో ఉన్న వర్ణతత్వమే అన్నారు అంబేడ్కర్. ఆయన మార్గంలోనే విముక్తి ఉందని దళిత, బహుజనులు గమనించినప్పుడే మత, కుల భావాలకు అతీతంగా సమ సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది.
డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త దళితోద్యమనేత ‘ 98497 41695
Comments
Please login to add a commentAdd a comment