అభిప్రాయం
భారతదేశంలో రాజకీయాలు 2024 సార్వత్రిక ఎన్నికల శంఖారావంతో ఊపందుకున్నాయి. ఓటరు చైతన్యం ఇందులో కీలకం. ఓటు దేశ ప్రజలకు జీవధాతువు. మన జీవిత నిర్మాణానికి అది ఒక పనిముట్టు. ఓటుహక్కును మనం దుర్వినియోగం చేసుకుంటే, మన మిగిలిన హక్కులన్నీ కాల రాయ బడతాయి. అందుకే ఓటు అనేది అత్యున్నతమైనది. దాని విలువ అమూల్యమైనది. ఆ విలువ మానవ విలువలతో సమానమైనది. భిన్న భావజాలాల ప్రభావం ఈ ఎన్నికల మీద ఉండబోతోంది. అంబేద్కర్ వాదుల, సామ్యవాదుల, సోషలిస్టుల, కమ్యూనిస్టుల, స్త్రీవాదుల, దళిత బహుజన వాదుల, మైనారిటీ హక్కుల వాదుల, మానవ హక్కుల పోరాటవాదుల సిద్ధాంతాల ప్రజ్వలనం సమాజంలో అంతర్గతంగా బలంగా ఉందని చెప్పక తప్పదు.
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) మళ్ళీ తెరపైకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నాలుగు రోజుల్లో షెడ్యూలు వస్తుందనగా... బీజేపీకి ఓట్లు కురిపిస్తుందని భావిస్తున్న సీఏఏను మోదీ సర్కారు బ్రహ్మాస్త్రంగా బయటికి తీసింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మనదేశ పౌరసత్వాన్ని కల్పించడం దీని లక్ష్యం. సీఏఏ చట్టం 2019 లోనే పార్ల మెంట్ ఆమోదం పొందినా, రాష్ట్రపతి సమ్మతి కూడా లభించినా... విపక్షాల ఆందోళనలు, దేశవ్యాప్తంగా నిరసనల కారణంగా అమలులో జాప్యం జరిగింది.
పూర్తిస్థాయి నిబంధనలపై సందిగ్ధం నెలకొనడంతో చట్టం కార్యరూపం దాల్చలేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పలుమార్లు చెబుతూ వచ్చారు. సరిగ్గా అదను చూసి ఇపుడు దానిని తెరపైకి తెచ్చారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి 2014 డిసెంబర్ 31 కంటే ముందు మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు ఈ చట్టం వర్తిస్తుంది.
భారతదేశంలోకి అనేక మతాలవారు ఆయా కాలాల్లో వచ్చారు. భారతీయ జన జీవనంలో కలసిపోయారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి అన్ని మతాలవారు, కులాల వారు కలసి పోరా డారు. భారతదేశానికి మొదటి ఎన్నికలు జరిగినప్పటి నుండి ముస్లింలకు పార్లమెంట్‌లోనూ, అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యం ఇస్తూ వస్తు న్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ముస్లిం సభ్యులు 76 మంది ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ముస్లిం ఎంపీలు గణనీయంగా ఎన్నికయ్యారు.
ఆనాడు ముస్లింల జనాభా 6 శాతం కంటే తక్కువ. మొదటి రాజ్యసభలో సుమారు 10.5 శాతం ముస్లిం సభ్యులున్నారు. 2014లో బీజేపీ స్వల్ప మెజారిటీతో లోక్‌సభ ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ అధికారానికి వచ్చిన నాటి నుండి ముస్లింల ప్రాతినిధ్యం అత్యల్పం. అందుకే 2024 ఎన్నికల్లో ముస్లింలు ఏకమై సెక్యులర్ పార్టీలకు ఓట్లు వేస్తారని ఒక పరిశోధనా పత్రం పేర్కొంది. బీజేపీపై పోటీ చేసే బలమైన అభ్యర్థికి ఓట్లు వేస్తారని ఆ పరిశోధన అంచనా వేసింది.
2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 27 మంది ముస్లిం అభ్యర్థులు గెలవగా (17వ లోక్‌సభ), 16వ లోక్‌సభలో 23 మంది ముస్లిం సభ్యు లున్నారు. పార్లమెంట్ చరిత్రలో ఇది ముస్లింలు తక్కువ సంఖ్యలో వున్న రెండోసభ. ప్రపంచంలో భారత్ మూడవ అతిపెద్ద ముస్లిం జనాభా (17.22 కోట్లు్ల) కలిగివున్న దేశం. నిజానికి ముస్లింలు ఈ దేశ స్వాతంత్య్రంలో పాల్గొన్న ప్రధానమైన శక్తులు. వారిని నిర్లక్ష్యం చేయడం దేశ అభివృద్ధికి, సౌభాగ్యానికి గొడ్డలిపెట్టు.
క్రైస్తవులు భారతదేశానికి ఇతర దేశాల నుండి వలస వచ్చినవారు కాదు. హిందూమతంలో అస్పృశ్యతకు, నిరాదరణకు గురైనవారు ఆ మతంలోకి వెళ్ళి అక్షర విద్యను నేర్చుకున్నారు. దళితులు ఎక్కువ మంది క్రైస్తవ మతంలో చేరి అక్షర విద్యను నేర్చుకున్నారు. వారిని నిరాకరించడం వల్ల, జనరల్ సీట్లలో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం వల్ల లౌకికవాదం దెబ్బతింటుంది. ఇక బౌద్ధం భారతదేశంలో సామాజిక, సాంస్కృతిక విప్లవాన్ని తీసుకువచ్చింది. సమసమాజ భావాన్ని ప్రజ్వ లింప చేసింది.
మానవతా ధర్మాన్ని ప్రబోధం చేసింది. భారతదేశ వ్యాప్తంగా బౌద్ధ సంస్కృతి వికాసం జరిగింది. భారతదేశం నుండి ప్రపంచ దేశాలకు బౌద్ధం విస్తరించింది. భారతదేశ వ్యాప్తంగా బౌద్ధులు కోట్లాది మంది వున్నారు. వారు ప్రత్యక్షంగా లేకపోవచ్చు. పరోక్ష రాజకీయ ఉద్యమంలో వున్నారు. తప్పకుండా భారత రాజ కీయాల్లో వీరి ప్రభావం స్పష్టంగా వుంది. ఇకపోతే రావ్‌ు మనోహర్ లోహియా ప్రభావం దళిత బహుజన రాజకీయాల మీద బలంగా వుంది.
మండల కమిషన్ రిపోర్టును బయటికి తీసుకొచ్చిన వి.పి.సింగ్ ప్రభావం కూడా బలంగా వుంది. కమ్యూనిస్ట్‌లు, అంబేడ్కర్ వాదుల అశేషమైన భావజాలం కూడా 2024 ఎన్నికల మీద వుంది. భారతదేశంలో అనేక భావజాలాల ప్రభావానికి ఈ ఎన్నికలు గురవు తాయి అనడంలో సందేహం లేదు. ఫూలే, అంబేడ్కర్, రావ్‌ు మనో హర్ లోహియా, పెరియార్ రామస్వామి నాయకర్, వి.పి. సింగ్, కాన్షీరావ్‌ు... వీరందరి ప్రభావం తప్పక ప్రజల మీద ఉంది.
ఇకపోతే 2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గడిచిన తొమ్మిదేళ్ళ పది మాసాల్లో పెరిగిన నిరుద్యోగం, చుక్కలనంటిన నిత్యావసరాల ధరలు, నల్ల ధనాన్ని వెనక్కి తీసుకురావడంలో విఫలం కావడం, సామాన్య మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొన్న అష్ట కష్టాలను ప్రధానాంశాలుగా ప్రతిపక్షాల కూటిమి ‘ఇండియా’ విస్తృతంగా ప్రచారం చేయాలి.
మాజీ ఎన్నికల కమిషనర్ టి.ఎన్. శేషన్ చెప్పినట్లుగా దశ మహపాతకాలు దేశ ఎన్నికల వ్యవస్థను కరకర నమిలేస్తున్నాయి. భారతదేశంలో ఎన్నికలు కొత్త కాదు. ప్రజలు చైతన్యవంతులు, ఆలోచనాపరులు. అయితే, యువతకు ఉద్యోగ వసతి కల్పిస్తారనీ, ఆర్థిక అభివృద్ధి చేస్తారనీ ఎక్కువమంది మోదీకి ఓట్లు వేశారు. కానీ పేద ప్రజలకు భరోసాని ఇచ్చే ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామి’ పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నీరుగార్చింది.
స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు నిర్వహించడమనేది కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ధ విధి. ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించడం వల్ల కొంత మేలు ఉన్నప్పటికీ, లోపాలు కూడా లేక పోలేదు. సున్నితమైన నియోజకవర్గాల్లో, ఎన్నికల సంబంధ హింసాకాండ చోటు చేసుకొనే అవకాశమున్న పోలింగ్ కేంద్రాల్లో తగిన సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించడానికి విడతలవారీ ఎన్నికల నిర్వహణ దోహదపడుతుంది.
85 ఏళ్ళ వయస్సు పై బడిన వారందరూ ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 85 వయస్సు పైబడిన ఓటర్లు దేశ వ్యాప్తంగా 82 లక్షల మంది ఉన్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇందులో వందేళ్ళు దాటిన ఓటర్లు 2 లక్షల 18 వేల మంది వున్నారు.
భారతదేశ రాజకీయాల్లో ఈనాడు అనివార్యంగా ఓబీసీలకు సీట్లు పెంచవలసిన చారిత్రక అవసరం ముందుకు వచ్చింది. బీసీలు వృత్తికారులే కాక, శ్రామికశక్తులు! చాలామంది బీసీలు తమ విముక్తిదాతైన ఫూలే గూర్చి తెలుసుకోలేకపోతున్నారు. మహాత్మా ఫూలే ఓబీసీలకు అర్థమైనపుడే వారిలో సామాజిక, రాజ కీయ చైతన్యం వస్తుంది. స్త్రీలకు కూడా మునిపటి కంటే ఎక్కువ సీట్లు ఇస్తారు.
విద్యాధికులు, రిటైర్డ్ ఆఫీసర్లు, అడ్వకేట్లు, పాత్రికేయ ప్రము ఖులు, రిటైర్డ్ జడ్జిలు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇప్పుడు రాజకీయ రంగంలోకి దూకారు. ఆంధ్రప్రదేశ్‌లోకి బీజేపీని ఆహ్వానించడం వల్ల చంద్రబాబు ముస్లింల, క్రైస్తవుల, సోషలిస్టుల, కమ్యూ నిస్టుల ఓట్లు కోల్పోతున్నారు. రాజ్యాంగేతరమైన భావజాలం ఎన్ని కలలో పెరగడం ఆశ్చర్యకరం. అయితే భారతదేశంలో ఇవన్నీ అనేక సందర్భాలలో జరుగుతూ వచ్చాయి.
వాటన్నింటినీ భారతదేశం తట్టుకొని నిలబడుతూ వచ్చింది. బీజేపీ తన వ్యూహ ప్రతి వ్యూహ రచనల్లో ప్రధానంగా పార్టీలను చీల్చడం, లొంగదీసుకోవటం వంటి అనేక వ్యూహాలతో ముందుకువెళ్తోంది. కానీ భారత రాజ్యాంగాన్ని దాటి వెళ్లే శక్తి ఏ వ్యక్తికీ, ఏ పార్టీకీ లేదని మనం తప్పక నమ్మాలి. దాని అంతర్గత శక్తి బౌద్ధ సూత్రాలతో నిండి ఉంది. అందుకే 2024 ఎన్నికలకు దళిత బహుజన లౌకికవాద భావజాలంతో ముందుకు నడవాల్సిన చారిత్రక సందర్భం ఇది.
డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695
Comments
Please login to add a commentAdd a comment