కులగణనే సమస్యలకు పరిష్కారం | Katti Padma Rao Guest Column-Nitish Kumar Comments Population Control | Sakshi
Sakshi News home page

కులగణనే సమస్యలకు పరిష్కారం

Published Sat, Jan 14 2023 1:06 AM | Last Updated on Sat, Jan 14 2023 1:11 AM

Katti Padma Rao Guest Column-Nitish Kumar Comments Population Control - Sakshi

భారత దేశ సామాజిక, ఆర్థిక వ్యవస్థలు నిచ్చెన మెట్ల కుల వ్యవస్థపై ఆధారపడి నిర్మితమయ్యాయి. భూమి మీద ఎవరికైతే హక్కు ఉందో వారే రాజ్యాధికారాన్నీ అనుభవించే పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. అయితే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వంటి పై మూడు ఆధిపత్య కులాలవారితో పాటూ శూద్రులైన కొన్ని కులాల వారూ సంపదనూ, రాజ్యాధికారాన్నీ అనుభవించ గలుగుతున్నారు. అయితే రాజ్యాధికారంతో పాటూ దేశ సంపదను కులాల దామాషా ప్రకారం ఎవరికి దక్కాల్సింది వారికి దక్కినప్పుడే... రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ హక్కుకు సార్థకత్వం చేకూరుతుంది. ఇందుకు దేశంలో ఏ కులంవారు ఎంత మంది ఉన్నారనే లెక్కలు అవసరం. అందుకే కుల గణనను ప్రభుత్వం తక్షణం చేపట్టాలి.

భారతదేశంలో సాంఘిక అసమానతలు తగ్గాలంటే కుల గణనతో పాటు కుల సంపద గణన కూడా జరగాల్సి ఉంది. బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఈ కులగణనకు పూనుకోవడం అందుకు 500 కోట్లు కేటాయించడం ఒక సామాజిక పరిణామానికి తప్పక దోహదం చేస్తుంది. అంబేడ్కర్, లోహియాలు ఇరువురూ ఈ కులగణన విషయంలో గట్టిగా పట్టుపట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ హిందువులే అనే వాదనలో బ్రాహ్మణవాదం ఉంది అని వీరు పసిగట్టారు. అది ఒక సందర్భంలో ఎస్సీలను హరిజనులు లేదా దేవుని బిడ్డలు అని చెప్పిన ప్పుడు అంబేడ్కర్‌ అంటరానివారు దేవుని బిడ్డలు అయితే మరి మిగిలిన వారందరూ దెయ్యం బిడ్డలా అని ప్రశ్నించాడు. ఈ సందర్భంలో మాట్లాడుతూ ఇప్పటికైనా భారతదేశాన్ని మనం మార్చు కోవాలి. సామాజిక న్యాయాన్ని పాలనలో తీసుకురావాలంటే తప్ప కుండా కులగణన జరగాలి. 

అందరికీ భూమి హక్కు వచ్చినప్పుడే సమానత చేకూరుతుంది. వ్యవసాయం ప్రభుత్వ పరిశ్రమగా ఉండాలి. ప్రభుత్వాధీనంలోకి దేశంలోని భూమిని తీసుకురావాలి. అప్పుడే భూస్వామి, భూమిలేని పేద వ్యవసాయ కూలీ, కౌలుదారు అనే భేదాలు తొలగి పోతాయ న్నాడు అంబేడ్కర్‌.  హిందూ మత భావన జాతి వ్యతిరేకమైనదని ఆయన ప్రకటించాడు. సాంఘిక, ఆర్థిక ప్రజాస్వామ్యం లేకుండా రాజ కీయ ప్రజాస్వామ్యానికి మనుగడ లేదు అని ప్రకటించాడు. దేన్నైనా అమ్ముకోండి గానీ ఆత్మాభిమానాన్ని మాత్రం అమ్ముకోవద్దని శూద్రు లకు, అతిశూద్రులకు చాటి చెప్పాడు.

నిజానికి బిహార్‌ బౌద్ధ భూమి. అక్కడ బీసీలుగా చెప్పబడుతున్న అనేక కులాల వారు కొన్ని శతాబ్దాలు బౌద్ధులే. భారతదేశంలో ఉన్న శిల్పాలన్నీ దళితులు, బౌద్ధులు చెక్కారు. నిజానికి భారతదేశంలో దళితులు, బహుజనులు కొన్ని శతాబ్దాలు బౌద్ధంలోనే ఉన్నారు. పైగా వారు బౌద్ధ కవులుగా, బౌద్ధ తాత్వికులుగా, బౌద్ధ శిల్పులుగా, బౌద్ధ భిక్షువులుగా జీవించారు. బీసీలు హిందువులుగా మారింది క్రీ.శ. 6వ శతాబ్దం తరువాతే. క్రీ.శ. 6వ శతాబ్దం ప్రాంతంలో  భాగవతాన్ని సృష్టించారు. అందులో కృష్ణుని పాత్ర సృష్టించారు. కృష్ణుడు యాదవు డని బహు భార్యాత్వాన్ని ఆయనకి ఆపాదించారు. భగవద్గీతను కూడా ఆయన చేత చెప్పించారు. అప్పటి నుండే యాదవులు హిందువులుగా మారడం ప్రారంభించారు. భగవద్గీత బుద్ధుని పరిణామ వాదానికీ, ప్రకృతివాదానికీ భిన్నంగా చెప్పబడింది. బుద్ధుడు ఏదీ నిత్యం కాదనీ, మిశ్రతమైనదేదీ శాశ్వతం కాదని చెప్పాడు. 

ఆ అంశాన్ని వివరిస్తూ అంబేడ్కర్‌ దీనికి అసంగుని వివరణ ఇలా ఇచ్చారు. ‘‘ఒక దాని ఆధారంగా మరొకటి  ఏర్పడిన మిశ్రమంలో ఏ ఒక్కటీ స్వయం శక్తి కలిగి ఉండజాలదు. మిశ్రమం విడిపోయినప్పుడు అందలి ధాతువులు సహితం నాశనమైపోవడం అనివార్యం అవుతుంది.’’ మన్ను, నీరు, నిప్పు, వాయువుల మిశ్రమమే జీవి. ఈ నాలుగు ధాతువులు విడిపోయినప్పుడు జీవి విగతమౌతుందనీ, దానినే మిశ్రమ పదార్థ అనిత్యతత్వం అంటారనీ, ‘ఒక వ్యక్తి శాశ్వత మెలా అవుతాడన్నది’’ ఈ శాస్త్రం వివరిస్తుందని అంబేడ్కర్‌ శాస్త్రీ
యంగా క్రోడీకరించాడు.
నిజానికి యాదవులు వ్యవసాయ కులం గొర్రెల కాపరులుగా ఉన్నారు. భగవద్గీత వచ్చాక వారిలో భూస్వామ్య ఆధిపత్యం వచ్చింది. బౌద్ధ భావం తగ్గింది. నిజానికి కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి వారంతా శాతవాహనులుగా, రజకులుగా, నాయీ బ్రాహ్మణులుగా తమనుతాము ఆర్యీకరించుకోవడం, బ్రాహ్మణీకరించుకోవడం; భాగ వత, రామాయణ, భారతాల కథలు బుర్రలకు ఎక్కించుకొన్నాకే జరిగింది. అలా బీసీ కులాల వారు హిందువులుగా మారారు. జ్యోతి రావు ఫూలే బీసీలు హిందువులు కాదని చెప్పడం గమనార్హం.

భూమిపై ఆధిపత్యం ఉన్నవారు ఆధిపత్య కులాలుగా అవతరించారు. వారే అధికారాన్ని చేపట్టగలుగుతున్నారు. బ్రాహణ, క్షత్రియ, వైశ్య కులాలవారితో పాటూ కొందరు శూద్రకులాలలో ఆధిపత్య కులాల స్థాయికి చేరినవారూ (తెలుగు రాష్ట్రాల్లో కమ్మ, రెడ్డి; బిహార్‌లో యాదవ) అధికార పీఠం ఎక్కగలుగుతున్నారు. వీరిదగ్గరే సంపద పోగుపడిపోతున్నది. కూలినాలీ చేసుకొనే వారికి 40 కోట్ల మందికి ఇళ్లే లేవు. ఆధిపత్య కులాలవారి సంపద తేలితేనే సమ సమాజ రూప కల్పనకు ప్రణాళిక రూపొందించుకునే వీలుంది. అయితే భూమి పంచడానికీ, ఇతర సంపద పంచడానికీ ఆధిపత్య కులాలు సిద్ధంగా లేవు. కాగా నామమాత్రపు రిజర్వేషన్లకు ఈర్ష్య పడుతున్నారు. 

బిహార్‌ జనాభా పన్నెండు కోట్ల 70 లక్షల మంది. 16 శాతం ఎస్సీలు, 48 శాతం ఓబీసీలు, 17 శాతం ముస్లింలు, 1.28 శాతం ఎస్టీలు జీవిస్తున్నారు. తాజా జనగణన తర్వాత కులాల శాతాలు కూడా బయటకు వస్తాయి. భారతదేశంలో 1871లోనే బ్రిటిష్‌ ప్రభుత్వం ఎందుకు కులగణన చేపట్టింది? బ్రిటిష్‌వాళ్లకు భారతీయ కులవ్యవస్థపై ఒక అవగాహన వస్తే కానీ వారు ఇక్కడ మనలేరు. బహుశా అందుకే కులగణన చేసి ఉంటారు.  ఈ కుల గణన వల్ల శూద్రులకు, అతి శూద్రులకు సామాజిక çస్పృహ వస్తుందని మహాత్మా ఫూలే నడిపిన సత్యశోధక్‌ సమాజ్‌ పేర్కొంది. 

అంబేడ్కర్‌ ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్, బీజేపీ ఆంత ర్యాన్ని కనిపెట్టాడు. రాముడు వర్ణాశ్రమ ధర్మాన్ని రక్షించడం కోసం శంబూకుణ్ణి చంపాడు కాబట్టి అన్ని విశ్వవిద్యాలయాల్లో శూద్ర, అతి శూద్ర, మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి. తామే చదువు కోవాలి, ఇంకొకరు చదువుకోకూడదు. తమకే భూములుండాలి, మరొ కరికి ఉండకూడదు; తమకే రాజ్యాధిపత్యం ఉండాలి, వేరే వారికి ఉండకూడదు అనే మనువాద భావాలను బాగా నమ్ముతున్నారు కనుక ఇటువంటి దాడులకు వారు తెగబడుతున్నారు ఆధిపత్య కులాల వారు. ఈ భావాలు ఏ కులం వారికి ఉన్నా అవి రాజ్యాంగ విరుద్ధమై నవే. రాజ్యాంగానికి వ్యతిరేకంగా జీవిస్తున్న అగ్రవర్ణ ఆధిపత్య బ్రాహ్మణవాదులు నిషేధిత సంస్థల నుండి ఆవిర్భవించినవారేవీరంతా. వారెప్పుడూ రాజ్యాంగానికి బాధ్యులుగా లేరు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే మార్గంలో వారు నడుస్తున్నారు. మాట్లాడే స్వేచ్ఛను రాజ్యాంగం ఇచ్చిందని వారికి తెలియదు.

ఈ మనువాదానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండే బౌద్ధాన్ని అంబేడ్కర్, లోహియా, మహాత్మాఫూలే, పెరియార్‌ రామస్వామి నాయకర్‌ అనుసరించారు. ఇప్పుడు మనం బౌద్ధ భారతాన్ని నిర్మించుకోవాలి. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలు ఉత్పత్తి శక్తులు. వారిని పేదరికంలోఉంచి, వారిని దుఃఖంలో ఉంచి ఎవరైనా రాజ్యాంగేతరులుగా పరిపాలించాలని అనుకుంటే అది వట్టి భ్రమే. రాజ్యాంగంలోని 15వ ఆర్టికల్‌ ఈ విధంగా చెబుతుంది. కుల, మత, లింగ, పుట్టిన ప్రదేశం కారణాలుగా వివక్షకు తావులేదు.1) కేవలం మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం లేక వాటిలో కొన్నింటి ప్రాతిపదికపై ఏ వ్యక్తినీ ప్రభుత్వం వివక్షకు గురి చేయరాదు. 2) కేవలం, మతం, జాతి, కులం, లింగం పుట్టిన ప్రదేశం లేక వాటిలో కొన్నింటి ప్రాతిపదికపై పౌరులెవరికీ హక్కులను నిరాకరించటం, నియంత్రించటం, అర్హత లేకుండా చేయడం గాని చేయరాదు.

భారతదేశ పునర్నిర్మాణానికి భారత రాజ్యాంగమే గీటురాయి. మతతత్వవాదులు తప్పక ఓడిపోతారు. ఒక మతం భారతదేశాన్ని ఎప్పటికీ పరిపాలించలేదు. ఒక కులం భారతదేశాన్ని ఎప్పటికీ పరిపా లించలేదు. భారతదేశం అంతర్గతంగా తీవ్రమైన సామాజిక, సాంస్కృతిక, సాంకేతిక విద్యాపరమైన మార్పుకు గురవుతూ వస్తుంది. దళిత బహుజన మైనార్టీలు లౌకికవాదులు ఏకమై సమ సమాజ నిర్మాణానికి పోరాడాల్సిన యుగమిది. కులగణనే కాదు కులసంపద గణన కూడా జరగాల్సిందే. భారతదేశంలో ప్రజలందరూ సమానంగా బతికే రోజు కోసం పోరాడాల్సిందే. అదే అంబేడ్కర్, ఫూలే మార్గం.

డా‘‘ కత్తి పద్మారావు 
వ్యాసకర్త
దళిత ఉద్యమ నేత

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement