అభిప్రాయం
భారతదేశం నదీ నాగరికతల దేశం. అసలు ఇక్కడ నదులను దేవతలుగా కొలవడం సంస్కృతిలో భాగం. ఈ సంస్కృతికి మూల విరాట్టులు ఆదివాసీలూ, దళితులే. అడవులు, నదీతీరాలు వీరి ఆవాసాలుగా ఉన్నప్పుడు వాటికి ఏ ఇబ్బందులూ కలగలేదు. ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం వచ్చి, వస్తూత్పత్తి వాణిజ్య స్థాయిలో అవ్వడం ప్రారంభమయ్యిందో... అప్పుడే ప్రకృతి వనరులను విచక్షణా రహితంగా దోచుకోవడం ప్రారంభమయ్యింది.
పట్టణాలు, నగరాలు విస్తరించాయి. చివరికి నదులు, కాలువలు, చెరువులు, అడవులు అన్నింటినీ ఆధిపత్య వర్గాలవారు కబ్జా చేశారు. వీరి చేతుల్లోనే భూమి, మూలధనం కేంద్రీ కృతమై ఉన్నందున వీరే పరిశ్రమలు, ఇతర వ్యాపారాలను స్థాపించి పేరాశతో డబ్బు, అధికార దర్పాలతో కబ్జాలకు తెరలేపారు. తత్ఫలితమే విజయవాడ, ఖమ్మం వంటి చోట్ల ఇవ్వాళ నదులు లేదా ఏరులు సృష్టించిన విలయాలు!
ఈ నేపథ్యంలో విజయవాడను చుట్టుముట్టిన వరదలను చూడాలి. ఇక్కడ ప్రజల కడగండ్లకు ప్రధాన కారణం బుడమేరు కాలువ/ వాగు. జలవనరుల శాఖ పరిభాషలో ఇది ఒక మేజర్ డ్రెయిన్. ఎన్టీఆర్,కృష్ణా జిల్లాల్లో పంట పొలాల్లోని మిగులు నీరు ప్రవహించే ఒక వాగు. ఖమ్మం జిల్లాలో పుట్టిన ఈ వాగు మైలవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. రెడ్డిగూడెం, మైలవరం, కొండూరు మండలాల్లోని పులివాగు, భీవ్‌ువాగు, లోయవాగును కలుపుకొని ముందుకు సాగుతుంది.
విస్సన్నపేట, తిరువూరు నుంచి వచ్చే కొన్ని ఏరులు కూడా దీనిలో కలుస్తాయి. ఇవన్నీ కలిశాక, వెలగలేరు మీదుగా విజయవాడ శివారులోని సింగ్‌నగర్, గూడవల్లి, గన్నవరం, బాపులపాడు, గుడివాడ, నందివాడ వైపు సాగి చివరకు కొల్లేరులో కలుస్తుంది. బుడమేరు గరిష్ఠ నీటి ప్రవాహ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు మాత్రమే. దీని ఉద్ధృతి తగ్గించేందుకు 1970ల్లో
నాటి ప్రభుత్వం జి. కొండూరు మండలం వెలగలేరు వద్ద ఒక రెగ్యులేటరీని నిర్మించింది. అక్కడ చిన్న జలాశయాన్ని తలపిస్తుంది.
ఈ హెడ్ రెగ్యులేటరీ ద్వారా కిందకు వరద ప్రవాహాన్ని నియంత్రించే వారు. తర్వాత దీన్నుంచి మళ్లింపు కాలువ (బుడ మేరు డైవర్షన్ ఛానెల్– బీడీసీ)ని తవ్వారు. అధికంగా వచ్చే వరద ఈ ఛానెల్ ద్వారానే ప్రవహించి, ఇబ్రహీంపట్నం సమీపంలో కృష్ణా నదిలో కలుస్తుంది. వీటీపీఎస్‌లోని వృథా నీటిని కూడా దీని ద్వారానే కృష్ణాలోకి పంపిస్తారు. దీని సామర్థ్యం చాలా తక్కువ.
కాలువ సామర్థ్యం పెంపు ప్రతిపాదనల్లో ఉండ గానే బుడమేరుకు 2005లో సుమారు 70 వేల క్యూసెక్కుల వరద పోటెత్తి, విజయవాడను ముంచెత్తింది. వరదను అరికట్టాలంటే మళ్లింపు కాలువ విస్తరణే మార్గమని ప్రతిపాదన వచ్చింది. తర్వాత పోలవరం కుడి కాలువను బుడమేరులో కలిపారు. అంటే పోలవరం నుంచి వచ్చే నీటిని కృష్ణా నదిలో కలిపేందుకు దీన్నొక అనుసంధాన కాలువగా మలిచారు.
పోలవరం కుడి కాలువను 37,500 క్యూసెక్కుల సామర్థ్యంతో డిజైన్ చేయగా, ప్రస్తుత సామర్థ్యం 8,500 క్యూసెక్కులు మాత్రమే. గత ఏడెనిమిదేళ్లుగా పట్టిసీమ నీళ్లు ఈ కాలువ ద్వారానే కృష్ణాలోకి వస్తున్నాయి. భవిష్యత్తులో పోలవరం కాలువను విస్తరించేందుకు అవకాశ ముంది. ఆ మేరకు బీడీసీ సామర్థ్యం కూడా ఇప్పుడున్న 10 వేల క్యూసెక్కుల నుంచి పెంచాల్సిన అవసరముంది.
సహజమైన నదీ తీరాన్ని ఇవ్వాళ ధ్వంసం చేసి పెద్ద పెద్ద అంతస్తులతో భవనాలు కట్టి నదీ గమనానికి అడ్డుగా నిలవడమే కాక నదీజలాలు కలుషితం కావడానికి కూడా కారణమవుతున్నారు బడాబాబులు. విజయవాడకు ఇంతటి పెనుముప్పు రావడానికి ఇదే ప్రధాన కారణం. కృష్ణా నది కరకట్ట మీద పెత్తందారుల అక్రమ కట్టడాల వల్లే ఇది జరిగింది. ఈ కరకట్ట మీద ఉన్న ముఖ్యమంత్రి నివాసం, కొంతమంది వైద్యం పేరుతో వ్యాపారం చేస్తున్న వారి కట్టడాలు ఉన్నాయి. వాటిని కూలుస్తామనే మాట పాలకులు చెప్పడం లేదు.
ఈనాడు తెలంగాణలో ‘హైడ్రా’ చెరువులు కబ్జా చేసిన వారి అక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్నట్లు అన్ని రాష్ట్రాలలో కూల్చివేయాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ కూల్చివేతల అవసరం ఎంతైనా ఉంది. ఇక ప్రజలు ప్రాకృతిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పునరుజ్జీవనం గురించి ఆలోచించవలసిన సమయం వచ్చింది. ప్రజల్లో అలముకున్న నిరాశ, నిస్పృహల స్థానంలో సమకాలీన పరిస్థితుల పట్ల స్పష్టమైన అవగాహన నింపాలి. అప్పుడే వారు పెత్తందార్లకు బుద్ధి చెబుతారు. ప్రజలే చరిత్ర నిర్మాతలు కదా!
డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695
Comments
Please login to add a commentAdd a comment